Jump to content

వికీపీడియా:సమావేశం/నెల్లూరు/నెల్లూరు ప్రాంత రచయితలతో సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా సోదరప్రాజెక్టుల గురించి, ప్రత్యేకించి తెలుగు వికీసోర్సు గురించి, తెలుగు రచయితల్లో అవగాహన పెంపొందించేందుకు, వారి భాగస్వామ్యం పెంచడానికి ఉద్దేశిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఇది. సీఐఎస్-ఎ2కె సహకారంతో, ప్రముఖ పరిశోధకుడు కాళిదాసు పురుషోత్తం స్థానికంగా నిర్వహణా భారం వహించగా, పవన్ సంతోష్ నెల్లూరు వర్ధమాన సమాజంలో తెలుగు వికీసోర్సు, యూనీకోడ్ ప్రాముఖ్యత, కాపీహక్కుల విడుదల వంటి అంశాలపై రచయితలతో మాట్లాడారు.

వివరాలు

[మార్చు]
ప్రదేశం
వర్ధమాన సమాజ గ్రంథాలయం, నెల్లూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా
తేదీ
2018 ఆగస్టు 24
అంశం
తెలుగు రచయితలు అంతర్జాలంలో ఎందుకు ప్రచురించాలి? అందుకు ఏమేం చేయవచ్చు?
వివరణ
ఈ క్రమంలో యూనీకోడ్, సీసీ లైసెన్సులు, కాపీహక్కులు వంటివి వివరించారు. ప్రధానంగా తెలుగు వికీసోర్సుకు పుస్తకాలు అందించడం గురించి మాట్లాడారు.

పాల్గొన్నవారు

[మార్చు]
  • కాళిదాసు పురుషోత్తం
  • అల్లు భాస్కరరెడ్డి
  • పవన్ సంతోష్ (ప్రసంగకర్త)

నివేదిక

[మార్చు]
  • ప్రముఖ రచయిత, పరిశోధకుడు కాళిదాసు పురుషోత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడంలో కృషిచేశారు. నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం వారికి సంగతి సందర్భాలు వివరించి ఈ ప్రత్యేక ప్రసంగాన్ని, చిరు సమావేశాన్ని ఏర్పాటుచేసి సమన్వయపరిచారు. నెల్లూరుకు చెందిన పలువురు రచయితలు, ప్రచురణకర్తలను కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించారు. అలాగే పవన్ సంతోష్ రాక సందర్భంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రసారమయ్యే యాక్ట్ 24x7 ఛానెల్ వారి ముఖాముఖీ కార్యక్రమంలో పవన్ సంతోష్ ఇంటర్వ్యూ ఏర్పాటుచేశారు. ఎన్నోవిధాల కార్యక్రమ నిర్వహణకు స్వచ్ఛందంగా కృషిచేశారు.
  • తెలుగు వికీపీడియా ఎవరు రాయవచ్చు, వికీపీడియా వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, అందులో తన పాత్ర ఏమిటి, తనకు ఈ రంగం పట్ల అభిరుచి ఎలా కలిగింది, తెలుగు వికీపీడియాకు నెల్లూరు ప్రాంతం నుంచి కృషిచేస్తున్నవారు ఎవరైనా ఉన్నారా వంటి అంశాల మీదుగా యాక్ట్ 24x7 టీవీ ఛానెల్‌లో పవన్ సంతోష్ ఇంటర్వ్యూ సాగింది. ప్రధానంగా ఛానెల్ వారి యాంకర్ వేసిన ప్రశ్నలకు అప్పటికప్పుడు పవన్ సంతోష్ ఇచ్చిన సమాధానాల రూపంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో te.wikipedia.org యూఆర్‌ఎల్ తరచు ప్రదర్శించమని, అవసరమైన చోట సంప్రదించేందుకు వివరాలను చూపమని పవన్ వారిని అభ్యర్థించారు. అంతేకాక నెల్లూరు స్థానికులు, తెలుగు వికీపీడియాలో విస్తృతమైన కృషి చేస్తున్నవారు, నూనెల శాస్త్రవేత్త పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గురించి టీవీ ఛానెల్‌కు వివరించగా, పాలగిరిని ఇంటర్వ్యూ చేసి వారి కృషిని, వికీపీడియా ఆవశ్యకతను నెల్లూరు ప్రేక్షకులకు అందించగలమని యాక్ట్ వారు వివరాలు సేకరించారు.
  • సాయంత్రం 6 గంటలకు నెల్లూరులోని ప్రాచీన, చారిత్రక వర్ధమాన సమాజ గ్రంథాలయం రీడింగ్ రూంలో పవన్ సంతోష్ మాట్లాడారు. కొద్దిమంది ముఖ్యులైన రచయితలు, ప్రచురణకర్తలు హాజరైన ఈ సమావేశంలో పవన్ సంతోష్ మాట్లాడుతూ మౌఖికం నుంచి రాతకు, రాత నుంచి ముద్రణకు ప్రపంచ సాహిత్య సాంకేతికత మార్పుచెందాకా కాగితంపై ముద్రణ స్థిరపడిందన్నారు. ఆ స్థిరపడ్డ వందలాది సంవత్సరాలకు తిరిగి ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మార్పుచెందడమనే గొప్ప విప్లవాత్మక పరిణామం చూస్తున్నామని, దీనికి తగినవిధంగా మన భాషా, సాహిత్యాలు, వాటికి రూపమిచ్చే సాహిత్యకారులు స్పందించాలని విజ్ఞప్తిచేశారు. ఈ క్రమంలో అంతర్జాలంలోకి రచనలు తీసుకురావాల్సిన అవసరాన్ని, అందుకు అవసరమయ్యే కాపీహక్కుల సరళీకరణ, యూనీకోడీకరణ విధానాలను వివరించారు. ఈ క్రమంలో పుస్తకాలను స్కాన్ రూపంలోకి తీసుకువస్తున్న మనసు ఫౌండేషన్ కృషినీ, స్కాన్ రూపంలోని పుస్తకాలను యూనీకోడీకరించి, స్వేచ్ఛా నకలు హక్కుల్లో ప్రపంచానికి అందిస్తున్న వికీసోర్సు ప్రయత్నాన్ని వివరించారు. తర్వాత ఈ అంశాలపై జరిగిన ఇష్టాగోష్టిలో ముద్రణరంగంలో లబ్దప్రతిష్టులైనవారికి యూనీకోడ్‌ ముద్రణలో అందంగా ఉండదన్న అంశంపై ఉన్న సందేహాలపై పవన్ ప్రతిస్పందించారు. ప్రతిష్టాత్మక తెలుగు ప్రచురణ సంస్థలు క్రమేపీ యూనీకోడ్ స్వీకరిస్తున్నాయన్నారు. ముద్రణ-యూనీకోడ్‌పై కన్నా తనకు యూనీకోడ్-అంతర్జాలం అన్న అంశంపైనే ప్రత్యేకాసక్తి, కృషి, అనుభవం ఉన్నాయన్నారు. కాబట్టి భవిష్యత్తులో నెల్లూరు జిల్లా ప్రచురణకర్తలకు ఆసక్తి ఉంటే ముద్రణ-యూనీకోడ్ అంశంపై గట్టికృషి చేసినవారిని తీసుకువచ్చి మాట్లాడించగలనని పేర్కొన్నారు.
  • తెలుగు వికీపీడియాలో నెల్లూరి జిల్లా ప్రముఖుల గురించి ఉన్న వ్యాసాలను పరిశీలించి, మరెవరెవరు ఉండాలన్న అంశంపై వర్ధమాన సమాజ సభ్యులు జాబితా అందజేశారు. పవన్ వాటిని అక్కడికక్కడే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంబంధిత విభాగంలో చేర్చారు. ఈ వ్యాసాలు అభివృద్ధి చేయడానికి అవసరమైన విక్రమసింహపురి మండల చరిత్ర పుస్తకం సాఫ్ట్‌కాపీ కూడా అందించారు. కాళిదాసు పురుషోత్తం ఈ రెఫరెన్సు గ్రంథాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసే విషయమై తాను ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
  • నెల్లూరు వర్ధమాన సమాజ సభ్యులు వ్యక్తిగత స్థాయిలో ఈ కార్యక్రమంపై తన స్పందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల విషయంలో తమను సంప్రదించాల్సిందని ఆహ్వానించారు. కాళిదాసు పురుషోత్తం తాను రాసిన పరిశోధక గ్రంథాలు, తన ఆధ్వర్యంలోని సంస్థలు చేసిన ప్రచురణలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయడానికి ముందుకురావడమే కాక స్వయంగా తెలుగు వికీపీడియాలో రాయడం మొదలుపెట్టారు. తన స్నేహితులు, లబ్దప్రతిష్టులు అయిన పలువురు పరిశోధకులు, రచయితలు చేసిన కృషిని కూడా స్వేచ్ఛానకలు హక్కుల్లో విడుదల చేసేందుకు వారి వారసులను సంప్రదిస్తున్నారు.
  • కార్యక్రమ నిర్వహణలో అంతా తానై సహకరించడమే కాక, తాను చేసిన కృషి సర్వస్వాన్ని సమాజ హితానికి స్వేచ్ఛా నకలు హక్కుల ద్వారా ధారపోయడానికి ముందుకువచ్చి, నెల్లూరు జిల్లాలో స్వేచ్ఛా నకలు హక్కుల ఉద్యమాన్ని బలపరచడానికి తనవంతు చేస్తానంటున్న జ్ఞానవృద్ధులు కాళిదాసు పురుషోత్తంకు ధన్యవాదాలు తెలుపుకుని పవన్ నెల్లూరు నుంచి బయలుదేరారు.

తర్వాతేం జరిగింది?

[మార్చు]
  • తెలుగు వికీపీడియాలో కాళిదాసు పురుషోత్తం గారు అక్కౌంట్ తయారుచేసుకుని మార్పుచేర్పులు చేయడమే కాక కొన్ని అరుదైన ఫోటోలు, విలువైన సమాచారం పవన్ సంతోష్ ద్వారా వికీపీడియాతో, కామన్స్ తో పంచుకుంటున్నారు.
  • కాళిదాసు పురుషోత్తం గారు రాసిన దంపూరు నరసయ్య జీవిత చరిత్ర స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేశారు. ప్రస్తుతం వికీసోర్సులో ఉంది.
  • కాళిదాసు పురుషోత్తం గారు తెలుగు వికీసోర్సుకు అవసరం కాగా కొందరు రచయితల వారసుల వివరాలు అందిస్తూ, వారితో సంప్రదింపులు చేసి వారి పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయడం గురించి ప్రయత్నిస్తున్నారు.