Jump to content

వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం

వికీపీడియా నుండి
(వికీపీడియా:కంటెంట్ ట్రాన్స్లేషన్ టూల్ నుండి దారిమార్పు చెందింది)

విషయ అనువాద ఉపకరణం (Content Translation tool)[1] 2014 జనవరి లో ప్రారంభమైంది. మెరుగైన ఉపకరణం (v2)[2] 2018 లో విడుదలైంది. ఈ ఉపకరణాన్ని తెలుగు వికీలో వాడుటకు మంచి పద్ధతులు, చిట్కాలు తెలియచేయటమే ఈ వ్యాసం లక్ష్యం.

పరికరం పరిచయం

[మార్చు]

ఇతర భాషల వికీపీడియాలలో ఉన్న వ్యాసాలను తెలుగు లోకి అనువదించేందుకు ఉద్దేశించిన పరికరమే అనువాద పరికరం. యంత్రమే అనువదించి వాడుకరికి చూపించడం ఇందులోని ప్రత్యేకతల్లో మొదటిది. ఈ పరికరంలో ఇంకా ఇతర విశేషాలు కూడా ఉన్నాయి. వాటి గురించిన వివరాలను ఈ పేజీలో చూడవచ్చు. అనువాద పరికరాన్ని ఎవరైనా వాడొచ్చు. లాగినై ఉన్న వాడుకరులందరికీ ఈ పరికరం అందుబాటులో ఉంటుంది. లాగినవని వాళ్ళు దీన్ని వాడలేరు. తెలుగు వికీపీడియాలో ప్రతి పేజీకి పైన కుడి మూలన ఉండే వాడుకరి లింకుల్లో "అనువాదాలు" అనే లింకు ఉంటుంది. కింద చూపిన తెరపట్లను చూడండి

వెక్టర్ 2020 రూపులో అనువాదాలు లింకు ఇలా ఉంటుంది
పాత వెక్టర్ రూపులో అనువాదాలు లింకు ఇలా ఉంటుంది


"అనువాదాలు" లింకును నొక్కితే అనువాద పరికరం ప్రధాన పేజీకి (డ్యాష్‌బోర్డుకు) వెళ్తారు.

అనువాద పరికరం డ్యాష్‌బోర్డు

అనువాద పరికరం పేజీ, ఆకృతిలో తెలుగు వికీపీడియా పేజీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆకృతి అన్ని భాషల వికీల లోని పరికరాలన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డు (ప్రధాన పేజీ) రెండు భాగాలుగా ఉంటుంది. ఎడమవైపున ఉండే కంటెంటు ప్యానెల్ మూడింట రెండు వతుల పేజీని ఆక్రమించగా, మిగతా భాగంలో కుడివైపున పనిముట్ల ప్యానెల్ ఉంటుంది. కంటెంటు ప్యానెల్‌లో ప్రస్తుతం అనువాదం చేస్తూ ఉన్న పేజీల జాబితా ఉంటుంది.

కంటెంటు ప్యానెల్ పైవరుసలో ఎడమవైపున "కొత్త అనువాదం" అనే లింకు ఉంటుంది. దీన్ని నొక్కినపుడు వచ్చే పేజీలో మూలం పేజీ పేరును ఇచ్చి కొత్త అనువాదం మొదలుపెట్టవచ్చు. కంటెంటు ప్యానెల్‌కు పైన కుడివైపున "సూచనలు", "పురోగతిలో ఉన్నవి", "ప్రచురితం" అనే మూడు లింకులు ఉంటాయి. "సూచనలు" లింకులో, వాడుకరి అనువదిస్తున్న వ్యాసాల రకాన్ని బట్టి పరికరం అనువాదం చేసేందుకు సూచనలు చేస్తుంది. "పురోగతిలో ఉన్నవి" లో మనం ప్రస్తుతం చేస్తూ ఉన్న అనువాదాల జాబితాను చూపిస్తుంది. ఈ పేజీని డిఫాల్టుగా చూపిస్తుంది. ఈ జాబితా లోంచి ఏదో ఒక దాన్ని ఎంచుకుని అనువదించడం కొనసాగించవచ్చు. "ప్రచురితం" లో వాడుకరి ఈసరికే ప్రచురించిన అనువాదాలను చూపిస్తుంది. జాబితా లోంచి అనువాదం చేసేందుకు ఒక పేజీని నొక్కినపుడు అనువాదం పేజీకి తీసుకెళ్తుంది.

అనువాదం చేసే పేజీ

అనువాద పరికరం వాడే పద్ధతి

[మార్చు]

పరికరాన్ని వాడేందుకు పది అంగలు

[మార్చు]
  1. తెలుగు వికీపీడియాలో ప్రతి పేజీలోను పైన కుడి మూలన ఉండే వాడుకరి లింకుల్లో "అనువాదాలు" అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కండి. అప్పుడు అనువాద పరికరం డ్యాష్‌బోర్డుకు వెళ్తారు
  2. ఆ పేజీలో "కొత్త అనువాదం" అనే లింకు నొక్కండి.
  3. అప్పుడు వచ్చే పేజీలో మూలం భాషను ఎంచుకుని అనువదించలచిన పేజీ పేరును ఇవ్వండి
  4. అనువాదం ఏ భాష లోకి చెయ్యబోతున్నారో దాన్ని (తెలుగును) ఎంచుకోండి.
  5. ఇక "అనువాదం మొదలుపెట్టండి" బొత్తాన్ని నొక్కండి. అప్పుడు అనువాదం పేజీ తెరుచుకుంటుంది.
  6. అనువాదం ప్యానెల్‌లో ఎడమ సగంలో మూలం పేజీ లోని పెరాగ్రాఫులన్నిటినీ ఒకదాని కింద ఒకటి చూపిస్తుంది. కుడి సగం, అనువాదం చెయ్యడానికి సిద్ధంగా ఖాళీగా ఉంటుంది. మీరు ఏ పేరానైనా అనువాదం చెయ్యవచ్చు. ఎన్ని పేరాలనైనా అనువదించవచ్చు. అన్నీ చెయ్యాలనే నిబంధనేమీ లేదు.
  7. ఏ పేరాను అనువదించదలచారో ఆ పేరుకు ఎదురుగా కుడివైపున ఉన్న ఖాళీలో క్లిక్కు చెయ్యండి. వెంటనే యాంత్రిక అనువాదం ఆ ఖాళీలో ప్రత్యక్షమౌతుంది. ఈ అనువాదాన్ని మీరు సరిదిద్దవచ్చు.
  8. ఆ అనువాదాన్ని సరిదిద్ది సహజంగా ఉండేలా తీర్చిదిద్దండి.
  9. అయ్యాక, ఇంకో పేరాను ఎంచుకోండి. దాన్ని కూడా అలాగే సరిదిద్దండి. అలా మీరు చెయ్యదలచిన పేరాలను అనువదించండి
  10. మీరు అనువాదం చేస్తూ ఉంటే పరికరం ఎప్పటికప్పుడు దాన్ని భద్రపరుస్తూ ఉంటుంది.
  11. ఇక ప్రచురించవచ్చు అని మీరు భావించినపుడు అనువాదం పేజీలో పైన ఉన్న "ప్రచురించు" బొత్తాన్ని నొక్కండి.

వ్యాసాల ఎంపిక

[మార్చు]

తెవికీ చదువరులకు ఆసక్తిగల వ్యాసాలలో మీకిష్టమైన వాటినే ఎంపిక చేయండి. ఎక్కువ వీక్షణలున్న తెలుగు వికీ వ్యాసాలలో[3] ఎర్ర లింకులతో వున్నవి, లేక, గూగుల్ శోధన ట్రెండ్స్ లో అధిక ర్యాంకులలో వుండేవాటిని అనువదిస్తే మీ అనువాదం మరింత ఉపయోగంగా వుంటుంది.[4] ఆంగ్ల వ్యాసాలకు యాంత్రిక అనువాదం సులభంగా గూగుల్ అందిస్తున్నది కావున, తెవికీ చదువరులకు ఆసక్తి లేని ఆంగ్ల వ్యాసాలను (ఉదా:ఆంగ్ల పాప్ సింగర్లు) అనువదించడం అంత ఉపయోగం కాదు. అలాగే శాస్త్ర, సాంకేతిక విషయాలను తెలుగులో వ్యక్తీకరించడంపై కొంత అనుభవం వుంటేనే (నేరుగా వికీలోగాని ఇతర మాధ్యమాలలో కొన్ని వ్యాసాలు వ్రాసివుంటేనే) ఆ విషయాలను అనువదించే ప్రయత్నం చెయ్యండి.

మీరు ఎంచుకున్న వ్యాసానికి తెలుగు అంతర్జాలంలో మూలాలేమైనా దొరుకుతాయేమోనని గూగుల్ లో వెతికితే నమ్మకమైన, ప్రాచుర్యంగల జాలస్థలుల మూలాలు ఒకటి దొరికినా దానిపై తెలుగువారికి ఆసక్తి వున్నట్లుగా పరిగణించవచ్చు. అనువాదంతో పాటు విస్తరించటానికి ఆ తెలుగు మూలంవాడుకోవచ్చు.

మూల వ్యాసానికి వికీ ప్రాజెక్టు ఎంపిక

[మార్చు]

మూలంగా ఏ వికీనైనా (భారతీయ భాషలతో సహా) ఎంచుకోవచ్చు. ఆంగ్లమైతే సాధారణ ఇంగ్లీషు(en.wikipedia.org), సులభమైన ఇంగ్లీషు( simple.wikipedia.org) లో ఏదైనా వాడవచ్చు. అనువాదానికి సులభమైన ఇంగ్లీషు(సింపుల్ ఇంగ్లీషు) వికీవ్యాసం మెరుగుగావుండవచ్చు. యంత్ర అనువాదం కూడా మెరుగుగా వుండవచ్చు.

ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదానికి ముఖ్యమైనవి

[మార్చు]

ఇంగ్లీషు నుండి తెలుగు లోకి అనువాదం చేసేటపుడు ఈ రెండు భాషల స్వరూపం లోను, వాక్య నిర్మాణం లోనూ ఉండే అంతరాల వల్ల, అనువాద యంత్ర పరిమితులవలన కొన్ని సార్లు కృతకంగా ఉండవచ్చు. అనేక సవరణలు చెయ్యవలసి వస్తుంది. వాటిని చేసాకే ప్రచురించాలి. లేకపోతే భాష కృతకంగా, అపరిపక్వంగా ఉంటుంది. అటువంటి సందర్భాల లో కొన్ని చూడండి:

  • కర్మణి వాక్యాలు (పాసివ్ వాయిస్):
    • ఉదా:"కోర్టు అతడికి పదేళ్ళు జైలు శిక్ష విధించింది" అని రాయడం తెలుగుకు సహజం. "అతడికి కోర్టు చేత పదేళ్ళ జైలుశిక్ష విధించబడింది" అని రాస్తే అది సహజం కాదు. ఉపకరణం ఇలాగే అనువదిస్తుంది.
    • ఉదా: "నటనతో తన మొదటి విచారణలో, రోటిమి గాత్ర పరీక్ష చేయబడ్డాడు మరియు తరువాత బాస్ లో మాదకద్రవ్యాల వ్యాపారి డారియస్ మోరిసన్ పాత్రలో తన మొదటి నటనను పొందాడు":
  • ఇంగ్లీషులో and ఉన్న చోటల్లా "మరియు" రాసేసుకుంటూ పోతుంది. దాన్ని సవరించాలి. ఆంగ్ల పేరులో and ఉంటే దానిని మరియుగా ఉంచకూడదు. సహజమైన తెలుగులో "మరియు" అనేది ఉండదు. అది వికీ భాష శైలికి విరుద్ధం. ఉదా: "వెంకటరావు మరియు సుబ్బారావు నడుస్తున్నారు" (ఇది కృతకమైన, మక్కికి-మక్కి అనువాద రూపం) - వెంకటరావు, సుబ్బారావు నడుస్తున్నారు (సహజ రూపం)
  • ఇంగ్లీషులో of అని అంటే ఇది "యొక్క" అని రాసేస్తుంది. చాలావరకు ఈ పదం తొలగించితే సరిపోతుంది. యొక్క అవసరమైన చోట్ల వాడాలి.
    • ఉదా:"అతడి చొక్కా రంగు తెలుపు" అనేది తెలుగుకు సహజం. "అతడి యొక్క చొక్కా రంగు తెలుపు" అని రాస్తుందది. అది మన భాషకు సహజం కాదు.
  • సందర్భ శుద్ధి లేమి: ఒకే పదానికి వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలు ఉండవచ్చు. అలాంటి వాటిని సందర్భానుసారం అనువదించాలి. కానీ, అనువాదంలో యంత్రం సందర్భ శుద్ధి చూపదు.
    • ఉదా: "ఐదు యూరోల నోటు యొక్క సగటు జీవితం ధరించడం వల్ల భర్తీ చేయడానికి ఒక సంవత్సరం కన్నా తక్కువ అని అంచనాలు సూచిస్తున్నాయి." - wear అనే ఇంగ్లీషు మాటకు ధరించడం, అరిగిపోవడం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అరిగిపోవడానికి సంబంధించిన నలిగి పోవడం/కృశించి పోవడం వంటి పదాలు వాడాలి. కానీ ధరించడం అని యంత్రం అనువదించింది. వాడుకరి కూడా వ్యాసాన్ని అలాగే ప్రచురించారు.
  • ఇంగ్లీషులో ఉండే సంక్లిష్ట/సంశ్లిష్ట వాక్యాలు అనువాదం లోకి వచ్చేటప్పటికి మరీ అతుకుల బొంత లాగా ఉండవచ్చు.
    • ఉదా: "దాని ప్రారంభ రోజున, కిక్ 260 చుట్టూ సంపాదించారు మిలియన్, ఇది ధూమ్ 3 వెనుక రెండవ అత్యధిక సెలవుదినం కాని ఓపెనింగ్ వసూలు చేసింది."
  • అస్సలు కించిత్తు కూడా అర్థాన్ని ఇవ్వని వాక్యాలు: కొన్ని అనువాదాలు వాక్యాన్ని మొత్తంగా అనువదించినట్లు ఉండవు. ఒక్కో పదాన్ని విడివిడిగా అనువదించి ఒక వాక్యంగా పేర్చినట్టు ఉంటాయి.
    • ఉదా: "ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి." - ఇలాంటి వాక్యాల గురించి చెప్పడానికేమీ లేదు.
  • పదాలు ఉన్నవి ఉన్నట్లుగా: (ఇది అంత పెద్ద సమస్యేమీ కాదు) ఇంగ్లీషు పదాలను ఉన్నవి ఉన్నట్లుగా అనువదిస్తుంది. కొత్త సాంకేతిక పదాలు, తెలుగులో అసలే లేని పదాల విషయంలో అది తప్పదు, అలాగే చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో దాన్ని నివారించవచ్చు.
  • ఢి, ఝా, ఔ లాంటి కొన్ని అక్షరాలుండే పదాలను అనువాదాలు మరీ ఘోరంగా, ఇంగ్లీషు తెలుగు కలిసిపోయి గందరగోళంగా ఉండవచ్చు.
  • మూలంలోని ఇంగ్లీషు భాష దోషాల్లేకుండా సరిగ్గా ఉంటే పరిస్థితి పైన చెప్పినట్లు ఉంటుంది. ఒకవేళ మూలం లోని ఇంగ్లీషు దోష భూయిష్టంగా ఉంటే (ఎన్వికీ లోని తెలుగు సినిమాల వ్యాసాల్లో ఇంగ్లీషు బాగుండదు) దాన్నుంచి వచ్చే అనువాదం నాణ్యత చాలా తక్కువగా వుండవచ్చు.

ఉపకరణం సాంకేతిక వాడుక సూచనలు

[మార్చు]

ఈ ఉపకరణం విజువల్ ఎడిటర్ పై ఆధారపడి పనిచేస్తుంది. విజువల్ ఎడిటర్ మెనూ పట్టీ అలాగే కనబడకపోయినా, మీరు ఈ ఉపకరణం నుండి, ఇతర వ్యాసం విజువల్ ఎడిటర్ తో తెరచినప్పుడు నకలు, అతికించడం చేయవచ్చు. ప్రచురించడానికి అధిగమించలేని సమస్యలుంటే తప్ప, లేక వ్యాసంలో చిన్న పేరా అనువదించి విలీనం చేయటానికి తప్ప, ఇలా నకలు, చేసి అతికించవద్దు. ఇలాచేస్తే ఇతరులకు మీ అనువాదాన్ని మెరుగుచేయడానికి అవసరమైన వివరాలు (ఆంగ్ల వ్యాసం రూపు) దొరకవు.

అనువాద యంత్రం ఎంపిక

[మార్చు]
అనువాద యంత్రం ఎంపిక

ఈ ఉపకరణంలో గూగుల్,మిన్‌ట్ (MinT), యాండెక్స్ అనే మూడు యంత్రాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని యాంత్రికానువాదం చెయ్యవచ్చు. వీటిలో దేన్నైనా వాడుకోవచ్చు. ఒక్కో పేరాకు ఒక్కో యంత్రాన్ని వాడుకుని అనువదించుకోవచ్చు. వీటిలో ఒకదాన్ని అప్రమేయంగా (డిఫాల్టుగా) పెట్టుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ ఆంగ్లం నుండి తెలుగుకు మెరుగైన అనువాదం చేస్తున్నందున దానిని అప్రమేయంగా (ఢిపాల్ట్) ఎంపిక చేసుకోండి. ఒక పేరాను అనువదించిన తరువాత, మీకు నచ్చకపోతే ఆ అనువాదాన్ని పూర్వస్థితికి తీసుకువెళ్లి, మూల పాఠ్యాన్ని నకలు చేసి మానవీయంగా అనువాదం చేయడం ద్వారా, లేక కొత్త పేరాను ప్రారంభించి దానిలో నేరుగా అనువాదాన్ని చేర్చవచ్చు.

సమాచార పెట్టెల అనువాదాలు

[మార్చు]

సమాచారపెట్టెలు అనువాదం చేసి ముద్రించినపుడు దాని వికీటెక్స్ట్ తీరు మారే అవకాశం వుంది. అంటే మూసలోని పరామితులన్నీ ఒకే పేరాగా కనిపిస్తాయి. సాంప్రదాయక ఎడిటర్ వాడే వారికి దీనిలో సవరణలు చేయాలంటే కొద్ది ఇబ్బందిగా వుండవచ్చు. కావున ప్రచురించిన తరువాత వీలైతే ఆ వికీటెక్స్ట్ తీరును ఒకవరుసకు ఒక పరామితి వుండేటట్లు సవరించండి, లేక ఆంగ్ల వ్యాసంలో నుండి నకలు చేసి అతికించి అనువాదం చేయండి.

అనువాద సేవ పనిచేయనపుడు

[మార్చు]

అనువాద సేవ పనిచేయనపుడు ఆంగ్ల పాఠ్యం యథాతథంగా చేరుస్తుంది. కొన్ని మూసలు, సాంకేతిక సమస్యలవలన ఇలా జరగవచ్చు. అప్పుడు మీరు తెలుగు అనువాదం పొందాలంటే గూగుల్ లో ఆంగ్ల వ్యాసం పేరు వెతికితే మీకు శోధన ఫలితాలలో గూగుల్ అనువాదం లింకు కనపిస్తుంది దానిని నొక్కి, సంబంధిత పేరా అనువాదాన్ని నకలు చేసి ఉపకరణంలో తగిన పేరాలో ఆంగ్ల పాఠ్యానికి బదులు చేర్చవచ్చు. ఇలా చేసినప్పుడు ఆంగ్ల వ్యాసంలో మూలాలు రావు కనుక, మానవీయంగా ఎడమైవైపున ఆంగ్ల మూలాలను నకలు చేసి కుడివైపున అనువాద విభాగంలో తగిన చోట అతికించండి. లేకుంటే గూగుల్ translate జాలస్థలి [5]ద్వారా అనువదించి చేయవచ్చు.

'మరియు', 'యొక్క'లు సవరించడం

[మార్చు]

ఆంగ్ల వ్యాసాల యాంత్రిక అనువాదంలో 'and' కు 'మరియు', 'of' కు 'యొక్క' అనేవి కనిపిస్తాయి. ఇవి సాధారణ తెలుగులో అసహజం కనుక ఉపకరణంలో వెతికి మార్చే ఆదేశం CTRL+F వాడడం ద్వారా, వీటిని అవసరం కానిచోట్ల సవరించవచ్చు. ఒకవేళ సాధారణ వ్యాస సవరణలో వీటిని చేయటం మీకు సౌలభ్యమనిపిస్తే, మీరు ప్రచురించిన తరువాతైనా ఈ మార్పులు చేయవచ్చు.

అంతర్వికీలింకులు

[మార్చు]

వ్యాసంలో వాడిన ఆంగ్ల వ్యాస లింకు కు సరిపోలిన తెలుగు వ్యాసం వికీడేటా ద్వారా లింకయివుంటే, ఈ ఉపకరణం లింకు లక్ష్యాన్ని తదనుగుణంగా సవరిస్తుంది. కాని లింకు పదం(లేబెల్) అనువాదం లేక తెలుగు లిప్యంతరీకరణంలో తప్పులుండవచ్చు. దానిని సరిచేయటానికి మెనూలో లింకు బటన్ ఉపయోగించాలి. ఈ బటన్ వాడి లింకు లక్ష్యం మార్చవచ్చు, లింకు పదం మార్చవచ్చు, తెవికీలో లింకు వ్యాసం ఏర్పడే అవకాశాలు తక్కువైతే తొలగించవచ్చు.

పెద్ద వ్యాసాన్ని అనువదించడం

[మార్చు]

పెద్దగా వున్న ఆంగ్ల వ్యాసం ప్రపంచ దృక్కోణంతో, విస్తారమైన సమాచారంతో వుంటుంది. తెలుగులో యథాతథంగా అనువదించనవసరంలేదు. తెలుగులో అవసరమైనంతమేరకు కావాలసిన పేరాలను మాత్రమే అనువదించవచ్చు. కొన్ని పేరాలను క్లుప్తీకరించి అనువదించవచ్చు. ఇప్పటికే తెలుగు వ్యాసం వుండి వుంటే, దానిలో విలీనం చేయడానికి ఒక్కొక్క విభాగాన్ని అనువదించి వాడుకరి పేరుబరికి ముద్రించుకొని, ఆ తర్వాత అక్కడనుండి నకలు, అతికింపుల ద్వారా విలీనం చేసి సవరించాలి. ఒకసారి ముద్రించిన తరువాత, అనువాదం ముద్రితమైన విభాగాల్లో కనబడుతుంది. దానిని మరల సవరించే బొమ్మపై నొక్కి, ఇంకొక విభాగం అనువాదం చేయవచ్చు.

సమస్యలను పరిశీలించడం

[మార్చు]

ఉపకరణం కుడివైపు విభాగంలో అనువాద సమస్యల పెట్టెలో సమస్యలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు పేరా లో పూర్తిగా యాంత్రిక అనువాదం అలానే వుంచితే లేక ఉపకరణంలో సాధారణ పరిమితికన్నా ఎక్కువు వుంటే హెచ్చరిస్తుంది. అలాగే మూలలలో సమస్యలున్నా తెలుపుతుంది. వాటిని పరిశీలించి అనువాదం మెరుగుచేయవచ్చు.

అనువాదం కాని మూసలు

[మార్చు]

మూసలు అనువాదం అవ్వాలంటే తెలుగు వికీపీడియాలో మూసలు ఆంగ్లవికీపీడియాలో మూసలకు అనుసంధానించాలి. తెవికీలో చాలా మూసల పేర్లు తెలుగులో అనువదించి వున్నాయి. 2021-06-16 నాడు తెలుగు వికీలో 58 మూసలు మాత్రమే లింకులు కలిగివున్నాయి. మూస తెలుగులో లేదని దోషం కనబడితే మీ మూల వ్యాసంలో వున్న మూసలకు సరిపోలిన తెలుగు మూసను ప్రక్కపట్టీలో కనబడే ఇతర భాషలు (లంకెలను చేర్చండి) తో అనుసంధానించండి. మరల అనువాదానికి ప్రయత్నించండి. (ఉదాహరణ అనుసంధానం {{శైవం}} en:Template:Saivism)

ప్రచురించునపుడు సమస్యలు

[మార్చు]

యాంత్రిక అనువాద పరిమితి

[మార్చు]

తెవికీలో యాంత్రిక అనువాదం 70% కన్నా తక్కువ వుండాలన్న పరిమితి అమలులో వున్నది[6]. కావున మీరు ప్రచురించు నొక్కినపుడు, మీ వ్యాసం ప్రచురించకుండా నిరోధించబడవచ్చు. అప్పుడు పేరా వారీగా మీ అనువాదాన్ని పరిశీలించి ఏమైనా మెరుగుచేయగలిగితే చేయండి. మీకు సాధ్యమైనంత మెరుగు చేసినా, ప్రచురించుటకు అనుమతించనప్పుడు క్రింద విధంగా చేయండి. [7]

  1. ప్రచురించు అనే బటన్ ముందుగల గేర్ బొమ్మ పై నొక్కి మీ వాడుకరి పేరుబరిని లక్ష్యంగా ఎంపికచేయండి. ఇలా చేయటం ఇప్పటికే వున్న వ్యాసాన్ని అనువాదం ద్వారా విస్తరించాలన్నా, లేక మీ అనువాదాన్ని ఇతరుల సహాయంతో మెరుగుపరచిన తర్వాత ప్రధాన పేరుబరిలో చేర్చాలన్నా ఉపయోగం.
  2. అనువాదం లో చివరికి వెళ్లి, కొత్త పేరా చేర్చండి. Some text (to be deleted after publishing) అని టైప్ చేసి ఒక ఐదు-పది పేరాల తెలుగు పాఠ్యం ఇతర వ్యాసాలనుండి నకలు చేసి అతికించండి. (సాధారణంగా గ్రామాల వ్యాసాలలో సులభంగా పది పేరాలు ఎంపిక చేసుకోవడం సులభం).
  3. ఇప్పుడు ప్రచురించు నొక్కండి. ఇంకనూ ప్రచురించటానికి అనుమతించకపోతే మరల నకలు చేసినదాన్ని ఇంకొకసారి అతికించండి. ఇలా మీరు సులభంగా ప్రచురించవచ్చు. (ఉదాహరణ భారతదేశపు పట్టణ పరిపాలన, అతికించి తొలగించిన పాఠ్యం)
  4. ప్రచురించిన వాడుకరిపేరుబరిలోని వ్యాసంలో చివరంగా అదనంగా చేర్చిన సమాచారం తొలగించండి.
  5. ఆ వ్యాసాన్ని మరొకసారి పరిశీలించి అనువాదాన్ని మెరుగుపరచండి. (ఏమైనా మిగిలిపోయిన 'మరియు', 'యొక్క' పదాల తొలగింపులు మరియు వికీశైలి కి తగినట్లుగా సవరింపులు)
  6. మీరు అనువాద నాణ్యతను మెరుగుపరచడానికి ఇతరుల సహాయం తీసుకోదలిస్తే, చర్చాపేజీలో {{సహాయం కావాలి}} చేర్చి వ్యాఖ్య వ్రాయండి. ఇతరులు మీ అనువాదాన్ని అనువాద సమస్యల పరిశీలన ఉపకరణంతో[8] పరిశీలించి సహాయం చేస్తారు.
  7. వీలైతే తెలుగు మూలాలలో వున్న సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి.
  8. మీరు అనువదించినది కొత్త వ్యాసమైతే ఆ పేజీని ప్రధానపేరుబరికి దారి మార్పు లేకుండా తరలించండి. ఇప్పటికే వున్న వ్యాసమైతే మీరు అనువదించిన భాగాలను ఇప్పటికే వున్న వ్యాసంలో విలీనం చేయండి( ఉదాహరణ:ఆంధ్రప్రదేశ్ వ్యాస చరిత్రలో 2021-02-10 నుండి 2021-02-19 వరకు గల మార్పులు)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మీడియావికీలో కంటెంట్ ట్రాన్స్లేషన్ పేజీ (తెలుగు భాషలో)
  2. మీడియావికీలో కంటెంట్ ట్రాన్స్లేషన్ పేజీ రెండవ విడుదల(ఆంగ్ల భాషలో)
  3. "క్రిందటి రోజున అత్యధిక తెలుగు వికీపీడియా వీక్షణల వ్యాసాలు". Wikimedia Foundation. Retrieved 2021-02-20.
  4. "Trending searches in India (Google)". Retrieved 2021-02-20. గూగుల్ శోధన యంత్రంలో మీరు తెలుగు ఎంపిక చేసుకుంటే, ఆంగ్ల పదాలతో వెదికినా దానికి సమానమైన తెలుగు పదాలు గల ఫలితాలను కూడా చూపిస్తుంది. వెతుకు పదాలను తెలుగువరకే పరిమితం చేయటం, శోధన ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రాలవరకే పరిమితం చేయటం ప్రస్తుతం లేదు కనుక, ఫలితాలలో తెలుగు కొరకు కూడా చూడండి
  5. "Google Translate". Retrieved 2021-02-12.
  6. వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ
  7. రచ్చబండలో మానవీయ అనువాద స్థాయి పరిమితిని అధిగమించడానికి చిట్కా చర్చ date=2021-01-31
  8. Santhosh T. "Translation debugger (అనువాద పనితీరు పరిశీలించు మరియు వివరాలు,గణాంకాల వెబ్ పేజీ)". WMF. Retrieved 2020-08-14. దీనిలో ఉదాహరణగా మూల వికీ భాష (en for English), అనువదించిన వికీ భాష (te for Telugu), మూల వికీభాషలో పేజీ శీర్షిక ప్రవేశ పెట్టి అనువాదం కొరకు వెతకాలి. అప్పుడు ఆ అనువాదం వివరాలు కనబడతాయి. ఆ తరువాత Fetch page నొక్కితే మూలం, ప్రారంభ యాంత్రికఅనువాదం, సభ్యుని మార్పులతో అనువాదం ఒకే తెరలో చూడవచ్చు. ఇతర ఆదేశాల ద్వారా మునుజూపు, వికీటెక్స్ట్ రూపం పొందవచ్చు