శ్రీరామ నరసింహమూర్తి కవులు
గంధం శ్రీరామమూర్తి, ఇఱ్ఱింకి నరసింహమూర్తి అనే ఇద్దరు కవులూ జంటగా శ్రీరామ నరసింహమూర్తి కవులు అనే పేరుతో జంటగా కవిత్వం చెప్పారు. శతావధానము చేశారు. గద్వాల సంస్థానములో ఆస్థానకవులుగా ఉన్నారు.[1]
గంధం శ్రీరామమూర్తి
[మార్చు]ఇతడు 1905లో పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి గ్రామంలో జన్మించాడు. ఇతడు ఉభయభాషాప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడయి పశ్చిమ గోదావరి జిల్లాలలోని పలు స్థానికోన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాడు.
ఇఱ్ఱింకి నరసింహమూర్తి
[మార్చు]ఇతడు 1901లో పశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు కూడా ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడై పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]వీరిరువురూ బహుగ్రంథకర్తలు. వీరి గ్రంథాలలో
- శతావధానము
- చాటువులు
- శ్రీమదాంధ్ర భాగవతము
- మణిరత్నమాల
- తేటగీత భగవద్గీత
- మహాభారత యుద్ధము
- తీర్థయాత్రాదర్శిని
- ఆంధ్రపుష్పబాణవిలాసము
- యదార్థ రామాయణము
- వేమగీతమ్ (సంస్కృతం)
- ప్రథమ సహస్రము
- బాపూజీ సూక్తి రత్నావళి
- మహాత్మాగాంధీ
- ఆశ్రిత పారిజాత శతకము మొదలైనవి ఉన్నాయి.
అవధానాలు
[మార్చు]వీరు చేసిన అవధానాలలో తోలేరులో చేసిన శతావధానము వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ అవధానములోని కొన్ని పూరణలు:
- వర్ణన: నదిని స్త్రీతో పోల్చి పద్యం
పూరణ:
వేణి భరాభిరామ, యరవింద సముజ్వల నేత్ర, సైకత
శ్రోణియు, చక్రవాక కుచశోభిత, రాజ మరాళయానయై
ప్రాణవిభున్ తమిన్ గవయఁబాల్పడి యేగెడు కాంతకైవడిన్
రాణమెయిన్ స్రవంతి జలరాశిని గూడఁగ నేగుదెంచెడిన్
- సమస్య: వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్
పూరణ:
ఈ క్త్రా ప్రాసముఁజెప్ప నద్భుతమొకో యేంతేనియున్, జూడుడీ
వాక్త్రాసంబుల జంకు వారమనుచున్ భావింపఁగా బోకుడీ
దిక్త్రారాతికిఁబార్వతీ శివులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్
- సమస్య: మలము దినుము నీదు నోటి మలినము పోవున్
పూరణ:
చలువ కపురంపు పలుకులు
జలుబు మలపు జాజికాయ జాపత్రులు వ
క్కలు యేలకులం గూడు, త
మలము దినుము నీదు నోటి మలినము పోవున్
మూలాలు
[మార్చు]- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 233–236.