వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీలో నిర్వాహకులు అమలు చేసే నిరోధం వంటి నిర్ణయాలు ఒకరో అంతకంటే ఎక్కువ మందో వాడుకరులను ప్రభావితం చేస్తాయి. ఆ నిర్ణయాలకు గురైన ఆయా వాడుకరులు నిర్ణయంపై విభేదించవచ్చు. అలాంటి సందర్భాల్లో బాధితులకు తరుణోపాయాన్ని ఈ విధానం సూచిస్తుంది.

తనపై విధించిన నిరోధాన్ని పునస్సమీక్షించమని బాధితుడు నిరోధం విధించిన నిర్వాహకుని కాకుండా ఇతర నిర్వాహకులను కోరవచ్చు. ఈ కొత్త నిర్వాహకులు నిరోధ నిర్ణయం తీసుకున్న చర్చలో పాల్గొని ఉండకూడదు. అయితే తెవికీలో చురుగ్గా ఉండే వాడుకరుల సంఖ్యను గమనిస్తే, అలాంటి జోక్యం చేసుకోకుండా ఉన్న నిర్వాహహకులు ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో బాధితులకు మరొక అవకాశం కలిగించడమే ఈ విధాన ఉద్దేశం. ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్నట్లుగా తెవికీలో ఆర్బిట్రేషన్ కమిటీ లేదు. కమిటీని ఏర్పాటు చేసుకునేంత సంఖ్యలో అనుభవమున్న వాడుకరులు లేరు.

పై అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు తిసుకునే నిరోధ నిర్ణయాలపై ఒక సమీక్షా విధానాన్ని ఏర్పరచుకోవడమే ఈ ప్రతిపాదన పేజీ ఉద్దేశం. దీని కోసం ఒక సంఘాన్ని ఏర్పరచుకోవాలని సముదాయం సూత్రప్రాయంగా నిశ్చయించింది. తత్ప్రకారం ఒక ఈ సంఘ నిర్మాణం, దాని హోదా, పని మార్గదర్శకాలు వగైరాలపై సముదాయం చర్చించి, ఆమోదించింది. తదనుగుణంగా, 2020 సెప్టెంబరు 29 న ఈ విధానం అమల్లోకి వచ్చింది.

సంఘ నిర్మాణం

[మార్చు]

ఈ విధానం కింద ఒక సమీక్షా సంఘం ఏర్పాటౌతుంది. ఆ సంఘ వివరాలు ఇలా ఉంటాయి:

 • పేరు: వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం
 • పరిధి: నిర్వాహకులు వాడుకరులపై విధించే నిరోధాలపై సమీక్ష.
 • సభ్యుల సంఖ్య: 3
 • సభ్యుల కాలావధి: రెండేళ్ళు
 • హోదా: ఈ సంఘం తన దృష్టికి వచ్చిన కేసును దర్యాప్తు చేసి, రికమెండేషన్లు మాత్రమే ఇస్తుంది. వాటిని బట్టి సముదాయం నిర్ణయం తీసుకుంటుంది.

సభ్యుల అర్హతలు

[మార్చు]
 1. వికీపీడియా విధానాలు, పద్ధతుల పట్ల అవగాహన కలిగిన వాడుకరులై ఉండాలి. (దీనికి కొలబద్దగా వారు ఏ వికీపీడియాల్లో నైనా, ఏ పేరుబరిలోనైనా కనీసం 5000 దిద్దుబాట్లు చేసి ఉండాలి.)
 2. తెలుగు వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే సభ్యులై "ఉండకూడదు". (అంటే గత మూడేళ్ళలో మొత్తం 50 దిద్దుబాట్లకు మించి చేసి ఉండకూడదు)
 3. తెలుగు మాతృభాషగా కలిగినవారు లేదా తెలుగు క్షుణ్ణంగా రాయడం చదవడం తెలిసినవారై ఉండాలి.

వివాదంలో ఉన్న పక్షాలు

[మార్చు]

ఈ విచారణకు సంబంధించినంత వరకూ నిరోధం విధించిన నిర్వాహకుడు, దానికి గురైన వాడుకరి - వీరిద్దరూ ప్రత్యర్థి పక్షాలు. నిరోధ చర్చల్లో వీరికి మద్దతుగా నిలిచిన వాడుకరులు ఈ పక్షాల్లోకి రారు.

నిబంధనలు, మార్గదర్శకాలు

[మార్చు]
 1. 2020 సెప్టెంబరు 29 న ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీనికి ముందు జరిగిన నిరోధాలు ఈ విధానం ద్వారా అప్పీలు చేసుకునేందుకు అనర్హం.
 2. నిరోధం విధించినప్పటి నుండి, అది ముగిసాక వారం వరకూ అప్పీలు చేసుకోవచ్చు.
 3. నిరోధిత వాడుకరి, మరో నిర్వాహకుని చేత సమీక్షింపజేసే అవకాశాన్ని వాడుకున్నప్పటికీ, సమీక్షా సంఘాన్ని ఆశ్రయించవచ్చు. వాడుకోక పోయినా ఆశ్రయించవచ్చు.

అభ్యర్ధన, విచారణ, రికమెండేషను అమలు

[మార్చు]
 • నిర్వాహకుల నిరోధానికి గురైన వాడుకరి, ఈ సమీక్షా సంఘానికి తన వాదన చెబుతూ తగు ఆధారాల నిచ్చి ఫిర్యాదు చేసుకుంటారు.
  1. ఫిర్యాదు లేనిదే సంఘం జోక్యం చేసుకోదు.
  2. ఫిర్యాదు బాధితుడు మాత్రమే చెయ్యాలి.
  3. ఫిర్యాదు ముగ్గురు సభ్యులలో ఎవరికైనా, ఎందరికైనా చెయ్యవచ్చు. అభ్యర్ధన సభ్యుల స్వంత వికీలోని చర్చా పేజీలో గాని, ఈ మెయిలు ద్వారా గానీ, లేదా ఆ సభ్యులు సూచించిన మరే పద్ధతిలోనైనా చెయ్యవచ్చు.
 • సమీక్షా సంఘం ఆ కేసును తోసిపుచ్చవచ్చు, లేదా విచారణకు స్వీకరించవచ్చు.
 • స్వీకరించినదీ లేనిదీ వారు తెవికీలో రచ్చబండలో సంబంధిత నిర్వాహకులనూ, బాధితునీ ప్రస్తావిస్తూ తమ నిర్ణయాన్ని తెలియబరచాలి.
 • సభ్యుల్లో ఎవరైనా, ఎందరైనా కేసుపై దర్యాప్తు చెయ్యవచ్చు. సంఘం, చర్య తీసుకున్న నిర్వాహకుని వివరణ కోరితే నిర్వహకుడు తన తరపున వాదనను వినిపిస్తూ తగు ఆధారాలను ఇస్తారు.
 • విచారణకు స్వీకరించాక, 7 రోజుల్లో సంఘం ఈ అధారాలను పరిశీలించి, తన నిర్ణయాన్ని తగు హేతువులతో వెలువరిస్తుంది. ఈ సమయంలో సంఘం అడిగితే తప్ప ఇరుపక్షాలు గానీ, మరెవ్వరైనా గానీ ఎటువంటి వాదనలూ చెయ్యరాదు, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. సంఘ నిర్ణయం సముదాయానికి ఒక రికమెండేషను మాత్రమే. శిరోధార్యమేమీ కాదు. ఎందుకంటే, నిర్వాహకుని నిర్ణయాన్ని సమీక్షిస్తూ నిపుణుల సలహాకు గాను, సముదాయం ఈ సంఘాన్ని నియమించుకుంది. సంఘం సముదాయానికి సలహా ఇస్తుంది. అంతిమ నిర్ణయం మాత్రం సముదాయానిదే.
 • ఈ రికమెండేషన్ను పాటించాలా తిరస్కరించాలా అనే ప్రశ్నపై సముదాయం వోటింగు నిర్వహిస్తుంది. చర్చేమీ జరగదు, రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని వోటింగు ద్వారా ఎంచుకుంటుంది. వోటింగుకు గడువు 2 రోజులు. ఈ వోటింగులో, వివాదంలో ఉన్న రెండు పక్షాలకూ ప్రమేయం ఉండదు. సముదాయం తీసుకునే నిర్ణయం ఇరుపక్షాలకూ శిరోధార్యమే. వోట్లు సమానంగా వస్తే, సంఘం ఇచ్చిన రికమెండేషన్ను ఆమోదించినట్లే
 • విచారణకు, వోటింగుకూ పట్టిన 9 రోజుల గరిష్ఠ కాలంలో నిర్వాహకులు విధించిన నిరోధం అమలు ఆగదు, జరుగుతుంది.
 • విచారణ తెవికీలో ఉన్న విధానాల ప్రకారం జరుగుతుంది. తెవికీలో విధానం స్పష్టంగా లేకున్నా, అసలే లేకున్నా ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్న విధానాన్ని అనుసరిస్తుంది.

సమీక్షా సంఘం

[మార్చు]

కింది వారితో సమీక్షా సంఘం ఏర్పాటైంది.

 1. Strike Eagle
 2. Ab207

పర్యవసానాలు

[మార్చు]
 • నిర్ణయం వచ్చేనాటికి నిరోధం ఇంకా అమల్లో ఉంటే, నిర్ణయం ఆ నిరోధాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే నిర్ణయం నిరోధానికి వ్యతిరేకమైతే, నిరోధం తక్షణమే ముగుస్తుంది. అప్పటికే నిరోధ కాలం ముగిస్తే, ప్రభావమేమీ ఉండదు.
 • ఈ ఫలితాన్ని నిరోధాల సమీక్షా పేజీలో చేరుస్తారు.
 • నిర్ణయం, నిరోధానికి వ్యతిరేకంగా వస్తే అది ఆ నిర్వాహకునిపై అభిశంసనగా భావించరాదు.
 • నిర్ణయం, నిరోధానికి అనుకూలంగా వస్తే అది నిరోధిత వాడుకరిపై కొత్త అభియోగంగానో, మరో నిరోధంగానో భావించరాదు.

పద్ధతులు

[మార్చు]

పై విధానాన్ని అనుసరించి ఏయే పనులు ఎలా చెయ్యాలో సూచనప్రాయంగా వివరించే పేజీలు:

 1. వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/సమీక్షా పద్ధతి
 2. వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/నమూనా కేసు