వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/కాపీహక్కులు అంటే ఏమిటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాపీహక్కులు అన్నమాట చాలాచోట్ల, చాలామంది అస్పష్టంగా వాడుతూ ఉంటారు. దాన్ని వివరంగా చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం.

మీరు ఒకచోట భూమి కొనుక్కుని, ఇల్లు కట్టుకున్నారనుకోండి. దానిపై మీకు రకరకాల హక్కులు ఉంటాయి. ఒకటి - అందులో నివసించే హక్కు, దాన్ని మీరు అద్దెకివ్వడం ద్వారా వేరేవారికి తాత్కాలికంగా బదిలీ చేయవచ్చు. మరొకటి - అమ్ముకునే హక్కు. ఇంకొకటి - దానిలో ప్రవేశించడానికి అనుమతించే హక్కు, ఎవరైనా మీ అనుమతి లేకుండా ప్రవేశిస్తే ట్రెస్‌పాసర్స్‌గా వారిపై మీరు కేసుపెడితే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా కొన్ని హక్కులు ఉంటాయి కదా.

ఇలాగే ఒక వ్యక్తి రాసే పుస్తకం కావచ్చు, వ్యాసం కావచ్చు, తీసే ఫోటో కావచ్చు, గీసే పెయింటింగ్ కావచ్చు - వాటిపై అతనికి కొన్ని హక్కులు ఉంటాయి.

ఏయే హక్కులు ఉంటాయి?

కాపీహక్కుదారులకు ఈ హక్కులు ఉంటాయి:

  • రచనను ప్రచురించడానికి, పునఃప్రచురించడానికి హక్కులు
  • వేరేవారితో పంచుకోవడానికి, ప్రసారం చేయడానికి
  • అమ్మి సొమ్ముచేసుకోవడానికి
  • దీని ఆధారంగా వేరే కృతిని రూపొందించడానికి (అనువాదాలు చేయడం కానీ, ఫోటోలు మార్చి వేరే కృతి తయారుచేయడం కానీ)
  • హక్కులు మొత్తంగా అమ్మడం కానీ, కొన్నిటిని వదులుకోవడం కానీ
వేటి మీద, ఎవరికి హక్కులు ఉంటాయి?
  • ఈ కాపీహక్కులనేవి రచనలు, సంగీతం, చిత్రకళా కృతులు, సౌండ్ రికార్డింగులు, ఫోటోలు, వీడియోలు వంటివాటికి వర్తిస్తాయి.
  • భారత కాపీహక్కుల చట్టం ప్రకారం రచనలు, సంగీత కృతులు (నొటేషన్లు), చిత్ర కళాకృతుల మీద వాటి సృష్టికర్తకు సహజంగా హక్కులు ఉంటాయి. వీడియో రికార్డింగ్ (సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఈ కోవలోకి వస్తాయి), ఆడియో రికార్డింగుల (సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వగైరాలు) మీద నిర్మించినవారికి కాపీహక్కులు ఉంటాయి.
    • పాటలపై నిర్మాత పొందే రెవెన్యూ నుంచి సంగీతం సమకూర్చిన స్వరకర్తకు, పాట రాసిన కవికి కూడా రాయల్టీలో భాగం ఇవ్వాల్సివుంటుంది.
  • ఒకవేళ రచయితను ఆ రచనలు చేయడానికే ఒక సంస్థ ఉద్యోగం ఇచ్చి ఉంటే, ఆ సంస్థకే రచనలపై కాపీహక్కులు ఉంటాయి. ఫోటోగ్రాఫర్‌గా పత్రికకు పర్మినెంట్ పద్ధతి మీద పనిచేసేవారి ఫోటోలపై సంస్థకు కాపీహక్కులు ఉంటాయి. ఐతే ఇది కేవలం కొన్ని ఫోటోలు తీయడానికో, రచనలు రాయడానికో సంస్థలు రెమ్యూనరేషన్ ఇచ్చి తాత్కాలికంగా నియమిస్తే వర్తించదు.
  • భారత కాపీహక్కుల చట్టం ప్రకారం పైన పేర్కొన్నవారికి ఎక్కడా ముందుగా నమోదుచేయకుండానే, రచనను తమ పేరిట ప్రచురించుకున్న వెనువెంటనే సహజంగా కాపీహక్కులపై యాజమాన్యం వచ్చేస్తుంది.