శేద్య చంద్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శేద్యచంద్రిక తెలంగాణలో తొలి తెలుగు పత్రిక. సేద్యచంద్రక తొలిపత్రిక అయినా అది అనువాద పత్రిక కావడంతో 1913లో శ్రీనివాసశర్మ సంపాదకత్వం లో హితబోధిని తొలిపత్రికగా పరిగణించారు. తెలుగు ప్రజల కోసం  ముఖ్యంగా రైతుల కోసం తెలుగు అనువాద పత్రికను అందిస్తున్నట్టు శేద్యచంద్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇది వ్యవసాయ శాస్త్ర సంబంధిత పత్రిక.

కాల నిర్ణయం[మార్చు]

శేద్య చంద్రికను పరిశీలించిన ఆరుద్ర, తిరుమల రామచంద్ర ఇది 1883 నాటిదని లెక్కగట్టగా మరికొందరు దీన్ని 1886 నాటిదని అంటున్నారు.[1] 1887లో ఈ పత్రిక వెలువరించుంటారని తెలంగాణ సాహిత్య వికాసం పరిశోధనా గ్రంథంలో ఉంది.[2]

విశేషాలు[మార్చు]

మహబూబ్‌ నగర్‌ నుంచి 1913లో  వెలువడిన ‘హితబోధిని’ తొలి తెలంగాణ పత్రికగా చాలాకాలం వరకూ ప్రచారంలో ఉండేది. కానీ అంతకు మూడు దశాబ్దాల కిందటే ఉర్దూ మాతృకకు అనువాదంగా వెలువడిన పత్రిక ‘శేద్య చంద్రిక’. ఇది 1886లో లో ప్రారంభించబడినది.[3] ఇది మద్రాసు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ (ప్రాచ్యలిఖిత గ్రంథాలయం)లో దీని ప్రతులు లభ్యమవుతున్నాయి. 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ లో జరిగిన ప్రదర్శనలో శేద్య చంద్రికను కూడా ప్రదర్శించారు. శేద్య చంద్రిక మొత్తం 40 పేజీలుంటుంది. చెక్కమీద చెక్కి ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నారని ముద్రణాసాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధించిన వారు ఆ తరువాత తేల్చారు. ఉర్దూలో వెలువరించిన "ఫునూన్‌" అనే పత్రికకు ఇది అనువాదమని పత్రిక సంపాదకీయాన్ని బట్టి తెలుస్తుంది. అప్పట్లో జనం భాషలో ఉర్దూ పదాలు దొర్లేవనటానికి నిదర్శనంగా తెలుగు అనువాదంలోనూ అనేక ఉర్దూ పదాలు కనిపిస్తాయి[1].

ముఖచిత్రం[మార్చు]

ముఖపత్రంలో అప్పటి నిజాం ఆదేశాలకు అనుగుణంగా రైతుల క్షేమం కోసం ప్రచురించినట్టు చెప్పుకోవటం కనిపిస్తుంది. పబ్లిషర్‌ గా "మున్షీ మహమ్మద్‌ ముష్తాక్‌ అహ్మద్‌" పేరు చెబుతూ ఫునూన్‌ పేరు ప్రస్తావించారు. చార్మినార్‌ సమీపంలోని పత్తర్‌గట్టి దగ్గర ‘పునూన్‌’ ముద్రణాలయంలో ప్రచురితమైనట్టు అధ్యయనకారుల పరిశీలనలో వెల్లడైంది[2].

శీర్షికలు[మార్చు]

రైతులకు తెలియాల్సిన మెలకువల గురించి, ఆధునిక పోకడల గురించి, ఇతర దేశాల నుంచి అందుతున్న సమాచారం గురించి చెప్పటానికి ఇందులో ప్రాధాన్య మిచ్చారు. అదే సమయంలో వైద్య చిట్కాల వంటివి కూడా పత్రికలో చేర్చారు. రెవెన్యూ వసూళ్ళ వివరాలు, బకాయిల వివరాలు పేర్కొనటంతోబాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరెవరు ఎక్కడికి బదలీ అయ్యారో ఆ సమాచారం కూడా శేద్య చంద్రికలో పొందుపరచారు. వ్యవసాయం లాభదాయకంగా సాగటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే పేరుకు తగినట్టుగా ఇది పూర్తిగా రైతుల పత్రిక. తెలుగు మాత్రమే తెలిసిన  రైతుల కోసం చేసిన ప్రయత్నమే ఇది[1].  

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "తెలంగాణలో తొలితెలుగు పత్రిక". Cite web requires |website= (help)
  2. 2.0 2.1 "తొలి తెలుగు అడుగులు". Cite web requires |website= (help)
  3. "'సారస్వత' పూల గుత్తులు". Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]