Jump to content

వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

వికీపీడియా నుండి

వికీపీడియా అన్నదొక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వం అంటే ఏమిటన్నది ఇక్కడ చదివి తెలుసుకున్నారు. ఇక స్వేచ్ఛ అన్న పదానికి అర్థం ఏమిటంటే:

  1. వికీపీడియాలో ఉన్న సమాచారం అంతటినీ కాపీహక్కులపరంగా స్వేచ్ఛగా, ఎవరి నుంచీ అనుమతులు అడగనక్కర లేకుండా కేవలం "వికీపీడియా నుంచి" తీసుకున్నట్టు ఓ ముక్క ప్రస్తావించి ఎవరైనా, ఎందుకైనా వాడుకోవచ్చు.
  2. వికీపీడియాలో ఇప్పటికే ఉన్న సమాచారాన్ని విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు మార్పుచేర్పులు చేయవచ్చు. అలానే మీరు రాసినదాన్ని కూడా ఇతరులు దిద్దుబాట్లు చేయవచ్చు.

ఈ సూత్రాలనే మరింత వివరిస్తే -

  • మీరు వికీపీడియా వ్యాసాలను మీ అవసరం కోసం వాడుకుందామనుకుంటే - హాయిగా వాడుకోండి, ఎవరినీ అడగనక్కరలేదు, కేవలం వికీపీడియాకు అట్రిబ్యూషన్ ఇవ్వాలంతే.
  • మీరు వికీపీడియాలో రాస్తూన్నట్టైతే -
    • మీరు ఏ వ్యాసంలో అయినా వికీపీడియా సూత్రాలు అనుసరించి చక్కగా మార్పులు చేయవచ్చు.
    • మీరు వికీపీడియాలో మార్పులు చేస్తున్నప్పుడే మీ సమాచారాన్ని ఎవరైనా వాడుకోగలిగేలా, వికీపీడియా నుంచి తీసుకున్నదన్న అట్రిబ్యూషన్ ఇస్తే చాలన్నట్టుగా మీరొక లైసెన్సులో సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు.
    • వికీపీడియాలోని వ్యాసాలు ఎవరైనా అనుమతులు లేకుండా వాడగలిగేలా ఉండాలి కాబట్టి వేరెవరిదో సమాచారం అచ్చంగా కాపీ పేస్టులు చేయకండి. ఎందుకంటే వికీపీడియాకు మీరిచ్చేది ఆ సమాచారంపై కొన్ని కాపీహక్కులు వదులుకుని ఇస్తున్నారు. వేరెవరి హక్కులో మీరెలా వదులుకోగలరు చెప్పండి? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంటుంది.
    • మీకు వ్యాసాల్లో సరైన మార్పులు చేసే హక్కు ఎలా ఉందో, అలానే ఇతరులూ మీరు మొదలుపెట్టిన వ్యాసాల్లో సరైన మార్పులైతే చేయవచ్చు. వికీపీడియాలో వ్యాసాలేవీ ఇవి నావి అని గిరిగీసి కూర్చునే వీల్లేదు.

ఈ పనిపట్టండి

[మార్చు]

మీరొకసారి వికీపీడియాలో ఏదైనా పేజీలో సవరించు అన్న బటన్ నొక్కి, పేజీ కింద సవరణ సారాంశం అన్న డబ్బాకు, మార్పులను ప్రచురించు అన్న బటన్‌కీ నడుమ ""పేజీని భద్రపరచు" బొత్తాము నొక్కడం ద్వారా" అని మొదలయ్యే లైసెన్సు వివరాలు చదివి చూడండి.