Jump to content

శేషం కృష్ణకవి

వికీపీడియా నుండి

శేషం కృష్ణకవి కవి-పండితుడు-కావ్యా రచయిత.

పూర్వకాలమున విద్వత్వకవిత్వముల వన్నెకెక్కిన ఆంధ్రదేశీయపండిత వంశములలో శేషంవారి వంశమొకటి. వీరి ఆద్యనివాసము తెలంగాణాలోగాని, రాయలసీమలోగాని ఒక గ్రామం కావచ్చును. అది ఇపుడు నిరూపింపరాదుగాని యీవంశములోని కొంతమంది కాశీనగరమునకును, మరికొందరు మహారాష్ట్రకును, ఇంకొదరు దక్షిణదేశానికిను వలస వెళ్ళినట్లు కనబడుచున్నది. వారివారి రచనలే ఇందుకు ప్రమాణము.

శేష వంశము-వారి రచనలు

[మార్చు]

శేషం కమలాకర రత్నాకర పండితులు గీతగోవిందమునకును, శేషం గోవిందపండితుడు అమరుకశతకమునకును నిర్మించిన వ్యాఖ్యలున్నవి. గోవిందపండితుడు వినతానందవ్యాయోగము, గోపాలలీలార్ణవభాణము కూడా నిర్మించియున్నాడు. శేషం రామచంద్రబుధుడు హర్షనైషధమునకు టీక రచియించెను. శేషం వేంకటపతి మధురా నాయకుడైన విజయరంగచొక్కభూపాలుని ఆస్థానకవియై తారాశశాంకవిజయమును ఆంధ్ర ప్రబంధమును రచియించెను. ఇట్లు దేశము నలుగడలనుండి సారస్వతసేవయొనరించిన ఈ శేషమువంశములోని నరసింహకవి సా.శ. 1450 ప్రాంతమందు కాశీపురమున కేగి అందు స్థిర పడెను. ఆకాలమందలి కాశీపండితులలో నరసింహకవి శబ్దశాస్త్రినిధి అని కీర్తిగన్నవాడు. భట్టోజీధీక్షితులు, నాగేశభట్టు మొదలగు మహావైయాకరణులు పాణినీయమున అతని మతము నెక్కువగా ఆశ్రయించి రనుటయే అతని అతని వైదుష్య మహత్త్వమునకు గొప్పగుర్తు. తాండవపురరాజైన గోవిందచంద్రనృపతి ఆదరమందిన ఆకవీంద్రుడు పోషకునిపేర గోవిందార్ణవమను ధర్మశాస్త్రగ్రంధము నిర్మించెను.ఆనాడు వారణాసిలో శబ్దశాస్త్రపాఠమునకు పరమగురువైన అతనికి చింతామణి, కృష్ణుడునని ఇద్దరు కొడుకులు జన్మించిరి. చింతామణి మహావైయాకరణుడై, కవియు నైరుక్మిణీపరిణయ నాటకమును, రసమంజరీపరిమళ మను అలంకారకృతిని నిర్మించెను.

ద్వితీయుడైన కృష్ణకవి తండ్రివలె అన్నవలె శబ్దశాస్త్ర ప్రవీణుడై కవితాచతురుడై మురారి విజయము, ముక్తా చరితము, సత్యభామా పరిణయము, సత్యభామావిలాసము, ఉషాపరిణయము, క్రియాగోపన రామాయణము, పారిజాతహరణము, కంసవధ అను కావ్యములను రచించెను. వీనిలో కంసవధ ఏడంకముల నాటకము. ఇది, అక్బరు ఫాధుషామంత్రియైన రాజాతోడర మల్లుని కుమారుడగు గోవర్ధనధారి అనబడిన గిరిధారి నృపతి ప్రోత్సాహమున రచించబడింది. దీనిని బట్టి ఇతడు క్రీ. శ. 1510 ప్రాంతమందున ఈ కృతి రచించెననవచ్చును. శబ్దశాస్త్రకోవిదత్వము కవులకు భూషణము. అదిలేని కవిత బొల్లియున్న లతాంగివలె రసికులను రంజింపజేయజాలదు అని ఈతడి అభిప్రాయము. ఈకవి తన తండ్రివల్ల కృతినందిన తాండవపుర (కాశీసమీపమున) రాజుతమ్ముడైన నరోత్తమనృపతి కంకితముగా పారిజాతాపహరణ చంపువు రచించెను. ఆంధ్రుడైన ఈవిద్వత్కవి సుప్రసిద్ధుడైన జగన్నాధ పండిత రాయలకంటే పెద్దవాడు, ఢిల్లీ నగరమున వీరిరువురు పరస్పరము చూచుకొన్నవారు ననుట కవకాసము ఉంది.

ఈకృష్ణకవికి వీరేశ్వరుడు, నారాయణుడు నను ఇరువురు పుత్రులు కలరు. వీరిలో పెద్దవాడు పండితరాయల గురువులలో నొకడు. ఆవీరేశ్వరుడు వేరేమోఅని కొదరు అనుకుందురుకాని, ఆకాలమున కాశీనగరమందు శబ్దశాస్త్ర ప్రసిద్ధుడైన వీరేశ్వరు డీ కృష్ణకవి పుత్రుడే కాక మరియొకడు కాదు. ఈవీరేశ్వరుని వద్దనే భట్టోజీ ధీక్షితులు, అన్నంభట్టును శబ్దతర్కశాస్త్రమును అభ్యసించిరి. అట్టి శేషవంశములోని ఈ కృష్ణకవి కృతులను సంపాదించి ప్రకటించుట ఆంధ్రుల కర్తవ్యము.

మూలాలు

[మార్చు]

1950 భారతి తెలుగు మాస పత్రిక- వ్యాసకర్త శ్రీ మల్లాది సుర్యనారాయణశాస్త్రి.