వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 11వ వారం
కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ.శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్). తెలంగాణా ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు తీరాంధ్రంలో వేంగి చాళుక్య చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ (బాదామి) చాళుక్యులకు సోదర సమానులు. కాని క్రమంగా దక్షిణాపధం నుండి విస్తరిస్తున్న చోళులు తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకొన్నారు. అలా క్రీ.శ. 1076 నుండి తీరాంధ్రంలో చాళుక్య చోళ యుగం ప్రారంభమై క్రీ.శ. 1200 వరకు సాగింది. కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి.
- క్రీ. శ. 1000- 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు మరియు రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్రము నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగా ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. ప్రజలలో పుట్టి కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్ర్యముతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్య నీటివనరులు.
- క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గరు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి.
- ఖ్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.
....పూర్తివ్యాసం: పాతవి