వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 10వ వారం
శాసనోల్లంఘన ఉద్యమం |
---|
భారత స్వాతంత్ర్యోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై, 1934 వరకూ సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెసు పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిషు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించి, నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెసు నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన. ప్రజా క్షేమం దృష్ట్యా బ్రిటిషు ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి, ఆ చర్యలు తీసుకోకపోతే, శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ, 1930 జనవరి 31 న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలను గాంధీ నిర్దేశించాడు. ఆ కార్యక్రమాల నన్నిటినీ అహింసా పద్ధతిలో జరగాలని కూడా అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. ఇతర కార్యక్రమాల్లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిషు వస్తు బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కల్లు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి ఉన్నాయి. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్దయెత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత.
|