Jump to content

వికీపీడియా:తెలుగు వికీపీడియా సామాజిక వేదికల మార్గదర్శకాలు

వికీపీడియా నుండి

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వికీపీడియా, సోదర ప్రాజెక్టులకు సమాచారం, ఆసక్తికరమైన అంశాలు, విజ్ఞానపరమైన విశేషాల కోసం వస్తూంటారు. 2004 నుంచి తెలుగు వికీపీడియా విస్తరిస్తూ తెలుగు భాషలో స్వేచ్ఛా విజ్ఞానాన్ని పంచడానికి కృషిచేస్తోంది. 2017 నాటికి 65,500 పైచిలుకు వ్యాసాలు తెలుగు వికీపీడియాలో లభ్యమవుతూండగా, 27 దింపుకొనదగిన పుస్తకాలు, మొత్తంగా 365 పుస్తకాలతో తెలుగు వికీసోర్సు, లక్షా 5వేల పైచిలుకు పదాలతో తెలుగు విక్ష్నరీ, 402 పేజీలతో తెలుగు వికీకోట్, 63 వ్యాసాలున్న పుస్తకాలతో తెలుగు వికీబుక్స్ తెలుగు భాషలో స్వేచ్ఛగా పంచుకోదగ్గ సమాచారాన్ని అందిస్తున్నాయి.

ఐతే మరెంతో చేయాల్సివుంది. ఈ సందర్భంలో సమాచారం మరింతమందికి చేరువకావాల్సివుంది, వికీపీడియాను నిర్మిస్తున్న వికీపీడియా సముదాయం మరింత విస్తరించాల్సివుంది, మరింత సమాచారం ప్రోదిచేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక వికీమీడియా ప్రాజెక్టుల్లో రూపొందుతున్న సమాచారం వెనుక, రూపొందిస్తున్నవారికీ ఎన్నో కథనాలు ఉన్నాయి. వాటిని వివరించడం పై లక్ష్యాలకు దోహదం చేస్తుంది. ఇవి చేసేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సమాజిక మాధ్యమాలు, బ్లాగులు ఉపకరిస్తాయి.

తెలుగు వికీపీడియన్లు గతంలో సమాజిక మాధ్యమాల్లో తెలుగు వికీపీడియా కోసం వేదికలు ప్రారంభించి, తమ ఆసక్తులు, అవగాహన మేరకు కృషిచేశారు. 2017 సెప్టెంబరులో సామాజిక మాధ్యమాల వేదికల్లో (ట్విట్వర్ హ్యాండిల్, ఫేస్ బుక్ పేజీలు) తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల ఉనికి, వ్యూహాలు వంటివాటిపై తెలుగు వికీపీడియా సముదాయంలో చర్చ జరిగింది. ఆ చర్చ ఫలితంగా రూపుదిద్దుకున్న వ్యూహాలు, మార్గదర్శకాలు ఇక్కడ రాస్తున్నాం.

లక్ష్యాలు

[మార్చు]
  1. తెలుగు వికీపీడియాలోని సమాచారం, దాని నాణ్యత, వైవిధ్యం, సముదాయం వంటివాటిని ప్రాచుర్యంలో పెట్టేందుకు (రీచ్) ప్రాథమిక లక్ష్యం
  2. సామాజిక మాధ్యమాల్లో అనుసరించేవారు తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల వరకూ వచ్చి రాయడం అన్నది ద్వితీయ లక్ష్యం

మార్గదర్శకాలు

[మార్చు]
  1. సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఓ ప్రత్యేకమైన పేజీ రూపొందించుకోవాలి.
  2. ఇక్కడ సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి పోస్టులు పెట్టవచ్చో సూత్రప్రాయంగా చర్చించి నిర్ణయించుకుంటే అది ఆ పేజీలో ప్రముఖంగా కనిపించాలి. పాలసీలో సామాజిక మాధ్యమాల పేజీల్లో, హ్యాండిళ్ళలో ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవచ్చు, ఎలాంటి సమాచారాన్ని ప్రచురించరాదు, ఎవరైనా వికీపీడియా ఫేస్ బుక్ పేజీలోనో, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానో ఓ సమాచారాన్ని పంపదలుచుకుంటే ఎక్కడ కోరాలి, మనం ప్రచురించిన సమాచారంపై వచ్చే అనుబంధ ప్రశ్నల కామెంట్లకు సమాధానం ఇవ్వొచ్చా మొదలు ముఖ్యమైన సామాజిక మాధ్యమ నిర్వహణ పాలసీలు ఉండాలి. వేరే పేజీల నుంచి సమాచారాన్ని పున:ప్రచురించదలిస్తే ముఖ్యమైన నిబంధన ఏమిటి వంటి విషయాలను కూడా నిర్ధారించాలి.
  3. తెలుగు వికీపీడియా సామాజిక ఖాతాలను నిర్వహించే ఆసక్తి ఉన్నవారు ఇక్కడే తమ పేర్లతో సైన్-అప్ అవుతారు, ఇక్కడ సైనప్ అయినవారికే సామాజిక మాధ్యమాల్లో నిర్వహణ అప్పగిస్తాం.
  4. నిర్వహణా బాధ్యతలు చేసేవారు దుర్వినియోగపరిస్తే ఆ విషయాన్ని తెలుగు వికీపీడియాలోని సామాజిక మాధ్యమాల పేజీలో నమోదు చేసి, వారిని హెచ్చరించి, హెచ్చరిక ఫలించకుంటే తొలగించాలి.
  5. సామాజిక మాధ్యమాల్లోని పుటలు తెలుగు వికీపీడియా అధికారిక పుటలు కానీ, అధికారిక వేదికలు కానీ కావని స్ఫుటంగా తెలియజేయాలి. ఐతే ప్రధాన వేదికలుగా గుర్తించిన వాటిని నిర్వహించడానికి ఈ పేజీని ఉపయోగిస్తున్నాం.
  6. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యూహాలను అనుసరించి అరుదుగా తప్ప (ఉదాహరణకు మొలక వ్యాసాన్ని అభివృద్ధి చేయడం, వ్యాసాల్లో సమస్యలను గుర్తించడం ఎలాగో నేర్పించడం వంటి పోస్టులు) సాధారణంగా తెలుగు వికీపీడియాలోని నాణ్యమైన వ్యాసాలనే (అంటే కాపీహక్కుల సమస్యలు లేని రచనలు, సరైన మూలాలు, తటస్థ దృక్కోణం కలిగివున్నవి, చక్కగా విస్తరించివున్నవి మొదలైనవి) ప్రదర్శించాలి.

చేయకూడనివి

[మార్చు]

మార్గదర్శకాల్లో రెండవ అంశానికి ఈ చేయకూడని విషయాలు విస్తరణగా భావించవచ్చు

  1. వికీపీడియాకు, స్వేచ్ఛా విజ్ఞానాభివృద్ధికి నేరుగా సంబంధం లేని, కేవల ప్రచారపరమైన పోస్టులను ప్రచురించకూడదు.
  2. తటస్థ వైఖరిని తప్పకూడదు.
  3. వివాదాస్పదమైన ఏ పోస్టునూ చేయకూడదు.
  4. వికీపీడియాకు సంబంధం లేని వ్యక్తిగతమైన పోస్టులు వేయకూడదు.
  5. తెవికీ సభ్యులు అంగీకరించిన, తెవికీ అభివృద్ధికి ఉపయోగపడే మరియు తెవికీ సోదర ప్రాజెక్టులకు సంబంధించిన ముఖపుస్తక సమూహా, పుటలతోనే తెవికీ తెలుగు వికీపీడియా ముఖపుస్తక సమూహా, పుటలను లింక్ చేయాలి తప్ప సంబంధం లేనివాటితో చేయకూడదు.

వ్యూహాలు

[మార్చు]

ఈ కింది వ్యూహాలు తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు సూచించినవి. ఈ వ్యూహాలలో కొత్తవి చేర్చాలన్నా, ఉన్నవాటిలో మార్పుచేర్పులు చేయాలన్నా ముందస్తుగా చర్చపేజీలో చర్చించగలరు.

  • ప్రస్తుతం చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటివాటిని ప్రణయ్ చాలా చక్కగా క్రమం తప్పకుండా వికీపీడియా యాప్లో వచ్చే "షేర్-ఎ-ఫ్యాక్ట్" టూల్ ఉపయోగించి పోస్ట్ చేస్తున్నారు. ఇది కొనసాగించాలి.
  • నెలకు ఒక వికీపీడియన్ చేసిన కృషిని గుర్తించి వారి గురించి కథనం, ఏవీ లాంటివి ఉపయోగించి ప్రాచుర్యం కల్పించాలి. ఈ కృషిలో ప్రధానంగా వారిని గౌరవించుకోవడం అన్న లక్ష్యం కన్నా, వారిలాంటి వృత్తిలో, వయసులో, సామర్థ్యంతో ఉన్నవారికి అరె మనమూ చేయొచ్చు కదా అన్న భావన కల్పించడం ముఖ్యం. కాబట్టి ప్రధానంగా ఒక టీచర్ ఏ సమయాన్ని ఉపయోగించుకుని వికీపీడియా ద్వారా ఏయే లక్ష్యాలను సాధిస్తున్నారు, కుటుంబ బాధ్యతలు పూర్తిచేసుకున్న ఒక జంట తమ సమయాన్ని దీనికి వెచ్చించి ఎంతటి కృషిచేస్తున్నారు, ఎలా భావితరాలకు ఆదర్శప్రాయులయ్యారు, ఒక ఉద్యోగి తనకు ఆసక్తి అయిన సినిమా రంగం గురించి సరదాగా రాయడం ద్వారానే ఎలా వికీపీడియాలో గొప్ప కృషిచేసినవారయ్యారు అన్న కోణంలో ఉండాలి. అసాధ్యమైన పనిలా మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ అనిపించేలా రాయరాదు.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో జరుగుతున్న కృషిని - ఉదాహరణకు తెలంగాణ తేజోమూర్తులు ప్రాజెక్టు, వికీసోర్సులో ఆసక్తికరమైన చిన్ననాటి ముచ్చట్లు దిద్దుబాట్లు, అక్షరదోషాల సవరణ ఇలాంటి విషయాలపై ఫోకస్ చేసి ప్రతీ శుక్రవారం ఒక్కో కథనం అందించవచ్చు. తద్వారా జరుగతున్నదేంటో - జరగాల్సింది ఏంటో, దానిలో వారెలా పాలుపంచుకోవచ్చో తెలియజేయవచ్చు.
  • తెలుగు వికీపీడియా మొదటి పేజీ శీర్షికలను వీలువెంబడి పోస్టులుగా ప్రచురిస్తూండవచ్చు.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి అవుట్-రీచ్ కార్యక్రమాలు జరిగినా, వికీపీడియన్ల గురించి ఏదైనా పత్రికలో కవరేజి వచ్చినా, ఏ విధంగానైనా వికీపీడియాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నా దాన్ని పంచుకోవడాన్ని అనుమతించవచ్చు
  • తెలుగు వికీపీడియాను నిర్వహిస్తున్న విధంగానే తెలుగు వికీసోర్స్ మరియు తెలుగు విక్షనరీ లను గురించి కూడా ప్రతి రోజూ ముఖపుస్తకంలో ఒక పోస్ట్ చేయాలి.
  • తెలుగు విక్షనరీకి అక్కడ పేజీ లేకపోతే సృష్టించాలి. రోజూ ఒకపదం ప్రస్తుతం మొదటి పేజీలో నిర్వహించడం లేదు. అది తిరిగి ప్రారంభించి; అందులోని పదాన్ని ముఖపుస్తకంలో తెలియజేయవచ్చును. బొమ్మలున్న పదాలను చూపిస్తే పిల్లలకు, విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతుంది.
  • తెలుగు వికీసోర్స్ గురించి కూడా ముఖపుస్తకంలో లేదు. అది ప్రారంభించి, నెలకొక పుస్తకాన్ని అందులోని వివిధ అంశాలను పేజీలవారీగా లేదా ప్రకరణాల వారీగా తెలియజేయవచ్చును. కొందరు రచయితల జీవితచరిత్రలను అందించవచ్చును.
  • విక్షనరీ, వికీసోర్స్ లను వారానికి ఒకసారి కాకుండా రోజువారీగానే నిర్వహిస్తే బాగుంటుంది. వీనిలో ఆసక్తి ఉన్నవారికి అవకాశం ఇద్దాము.
  • వివిధ విభాగాలలో మంచి కృషిచేస్తున్న వికీపీడియన్లను గురించి కూడా ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవచ్చును. వారిగురించి తెలియజేయడం వలన మరికొంతమంది తెలుగు వికీ విభాగాల్లో పనిచేయడానికి ముందుకు రావడం లక్ష్యం.
  • వికీమీడియా కామన్స్ లోని అత్యుత్తమమైన ఫోటోలు కొన్నిటిని ప్రచురిస్తూండాలి. తద్వారా ఫోటోలు ప్రచురించవచ్చన్న అంశాన్ని తెలియజేయడం, ఇలాంటి అత్యుత్తమ ఫోటోలు స్వేచ్ఛగా దించుకుని వాడుకోవచ్చన్న అవగాహన అనుసరించేవారికి కలగడం లక్ష్యం.
  • తెలుగు వికీమీడియన్లకు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని, కొత్తవారికి అవసరమైన అవగాహనాపరమైన టపాలను వేస్తూండాలి.

సభ్యులు

[మార్చు]

గమనిక: తెలుగు వికీపీడియా సామాజిక మాధ్యమాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన సభ్యులు ఈ కింద సంతకం చేయగలరు, ఈ కింద సంతకం చేయడంలో పైన మార్గదర్శకాలు విభాగంలో ఉన్న అంశాలతో అంగీకరిస్తున్నట్టు అవుతోంది. నిర్వహణ అప్పగించడానికి, సంప్రదించడానికి మీరు ఈమెయిల్ ఐడీ కానీ, ఫేస్ బుక్ వివరాలు కానీ అందజేయాల్సి రావచ్చు. మీ వివరాలు అనుమతి లేకుండా ఎక్కడా ప్రచురించబడవు:

  1. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:44, 24 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర వనరులు

[మార్చు]