Jump to content

వేదిక:తెలుగు సినిమా/పరిచయం

వికీపీడియా నుండి
తెలుగు సినిమా పరిచయం
భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. 1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది. 1938-39 సంవత్సరాలలో తెలుగు సినిమా కొత్త రూపు దిద్దుకుంది. సినిమా ప్రయోజనం ఒక్క వినోదం సృష్టించడం మాత్రమే కాదు - విప్లవం కూడా సృష్టించగలదని ఆ రెండు సంవత్సరాలు నాంది పాడాయి. కేవలం పురాణ గాధలే సినిమాలుగా వస్తూ ప్రజానీకాన్ని ఆనందపరుస్తున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం "మాలపిల్ల" లాంటి చిత్రం తీసి, విప్లవం సృష్టించాడు. 1940 దశాబ్దంలో "వాహినీ స్టూడియోస్" ప్రారంభించబడింది. నేపధ్యగానం ప్రక్రియ స్థిరపడింది. ఈ దశకంలో ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. 1950 దశాబ్దం తెలుగు సినిమాలకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. క్రొత్త నటీనటుల ప్రవేశ పరంపర కొనసాగింది. క్రొత్త చిత్ర నిర్మాణ సంస్థలు చాలా వెలిసాయి. హైదరాబాదులో సారధి స్టూడియోస్ ప్రాంభమైంది. జగ్గయ్య, కాంతారావు లాంటి నటులు ఈ కాలంలోనే ప్రవేశించారు. మల్లీశ్వరి, పాతాళభైరవి లాంతి చిత్రాలు ఈ దశాబ్దంలో వచ్చాయి. 1960 దశాబ్దంలో నంది అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ దశాబ్దంలో మొత్తం 758 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రనిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును భరించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో రాష్ట్రంలో చిత్రనిర్మాణం పుంజుకుంది.