శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం (యనమదుర్రు)
శక్తీశ్వర స్వామి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక శైవాలయం. ఇది స్వయంభువుడిగా శివుడు వెలసిన ఆలయం. ఈ ఆలయంలో మహాశివుడు సతీ, పుత్ర సమేతుడై శీర్షాసనంలో ఉన్నట్లు కనిపిస్తాడు.[1]
ఆలయ విశేషాలు
[మార్చు]ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లో మండల కేంద్రానికి 4 కి.మీ దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో నెలకొని ఉంది. ఇది స్థానికంగా "శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం" గా పిలువబడుతుంది. శక్తీశ్వరస్వామి తలక్రిందులుగా దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇది భీమవరానికి 4 కి.మీ దూరంలో ఉంది. సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు పార్వతీ సమేతుడై, ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శివపార్వతులు వెలసిన పీఠం ఏకపీఠం కావడం ఒక విశేషమైనతే, ఇదంతా ఒక పెద్ద శిలగా భూగర్భంలో నుంచి చొచ్చుకుని వుండడం మరొక అద్భుతం. శక్తీశ్వరుడు ఈ ఆలయంలో శీర్షాశనంలో తపోనిష్టుడై ఉండడం మరో మహాద్భుతం. జటాఝూటం, నొసట విభూతి రేఖలు, నాగాభరణము స్వామి వారి విగ్రహంలో స్పష్టంగా కనపడతాయి. ఈ ఆలయం తూర్పువైపు శక్తి ఉండం ఉంది. కాశీలోని అంతర్వాహిని అయిన గంగ ఈ చెరువులో కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ చెరువు తవ్వకాలలో సర్పం ఆకారంలో ఆరు అడుగుల శిల బయటపడింది. ఈ శిలను సుబ్రహ్మణ్యస్వామిగా భావించి ఆలయంలో ప్రతిష్టించారు. ఈ శక్తిగుండంలోని నీరుతోనే స్వామివారిని అభిషేకం, పూజలు నిర్వహిస్తారు. [1][2]
స్థల పురాణం
[మార్చు]శంబరుడనే రాక్షసుని సంహరించేందుకు యముడు శివున్ని ప్రార్థించాడు. ఆ సమయంలో శివుడు యోగముద్రలో ఉండటంతో పార్వతీ మాత అనుగ్రహంతో యముడు శక్తిని పొంది శంబరుడిని సంహరిస్తాడు. యమధర్మరాజు కోరిక మేరకు శీర్షాసన స్థితిలో ఉన్న శివుడు అమ్మవారితో సహా ఈ క్షేత్రమునందు వెలిశాడు అనీ చరిత్ర.
ఉత్సవాలు
[మార్చు]మహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో స్వామి వారికి రుద్రభిషేకం, అభిషేకాలు లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి సందర్భంగా అఖండ అన్నసమారాధన జరుగుతుంది. ఆ ప్రత్యేక ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Shakteeswara Swamy Temple Yanamadurru - History, Timings, Phone". Temples Information Center - Tirumala Tirupati Srikalahasti (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-05-30. Retrieved 2018-04-05.
- ↑ "The Complete and Updated Information of the Bhimavaram City | Manabhimavaram.in". www.manabhimavaram.info. Archived from the original on 2016-05-16. Retrieved 2018-04-05.