విధవ వ్రతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


విధవ వ్రతము అనగా భర్త మరణించిన తర్వాత భార్య చేపట్టే వ్రతము. ఈ వ్రతములో సౌభాగ్యానికి, సంతోషానికి గుర్తులా నిలిచే సింధూరం, మంగళసూత్రం, కాళ్ళమెట్టెలు, రంగు రంగుల చీరలు విడిచి కేవలం తెల్లచీర ధరించి మిగిలిన జీవితకాలమంతా మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ దైవ సన్నిధిలో గడపటం. ఈ వేద కాలం నాటి సంప్రదాయ వ్రతము ఇప్పటికీ అరుదుగా కొన్ని గ్రామాల్లో ఉంది.

చరిత్ర[మార్చు]

పూర్వం భారతీయ స్త్రీలు - భర్తే ప్రత్యక్ష దైవమని, శ్రీరామ రక్ష అని నమ్మే రోజులవి. ఆర్యులు భారతీయ కుటుంబ వ్యవస్థను, భార్యా భర్తల బంధాన్ని పటిష్ఠ పరచడానికి 'విధవ వ్రతాన్ని' సమాజానికి 'మనుస్మృతి' వంటి గ్రంథాల ద్వారా పరిచయం చేశారు. మనుస్మృతి 5 వ అద్యాయంలో విధవ వ్రతం గురించి ఇట్లు వ్రాయబడి యున్నది:[ఆధారం చూపాలి]

  • 160. ఏ భార్య అయితే తన భర్త చనిపోయిన తర్వాత కూడా పతివ్రతగా ఉంటుందో నిశ్చయంగా ఆమె, పుత్రులు లేకపోయినా స్వర్గానికి వెళ్ళును.
  • 165. ఏ స్త్రీ అయితే భర్తను ఎదిరింపక, తన ఆలోచనలను, మాటలను, చేతలను నియంత్రించుకునునో ఆ స్త్రీ నిశ్చయంగా స్వర్గంలో కూడా భర్తతో పాటూ ఉండును, అటువంటి స్త్రీ పతివ్రత అగును.

స్త్రీలు పూర్వం నుండి ఈ విధవ వ్రత ఆచారాన్ని పాటించడానికి గల కారణం మనుస్మృతి చెప్పిన వాక్యాలే కావచ్చు.

ఈ వ్రతం గురించి[మార్చు]

పసుపు కుంకుమలు, నుదుట సింధూరం, గాజులు, మంగళసూత్రం, కాలిమెట్టలు వగైరా వంటివి స్త్రీ యొక్క సౌభాగ్యానికి లేదా ఐదవతనానికి గుర్తులు. భర్త ఉన్నంతకాలం ఇవన్నీ స్త్రీ ధరించుట భారతీయ సంప్రదాయం. భర్త మరణించిన పిమ్మట స్త్రీ తన సౌభాగ్యాన్ని కోల్పోతుంది కాబట్టి తన నుదుటి బొట్టు, చేతి గాజులు, మంగళసూత్రము, కాలిమెట్టెలు తీసివేయాలి. రంగు చీరల బదులు పరిశుద్ధతకు, శాంతికి గుర్తుగా ఉండే తెల్ల చీర ధరించాలి. శిరోముండనం చేయించుకోవడం, తెల్ల చీర కట్టడం, ఇతర అచారాలు విధవ వ్రతంలో ఉంటాయి. విధవరాళ్ళు జీవిత ప్రమాణాలు తీసుకొనుట ద్వారా భర్త ఉన్న లోకంలోకి చేరవచ్చని నమ్ముతారు. ఇదే విధవ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భర్త దుర్మార్గుడైతే విధవ వ్రతం చేపట్టరాదు.[ఆధారం చూపాలి]

భర్తలకు కూడా ఇటువంటి వ్రతం ఉంది, కాని 50 వ సంవత్సరాల వయసు వచ్చే సరికి చేయవలసి ఉంటుంది. భార్య తన భర్తకంటే చిన్న వయస్కురాలు కాబట్టి, భర్త ముందు మరణించడం సహజం. ఈ కారణంగా పురుషుడి వ్రతం తన వయసు మీద ఆధారపడుతుందే కాని భార్య మీద ఆధారపడదు. పురాతన గ్రంథాలలో ఇట్లు వ్రాయబడి ఉంది. "పంచాశోడ్వం వనం వ్రజేత్" అనగా 50 సంవత్సరాలు వచ్చే సరికి భర్త అడవికి వెళ్ళిపోవాలి. దీని ప్రకారం పురుషుడు తన భార్యను ఎదిగిన కొడుకుకి అప్పగించి, జీవిత ప్రమాణాలు తీసుకొని వెళ్ళిపోవాలి. ముందుగా వానప్రస్త ఆశ్రమాన్ని స్వీకరించాలి. వానప్రస్త ఆశ్రమం ప్రకారం భార్యతో కలిసి అడవిలో జీవించాలి. ఇలా 25 సంవత్సరాలు జీవించిన తర్వాత 75 సంవత్సరాల వయసు వచ్చేసరికి సన్యాస ఆశ్రమం స్వీకరించాలి. స్వీకరించిన పిమ్మట భార్యను ఎదిగిన పుత్రుడికి అప్పగించి వెళ్ళిపోవాలి. అందువల్ల భర్యా భర్తలిద్దరూ తమ వృద్దాప్యంలో పునర్జన్మ కొరకు ఇటువంటి వ్రతాలు చేబడతారు. సంస్కృతి విశ్లేషకుల ప్రకారం వివాహ వ్యవస్థ, భార్యా భర్తల బంధాన్ని బలపరచడానికి ఆర్యులు చేసిన ప్రయత్నంగా తెలుస్తోంది[ఆధారం చూపాలి]

.

నేటి పరిస్థితి[మార్చు]

దురదృష్టవ శాత్తు మధ్యయుగం నాటికి భారతీయ సమాజం ఎదురయ్యే విధవరాళ్ళను అపశకునంగా భావించేది, అంటరానివారిగా చూసేది. విధవ వ్రతంలో స్త్రీలు సమస్త సుఖ సంతోషాలకు దూరంగా, సమాజానికి కనిపించకుండా ఉండవలసి వచ్చేది. ఈ ఆచారాన్ని సంఘ సంస్కర్తలైన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటివారు వ్యతిరేకించారు. విధవ పునర్వివాహం, స్త్రీ విద్య, విష తుల్యమైన పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన నేడు ఈ ఆచారం దాదాపుగా అంతరించిపోయింది. ఈ రోజుల్లో తెల్లచీర కట్టుకున్న విధవరాళ్ళు ఎక్కడో మారు మూల గ్రామాల్లో తప్ప ఎక్కడా కనిపించరు. నేడు విధవరాళ్ళ పునర్వివాహాలు సర్వ సాధారణమైపోయాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల ఆన్ లైన్ లో కూడా విధవరాళ్ళకు వివాహాలు జరుగుతున్నాయి.