Jump to content

వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/తెలుగు వికీపీడియా పరిచయం

వికీపీడియా నుండి
తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు

చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు తరాల వాళ్ళు వాటి గురించి తెలిసికోగలుగుతారు. ఇలా లోకంలోని ప్రతీ విషయం గురించీ ఒక పుస్తకంగా రాస్తే.. అదే విజ్ఞాన సర్వస్వం!

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

అసలు వికీపీడియా అంటే ఏమిటంటే..

[మార్చు]

అప్పుడెప్పుడో 2001 లో మొదలైంది ఈ కథ. లోకం లోని విజ్ఞానాన్నంతటినీ ఒకచోట చేర్చి ప్రజలంతా స్వేచ్ఛగా వాడుకునే వీలు కల్పించాలనే సంకల్పంతో మొదలైంది. ఎక్కడుంది ఈ విజ్ఞానం.. భాండాగారాల్లో ఉంది, సైన్సు పేపర్లలో ఉంది, పుస్తకాల్లో ఉంది, వార్తా పత్రికల్లో ఉంది, పెద్దపెద్ద సర్వర్లలో ఉంది, పర్సనల్ కంప్యూటర్లలో ఉంది, మెమరీ చిప్‌లలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కొందరో అందుకోగలిగే తావుల్లో ఉంది. దీన్నంతటినీ ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పెడతారు?

  • ఎలా తెస్తారు: ఈ సమాచారాన్నంతటినీ చదివి, తేనెటీగలు మకరందాన్ని సేకరించినట్లు వాటిలోని సారాన్ని సేకరించి తెస్తారు.
  • ఎవరు తెస్తారు: స్వచ్ఛందంగా పనిచేసే చదువరులు, లేఖకులు.
  • ఎక్కడ చేరుస్తారు: ఇదిగో ఈ వికీపీడియాలో.
  • వికీపీడియానా.. అంటే?

వికీపీడియా అనే పేరు ఎలా వచ్చిందనే కథాక్రమం బెట్టిదనిన..

చకచక, పకపక, గబగబ, సలసల, టపటప, తపతప అంటూ జమిలి పదాలున్నాయి కదా మనకు. విడిగా వాటికి అర్థం లేదు, కానీ జంటగా చక్కటి అర్థాన్నిస్తాయి. అలాంటి జమిలిపదాలే హవాయీ భాషలో కూడా ఉన్నాయి. వాటిలో వికివికి అనే మాట ఒకటి. దాని అర్థం చకచక/గబగబ అని. ఆశ్చర్యంగా ఉందా? ఔను, నిజమే!

హవాయి విమానాశ్రయంలో ఈ మాట విన్న వార్డ్ కన్నింగ్‌హామ్‌ అనే పెద్దాయనకు అది నచ్చి, 1995 లో తన వెబ్‌సైటుకు ఆ పేరు పెట్టాడు. ఎవరైనా మార్పుచేర్పులు చేసేలా, ఆ మార్పులు కూడా చకచకా చెయ్యగలిగేలా ఆ వెబ్‌సైటును తయారుచేస్తూ దానికి వికివికివెబ్ అని పేరు పెట్టాడు. ఆ వికీ అనే పేరునే తరువాత వికీపీడియాకు కూడా వాడారు. వికివికి+ఎన్‌సైక్లోపీడియా = వికీపీడియా అన్నమాట! వికీపీడియా ప్రస్తుతం 353 భాషల్లో ఉంది. తెలుగులో వికీపీడియా 2003 డిసెంబరులో మొదలైంది. మనం దీన్ని గబగబపీడియా అనో చకచకవిజ్ఞానం అనో కూడా అనుకోవచ్చు. తెలుగు వికీపీడియాకు అది ప్రత్యేకం!

వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

[మార్చు]

వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాగా మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

ఏమిటి వికీపీడియా విశిష్టత?

[మార్చు]

వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలను పెద్దసంఖ్యలో ప్రింటేసి, వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.

భారతీయ భాషల్లో వికీపీడియా:

[మార్చు]

2001 లో ఇంగ్లీషుతో మొదలైన వికీపీడియా, నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 350 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. దాంతోపాటు హిందీ, సంస్కృతం, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ, ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. వ్యాసాల సంఖ్య పరంగా ఉర్దూ, తమిళం, హిందీ, బెంగాలీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు 7 వ స్థానంలో ఉన్న తెలుగు వికీపీడియా 2024 లో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగి ఐదవ స్థానానికి చేరింది. ఈ క్రమంలో లక్ష వ్యాసాల మెట్టును కూడా అధిరోహించింది. చకచకా రెండవ లక్ష చేరుకోడానికి, మరో రెండు స్థానాలు ముందుకు వెళ్ళడానికీ ఒకటే మార్గం - మీరు కూడా వికీపీడియాలో రాయడమే.

తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు:

[మార్చు]

తెలుగు వికీపీడియా (తెవికీ) వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. లక్షా ముప్పై వేలకు పైగా వాడుకరులు (అంటే యూజర్లు) లక్షకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లోని ప్రతీ ఒక్క గ్రామానికీ సంబంధించిన విలువైన సమాచారం తెవికీలో లభిస్తుంది. మరే ఇతర వెబ్‌సైటులోనూ ఒకేచోట ఇంత సమాచారం లభించదు.

అది సరే...

[మార్చు]
అంతా ఉచితమే అంటున్నారు, ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?
అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమేంటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో చూడండి.
ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?
నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు.
దేని గురించి రాయవచ్చు?
మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.
మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?
ఏం పర్లేదు, తెవికీలో వివిధ రకాల తెలుగు టైపింగు ఉపకరణాలు ఉన్నాయి. మీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, టైపింగు మీచేత అదే చేయిస్తుంది.
కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?
మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. హాయిగా రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే! రోజూ రాయండి. వారాంబిఉకి ఒక్కసారే రాయండి, నెలకోసారి రాయండి.. మీ ఇష్టం, మీ వెసులుబాటు, మీ తీరిక, మీ ఓపిక.
కానీ రాయడం నాకు కొత్త, తప్పులు దొర్లుతాయేమో!?
నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.
పది కోట్ల మంది మాట్లాడే భాష మనది, మరీ ఐదో స్థానంలో ఉండడమేంటీ..
ప్రచారం లేక. తెలుగులో వికీపీడియా అనే బృహత్తర విజ్ఞాన సర్వస్వం తయారౌతోంది అనే సంగతి చాలామందికి తెలియదు. 2006 నవంబరు 5 నాడు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో తెలుగు వికీపీడియా గురించి వ్యాసం వచ్చింది. దాంతో తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపైంది. ఆ తరువాతి కాలంలో మరిన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. అలా తెవికీని మరింత మందికి చేర్చే ఉద్దేశమే ఈ పుస్తకం కూడా.

మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?
సాఫ్టువేరు అభివృద్ధికీ, సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకూ అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. ఈ విరాళాల సేకరణకు, తెలుగు వికీపీడియా లాంటి వెయ్యి పైచిలుకు ప్రాజెక్టుల నిర్మాణ నిర్వహణ, పోషణకూ వెన్నుదన్నుగా నిలబడిన సంస్థ ఒకటి ఉంది. అదే..