వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/వికీపీడియా ఎవరి స్వంతం
స్వరూపం
ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి - వెబ్‌సైట్ ఎవరిది? రెండు - వికీపీడియా వ్యాసాలు ఎవరివి? ఇవి రెండూ కాక మరో ప్రశ్న అదనంగా వస్తుంది - దీన్ని ఎవరు నిర్వహిస్తారు?
- వెబ్‌సైట్ ఎవరి స్వంతమన్న ప్రశ్నకి వద్దాం.
- వికీమీడియా ఫౌండేషన్ అన్న లాభాపేక్ష రహిత సంస్థ వికీపీడియా సాంకేతిక ఫ్రేమ్‌వర్కుకి మద్దతునిస్తుంది.
- వికీపీడియా సోదర ప్రాజెక్టులైన వికీసోర్సు (స్వేచ్ఛా గ్రంథాలయం), వికీడేటా (స్వేచ్ఛా డేటా నిధి), వికీమీడియా కామన్సు (స్వేచ్ఛా మీడియా నిధి) వంటివాటికి కూడా సాంకేతిక మద్దతునిస్తుంది.
- వీటన్నిటి డొమైన్ పేర్లూ ఆ సంస్థ పేరిటే నమోదై ఉన్నాయి. అయితే వికీపీడియాలో వ్యాసాలు, వికీపీడియా నిర్వహణ వికీమీడియా ఫౌండేషన్ స్వంతం కాదు.
- వికీపీడియాలో వ్యాసాలు ఎవరి స్వంతం?
- వికీపీడియాలో వ్యాసాలు ఎవరి స్వంతమూ కాదు. అదొక విధంగా చెప్పాలంటే ప్రపంచ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి.
- ఈ వ్యాసాలను ఎందరో వికీపీడియన్లు రూపొందించారు, రూపొందిస్తూంటారు. వీటిని రాసేప్పుడే వాటిపై తమకున్న కాపీహక్కులను క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్ అలైక్ అన్న ఓ లైసెన్సులో విడుదల చేస్తారు.
- అంటే మరేం కాదు - తాము రాసేది ఎవరైనా ముందుగా అనుమతి అక్కరలేకుండా ఇదే లైసెన్సులో ప్రచురిస్తూ వాడుకోవచ్చనీ, తమ పేరును ప్రస్తావించాల్సిన చోట విడిగా తమ పేరు అక్కరలేదనీ వికీపీడియా నుంచి అని రాస్తే చాలనీ చెప్పడమన్నమాట.
- వికీపీడియన్లు ఈ మొత్తం వ్యాసాలను ప్రపంచానికి కానుకగా అందిస్తున్నారు. ఇవి అందరి స్వంతమూను, అలానే ఎవరో ఒక్కరి స్వంతమూ కాదు.
- ఇదిలా ఉండగా, వికీపీడియన్లు వికీపీడియాలో చేసే రచనలపై వారికి ఇంకా హక్కులు ఉంటాయి. తమ స్వంతమైన ఈ రచనలను తమకు నచ్చినట్టు వాడుకోవడంలో వికీపీడియా లైసెన్సులు వారికి అడ్డుపడవు.
- దీన్ని ఎవరు నిర్వహిస్తారు?
- 5 మూల స్తంభాలను అనుసరించి వికీపీడియా సముదాయం దీన్ని నిర్వహిస్తుంది.
- ఆ ఐదు మూలస్తంభాలను సందర్భానికి తగ్గట్టు అన్వయించుకుంటూ వివిధ పాలసీలు, మార్గదర్శకాలు తయారుచేసుకుని అమలుచేస్తారు.
- ఆ పాలసీలు, మార్గదర్శకాల్లో వికీపీడియాలో ఎలాంటి సమాచారం ఉండాలి? ఏమేమి ఉండకూడదు? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పదేపదే తప్పుడు సమాచారం చేరుస్తూంటే వారిపై ఏ చర్యలు తీసుకోవాలి? వంటి అనేకానేక నిర్వహణా వ్యవహారాలపై స్పష్టత ఉంటుంది.
- వాటిని రూపొందించేదీ, అమలుచేసేదీ కూడా వికీపీడియా సముదాయమే, అంటే వికీపీడియన్లు ఉమ్మడిగా నిర్వహిస్తారు.