Jump to content

వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు)/2022 డిసెంబరు ప్రెస్‌నోట్

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా వార్షికోత్సవం - 2022 సందర్భంగా పత్రికలకు ఒక ప్రెస్‌నోట్ విడుదల చెయ్యాలని రచ్చబండలో చర్చ జరిగింది. దానికి కొనసాగింపుగా ఇక్కడ ఈ ప్రెస్‌నోట్ డ్రాఫ్టు తయారు చేసి వాడుకరుల పరిశీలన కోసం పెడుతున్నాను. ఈ ప్రెస్‌నోట్‌ను, తెలుగు వికీపీడియాను పరిచయం చెయ్యడం లాగా కాకుండా, తెవికీ లోని కొన్ని విశిష్టతల గురించి చెప్పాలని భావించాం. తదనుగుణంగానే ఈ ప్రెస్‌నోట్.


తెలుగు వికీపీడియా 2003 డిసెంబరు 10 న ఉనికి లోకి వచ్చి 19 ఏళ్ళు గడిచి, 2022 డిసెంబరులో 20 వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా తెవికీలో ప్రజలందరికీ పనికివచ్చే విశేషాలను కింద పొందుపరచాము.

సాధారణం

[మార్చు]
  1. తెలుగు వికీపీడియా విజ్ఞాన సర్వస్వాన్ని అంతర్జాలంలో te.wikipedia.org అనేచోట చూడవచ్చు. ఇది, వికీమీడియా ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థ నిర్వహిస్తున్న వందలాది భాషల విజ్ఞానసర్వస్వాల్లో ఒకటి.
  2. తెలుగు వికీపీడియాను మొబైల్ యాప్ లో కూడా చూడవచ్చు, సవరించవచ్చు.
  3. పూర్తిగా ఔత్సాహికుల ఆధ్వర్యంలో, విరాళాలతో ఇది నడుస్తుంది.
  4. ఇరు తెలుగు రాష్ట్రాలు, భారతదేశం, ప్రపంచం లోని పలు విశేషాల గురించి తెలుగు వికీపీడియా వ్యాసాలు ప్రచురిస్తోంది.
  5. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం దాదాపు 80,000 వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాలన్నీ ఔత్సాహికులు స్వచ్ఛందంగా రాసేవే
  6. ప్రతినెలా 15 లక్షల మంది తెలుగు వారు 65 లక్షల పైచిలుకు పేజీలు చూస్తారు
  7. వెయ్యి పైచిలుకు ఔత్సాహికులు, ఏటా లక్షన్నర పైచిలుకుసార్లు వికీపీడియా పేజీల్లో ఎడిటింగు చేస్తారు
  8. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని గ్రామాలు, మండలాలు, జిల్లాలు, భారతదేశ జిల్లాలు, తెలుగు సినిమాలు, సుప్రసిద్ధులైన తెలుగువారు, భారత ప్రభుత్వ పురస్కారాలు పొందిన ప్రముఖులు, చరిత్ర, సైన్సు వంటి అనేక అంశాలపై వ్యాసాలున్నాయి.
  9. వికీపీడియాకు ఒక నియమం ఉంది: ఇందులోని సమాచారాన్ని ఎవరైనా స్వేచ్ఛగా, ఉచితంగా చదువుకోవచ్చు, ఉచితంగా ప్రింటు తీసుకోవచ్చు, పుస్తకాలుగా వేసి అమ్ముకోవచ్చు, వికీపీడీయాకు పైసా చెల్లించాల్సిన పని లేదు - అయితే ఆ సమాచారం పేర్కొన్నప్పుడు "ఇది తెలుగు వికీపీడియా నుండి సేకరించాం" అని పేర్కొంటే చాలు.
  10. వికీపీడియాకు మరో నియమం ఉంది: ఇక్కడ ఎవరైనా రాయవచ్చు, ఏ అంశం గురించైనా రాయవచ్చు, ఉన్న సమాచారాన్ని సరిదిద్దవచ్చు, సవరించవచ్చు.
  11. వికీపీడియాకు ఇంకో నియమం కూడా ఉంది: ఇక్కడ రాసే ప్రతీ విశేషానికీ తగు విశ్వసనీయ ఆధారాలను చూపించాలి. అంటే నిరాధారమైన సమాచారాన్ని, స్వంత కథనాలను, వ్యక్తిగత, సంస్థాగత ప్రచారాల వంటి రాతలనూ తెలుగు వికీపీడియాలో చేర్చకూడదు.

గ్రామాల వ్యాసాలు

[మార్చు]
  1. తెలుగు వికీపీడీయాలో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు సుమారు 17,000, తెలంగాణ గ్రామాలు సుమారు 10,000 - మొత్తం దాదాపు 27,000 గ్రామాలకు పేజీలున్నాయి.
  2. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని 670 మండలాలకు, తెలంగాణ లోని 607 మండలాలకు - మొత్తం 1277 మండలాలకు పేజీలున్నాయి.
  3. అలాగే రెండు రాష్ట్రాల్లోని కొత్త, పాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లుకు, పురపాలక సంఘాలకు, పట్టణాలకు, అన్ని జిల్లాల, పురపాలక సంఘాల ముఖ్య పట్టణాలకు వ్యాసాలు లభిస్తాయి.
  4. 2016 లోను, ఆ తరువాతా తెలంగాణలో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత వివిధ భౌగోళిక ప్రాంతాల తాజా పరిస్థితిని ఈ పేజీలు ప్రతిబింబిస్తాయి.
  5. 2022 లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత, జిల్లాల తాజా పరిస్థితిని ఈ పేజీలు ప్రతిబింబిస్తాయి.
  6. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత జిల్లాలు, మండలాల భౌగోళిక పరిస్థితిని ప్రతిబింబించే కొత్త మ్యాపులను ఆయా పేజీల్లో చూడవచ్చు. ఈ మ్యాపులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం తయారుచేసినవి. ఇతర ఏ వెబ్‌సైట్లోనూ ఈ మ్యాపులు లభించవు
  7. కొత్త సమాచారంతో పాటు, పునర్వ్యవస్థీకరణలకు ముందు ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల పాత సమాచారం కూడా ఆయా పేజీల్లో ఉంటుంది.
  8. ఈ వ్యాసాలలో ఆ గ్రామానికి చెందిన జనాభా, విద్యా వైద్య సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్యం, సమాచార రవాణా సౌకర్యాలు, భూవినియోగం, గ్రామ ప్రముఖులు వివరాలు, ఇతర మౌలిక వసతులు వివరాలు అందుబాటులో ఉంటాయి
  9. రెండు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతాలకు సంబంధించిన పై సమాచారం ఒక్క తెలుగు వికీపీడియాలో తప్ప మరే ఇతర వెబ్‌సైట్లో కూడా "ఒకేచోట" లభించదు
  10. ఈ సమాచారం మొత్తాన్నీ ముద్రిస్తే 60,000 పైచిలుకు పేజీల గ్రంథం అవుతుంది.
  11. ఈ పేజీల్లో చేర్చిన ప్రతి సమాచారానికీ, ప్రతీ అంకెకీ సముచితమైన ఆధారం ఉంటుంది. ఆ సమాచారాన్ని సేకరించిన ఆధారం కూడా పక్కనే ఇస్తారు.
  12. దాదాపు 20 మంది పైచిలుకు వికీ ఔత్సాహికులు కలసి చేసిన కృషి ఫలితం, ఈ సమాచారం ఎవరైనా స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు.
  13. అంతేకాదు, మీ గ్రామం గురించి, మీ మండలం గురించి ఇంకా సమాచారం చేర్చదలిస్తే, నిరభ్యంతరంగా రాయవచ్చు. ఫొటోలు చేర్చవచ్చు.

తెలుగు వికీపీడియాలో మన గ్రామాల ప్రస్థానం

[మార్చు]

వికీపీడియా అనేది, ఆన్‌లైన్‌లో ఎవరైనా, ఎవ్వరి అనుమతితో పనిలేకుండా వారికి తెలియని సమాచారం స్వేచ్చగా పరిశీలించటానికి, నలుగురికి పంచటానికి అవకాశం ఉన్న ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వసం.అంతేగాదు దీనిలో రచనలు, సవరణలు ఎవరైనా చేయవచ్చు.వికీపీడియా సుమారు 250 భాషలకు పైబడి నిర్వహిస్తుంది. తెలుగు వికీపీడియా https://te.wikipedia.org అనే సైట్ ద్వారా నిర్వహించబడుతుంది.తెలుగు వికీపీడియా సంక్షిప్త నామం 'తెవికీ'.ఇది 2003 డిశెంబరు 10న ఆవిర్భవించింది.

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని మనందరకు తెలుసు.. తెవికీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అలాంటి గ్రామాలకు చెందిన సమాచార, గణాంక వివరాలను ఈ వ్వాసం వివరిస్తుంది.రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా కాలం తరువాత, తాజాగా జిల్లాల, మండలాలు పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత, ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఆవిర్బవించిన సంగతి మనందరికి తెలుసు.భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామం అంటే రెవెన్యూ గ్రామం అని అర్థం చేసుకోవాలి.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతి గ్రామానికి తెవికీలో వ్యాసం పేజీ ఉందని ఘంటాపధంగా చెప్పుకోవచ్చు.ఈ గ్రామ వ్యాసాలలో ప్రధానంగా ఆ గ్రామానికి చెందిన జనాభా, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యం, తాగునీరు, పారిశుద్యం, సమాచార రవాణా సౌకర్యాలు,భూమి వినియోగం, గ్రామ ప్రముఖులు వివరాలు, ఇతర మౌలిక వసతులు వివరాలు అందుబాటులో ఉన్నవి.శివారు గ్రామాల (రెవెన్యూయేతర గ్రామాలు) సమాచారం దాని రెవెన్యూ గ్రామంలోనే కలిసి ఉంటాయి. కొన్ని శివారు గ్రామాలకు ప్రత్వేక పేజీలు లేకపోలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 26 జిల్లాలు, 670 మండలాలు, 16,479 గ్రామ వ్యాసాలకు పేజీలు ఉన్నవి.అలాగే తెలంగాణ రాష్ట్రానికి వస్తే 33 జిల్లాలు, 607 మండలాలు, 10,332 గ్రామ వ్యాసాలకు పేజీలు ఉన్నవి.

అంతేగాదు రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని రెవెన్యూ డివిజన్లుకు , పురపాలక సంఘాలకు, జనగణన పట్టణాలకు, అన్ని జిల్లాల, పురపాలక సంఘాల ముఖ్య పట్టణాలుకు వ్యాసాల పేజీలు తెవికీలో లభిస్తాయి.

ఈ స్థాయికి సమాచారం తెవికీలో లభిస్తుందంటే ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యపడిందికాదు. తెలుగు వికీపీడియా 2003 డిసెంబరు 10న ఆవిర్భవించిన నాటినుండి దేశ, విదేశాలలో ఉన్న అన్ని రంగాల తెలుగు వ్యక్తులు వీరంతా ఒక్క నయాపైసా పారితోషకం ఆశించకుండా నిరంతరం ప్రవృత్తిగా ఖాళీ సమయాన్ని ధారపోసి వందల కొద్దీ వ్యాసాలు రాస్తూ, రాసిన వ్యాసాలలో మరింత తాజా సమాచారం చేరుస్తూ, తప్పుఒప్పులు సవరిస్తూ , చేయీ, చేయీ కలుపుతూ సాగిన ప్రయాణమే తెలుగు వికీపీడియా. ఇది కేవలం గ్రామాలను దృష్టిలో పెట్టుకుని రాసిన వ్యాసం మాత్రమే. మరింత సమాచారం వికీపీడియాలో లభిస్తుంది. సమాచారం చేర్చే ప్రక్రియ ఇది నిరంతర ప్రయాణం.అన్ స్టాపబుల్ కార్యక్రమం. చివరగా మీరూ ఇందులో పాల్గొని మీ విజ్ఞానాన్ని ఇతరులకు పంచండి. ధన్యవాదాలు.

సినిమా వ్యాసాలు

[మార్చు]
  1. తెలుగు వికీపీడియాలో సినిమాలకు సంబంధించిన వ్యాసాలు దాదాపు 7000 ఉన్నాయి.
  2. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల సినిమాలకు కూడా వ్యాసాలున్నాయి
  3. వీటిలో వెయ్యి పైచిలుకు నటీనటులు, సాంకేతిక నిపుణులకు వ్యాసాలున్నాయి
  4. ఈ వ్యాసాలను సంవత్సరం వారిగా విడుదలైన సినిమాలు, ఫలానా నటుల/దర్శకుల సినిమాలు, జీవితచరిత్రల సినిమాలు.. వంటి వివిధ వర్గాలుగా చూడవచ్చు
  5. ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను కూడా ఈ పేజీల్లో చూడవచ్చు
  6. ఈ సమాచారం మొత్తాన్నీ ప్రింటు తీస్తే దాదాపు 15 వేల పేజీల పుస్తకం అవుతుంది
  7. వికీపీడియా సూత్రాలకు అనుగుణంగా పై సమాచారాన్ని ఎవరైనా స్వేచ్ఛగా, ఉచితంగా చదువుకోవచ్చు, ప్రింటు తీసుకోవచ్చు, పుస్తకాలుగా వేసి అమ్ముకోవచ్చు - ఇది తెలుగు వికీపీడియా నుండి సేకరించాం అని ఒక్క మాట చెప్పితే చాలు.
  8. అంతేకాదు, ఈ సినిమాల గురించి ఇంకా సమాచారం చేర్చదలిస్తే, లేదా కొత్తగా ఏదైనా వ్యాసం రాయదలచినా నిరభ్యంతరంగా రాయవచ్చు. ఫొటోలు చేర్చవచ్చు.

వ్యాసం (ప్రసంగానికీ కూడా ఉపయోగపడుతుంది)

[మార్చు]
Wikipedia-logo-v2-te

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం , ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉచితంగా, స్వేచ్ఛగా, జ్ఞాన సర్వస్వముతో పంచు కొనుటను ఊహించండి, ఇదే 2001 నుండి ప్రపంచం అంతటా ఉన్న సభ్యుల దిద్దుబాటులతో ముందుకు సాగుతున్న వికీపీడియా మరియు సోదర వికీ మీడియా ప్రాజెక్టుల లక్ష్యం. వికీపీడియా, ఒక బహుభాషా, అంతర్జాల (వెబ్) – ఆధారిత స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము , ఇక్కడ సమాచారం గురించి తెలుసుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని కూడా చేర్చవచ్చు ఆ సమాచారం తక్షణం అందరికీ అందుబాటులో ఉంటుంది, తెలుగు తో సహ 328 పైచిలుకు ప్రపంచ భాషలలో వికీపీడియా సేవలు అందిస్తున్నది,తెలుగు వికీపీడియా 2003 డిసెంబరు 10 న ఉనికి లోకి వచ్చి 19 ఏళ్ళు గడిచి, 2022 డిసెంబరులో 20 వ ఏట అడుగు పెడుతోంది, వికీపీడియాకు మొబైల్ యాప్ కూడా ఉన్నది.

తెలుగు వికీపీడియా url : https://te.wikipedia.org/. 

వికీపీడియాలో ఇప్పటికే పలు అంశాల మీద 80 వేల పైన వ్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైన సాహిత్య విషయాలు, రచయితలు రచనల వివరాలు తెలుగు వికీపీడియాలో అంతంత మాత్రంగానే ఉన్నాయి లేక కొన్ని అసలు లేనే లేవు. వికీపీడియాలో విషయాన్ని తాజాగా ఉంచడానికి, ప్రస్తుతం మొలకలుగా ఉన్న వ్యాసాలను విస్తరించడానికి మరియు కొత్త వ్యాసాలను సృష్టించడానికి మీలాంటి వారిపై ఆధారపడుతుంది. మీ వికీ కృషి వందలూ, వేలూ, ఒక్కోసారి లక్షలాది ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది. అందరికీ అన్నీ విషయాలు తెలియక పోవచ్చు, కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం పై కొంత విషయ జ్ఞానం కలిగి ఉంటారు . అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానాన్ని ఒక చోట చేర్చటం వల్ల విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది. అలా కూర్పు చేసిన విజ్ఞానసర్వస్వం ఉచితం గా, స్వేచ్చగా అందించటమే వికిపీడియా లక్ష్యం. వికీపీడియా అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది, తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అయిన కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్, వికీసోర్స్ మొదలైనవాటి మీద తెలుగు ఔత్సాహికులు స్వచ్ఛందంగా ఎలా కృషి చేయవచ్చు అన్న అంశాల గురించి తెలుసుకుందాం. వికీపీడియాలో ఒక వ్యాసం రాయడానికి, మనకు తగినంత సమాచారం ఉండాలి అనేది చాలా మందిలో ఒక అపోహ. వికీపీడియాలో ఏదైనా వ్యాసం రాయడానికి లేదా సవరించడానికి మీరు ఏ రంగంలోనైనా నిపుణులు కానవసరం లేదు. అయితే ఆ వ్యాసం కు ఆధారం అవసరం, వికీపీడియా లో ఉన్న ప్రతి వ్యాసం వందలాది మంది సహకారులు చేసిన సమిష్టి కృషి ఫలితం. రేపు మీరు చాలా తక్కువ సమాచారంతో ఒక వ్యాసాన్ని ప్రారంభించినా , ఇంకొకరు క్రొత్తగా సమాచారాన్ని జోడించడం ద్వారా దాన్ని పెంచుతారు, తరువాత ఇంకొకరు ఆ వ్యాసానికి స్వరూపాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాసంలో ఎక్కడా సభ్యుల పేరు, సంతకం తగవు. ఎవరు ఏమి వ్రాశారో వ్యాసం 'చరిత్ర'లో ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది కొత్తవారు వికీపీడియాలో ఏమేమి వ్రాయవచ్చు, ఎలా వ్రాయవచ్చు వంటి విషయాలు నేర్చుకోవటానికి , వ్రాసేటప్పుడు కలిగే ఇబ్బందులు సరిచేయటానికి అన్ని వనరులు కూడా వికీపీడియా లోనే ఉన్నాయి. మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది ఆ తప్పులను సరిదిద్దుకొనే అవకాశం కూడా వికీపీడియాలో ఉన్నది. కొత్తగా వ్యాసం రాయకపోయినా ఇప్పటికే ఉన్న విషయాన్ని కూడా మార్చ వచ్చు , అదనపు సమాచారం చేర్చవచ్చు అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు. తెలుగు వికీపీడియా కేవలం తెలుగు యూనీకోడ్ ని మాత్రమే సపోర్టు చేస్తున్నది తెలుగును టైపుచేయటానికి లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు), మొబైల్ లో జి బోర్డు, మాట్లాడటం ద్వారా టైపు (text to speech) వంటి ఉపకరణాలతో తెలుగులో రాయవచ్చు. వికీపీడియా వ్యాసాలు ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినవి కావు, కానీ ఇది చాలా మంది సభ్యుల సహకార సామూహిక ఫలితం. మీరు సృష్టించిన వ్యాసంలో మరే ఇతర సభ్యుడు తప్పు సమాచారాన్ని నమోదు చేస్తే, మీరు దాన్ని తీసివేయవచ్చు లేదా నిర్వాహకుల సహాయంతో ఆ అనవసరమైన కంటెంట్‌ను తొలగించవచ్చు. ఎవరైనా సభ్యులు వ్యాసం చర్చా పేజీలో చేర్చిన వాస్తవాన్ని చర్చించవచ్చు, ఇతర నిర్వాహకులు , సభ్యులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు , మెజారిటీ ఆధారంగా, వాస్తవం నిజమని అనిపిస్తే వ్యాసంలో మాత్రమే ఉంచబడుతుంది. మీరు ఎడిటింగ్ / సవరణ చేసే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు రిఫరెన్స్ , నోటబిలిటీ విషయం గుర్తించబడకపోతే, సరిగా ప్రస్తావించబడకపోతే లేదా కాపీరైట్‌ను ఉల్లంఘిస్తే మీ వ్యాసం తిరస్కరించబడుతుంది. కాపీరైట్ మూలాల నుండి విషయాన్ని కాపీ –పేస్ట్ చేయవద్దు , లేదా దగ్గరగా పారాఫ్రేజ్ చేయవద్దు. మీ స్వంత మాటలలో మూలం చెప్పేదాన్ని సంగ్రహించండి. మూలాలు వ్యాసం అంశం ఇప్పటికే విశ్వసనీయమైన మూలాల్లో ఉండాలి. వీటిలో అకడమిక్ జర్నల్స్, బుక్స్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, ఫ్యాక్ట్ చెకింగ్ కొరకు పేరు ప్రఖ్యాతులున్న వెబ్ సైట్ లులో ఉండాలి. సోషల్ మీడియా, ప్రెస్ రిలీజ్ లు లేదా కార్పొరేట్ / ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ కు అర్హత లేదు రిఫరెన్స్ సాధారణంగా ఆమోదయోగ్యమైన స్వతంత్ర వనరులను రిఫరెన్స్ లుగా ఉపయోగించాలి. ప్రాథమిక వాస్తవాలను మాత్రమే ధృవీకరించడానికి స్వతంత్ర వనరులు (కంపెనీ వెబ్‌సైట్లు లేదా పత్రికా ప్రకటనలు వంటివి) ఉపయోగించబడతాయి. మీరు వ్యాసంలో రిఫరెన్సు గా ఇవ్వటానికి వ్యక్తిగత బ్లాగులు, సోషల్ మీడియా , టాబ్లాయిడ్ జర్నలిజం సాధారణంగా ఆమోదయోగ్యం కాదు. మీ గురించి లేదా / మీకు దగ్గరగా ఉన్న ఏదో గురించి రాయడం వికీ విధానం కాదు, వికీపీడియా ప్రచార సాధనం కూడా కాదు. మీ గురించి మీ స్వంత వ్యాసం అయినా కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, యజమాని, గురువు / వ్యాపార భాగస్వామి, లేదా మీకు దగ్గరగా ఉన్న విషయాల గురించి రాయడం వికీ నియమాలకు విరుద్ధం , ఎందుకంటే మీరు సృష్టించే వ్యాసం తటస్థంగా ఉండకపోవచ్చు. వ్యాసాలలో కాపీ-పేస్టింగ్ చేయకూడదు , మీరు ఆర్టికల్ ని మీకు ఉన్న వనరుల ఆధారంగా మీ స్వంత పదాల్లో రాయాలి, అలా కాకుండా రాసిన వ్యాసాలను నిర్వాహకులు వికీపీడియా నుండి తొలగించటం చేయవచ్చు. మీరు రాసిన ఆర్టికల్ లో మూలాలను పేర్కొనకపోవడం లేదా స్వతంత్ర విశ్వసనీయ మూలాలు లేని వ్యాసాలు సాధారణంగా కొన్ని రోజుల్లో తొలగించబడతాయి. వికీపీడియా సాధికారికతను, నిబద్ధతను మెరుగుపరచేందుకు., సమాచారపు శ్రేయస్సును మూలానికే చెందేలా చేసి, కాపీ కొట్టారన్న అపవాదు రాకుండా చేసేందుకు, మీ రచన మౌలిక పరిశోధన కాదని తెలియ జేసేందుకు , వ్యాసంలోని విషయాలు నమ్మదగినవని ఏ పాఠకుడికైనా లేదా నిర్వాహకుడికైనా తెలియజేసేందుకు, ప్రజలకు వ్యాసంలోని విషయానికి సంబంధించిన మరింత విశ్వసనీయమైన సమాచారం తెలియజేసేందుకు, వ్యాసంలో దిద్దుబాట్లకు సంబంధించిన వివాదాలు నివారించడం కోసం లేదా ఏదైనా వివాదాలు వస్తే పరిష్కరించడం కోసం మనం మూలాలను చూపాలి, మూలాలను ఉదహరించే ఫార్మాటు మీకు తెలియని పక్షంలో మూలాల గురించి మీకు తెలిసిన సమాచారాన్ని రాయండి. ఇతర వికీపీడియన్లు దానిని తగిన ఫార్మాటులో పెడతారు. మీరు సృష్టించిన కథనాలను ఇతర వ్యక్తులు సులభంగా కనుగొనగలిగేలా మీరు వ్యాసాలపై సరైన వర్గాలను ఉంచడం చాలా ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం- మీ వ్యాసానికి సంబంధించిన ఇతర కథనాలను కనుగొనడం మీ వ్యాసానికి వాటి వర్గాలను కూడా ఉపయోగించడం. మీరు ఒక పండుపై వ్రాస్తుంటే, మీకు తగిన కొన్ని వర్గాలను ఇవ్వగల అదే రకమైన ఇతర పండ్లపై కథనాలను కనుగొనడానికి ఉపయోగ పడుతుంది. మీరు ఆంగ్లంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మీ స్థానిక భాషలో ఇవ్వవచ్చు, ఇది ఆంగ్ల భాష తెలియని లేదా వారి మాతృభాషలో వ్యాసం చదవడానికి ఇష్టపడే చాలా మందికి సహాయపడుతుంది. ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకుండా, మాతృభాషలో ప్రావీణ్యం గల భారతీయులు చాలా మంది ఉన్నారు. ఆంగ్లంలో ప్రావీణ్యం లేకపోవడం లేదా వారి మాతృభాషలో జ్ఞానాన్ని పంచుకోవడం లో భాష అడ్డంకి కాకూడదు. వ్యక్తిగత అభిప్రాయాలు పక్షపాతం వివాదాలకు దారితీస్తాయి. మీరు వికీపీడియా వ్యాసంలో సమాచారం ఇస్తారు, మీ అభిప్రాయం కాదు. ఉదాహరణకు, ఒక చిత్రంలో ఎన్ని పాటలు ఉన్నాయో మీరు వ్రాయవచ్చు. కానీ ఏ పాటలు మంచివి, ఏ పాటలు తగనివి అనే వ్యక్తిగత ఆలోచనలు రాయకండి. మీకు ఇష్టమైన కొన్ని పాటల్లో మీకు నచ్చని పాటలు కావచ్చు. అదేవిధంగా, వ్యక్తిత్వ వ్యాసంలో మీరు వారి రచనలు ఏమిటో వ్రాయవచ్చు, కాని ఆ రచనలపై మీ అభిప్రాయాన్ని ఇవ్వరాదు రచన మొత్తం వచనాన్ని ఉటంకించడం కాపీరైట్ చట్టం పరిధిలోకి వస్తుంది. అందువల్ల వ్యాసానికి అవసరమైన విధంగా 4-5 పంక్తులను కోట్ చేయడం చట్టబద్ధం. గరిష్టంగా ఎన్ని పంక్తులను కోట్ చేయవచ్చనే దానిపై మార్గదర్శకం ఉంది.

ముఖ్యమైన తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు:

విక్షనరి : నిఘంటువు - http://te.wiktionary.org : విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం ఇందులో మనమంతా సంకల్పిస్తే సంవత్సరం లో మన అన్ని మాండలిక మరియు మౌఖిక పదాలను వాటి అర్థ-స్వరూప-ఉదాహరణ సహితంగా చేర్చి ఉపయోగించుకోవచ్చు.
వికికోట్ : http://te.wikiquote.org/ : వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి.
వికీబుక్స్: http://te.wikibooks.org/ : ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి పుస్తకాల నెలవు, ఇక్కడ మనమే ఒక పుస్తకం రాయవచ్చు , ఇక్కడ మీ సొంత అభిప్రాయాతో ఏవిధమైన అంశం, సాహిత్యం, కథలు, కవిత్వాల పుస్తకాలు రాయవచ్చు, ఇతరుల సహకారం కూడా తీసుకోవచ్చు.
వికిసోర్స్ : http://te.wikisource.org/ ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు మూలరూపాల సమాహారం -- మనం నిత్యం చదువుకునే ఏ స్మృతి-శృతి సంహిత అయినా, మన శతకకారులు రచించిన శతకములు, వేద-వేదాంగాలు,పురాణ-ఇతిహాసాలు ఇక్కడ వాటి మూల రూపంలో పొందుపరుచవచ్చు. మీ వద్ద ఉన్న ఏదైనా పుస్తకం స్కాన్ కాపీ,PDF వంటివి కూడా ఇక్కడ పంచుకోవచ్చు , OCR వంటి సౌకర్యం వలన అక్షర రూపంలో మార్చుకోవచ్చు.
వికీమీడియా కామన్స్: https://commons.wikimedia.org/ ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాల మరియు చలనచిత్రాల సంకలనం -- ఇక్కడ మీరు అందరితో పంచుకునే విధంగా ఎటువంటి కాపీరైటులేని క్రియేటివ్ కామన్స్ మరియు ఇతర సంబంధిత లైసెన్స్ లలో అనేక చిత్రాలు(ఫోటోలు), పుస్తకాలు,దస్త్రాలు పెట్టుకోవచ్చు.
వికీడేటా: https://www.wikidata.org/ వికీడేటా అనేది మానవులు మరియు యంత్రాలు ఇద్దరూ చదవగలిగే మరియు సవరించగలిగే ఉచిత, బహిరంగ జ్ఞాన స్థావరం ఇందులో లక్షలాది పదాలకు వివరణ తెలుగులో చేర్చవచ్చు.
తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు
వికీపీడియా ఒక్క విజ్ఞానసర్వస్వముగా మాత్రమే కాక ఇంకా మరెన్నో రూపాలుగా మనకు ఉపయోగపడుతుంది కొందరికి యాత్రాదర్శినిగా, కొందరికి ఏదో ఒక విషయమై ప్రమాణంగా పరిగణించబడుతుంది ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని రకాలుగా వికీ ని మనం వాడుకోవచ్చు వికీపీడియా మరియు అనుబంధ కార్యక్రమాలను ఆంగ్ల మాధ్యమం వారు విరివిగా వాడుకుంటారు. మన తెలుగులో కూడా ఏది కావాలనుకున్నా తెలుగు వికీపీడియాలో దొరకాలి , దీని కోసం అందరి సహకారం కావాలి మనం వికీపీడియాలో చేరి చరిత్ర సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, పద్యాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. వికీపీడియాలోని సమాచారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు , వ్యాపార ప్రయోజనాలకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు , ప్రాథమికంగా ఆ సమాచార పాఠ్యం , చిత్రములు క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు.
వివరాలకు తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org/ చూడండి
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. లాగిన్ అయిన తరువాత మీరు స్వంతంగా నేర్చుకోవడానికి తగిన వనరులు ఉన్నాయి, మీకు సహాయం చేయడానికి వికీపీడియా సభ్యులు సిద్ధంగా ఉన్నారు,వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ ప్రత్యేకంగా మీకోసం గురువు కేటాయించబడతారు.

వికీపీడియాలో ప్రాజెక్టులు, బహుమతులు, ఛాలెంజింగ్ లు

[మార్చు]

వికీపీడియాలో వ్యాసాల అభివృద్ధికి అనేక రకాలైన ప్రాజెక్టులను నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు గ్రామ వ్యాసాల అభివృద్ధికి గ్రామాల ప్రాజెక్టు, చిత్రాలను వ్యాసాలలో చేర్చడానికి చిత్రాల ప్రాజెక్టు (ఫొటోస్ వాంటింగ్ పేజెస్), మొలక వ్యాసాలను విస్తరించడానికి మొలక వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు, భాషల గురించి తెలియజేయడానికి భాషలకు సంబంధించిన ప్రాజెక్టు (వికీలో భాషలు) వంటివి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన ప్రాజెక్టులను నిర్వహించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులను నడిపించడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వికీపీయన్లు నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. అలాగే అందరూ వికీపీడియన్లు ఈ ప్రాజెక్టుల్లో పాల్గొంటారు.

వికీపీడియాలో జరిగే కొన్ని కొన్ని ప్రాజెక్టుల్లో ఉత్తమంగా నిలిచిన వికీపీడియన్లకు బహుమతులు, అవార్డులు కూడా అందిస్తారు. ఉదాహరణకు వికీపీడియా పేజిస్ వాంటింగ్ ఫొటోస్ అనే ప్రాజెక్టులో అధిక చిత్రాలు చేర్చిన వారికి, అధిక ఆడియోలు చేర్చిన వారికి, అధిక వీడియోలు చేర్చిన వారికి చక్కటి బహుమతులు అందిస్తారు. అలాగే వికీపీడియా ఏషియన్ మంత్ ప్రాజెక్టులో అధిక వ్యాసాలు రాసిన వికీపీయన్లకు వికీపీడియా ఏషియన్ అంబాసిడర్ అవార్డు వంటి వాటితో సత్కరిస్తారు. ఇలా చాలా మంది వికీపీడియన్లను ప్రోత్సహించే అవార్డులు, సత్కారాలు వికీపీడియాలో ఇంకా చాలానే ఉన్నాయి.

ఇక వికీపీడియాలో ఛాలెంజింగ్ విసరడం అనేది ఆసక్తికరమైన, ఆకట్టుకునే విషయం. ఎందుకంటే వికీలో వ్యాసాలు రాయటం, చిత్రాలు చేర్చడం వంటి వాటిని ఛాలెంజింగ్ గా భావిస్తారు చాలా మంది వికీపీడియన్లు. ఎలా అంటే 'రోజుకో వ్యాసం' అనే ఛాలెంజింగ్ చూసినట్లయితే ఈ ఛాలెంజ్ తీసుకున్న వికీపియన్ రోజుకో వ్యాసం క్రమం తప్పకుండా ఎన్ని అడ్డంకులొచ్చినా రాసి తీరుతాడు. అలా ఏడు రోజుల్లో ఏడు వ్యాసాలు, 30 రోజుల్లో 30 వ్యాసాలు, 100 రోజుల్లో 100 వ్యాసాలు, 1000 రోజుల్లో 1000 వ్యాసాలు వంటి వాటిని సంకల్పంగా పెట్టుకొని వ్యాసాలు రాస్తారు. ఇదే విధంగా చిత్రాలు కూడా చేరుస్తారు. భలే చిత్ర విచిత్రంగా ఉంది కదూ..! మీరు వీటిలో పాల్గొనాలనుకుంటున్నారా...? అయితే ఆలస్యం చేయకుండా వికీపీడియాలో జాయిన్ అవ్వండి!

ఈ సమాచారం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 అంతర్జాతీయ లైసెన్సు క్రింద లైసెన్స్ పొందింది. వికీపీడియా మరియు వికీమీడియా లోగోలు లాభాపేక్షలేని సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ ఇంక్ యొక్క కాపీరైట్ మరియు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు. వికీమీడియా లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌ల ఉపయోగం వికీమీడియా ట్రేడ్‌మార్క్ విధానం మరియు దృశ్యమాన గుర్తింపు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది మరియు దీనికి అనుమతి అవసరం కావచ్చు.

డిసెంబరు 10న ఇరవయ్యో వసంతంలోకి అడుగుపెడుతున్న తెలుగు వికీపీడియా

[మార్చు]

మనిషి దైనందిన జీవితంలో ప్రతిఅవసరానికీ ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నరోజులివి. ఒక పదం అర్ధంబోధపడాలన్నా, ఓ పల్లె విశేషం తెలుసుకోవాలన్నా, మరో వ్యక్తి గొప్పదనం అవగతమవ్వాలన్నా మనకు అందుబాటులో ఉన్నది వికీపీడియా. 328 పైచిలుకు ప్రపంచభాషల్లో సేవలందిస్తున్నవికీపీడియా https://www.wikipedia.org/ తేనెలొలుకు తేటతెనుగులో 2003 డిసెంబరు 10 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ విజ్ఞానాన్ని అచ్చమైన తెలుగులో అందించడంతోపాటు తెలుగు నేలకు సంబంధించిన అనేకానేక విశేషాలను ప్రపంచంముంగిటకు చేరుస్తున్నది తెలుగువికీపీడియా.

తెలుగు వికీపీడియా సంక్షిప్తనామం 'తెవికీ'. 2022 డిసెంబరులో పందొమ్మిదేళ్లు పూర్తిచేసుకుని ఇరవయ్యో ఏట అడుగుపెడుతోంది. వికీపీడియా అనేది అంతర్జాలఆధారిత విషయభాండాగారం. ప్రపంచభాషల్లో విజ్ఞానాన్ని పంచుతున్న స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వం. ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు స్వచ్ఛందంగా రూపొందించిన 80000 వ్యాసాలున్నాయి. దేశవిదేశాల్లో స్థిరపడిన వివిధరంగాల తెలుగువారు ఉత్సాహంగా తమ విలువైనసమయాన్ని కేటాయిస్తున్నారు. వివిధ అంశాలపై ఆకట్టుకునేలా వ్యాసాలురాస్తున్నారు. అందుబాటులో ఉన్న ఫొటోలు, డాక్యుమెంట్లు జతచేస్తున్నారు. ప్రచురితమైన వ్యాసాలకు మరిన్ని మెరుగులుదిద్దుతున్నారు. వికీపీడియాలో ఏ వ్యాసమైనా తగిన విశ్వసనీయఆధారాలు జతచేసి ఉంటాయి. నిరాధారమైన సమాచారానికి ఇందులో చోటులేదు. అందుకే ఇక్కడున్న సమాచారాన్ని సాధికారికమైనదిగా అందరూభావిస్తారు. ఈ విజ్ఞానసర్వస్వాన్ని ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే తమకు తెలిసిన సమాచారాన్ని ఇక్కడి వ్యాసాలకు జోడించవచ్చు. అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా చేయవచ్చు. ప్రతినెలా 15 లక్షల మంది తెలుగువారు దాదాపు 65 లక్షలపైచిలుకు పేజీలు వీక్షిస్తారని అంచనా. అలాగే సుమారు వెయ్యిమంది ఔత్సాహికులు ప్రతిఏటా లక్షన్నరకు పైగా వ్యాసాలను ఎడిట్ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంతటి విలువైన సమాచారం మరేఇతర వెబ్ పేజీల్లోనూ ఒకేచోట లభ్యంకాదు. ఇంతటి విలువైనవిజ్ఞానసర్వస్వాన్ని మరింత మెరుగులు దిద్దుతూ ప్రపంచంలో తెలుగువారెక్కడున్నా వారందరికీ చేరువచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరవయ్యోవసంతంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో తెలుగు వికీపీడియా వికాసంలో భాగస్వాములవుతున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటున్న వారికీ అభినందనలు.
తెలుగు వికీపీడియా ద్వారా అందుబాటులో ఉన్న ఇతర సేవలు:
విక్షనరి :నిఘంటువు - http://te.wiktionary.org
వికికోట్ : http://te.wikiquote.org/
వికీబుక్స్: http://te.wikibooks.org/
వికిసోర్స్ : http://te.wikisource.org/
వికీమీడియాకామన్స్: https://commons.wikimedia.org/
వికీడేటా: https://www.wikidata.org

తెవికీ ప్రత్యేకతలు

[మార్చు]
  1. విజ్ఞానానికి సంబంధించి ఎక్కడా దొరకని సమాచారం తెలుగు వికీపీడియాలో లభిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలతో తాజాపరుస్తూ ఉంటారు.
  2. తెలుగు వికీపీడియాలో దాదాపు అన్ని అంశాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుంది.
  3. తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని పుస్తకంగా ప్రచురిస్తే లక్షన్నర పేజీల పుస్తకం తయారవుతుంది.
  4. తెలుగు వికీపీడియాలో ఎవరైనా రాయడం గాని, ఫోటోలు చేర్చడం గాని చేయవచ్చు. అందుచేత మారుమూల ప్రాంతాలకు సంబంధించిన సమాచారం, ఫోటోలు తెలుగు వికీపీడియాలో దొరుకుతాయి.
  5. వికీపీడియాలోని సమాచారమంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వికీపీడియాలోని వ్యాసాలన్నింటిని పుస్తకంగా ప్రింట్ వేసుకొని అమ్ముకోవచ్చు. ఈ విషయంలో వికీపీడియా ఒక్క పైసా కూడా అడగదు. ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి తీసుకున్నాం అని రాస్తే సరిపోతుంది.
  6. తెలుగు రాష్ట్రాలలోని గ్రామాల, మండలాలకు చెందిన గత చరిత్రకు సంబంధించిన ఎన్ సైక్లోపీడిక్ సమాచారం (గ్రామం పుట్టుక, గతంలో ఏ మండలంలో, ఏ జిల్లాలో ఉంది, గతంలోని జనాభా మొదలైనవి) అంతా తెలుగు వికీపీడియాలో ఒకేచోట లభిస్తోంది.
  7. తెలంగాణ కొత్త మండలాలకు సంబంధించిన మ్యాపులు వికీపీడియాలో తప్ప ఎక్కడా దొరకవు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగా ఈ మ్యాపులు తయారుచేయబడ్డాయి.
  8. వార్తల్లో ఏదన్న విశేషం వస్తే దాన్ని గురించి వివరం తెలుసుకోవడానికి వికీపీడియాను చూస్తారు.