వికీపీడియా:2020 ప్రాధాన్యతలు
స్వరూపం
వికీపీడియా:సమావేశం/తెవికీ_జన్మదిన_వేడుక_2019/తెలుగు_వికీపీడియా_పరిస్థితిపై_వాడుకరుల_అభిప్రాయాలు-2019 నుండి తీసుకున్నది వాడుకరులు సూచించిన సమస్యలు అభిప్రాయాలను క్రోడీకరిస్తే కింది విషయాలు ప్రధానంగా తేలాయి.
- వ్యాసాల్లో ఉండే మూడు ముఖ్యమైన దోషాలు - భాషాదోషాలు, శైలి దోషాలు, సమాచార దోషాలు - గురించి మాట్లాడారు.
- భాషలో దోషాలు: వికీలోని కొన్ని వ్యాసాల్లో భాష కృతకంగా ఉంటుంది. ముఖ్యంగా అనువాద వ్యాసాల్లో ఈ దోషం ఎక్కువగా ఉంటుంది. వ్యాకరణ దోషాలతో, లోపభూయిష్టమైన వాక్యనిర్మాణంతో ఉంటాయి. యొక్క/మరియు వాడడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అనువాద పరికరం ద్వారా చేసిన అనువాదాలను సరిచెయ్యకుండా, ఉన్నదున్నట్లుగానో, సరిగ్గా సరిదిద్దకుండానో ప్రచురించెయ్యడం వలన ఇలా జరుగుతోంది. వీటిని సరిచెయ్యాలి, ఇక ముందు రాకుండా అరికట్టాలి. అలాంటి వ్యాసాలను రాసినవాళ్ళకు సూచనలు చేసి, తప్పులను సవరించేలా చూడాలి. లేని పక్షంలో వ్యాసాలను తొలగించాలి.
- శైలిలో దోషాలు: వ్యాసాల శైలి తెవికీ అంతటా ఒకేలా ఉండడం లేదు. ఏకవచన ప్రయోగం, శ్రీ/గారు వంటి ప్రయోగాలు చెయ్యడం, అనుస్వారం వాడకపోవడం, అనుచితమైన పరిమాణంలో బొమ్మలు పెట్టడం వంటివి జరుగుతున్నాయి. శైలి గురించి వాడుకరులందరూ తెలుసుకోవాలి. మార్గదర్శక వ్యాసాలను మెరుగు పరచాలి/తయారు చెయ్యాలి.
- సమాచారంలో దోషాలు: వ్యాసంలో రాసిన సమాచారంలో తప్పులు ఉంటున్నాయి.
- చర్చలు: తెవికీలో అవసరమైన చర్చలు సరిగ్గా జరగడం లేదు. విధానాలపై చర్చలు, వ్యాసాల తొలగింపు వంటి ముఖ్యమైన విషయాల్లో కూడా కొంతమంది వాడుకరులు ఆసక్తి చూపడం లేదు. చర్చల్లో అందరూ చురుగ్గా పాల్గొనాలి.
- అదే సమయంలో, పెద్దగా అవసరం లేని సందర్భాల్లో, పట్టు విడుపులు లేకుండా పంతాలకు పోయి చర్చలను సాగదీయడం కూడా జరుగుతోంది. వీటిని అరికట్టాలి.
- వ్యాసాల నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. నాణ్యతను మెరుగు పరచడం లేదు. ఉన్న వ్యాసాల నాణ్యతను ఎలా మెరుగు పరచాలి అనే విషయాన్ని వాడుకరులు నేర్చుకోవాలి.
- వికీ గురించి శిక్షణ నిచ్చే శిక్షకులు వికీ విధానాలు, శైలి, నాణ్యత గురించిన విషయాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. శిక్షకులకు వీటి గురించి తెలియకపోతే వారిచ్చే శిక్షణలో నాణ్యత ఉండదు.
- వివిధ అంశాలకు సంబంధించి, అంతర్జాలంలో లభ్యమౌతున్న స్ట్రక్చర్డ్ డేటాను ఉపయోగించుకుని, వికీ పేజీల్లో సమాచారాన్ని చేర్చాలి.
- సాంకేతికంగా తెవికీయులు మెరుగుపడాలి. బాట్‌లు రాయడం, నడపడం, మూసలను తయారు చేసుకోవడం వంటి విషయాలు నేర్చుకుని తెవికీని మెరుగుపరచాలి.
- ఇటీవలి మార్పులపై వాడుకరులు నిఘా పెట్టడం లేదు. దుశ్చర్యలను సకాలంలో పట్టించుకోకపోతే, ఇటీవలి మార్పులలో ఆ పేజీలు వెనక్కిపోతాయి. దుశ్చర్యలు మరుగున పడిపోయి, అలాగే ఉండిపోతాయి.
- వ్యాసాల నిర్వహణ:
- వ్యాసాలను సృష్టించేసాక, ఇక వాటిని పట్టించుకోవడం లేదు. ఒక వాడుకరి సృష్టించిన పేజీలో ఇతర వాడుకరులు రాయడం లేదు. అందరూ కలిసి పనిచెయ్యాలి.
- వ్యాసాన్ని మెరుగుపరచాక, దానిలో గతంలో పెట్టిన నిర్వహణ మూసలను అలాగే ఉంచేస్తున్నారు, తీసెయ్యడం లేదు.
- అనాథ, అగాధ వ్యాసాల వంటి ప్రత్యేక పేజీలను గమనిస్తూ వికీ నిర్వహణ పనులను పట్టించుకోవాలి.
- అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చే లింకులను సవరించాలి
- వికీని బ్రేక్ చేసే పనులను నిరోధించాలి. వాడుకరులు ఈ విషయంపై శ్రద్ధ పెట్టాలి.
- కొత్త వాడుకరులు
- కొత్త వాడుకరులను బెదరగొట్ట కూడదు. వారిని ప్రోత్సహించాలి. వారు రాసిన వ్యాసాలను మనం మెరుగుపరచాలి.
- కొత్త పేజీలను సృష్టించేటపుడు కొద్దిపాటి మార్పులతో వేరే వ్యాసాలు ఈసరికే ఉన్నాయేమో అని చూసుకోవడం లేదు.
- కొత్త వాడకరులను ఫాలో అప్ చెయ్యాలి.
- వికీని అభివృద్ధి చేసే క్రమంలో ఐఐఐటీ వంటి బయటి సంస్థలు కార్యక్రమాలు రూపొందించుకుని వస్తే వారి పట్ల వ్యతిరేకత వహించకూడదు, స్నేహభావంతో ఉండాలి.
- బయటి సంస్థలు ఏ పద్ధతుల్లో వ్యాసాన్ని రూపొందిస్తున్నారో మనకెందుకు, అంతిమంగా నాణ్యమైన వ్యాసం తెవికీలోకి చేరితే మనకు చాలు గదా.
- అయితే పై అభిప్రాయానికి వ్యతిరేకంగా - డబ్బులు ఇచ్చి వ్యాసాలు రాయిస్తే అది వికీ నియమాలకు వ్యతిరేకం. వికీ స్ఫూర్తి దెబ్బతింటుంది అని అభిప్రాయాలు వెలిబుచ్చారు.
- ఏయే వ్యాసాలు ఉండాలి అని వాడుకరులు, పాఠకులు భావిస్తారో వాటిని ఒక వ్యాసాల కోరికల జాబితా పేజీలో పెట్టాలి.
- ఇంగ్లీషు వికీలో డ్రాఫ్ట్స్ అనే పేరుబరి ఉంది. వ్యాసాన్ని ఈ పేరుబరిలో తయారు చేసి, మెరుగు పరచి, ఒక స్థాయికి వచ్చాక, వ్యాసాన్ని ప్రచురించవచ్చు. తెవికీలోనూ ఈ పేరుబరిని పెట్టుకోవాలి. డ్రాఫ్టుల్లో ఉన్న వ్యాసాలు సెర్చి ఇంజనుకు అందవు.