Jump to content

వెంటాడి చేసే దాడి

వికీపీడియా నుండి

వెంటాడి చేసే దాడి అంటే యుద్ధ విమానం గానీ, క్షిపణి గానీ మరో విమానంపై వెనకనుండి దాడి చేయడాన్ని వెంటాడి చేసే దాడి అంటారు. ఇంగ్లీషులో దీన్ని "టెయిల్-చేస్ ఎంగేజ్‌మెంట్" అంటారు. దాడి చేసేదానికి, లక్ష్యానికీ మధ్య సాపేక్ష వేగం తక్కువగా ఉండడం వలనా, అలాగే లక్ష్య విమానపు ఇంజను నుండి వెలువడే వేడి వాయువుల కారణంగానూ హోమింగ్ క్షిపణులకు, క్యానన్లకూ దాడి చెయ్యడం తేలిగ్గా ఉంటుంది. 

వెంటాడి చేసే దాడిలో క్షిపణులు తమ లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా అవకాశం ఉంది. మ్యాక్ 1 వేగంతో పోతున్న విమానాన్ని వెంటాడుతున్న క్షిపణి మ్యాక్ 2.5 వేగంతో పోతూంటే ఆ రెండింటి సాపేక్ష వేగం మ్యాక్ 1.5. తక్కువ సాపేక్ష వేగం కారణంగా, దాడి చేసే క్షిపణి నుండి తప్పించుకునేందుకు లక్ష్యం చేసే విన్యాసాలకు క్షిపణి సమర్ధంగా స్పందించగలదు. పైగా ఈ విన్యాసాలను చెయ్యడంలో క్షిపణులు విమానాల కంటే చురుగ్గా ఉంటాయి. లక్ష్యానికి తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. దాడికి గురైన విమానానికి కాపాడుకునే మార్గం ఒకటే - వీలైనంత వేగంగా పోతూ సాపేక్ష వేగాన్ని తగ్గించడం, వీలైతే దాన్ని సున్నా చెయ్యడం. ఈ రకంగా క్షిపణిలోని ఇంధనం అయిపోయి, అది నేలపై పడిపోయే దాకా అలా ప్రయాణిస్తూ ఉండడం.

తక్కువ సాపేక్ష వేగం కారణంగా, వెంటాడి చేసే దాడిలో క్షిపణి పరిధి బాగా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది ముఖాముఖి దాడి పరిధిలో మూడు నుండి నాలుగో వంతు వరకూ ఉంటుంది.[1] ఉదాహరణకు, భారత్ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణి పరిధి వెంటాడి చేసే దాడిలో 20 కి.మీ. ఉండగా, ముఖాముఖి దాడిలో అది 110 కి.మీ. ఉంటుంది. దాడికి లక్ష్యం విమానమైతే, లక్ష్యం కంటే వేగంగా పోయేందుకు గాను, అది ఆఫ్టర్‌బర్నరును వాడి వెంటాడాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ఇంధనం బాగా ఖర్చై, ఇంధన నిల్వ వేగంగా తగ్గిపోతుంది. 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Clancy, Tom; Gresham, John (2007). Fighter Wing: A Guided Tour of an Air Force Combat Wing. Penguin Publishing Group. pp. 254, 255. ISBN 9781101002575.