శశిరేఖ (చలం రచన)
శశిరేఖ, ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం వ్రాసిన ఒక రచన.
'శశిరేఖ ' గురించి రాస్తూ శివశింకరశాస్త్రి తన పీఠికలో-'ప్రేమ శాశ్వతమా చంచలమా అని కొందరు ప్రశ్నిస్తారు. గాడానురాగం శాశ్వతము కాదని యెవరనగలరు? అయితే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుందా, అనేక పర్యాయములు ఉదయిస్తుందా? ఈ విషయంలో భేదాలున్నవి. ప్రేమామృత ఝరి హృదయంలో నిరంతరమూ ప్రవహించేవారు ఎక్కువసార్లు ప్రేమించగలరు. ఏక కాలములో ఇద్దరు వ్యక్తులను మాత్రము సమానముగా ప్రేమించడం అసంభవం. ఒకరిమీద అనురాగం సడలిపోయిన తర్వాత ఇంకొకరిమీదికి ప్రసరించవచ్చును ' అని కథానాయికను జాగ్రత్తగా సమర్థిస్తూ ' ఈ కథానాయిక సామాన్య స్త్రీ కాదు. ఈమె ప్రేమైక జీవిని. అందుచేతనే తనకు యోగ్యుడైన ప్రియునికోసమై ఎట్టి త్యాగమైనా చేసింది. స్వాతంత్ర్యములేని సామాన్య స్త్రీలవంటి పతివ్రత ఈమె కాదు ' అని రూలింగ్ ఇచ్చాడు.
రామ్మూర్తి రత్నమ్మ, చలం-కృష్ణశాస్త్రి. సత్యవతి వీరి సంబంధాలను వ్యావహారిక జగత్తు నుంచి విడదీసి చూడడానికి తాత్త్వికమైన ప్రాతిపదికను శాస్త్రి తమ పీఠికలో తెచ్చిఇచ్చాడు. శశిరేఖ గురించి చలమే ముగింపులో దేవదూతచేత ఇలా అనిపిస్తాడు- 'అవును, ఈమె ఆ లోకంలో ఉండతగినది కాదు. ఎక్కడ ప్రేమకు అంతంలేదో, అంతా ప్రేమమయమో, ఎక్కడ ప్రేమకు నీతిదుర్నీతి అనునవి లేవో, అట్టి లోకానికి ఒస్తోందీమె. తన మనోకల్పితములైన దివ్య ప్రేమమూర్తులతో లీలలకై ఈమెకు వరమీయబడినది. ప్రేమించినవారికి పాపములేదు. ప్రేమ మూర్తి, ప్రేమాగ్నిలో తప్తమైన పరిశుద్దమైన దీమె ఆత్మ. ధన్యురాలు, ప్రేమించినది’