Jump to content

శొంఠి కామేశం

వికీపీడియా నుండి
(శొంటి కామేశం నుండి దారిమార్పు చెందింది)

శొంటి కామేశం (Sonti Kamesam) (జననం-1890. మరణం-1954) ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు, చిత్రకారుడు. అస్కు దారు సంరక్షక విధానం రూపొందించినవాడు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 1890లో జన్మించారు. వీరు ప్రాథమిక విద్యను విశాఖపట్నంలోను, కళాశాల విద్యను మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ పూర్తిచేసి వృత్తి విద్యకై గిండీ ఇంజనీరింగు కళాశాలలొ చేరి బి.ఇ.పరీక్షలో మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యారు.

మొదటగా డెహరాడూన్ లోని అటవీ పరిశోధన సంస్థ (Forest Research Institite) లో దారు సంరక్షణ ఉద్యోగిగా ప్రవేశించారు. వీరి ప్రతిభ మూలంగా అక్కడే 'Expert-in-charge of Wood Preservation' గా నియమితులయ్యారు. పరిశోధన నిమిత్తం జర్మనీ పంపగా అక్కడ డా.ఫాక్ తో కలసి కృషిచేసి 1930 లో 'ఫాక్-కామేశం దారు సంరక్షణ విధానం' రూపొందించారు. ఈ విధానంలో వాడబడే కొన్ని ద్రవ్యాల పేర్లను బట్టి దానికే 'ఆస్క్యూ (ASCU) దారు సంరక్షణ అనే పేరు కలిగింది. ఈ విధానం వలన రక్షించబడిన అడవి కర్రలు సైతం టేకు కర్రల వలె మన్నికను పొందగలుగుతాయి. ఈ విధానంలో రక్షితాలైన కొయ్యస్తంభాలను, దూలాలను ఉక్కు దూలాలకు, స్తంభాలకు ప్రత్యామ్నాయాలుగా వాడుకలోకి తేవడానికి చాలా కృషి చేశారు.

తరువాత తిరువాన్కూరు సంస్థానంలో డైరెక్టరుగా చేరారు. ఆ కాలంలో ఆస్క్యూ పద్ధతికి లోనైన కొయ్యతో తోటపల్లి ఏటికి ఒంటికాలు వంతెనను నిర్మించారు. అనంతరం బెంగుళూరులో ఇంజనీరు వృత్తిని ప్రారంభించి వీరు ఆస్క్యూ కలపతో పెక్కు కట్టడాలను, వంతెనలు నిర్మించారు. ఈ విధానం అవలంబించి వెదుళ్ళతో గట్టిచేయబడిన సిమెంటు పలకలను తయారుచేయడంలో కృతార్ధులయ్యారు. దీనికి 'సాన్స్-స్టీల్ (ఉక్కులేని) విధానం' అని పేర్కొన్నారు.

వీరు 1948లో కర్రతో చవకైన వంతెనల నిర్మాణం గురించి పుస్తకం రచించారు.[1]

వీరు చేసిన అపూర్వ కృషిని గుర్తించి, ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు వారు డి.ఎస్సీ. గౌరవ బిరుదుతో సత్కరించింది.

అంతర్జాతీయ ప్రఖ్యాతిచెందిన కామేశం గారు 1954లో పరమపదించారు.

మూలాలు

[మార్చు]