వికీపీడియా:శైలి/సినిమా వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ కింది మార్గదర్శకాలు శైలి కోసం ఉపయోగపడతాయి. ఈ మార్గదర్శక సూత్రాల్లో చాలావరకూ కొన్ని సినమాల గురించో, సినిమా వ్యక్తుల గురించో కాకుండా ప్రత్యేకించి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కో వ్యాసం రాయాలని భావించినప్పుడు ఉపకరిస్తాయి. సాధారణంగా సినిమాల గురించిన వ్యాసాలన్నిటి నుంచీ ప్రాథమిక సమాచారంలోని శీర్షికలు ఉండాలని ఆశించవచ్చు. ఐతే ప్రత్యేక సమాచారం కింద ఉన్న శీర్షికల్లో ఒక్కో శీర్షికా కొన్ని సినిమాలకే ఉంటాయి. ఈ శీర్షికలు ఏ వరుసలో ఉండాలన్న దానిపై నిర్దిష్టమైన వరుస అంటూ ఏమీ లేదు. ఈ పేజీలోని సమాచారం మార్గదర్శకాలకు సంబంధించింది కనుక మార్పుచేర్పులు వికీపీడియా పాలసీలు, పాల్గొనే సభ్యుల ఏకాభిప్రాయాలను అనుసరిస్తూంటాయి.

పేర్లు పెట్టే విధానం

[మార్చు]
 • అప్పటికే సినిమా పేరుతోనే సినిమాలకు సంబంధంలేని వేరే వ్యాసం ఏదైనా ఉంటే అయోమయ నివృత్తి పేజీ సృష్టించి శీర్షికలో (సినిమా) అన్నది చేర్చి తయారుచేయండి: "సినిమా పేరు (సినిమా)"
 • అప్పటికే మీరు సృష్టించదలుచుకున్న పేరుతో వేరే సినిమా ఉంటే మీరు సృష్టించే వ్యాసంలో (సంవత్సరం సినిమా) టైటిల్లో ఉపయోగించండి: "సినిమా పేరు (సంవత్సరం సినిమా)". అలాగే

ఒకవేళ సినిమా టైటిలే సందేహాస్పదమైతే, అంటే సినిమా టైటిల్లో ఫలానా పదం ఉందనీ లేదనీ, వగైరా దాన్ని ఇలా పరిష్కరించాలి:

 • ఆంగ్లో-అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ 7.0బి1 ప్రకారం: సినిమాలు, వీడియో రికార్డింగులకు ప్రధానమైన సమాచార మూలం వరుసలో: సినిమా (ఉదా: టైటిల్ ఫ్రేములు), సినిమా కంటెయినర్ కూడా సినిమాలో అవిభాజ్య భాగం అయితే (ఉదాహరణకు క్యాసెట్, సీడీ కవర్)"(Basic Videorecordings - OLAC)
 • ఇతర భాషల సినిమాల విషయంలో ఒకవేళ ఆ సినిమా తెలుగులో విడుదల కావడం జరిగి ఉంటే వ్యాసానికి ఆ డబ్బింగ్ పేరు పెట్టి, వ్యాసం అంతా డబ్బింగ్ అయిన తెలుగు పేరు ఉపయోగించాలి, ఐతే పరిచయం విభాగంలో బ్రాకెట్లలో, బొద్దు అక్షరాల్లో ఆ మూల భాషలోని టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు తమిళ చిత్రమైన ఇండియన్ తెలుగులో భారతీయుడుగా డబ్బింగ్ అయినందున వ్యాసంలోని పరిచయం విభాగం ప్రారంభం అవుతూనే భారతీయుడు (తమిళంలో ఇండియన్) అని ప్రారంభించి, వ్యాసం అంతా భారతీయుడు అని వ్యవహరించవచ్చు.
  • సినిమా తెలుగులో డబ్బింగ్ అవ్వడం కానీ, మూలభాషలోని పేరుతోనే ప్రాచుర్యం కావడం కానీ జరిగి ఉంటే మూలభాషలోని పేరుతోనే వ్యాసం ఉండాలి. ఉదాహరణకు ఇన్సెప్షన్ సినిమా తెలుగులో ఆరంభంగా డబ్బింగ్ అయినా తెలుగు సినిమా పత్రికలు, విశ్లేషణలు మొదలుకొని తెలుగువారందరికీ ఇన్సెప్షన్ అనే ప్రాచుర్యం చెందింది కాబట్టి ఇన్సెప్షన్ అన్న పేరును ఉంచేలా నిర్ణయించవచ్చు, అలానే వ్యాసం అంతా అదే పేరును కొనసాగిస్తూ డబ్బింగ్ సినిమా వివరాలు ఇవ్వాలి.
  • తెలుగులోకి డబ్బింగ్ కాని సినిమాల విషయంలో నేరుగా ఆయా భాషల టైటిల్స్ తోనే అంతటా వ్యవహరిస్తూ వ్యాస పరిచయంలో బ్రాకెట్లతో తెలుగులో పదానికి అనువాదం ఇవ్వాల్సివుంటుంది.

ప్రాథమిక సమాచారం

[మార్చు]

వ్యాసం ఈ కింది అంశాలను కవర్ చేసేందుకు ప్రయత్నించాలి. అనేక సినిమాల నిర్మాణం, విడుదల వంటివి వేర్వేరుగా ఉండడంతో ఒక్క వ్యాస పరిచయం తప్పించి శీర్షికల నిర్మాణం, ఏ వరుసలో రావాలి వంటివి వాడుకరి విచక్షణను అనుసరించి నిర్ణయించవచ్చు, వ్యాసం అవసరాన్ని అనుసరించి ఉత్తమమైన వరుసలో పెట్టాలి.

పరిచయం విభాగం

[మార్చు]

వ్యాస పరిచయం విభాగం సినిమాను పరిచయం చేసి, మిగిలిన వ్యాసం నుంచి సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాల సారాంశం అందించాలి. కనీసం, ప్రారంభ వాక్యం ఈ అంశాలను తెలియజేయాలి: సినిమా పేరు, విడుదలైన సంవత్సరం, సినిమా విభాగం, ఉప విభాగం, ఇతర అనువర్తించే అంశాలు కూడా ఉండాలి (ఉదాహరణకు ప్రాముఖ్యత కలిగిన దర్శకుడు కానీ, నిర్మాత కానీ) విభాగం వర్గీకరణ (జాన్రా) అన్నది ప్రాధాన్యతను అనుసరించి, ప్రధాన స్రవంతిలోని నమ్మదగ్గ మూలాల్లో నిర్ధారించిన విధంగా ఉండాలి. విదేశీ, పరభాషా చిత్రాల పేర్లు విషయంలో చేయాల్సిన విధానాలను సినిమా వ్యాసంలో పేర్లు పెట్టే విధానాన్ని అనుసరించి ఉండాలి. సినిమా ఏ దేశానికి చెందిందని నిర్ధారించదగ్గ మూలాల ద్వారా నిర్ణయించగలిగితే (ఉదాహరణకు అమెరికన్ చలనచిత్రం, బ్రిటీష్ చలన చిత్రం) ప్రారంభ వాక్యంలోనే ప్రస్తావించాలి. భారతీయ చిత్రాల విషయంలో మూల భాషను ప్రస్తావిస్తే సరిపోతుంది, బహుభాషా చిత్రాలైతే ప్రారంభ వాక్యంలో రెండు భాషల పేర్లు ప్రస్తావించాలి. పరిచయంలోని మొదటి పేరాలో దర్శకుడు, ప్రధాన తారాగణం పేర్లు తెలపాలి. రచయితలు కానీ, నిర్మాతలు కానీ పేరున్నవారైతే వారి పేరు కూడా తొలి పారాగ్రాఫ్ లో తెలియజేయవచ్చు. సినిమా ఏదైనా మూలం (నాటకం కానీ, నవల కానీ, ఇతర సాహిత్య ప్రక్రియలు కానీ, మరో సినిమా కానీ కావచ్చు) ఆధారం చేసుకుని తీసివుంటే ఆ మూలం పేరు కూడా తెలియజేయాలి. వీలైతే సినిమాలోని మౌలిక కథాంశాన్ని, ముఖ్యాంశాలను, నటుల పాత్రలను అత్యంత క్లుప్తంగా వివరించొచ్చు.

పరిచయ విభాగంలో తర్వాత వచ్చే పేరాలు మొదటి లైనులో ప్రస్తావించనివీ, తర్వాత వచ్చే మిగతా వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా వివరించాలి. వీటిలో సినిమాకు సంబంధించి నిర్మాణం, ప్రధానమైన థీమ్స్, సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల స్పందన, వివాదాలు, అవార్డులు, గౌరవాలు, అనుబంధ సృజనలు, ప్రాజెక్టులు (సీక్వెల్స్, రీమేకులు, సంబంధిత మీడియా), సమాజంపై సినిమా చూపిన ఏదైనా గమనించదగ్గ ప్రభావం వంటి ప్రధానమైన ఘటనలు, మైలురాళ్ళ వంటి సమాచారం ఉండాలి. తటస్థ దృక్కోణం అనుసరించి గొప్ప, అద్భుతమైన, అవార్డులు పొందిన, ప్రఖ్యాత, మొదలైన పదాలు మొదటి వాక్యాల్లో పరిహరించాలి, ఐతే తర్వాతి పేరాల్లో మాత్రం నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన విధంగా వచ్చిన అవార్డుల గురించి క్రోడీకరించి రాయాలి.

కథా సంగ్రహం

[మార్చు]

సినిమా వ్యాసాలకు సినిమాలే ప్రాథమిక మూలం కనుక సినిమా కథ గురించి మౌలికమైన వివరణతో రాస్తే, అది బయటి మూలాలతో పనిలేకుండా అంగీకరించవచ్చు. ప్రాథమిక మూలాల గురించి వికీపీడియా పాలసీలు ఇలా ఉన్నాయి[1] - "..ప్రాథమిక మూలం నుంచి కేవలం మౌలికమైన వివరణతో రాయాలి. దాని ఖచ్చితత్వాన్ని సామాన్యమైన విద్యావంతుడైన వ్యక్తి ప్రత్యేకించిన లోతైన విజ్ఞానం లేకుండా పరిశీలించుకుని ధ్రువీకరించుకునేంత మౌలికమైన వివరణే రాయాలి. ప్రాథమిక మూలం నుంచి లభిస్తున్న సమాచారం గురించి విశ్లేషణాత్మకంగా కానీ, సమన్వయం చేసి కానీ, వ్యాఖ్యానించుకుని కానీ, వివరణాత్మకంగా కానీ, మూల్యాంకనం చేసి కానీ రాయకూడదు." సినిమా ప్రాథమిక మూలం కావడం వల్ల, సమాచార పెట్టెలో సినిమా గురించిన వివరణ ఉంటుంది కనుక సినిమా కథాంశం సారాంశం విభాగంలో మూలంగా సినిమాని ప్రత్యేకించి పేర్కొనే అవసరం లేదు. ఈ నియమానికి రాబోతున్న సినిమాలు కానీ, పోయిన సినిమాలు కానీ (పాఠకులు చూసి ధ్రువీకరించుకోవడానికి అందుబాటులో లేనిది) మినహాయించి వాడుకరులు రెండవ స్థాయి మూలాలు ఇవ్వాలి.

పూర్తి నిడివి సినిమాలకు కథ సారాంశం 400 నుంచి 700 పదాల వరకూ ఉండొచ్చు. సినిమా కథా నిర్మాణం సాధారణమైనది కాక విశేషమైనదైతే తప్ప ఈ పరిధి దాటకూడదు. ఉదాహరణకు గజిని, యువ (తమిళంలో ఆయుధ ఎళత్తు), అమెరికన్ సినిమాలైన పల్ప్ ఫిక్షన్ లేదా మెమెంటో వంటి నాన్-లీనియర్ నరేషన్ ఉన్న సినిమాలు, 700 పదాల్లో కూడా వివరించలేనంత సంక్లిష్టమైన కథాంశం అయితే తప్ప సాధారణంగా సినిమాలకు ఈ పరిధి దాటకూడదు. (సారాంశం నిర్ధారిత పదాల పరిధిలో వివరించలేమా అన్న విషయాన్ని వాడుకరులు చర్చించి నిర్ణయించాలి) సంక్లిష్టమైన నిర్మాణం కలిగిన కథలకు కొన్ని వివరణలు మూలాలను సైట్ చేసి రాయాల్సి రావచ్చు. సినిమాలోని సీన్ల గురించి రెండవ స్థాయి మూలాల్లో దృక్కోణాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే, సినిమాలో స్క్రీన్ పై చూపించిన ఘటనలను వీలున్నంత మౌలికంగా కథాంశం సారాంశంగా రాసి, ఆయా వ్యాఖ్యానాలను విడిగా వేరేగా చెప్పాలి. చివరగా, సినిమాలో కథా ఘటనలు ఎలా వస్తాయో అదే వరుసను కథా సారాంశంలో అనుసరించనక్కరలేదు. అవసరమైతే, సినిమాలో ఘటనల వరుసను కథ మరింత స్పష్టంగా అర్థం అయ్యేందుకు తిరిగిరాయొచ్చు.

కథ సారాంశం సినిమాలోని ప్రధానమైన సంఘటనల పర్యావలోకనం మాత్రమే, కాబట్టి అక్కడ డైలాగులు, సీన్-బై-సీన్ విభజన, విడి జోకులు, సాంకేతికాంశాలు లాంటి మరీ చిన్న చిన్న వివరాలతో రాయొద్దు.

కథా సంగ్రహం విభాగం మొదట్లో సాధారణ విడుదల జరిగినప్పుడు కథలోని సంఘటనలనే కలిగివుండాలి. తర్వాత చేర్చిన సన్నివేశాలు, ప్రత్యామ్నాయ వెర్షన్లు, వీడియోల, టీవీ విడుదలల్లో చేర్చిన ఘటనలు వంటివి అవసరమైతే తగిన విధంగా ఇతర విభాగాల్లో రాయాలి.

స్పాయిలర్లు

[మార్చు]

సినిమాలో ముఖ్యమైన ఘటనలన్నిటినీ స్పాయిలర్ గురించి వివరాలు సెన్సార్ చేయకుండా, డిస్క్లైమర్లు, స్పాయిలర్ వార్నింగులు పెట్టకుండా వ్యాసంలో రాయాలి.

నటీనటులు

[మార్చు]

వ్యాసంలో నటీనటులు, వారి పాత్రలు పలు విధాలుగా రాయవచ్చు, అందుకు మూడు విషయాలు పరిగణలోకి వస్తాయి: 1) సినిమాలో నటీనటుల ప్రాధాన్యత, 2) ఒక్కో నటుడికి, నటికి లేదా మొత్తం తారాగణానికి ఉన్న నిజ జీవిత నేపథ్యం (ఆ సినిమా మినహాయించి సామాన్యంగా సినీ రంగంలో వారికున్న ప్రాధాన్యత), 3) వ్యాస నిర్మాణ శైలి. వాడుకరులను (రచయితలు) తమ వ్యాసానికి, వ్యాస పాఠకులకు అత్యుత్తమంగా నప్పే విధంగా మలుచుకొమ్మని సూచిస్తున్నాం. అవసరమైతే చర్చించి ఏకాభిప్రాయానికి రావచ్చు. వివరంగా చర్చించాల్సిన ముఖ్యాంశాలు ఇవి:

 • సినిమా సినిమాకీ తారాగణం సంఖ్యలోనూ, ప్రాధాన్యతలోనూ వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో సినిమాకి భారీ తారాగణం ఉంటే, మరికొన్ని సినిమాలకు అతి కొద్దిమంది నటులు ఉంటూంటారు. వికీపీడియా విచక్షణారహితమైన సమాచార భాండాగారం కాదు, కాబట్టి అత్యంత సందర్భోచితమైన నటులు, పాత్రలను సినిమాకు సరిపడే ఒకానొక నియమం ఒకటి: డైలాగున్న పాత్రలో, పేర్లున్న పాత్రలో, నమ్మదగ్గ మూలాల్లో పేర్కొన్న పాత్రలో, బ్లూ లింకులు (వికీలో వ్యాసాలున్న నటులు, కొన్ని సందర్భాల్లో), వంటిది ఏదోకటి పెట్టుకుని ఆ పరిధిలోనే ప్రస్తావించాలి. మరీ ఎక్కువమంది గుర్తించదగ్గ నటీనటులు ఉన్నట్టైతే, రెండు సూచించదగ్గ పద్ధతులు ఉన్నాయి: రెండు మూడు వరుస(కాలమ్ లు)ల్లో జాబితా వేయడం కానీ, పేర్లు ఒకే లైనులో కామాలు పెట్టి రాయడం కానీ చేయొచ్చు.
 • సందర్భాన్ని బట్టి ఫలానా పాత్రను ఫలానా నటుడు అంటూ జాబితాలా వేయడం కానీ, కొద్దిమంది నటుల గురించి వాక్యాలుగా వివరించి మిగతా నటుల పేర్లు జాబితాగా ఇవ్వడం కానీ చేయొచ్చు.

నటీనటుల ఎంపిక, పాత్రధారణ

[మార్చు]

మొలక స్థాయిలో ఉన్న వ్యాసాలు, ప్రారంభస్థాయికి విస్తరించేప్పుడు ప్రధానమైన నటీనటుల గురించి శీర్షిక పెట్టి, వారి పాత్రల పేర్లు - పోషించిన నటుల పేర్లు జాబితాగా వేస్తే సరిపోతుంది. కానీ ఉన్నత స్థాయికి వ్యాసాన్ని విస్తరించేప్పుడు మరింత సమాచారంతో విస్తరించాలి. సినిమా నిర్మాణ నేపథ్యంలో పాత్రను ఎలా రాశారు, ఏయే నటులను ప్రయత్నించారు, నటుడు/నటి ఆ పాత్ర పోషించేందుకు సినిమా నిర్మాణంలో ఎప్పుడు ఎలా భాగమయ్యారు, పాత్ర పోషణ కోసం చిత్రీకరణ దశలో ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు వంటివి సినిమాను బట్టి విస్తరించాలి. ఈ సమాచారాన్ని అందించడంలో కూడా కొన్ని విధానాలు అనుసరించవచ్చు: నటీనటులు లేక తారాగణం అన్న శీర్షికలోనే ఒక్కో పాత్రకూ ఒక్కో బుల్లెట్ పాయింట్ పెట్టి పాత్ర, నటుల గురించి సందర్భోచితమైన వివరాలను అందించడమో, పట్టిక కానీ, సమాచార పెట్టె కానీ నటులు-వారు పోషించిన పాత్రలను జతచేస్తూ ఇవ్వడమో చేయొచ్చు. వ్యాసం నిర్మాణాన్ని అనుసరించి నటీనటుల ఎంపిక లేదా పాత్రధారణ అన్న ఉపశీర్షకను నిర్మాణం అన్న శీర్షిక కింద పెట్టి ఈ వివరాలు రాయొచ్చు. సినిమాలో పాత్రధారణలోని సంక్లిష్టతలను అనుసరించి (బహుభాషా చిత్రాల్లో కొన్ని పాత్రలు అన్ని వెర్షన్లలోనూ ఒకరే ధరించడం, కొన్ని పాత్రలకు తెలుగులో వేరే నటులు, తమిళంలో వేరేవారూ ఉండడం లాంటివి అనేకం) సాఫీగా అర్థమయ్యేలా ఈ ఫార్మాట్ స్వీకరించాలి.

పాత్రలను కథా సంగ్రహం బయట రాస్తున్నట్టైతే (నటీనటులు, తారాగణం లాంటి శీర్షికల్లో) పాత్రల వివరణ క్లుప్తంగా ఉంచాలి. కథానాయకుడు, ప్రతినాయకుడు, ప్రధాన పాత్రధారి వంటి లేబుల్స్ ఒక్కో పాత్రకీ ఇవ్వకూడదు. సవ్యంగా రాసిన కథ సంగ్రహం నుంచే పాఠకులు ఆయా అంశాలను తన అవగాహన స్థాయి మేరకు గ్రహించగలరు. వికీపీడియా శైలి నియమాల ప్రకారం బొద్దుగా ఉంచడాన్ని శీర్షికలు, క్యాప్షన్లకు పరిమితం చేసి, పాత్రలు - నటులకు బొద్దు అక్షరాల్లో ఇవ్వకుండాలి.

థీమ్స్

[మార్చు]

సినిమాలోని అంశాల (కథాంశం, డైలాగులు, ఫోటోగ్రఫీ, గీతాలు, సంగీతం వంటివి) వెనకున్న ముఖ్యమైన ఆలోచనలు, ఉద్దేశాలు - జీవితం, సమాజం లేదా మానవ స్వభావం గురించి సిద్ధాంతం, సందేశం వెల్లడిస్తూంటే వాటిని థీమ్స్ అంటారు. చాలావరకూ థీమ్స్ సూటిగా, స్పష్టంగా చెప్పడం కాకుండా ధ్వనిస్తూంటాయి. దీనిలో నిర్మాతో, రచయితో, దర్శకుడో కావాలని ఆ ధ్వని ఉద్దేశించాడా లేదా అన్నదానితో నిమిత్తం అవసరం లేదు. వాడుకరి స్వంత అభిప్రాయాలు, మౌలిక పరిశోధనకు రాయకుండా వేరే మూలం నుంచి తీసుకుని, మూలాలను సైట్ చేసి థీమ్స్ గురించి రాస్తే అభినందనీయమైన పని - ఎందుకంటే పాఠకుల పరంగా వ్యాసం విలువ అభివృద్ధి చెందుతుంది, దాని నిజ-జీవిత నేపథ్యం విస్తరిస్తుంది. వేరే విభాగం ఏర్పరచాల్సి వస్తే ఏర్పాటు చేయవచ్చు కానీ థీమ్స్ లోని సమాచారాన్ని నిర్మాణం లేదా స్పందన విభాగాల్లో చేర్చగలిగితే వేరే విభాగం అవసరం లేదు.

నిర్మాణం

[మార్చు]

నిర్మాణం విభాగం సినిమా రూపకల్పనలోని కాలరేఖ (క్రానాలజీ) సరిపోయేలా నాలుగు ఉపశీర్షికలతో ఏర్పరచవచ్చు:

 • అభివృద్ధి: కథాంశం, స్క్రిప్టు అభివృద్ధి చేయడం, సినిమాకు నిర్మాతలను, ఫైనాన్స్ వెతుక్కోవడం, ఒప్పించడం వంటివి
 • ప్రీ-ప్రొడక్షన్: ప్రధానమైన నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడం దీని కిందికి వస్తుంది, అలానే షూటింగ్ కొరకు సన్నాహాలు చేసుకోవడం కూడా దీనికి సంబంధించిందే
 • చిత్రీకరణ: అసలు చిత్రీకరణ- స్థలం కాలాలు, ముఖ్యమైన నిర్ణయాలు, గుర్తుంచుకోదగ్గ సంఘటనలు (ఆలస్యం, తిరిగి చిత్రీకరణ ప్రారంభించడం, ఆర్థిక సమస్యలు వగైరాలు)
 • పోస్ట్-ప్రొడక్షన్: స్పెషల్ ఎఫెక్టుల పూర్తి, సంగీతం, రీరికార్డింగ్, సౌండ్, ఎడిటింగ్

అందుబాటులో ఉన్న సమాచారాన్ని అమర్చేలా ఈ విభాగాన్ని ఏర్పరచాలి: ఉదాహరణకు నిర్మాణం గురించి తగ్గ సమాచారం ఉంటే ఉప విభాగాల కింద విడదీసి రాయొచ్చు (అభివృద్ధి, చిత్రీకరణలాగా); కొన్ని టాపిక్స్ ఒకదానికొకటి సంబంధం ఉంటాయి.

విడుదల

[మార్చు]

సినిమా గురించి వికీపీడియా వ్యాసంలో ప్రధానమైన అంశం - దాని విడుదల గురించీ, దానికి లభించిన స్పందన గురించీ అయివుండాలి. కవరేజీ సినిమా సినిమాకీ మారుతూంటుంది కాబట్టి వాడుకరులు పాఠకులకు సరిగ్గా చేరే విధంగా సమాచారాన్ని విభజించి రూపొందించవచ్చు; సినిమా విడుదల గురించీ, స్పందన గురించీ సమాచారాన్ని కేవలం విడుదల అన్న ఒక్క విభాగం పెట్టి రాయడం నుంచి, పలు ఉప విభాగాలు ఏర్పరిచి రాయడం వరకూ నప్పే విధంగా చేయొచ్చు. సినిమా విడుదల గురించిన సమాచారంలో చెప్పుకోదగ్గ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ, తదితర చోట్లా జరిగిన స్క్రీనింగ్స్, పంపిణీ, సంబంధిత వాణిజ్య వివరాలు, సెటప్స్ (ఉదా: డిజిటల్, ఐమాక్స్, త్రీడీ వంటివి), విడుదల తేదీల మార్పులో ప్రముఖమైన అంశాలు, అవసరమైనప్పుడు మూలం నుంచి స్వీకరించిన వ్యాఖ్యలు. కానీ ప్రతీ ప్రాంతంలోనూ సినిమా విడుదల గురించిన సమాచారాన్ని మాత్రం చేరుస్తూ పోవద్దు.

విమర్శకుల స్పందన

[మార్చు]

సినిమాకు విమర్శకుల నుంచి మొత్తంగా వచ్చిన స్పందన రాసేప్పుడు నమ్మదగ్గ మూలాల నుంచి సమర్థిస్తూ సైటేషన్స్ ఇవ్వాలి. అనవసర విశేషణాలు, అత్యుక్తులు రాయొద్దు. ఏ వ్యాఖ్యనైనా తిరిగి రాసేప్పుడు పదజాలంపై వివాదం తలెత్తితే మూలం నుంచి వ్యాఖ్య (ఆ రెండు లైన్ల వరకే) ఎత్తి రాయండి. నమ్మదగ్గ మూలాల్లో సినిమాపై పలువురు విమర్శకుల మధ్య ఏకీభావం (లేదా ఏకీభావం లేకపోవడం) గురించి రాయగలిగితే అది ప్రోత్సహించదగ్గ విషయం. సినీ విమర్శ నిపుణుల రచనలు ప్రధానంగా పరిగణించాలి. సినిమా పరభాషదైతే అక్కడి భాషలోని రివ్యూ వివరాలను ఉటంకించి రాయగలిగితే, కొన్ని వ్యాఖ్యలను అనువదించాలి. పాత సినిమాల విషయంలో సమకాలీన విమర్శకుల స్పందన (సినిమా విడుదలైన కాలంలో వచ్చిన సమీక్షలు, విమర్శలు), తర్వాత్తర్వాతి స్పందన (తర్వాతి రోజుల్లో రాసిన రివ్యూలు, విమర్శల నుంచి) రాస్తే వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. సినిమా విడుదలైనప్పటి స్పందనకు, ప్రస్తుతం సినిమా ప్రాచుర్యానికి భేదం ఉంటే దాన్ని ద్వితీయ స్థాయి మూలాలతో సమర్థించి సైటేషన్ ఇచ్చి రాయాలి.

ప్రేక్షకుల స్పందన

[మార్చు]

ఈ సమాచారం సినిమా వ్యాసంలో ప్రత్యేకమైన విభాగంగా కానీ ఉపవిభాగంగా కానీ ఉండితీరాలన్న నియమం ఏమీ లేదు. నమ్మదగ్గ మూలాల నుంచి ప్రేక్షకుల స్పందన రాయాలి తప్ప సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఒకరు ఎక్కడో రాసిన వాక్యాన్ని తెచ్చి రాయకూడదు (ఉదాహరణకు యూట్యూబ్, ఐఎండీబీ, బ్లాగుల్లో రాసిన కామెంట్లు) ఎందుకంటే ప్రేక్షకులు అందరి స్పందననూ ఈ ఒక్క స్పందనా మదింపు వేసి చెప్పగల సమర్థతతో సాధారణంగా ఉండదు కనుక. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ కానీ రోటెన్ టమాటోస్ వంటి వెబ్సైట్లలో యూజర్ రేటింగ్స్ ఇందులో చేర్చరాదు, ఎందుకంటే వాటి నిర్మాణపరమైన ఇబ్బందుల కారణంగా వోట్లు స్టాకింగ్ కావడం, పాక్షికత ఏర్పడడం వంటివి జరుగుతాయి.

బాక్సాఫీసు

[మార్చు]

సినిమా వాణిజ్యపరమైన ప్రదర్శన (బాక్సాఫీస్ కలెక్షన్లు) వివరాల సారాంశంలో సాధ్యమైనంతలో సినిమా విడుదలైన దేశపు కరెన్సీలోనే అంకెలు ఇవ్వాలి. డొమెస్టిక్, ప్రాంతీయ, స్థానిక వంటి పదజాలాన్ని ఉపయోగించవద్దు. ఎందుకంటే తెలుగు పత్రికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను స్థానిక అని రాస్తే, జాతీయ పత్రికల్లో స్థానిక అన్న పదానికి వేరే అర్థం ఉండొచ్చు. అమెరికన్ మూలాల్లో అమెరికా, కెనడా మార్కెట్ డొమెస్టిక్ అని, మిగతా ప్రపంచాన్ని ఇంటర్నేషనల్ అని రాస్తారు. కాబట్టి సుస్పష్టంగా రాష్ట్రం లేక ప్రాంతం పేరు, దేశం పేరు రాయండి. ప్రత్యేకించి సినీ వాణిజ్యంలో రాజకీయ పటంలోని పదాలనే ఉపయోగిస్తారని లేదు కనుక (ఉదాహరణకు నైజాం, సీడెడ్ వగైరాలు రాష్ట్రం, జిల్లా పేర్లు కాకున్నా సినిమా వాణిజ్యంలో ప్రఖ్యాతం) మూలంలో ఉపయోగించిన ప్రదేశాల పేర్లనే ఉపయోగించి రాయండి.

ఈ సమాచారం స్పందన అన్న విభాగంలో రాయొచ్చు, ఐతే తగినంత సమాచారం లభిస్తున్న పక్షంలో ప్రత్యేకంగా బాక్సాఫీస్ అని శీర్షిక పెట్టి వేరే విభాగంగా రాయొచ్చు. ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ గణాంకాలతో పాటుగా, ఈ విభాగంలో తొలి వారాంతం, వివిధ ప్రాంతాల నుంచి ఫలితాలు, సినిమా విడుదలైన థియేటర్ల సంఖ్య, ప్రేక్షకుల గణాంకాలు వంటి సమాచారం ఇవ్వవచ్చు. సినిమా తీసిన దేశం లేక ప్రాంతం బయట మరెక్కడైనా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చివుంటే దాన్ని ప్రస్తావించొచ్చు (ఉదాహరణకు భారతీయ సినిమా చైనా మార్కెట్లోనో, జపాన్ మార్కెట్లోనో మంచి విజయం సాధించడం ప్రస్తావనార్హం). ఈ బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ ప్రధాన స్రవంతి పత్రికలు, సినిమా పత్రికలు వంటివాటిలో కవరేజిని మూలాలుగా ఇవ్వవచ్చు. సినిమా విజయం పొందిందా, పరాజయం పాలైందా అన్న విషయాన్ని మూలాల ఆధారంగా నిర్ణయించాలి, వాడుకరులు సినిమా పరాజయం లేక విజయం గురించి తమ స్వంత అభిప్రాయాలు రాయకూడదు.

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]

సినిమా అందుకున్న పురస్కారాలకు ప్రత్యేకించి ఒక విభాగం పెట్టి రాయవచ్చు. పురస్కారాలు, గౌరవాల్లో అవార్డు గెలుపు, నామినేషన్లు, సిని విమర్శకుల నుంచి గుర్తింపు, విమర్శకులు గుర్తించిన సినిమాల ప్రముఖ జాబితాల్లో చేరడం (బిబిసి 100.. వందేళ్ళలో ఉత్తమ 100 భారతీయ చిత్రాల జాబితా, వగైరా) వంటివి ఉంటాయి. సినిమా పొందిన పురస్కారాలు, దక్కిన గౌరవాలు, ఏదైనా సంబంధిత నేపథ్యం వంటి వివరాలే వాటిని ఎలా రాయాలి అన్నదాన్ని నిర్దేశిస్తాయి. ఒకవేళ ఏదైనా సినిమాకు కొన్నే పురస్కారాలు, గౌరవాలు ఉంటే దాన్ని రాయడానికి వేరే ప్రత్యేక విభాగం అవసరం లేదు, ఒక పేరా అందుకు సరిపోతుంది. ఒకవేళ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని, అనేక పురస్కారాలు, గౌరవాలు పొంది ఉంటే దాన్ని పట్టిక చేసి ప్రత్యేక విభాగం పెట్టి రాయొచ్చు. పట్టికకు కాలమ్ పేర్లు సాధారణంగా పురస్కారం, విభాగం, స్వీకర్త(లు), ఫలితం అన్నవి ఉంటాయి. ఒకవేళ ఈ పట్టిక మిగతా సినిమా వ్యాసాన్ని మించిపోయి, సమతౌల్యం చెడగొట్టేంత ఎక్కువగా ఉంటే విడదీసి వేరేగా పురస్కారాలు, గౌరవాలపై దృష్టిపెట్టే జాబితా వ్యాసంగా ఏర్పరచవచ్చు. సినిమా అవార్డులు మరీ విపరీతంగా పెరగడాన్ని బట్టి ప్రాముఖ్యత, గౌరవం కలిగిన సినిమా అవార్డులను మాత్రమే పరిగణించాలి.

సంగీతం

[మార్చు]

భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఉన్న ప్రాధాన్యతను అనుసరించి (అరుదుగా పాటలు లేకుండా వెలువడే సినిమాల్లో తప్ప) లభించే సమాచారంతో ప్రత్యేకించి సంగీతం అన్న విభాగాన్ని ఏర్పరచడం ప్రోత్సహించదగ్గది. {{Infobox album}} వంటివి ఉపయోగించవచ్చు. ఒకవేళ సినిమా సంగీతం ప్రత్యేకమైన వ్యాసంగా ఉండగల విషయప్రాధాన్యత కలిగివుంటే దాన్ని వేరే వ్యాసంగా రూపొందించవచ్చు. సినిమాలోని పాటల జాబితా కోసం {{Track listing}} ఉపయోగించి రాయవచ్చు. భారతీయ సినీ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను అనుసరించి సినమాలో పాటల రూపకల్పన, చిత్రీకరణ, ప్రాచుర్యం వివరాలను వీలైనంత క్లుప్తంగా ఇవ్వవచ్చు.

మూలాలు

[మార్చు]

సినిమాల గురించి ఇచ్చిన సమాచారాన్ని పాఠకులు తిరిగి ధ్రువీకరించుకోవాలి కాబట్టి నమ్మదగ్గ మూలాలను సైటేషన్ ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న వ్యాసంలో మూలాలను ఇవ్వడంలో చక్కని విధానాన్ని అనుసరించి ఉంటే, ఆ విధానాన్ని గౌరవించి కొనసాగించాలి. సరైన విధానంలో లేకుంటే మాత్రమే ఇప్పటికే ఇచ్చిన రిఫరెన్సులు సరిదిద్దాలి. మూలాలు ఇవ్వడంపై ఈ కింది పేజీ చూడండి:

వ్యాసంలో రిఫరెన్సుగా వెబ్ పేజీలు ఇస్తూంటే దాన్ని చివర యాక్సెస్ చేసిన తేదీని సైటేషన్లో చేర్చండి. కొన్నిసార్లు వెబ్ పేజీలు డెడ్ లింకులు అయిపోతాయి కనుక యుఆర్‌ఎల్ వేబ్యాక్ మిషన్‌లో సేవ్ చేయాలి, ఒరిజినల్ యుఆర్‌ఎల్‌తో పాటుగా ఆ వేబ్యాక్ మిషన్ యుఆర్‌ఎల్‌ని కూడా సైటేషన్లో చేర్చాలి.

ద్వితీయ స్థాయి సమాచారం

[మార్చు]

వివాదాలు

[మార్చు]

వివాదాస్పదమైన చిత్రానికి లేదా ఒక ప్రత్యేకమైన అంశం వివాదాస్పదమైన సాధారణ చిత్రానికి వికీపీడియా విధానమైన తటస్థ దృక్కోణం వాడుకరులు దృష్టిలో పెట్టుకుని వ్యాసాన్ని సమీక్షించాలి.

నోట్స్

[మార్చు]
 1. ఇంగ్లీష్ వికీపీడియా పాలసీ నుంచి అనువదితం