Jump to content

వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/ఏది వికీపీడియా కాదు

వికీపీడియా నుండి

ఏది వికీపీడియా అన్నదాన్ని తెలుసుకోవడానికి; ఏది వికీపీడియా కాదన్నది చెప్పడం ప్రయోజనకరం. కాబట్టి, ఏది కాదన్నది చూద్దాం.

వికీపీడియా ఒక డిక్షనరీ కాదు - వికీపీడియా వ్యాసం మొదట్లో అంశం గురించిన నిర్వచనంతో మొదలుపెట్టాలన్నది నిజమే కానీ తర్వాత విజ్ఞానపరమైన అంశాలు అందించేదిగా ఉండాలి. కేవలం నిర్వచనమే ఉండేట్టయితే దానికి వికీపీడియా వేదిక కాదు.

వికీపీడియా మౌలిక పరిశోధన ఫలితాలు, అభిప్రాయాలు ప్రచురించే వేదిక కాదు. ఏదైనా విషయంపై మన అభిప్రాయం కానీ, స్వంత పరిశోధన కానీ ఉంటే అది మరెక్కడైనా ప్రచురించుకోవచ్చు కానీ వికీపీడియాలో కాదు. వికీపీడియాలో ఇప్పటికే ఎక్కడైనా ప్రచురించిన నమ్మదగ్గ మూలాలు ఆధారం చేసుకుని, మన వ్యక్తిగత అభిప్రాయాలు లేకుండా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి.

వికీపీడియా ప్రచారానికి వేదిక కాదు. ఏ విధమైన అంశాలకీ ప్రచారానికి కానీ, ప్రకటనలకు కానీ వికీపీడియా వేదిక కాదు. ఆ అంశాలు వికీపీడియాలో రాయదగ్గవైతే ప్రచార ధోరణితో కాక నిష్పాక్షికంగా విజ్ఞానపరమైన అంశాలతో వ్యాసాలు రాయవచ్చు. ఉదాహరణకు ఒక సినిమాను పొగడుతూ, రాజకీయ పార్టీని తిడుతూ ప్రచారధోరణితో వ్యాసాలు నింపకూడదు. ఆ సినిమా కానీ, రాజకీయ పార్టీ కానీ రాయదగ్గవైతే తటస్థంగా దానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ విజ్ఞానదృష్టితో వ్యాసాలు రాయవచ్చు.

వికీపీడియా బ్లాగ్ కానీ, సామాజిక మాధ్యమం కానీ కాదు. ఇంతకుముందు కొంతమేరకు వివరించినట్టు అభిప్రాయాలు, ఉద్దేశాలు చెప్పే బ్లాగో, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు స్నేహితులతో పంచుకునే సామాజిక మాధ్యమం కానీ కాదు.

వికీపీడియా డైరక్టరీ కాదు. కాబట్టి విజ్ఞానపరంగా విలువలేని సామాన్యమైన సంగతులను జాబితాలుగా వేసుకుంటూ పోకూడదు. ఉదాహరణకు ఒక ఊళ్ళో పుట్టినవారందరి పేర్లూ, వృత్తులూ జాబితాగా వేయకూడదు.

వికీపీడియా మాన్యువల్ కాదు. ఫలానా పని ఎలా చేయాలో చెప్పే మాన్యువల్, గైడ్ బుక్ వంటిది కాదు వికీపీడియా. ఉదాహరణకు వికీపీడియాలో బిర్యానీ గురించిన వ్యాసంలో బిర్యానీ చరిత్ర నుంచి ఏయే రకాల బిర్యానీలు ఉన్నాయో ఉంటుంది తప్ప బిర్యానీ చేయాలంటే ఏయే పదార్థాలు, ఎలా వాడి, ఏం చేయాలో ఉండకూడదు.

వికీపీడియా భవిష్యత్తును ఊహించి చెప్పే భవిష్యవాణి కాదు. అలానే ఎప్పటికప్పుడు వివరాలు రాసే వార్తాపత్రిక కూడా కాదు. వార్తల్లో కొన్ని అంశాలు వికీపీడియాలో ఉండదగ్గవి ఉండొచ్చు, అంటే న్యూజీలాండ్‌లో మసీదుల మీద జరిగిన కాల్పులు అన్న అంశం వికీపీడియాలో వ్యాసంగా ఉండవచ్చు. అంతేకానీ, ఫలానా రాజకీయ నాయకుడు మరో నాయకుని మీద చేసిన ఆరోపణల వివరాలతో రోజువారీ వార్త వస్తే దాన్ని,

వికీపీడియా విచక్షణారహితంగా సమాచారాన్ని పోగుపెట్టేందుకు చోటు కాదు. అలానే పుస్తకాలు, కవిత్వం, పాటలు రాసుకునేందుకు కూడా వీలు లేదు. ఈ విషయంలో వివరించాలంటే పుస్తకాల గురించి, కవిత్వం గురించి, పాటలు - ఆయా అంశాలు రాయదగ్గవైతే వాటి - గురించి రాయడానికి వీలుంది. అంటే వాటిని తెచ్చిపెట్టెయ్యకూడదు గురించి రాయాలి.

ఈ పనిపట్టండి

[మార్చు]

వికీపీడియాలో ప్రస్తుతం మొదటి పేజీకి వెళ్ళి, అక్కడ ఈవారం వ్యాసం శీర్షిక కింద ఉండే వ్యాసం లింకు మీద నొక్కి దాన్ని చదివి చూడండి. ఆ వ్యాసంలో పైన చెప్పిన నియమాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. అంటే అది డిక్షనరీ తరహాలో ఉందా లేదా? ప్రచారం పరమావధిగా లేదు కదా? వంటి ప్రశ్నలు వేసుకుని తిరిగి చదవండి. మీకు ఆసక్తిగా ఉంటే మరికొన్ని వ్యాసాలు ఆ కోణంలో పరిశీలించండి.