వేదిక:తెలంగాణ/2013 50వ వారం
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన సామల సదాశివ [1928]], మే 11 న ఆదిలాబాదు జిల్లా, దహేగావ్ మండలం తెలుగు పల్లెలో జన్మించారు. ఇతను బహుభాషావేత్త, తెలుగు మరియు ఉర్దూ రచయితనే కాకుండా సంగీత పండితుడు కూడా. సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు సదాశివ రచించారు. ఇంకనూ అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడ ఇతని కలం నుంచి వెలువడ్డాయి. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తాడు. ఆయన సేవలకు గుర్తింపుగా 2011లో సంగీత నాటక అకాడమి అవార్డు, 1998లో శ్రీపొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి, 2002లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆగస్టు 7, 2012న మరణించారు.