Jump to content

తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం

వికీపీడియా నుండి
(సంగమేశ్వర స్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం
సంగమేశ్వర స్వామి ఆలయం
సంగమేశ్వర స్వామి ఆలయం
పేరు
ఇతర పేర్లు:తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం
ప్రధాన పేరు :సంగమేశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఖమ్మం జిల్లా
ప్రదేశం:ఖమ్మం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సంగమేశ్వరుడు (శివుడు)
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణంలో ఉన్న దేవాలయం. అత్రి మహర్షి పేరు మీదుగా ఆకేరు, భృగు మహర్షి పేరు మీదుగా బుగ్గేరు, మౌద్గల్య మహర్షి పేరు మీదుగా మున్నేరు అనే మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. మహాశివరాత్రి రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున కూడలి జాతర జరుగుతుంది.

ఆలయ చరిత్ర

[మార్చు]

ఖమ్మం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచింది. ఒకనాడు అత్రి, బృగు, మౌత్గల్య మహారుషులు శివునితో కలిసి వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో మూడు నదులు ప్రవహిస్తుండటం చూసి గంగ, పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా, పార్వతి వారించినా వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాలని శివుడు రుషులతో చెప్పాడని, దీనికి పార్వతి సంతోషించిన పిదప శివుడు, పార్వతి, గంగలను ఇచ్చటనే ప్రతిష్ఠింప చేయాలని శివుడు రుషులను ఆజ్ఞాపించాడని స్థల పురాణం చెబుతోంది. ఆ మహారుషులు ఓ దివ్యముహూర్తాన గంగా సమేత స్వామి వారితోపాటు వినాయకున్ని, నందీశ్వరున్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు.[1] రుషులు ఈ శివాలయాన్ని గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా పేరుపెట్టారు. అక్కడ ప్రవహించే నదులైన మౌత్గల్య పేరున మున్నేరు, అత్రి మహర్షి పేరున ఆకేరుగా, బృగు మహర్షి పేరున బుగ్గేరుగా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. కలియుగం మొదలైన తరువాత ఇక్కడ నిర్మించిన దేవాలయం అడవిలో పుట్టలతో నిండిపోవడంతో ఈ దేవాలయం కనబడకుండా పోయిందని ఒక పౌరాణిక కథనం

మళ్ళీ దేవాలయం వెలుగులోకి వచ్చిన విధం

[మార్చు]

ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో తెలియక జనసంచారం లేని దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ దేవాలయం ఒంటరిగా ఎన్నాళ్ళుందో, ఎన్నేళ్ళుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఐదువందల ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బజ్జూరి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, ఈ గుడి బయట పడినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా, ఇక్కడ ఒక గ్రామం వెలసింది. అప్పటి నుంచి సంగమేశ్వరస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్ట త బయటకు తెలియలేదు.

ఆలయ అభివృద్ధి చర్యలు

[మార్చు]

వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి పూజారిగా వున్న రాఘవవర్మ తండ్రి రామయ్య గుడిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసారు. ఆయన వారసుడిగా వచ్చిన రాఘవవర్మ చుట్టుప్రక్కల గ్రామాల భక్తుల నుంచి విరాళాలను సేకరించి గుడికి ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, యాగశాలను నిర్మించారు. దేవాలయాభివృద్ధికి గతంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా సహకారం అందించారట. 1968లో ఈ దేవాలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఈ దేవాలయానికి వచ్చే నిధులు, దాతల విరాళాలతో గుడిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయానికి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామికి 40 ఎకరాల మాన్యం ఉంది. 1972లో దేవాలయానికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటయ్యింది. తీర్థాల సంగమేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు అభివృద్ధి పరచేందుకు అప్పటి ఖమ్మం డివిజన్ రెవెన్యూ అధికారి వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భక్తుల నుంచి 20శాతం నిధులను సేకరించి వాటికి ప్రభుత్వం 80 శాతం నిధులను జతచేస్తు కొంతమేరకు చర్యలు చేపట్టారు.

త్రికూటాలయం పత్యేకతలు, విశేషాలు

[మార్చు]

సంగమేశ్వరాలయంలో ఒక్క గర్భగుడి కాకుండా పక్కపక్కనే వుండే మూడు గర్భగుడులు వుంటాయి. అయితే అందులో రెండు శైవానికి సంబంధించి శివలింగాలున్న గుడులైతే మూడవది. వైష్ణవ సంభందమయిన నరసింహాలయం. అయితే నరసింహాలయంలో ప్రధాన విగ్రహం ప్రస్తుతం లేదు. ఆ గర్భగుడిపై మాత్రం శేషసాయి అయిన మహా విష్ణువురూపం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.

సంగమేశ్వర లింగం ప్రత్యేకతలు

[మార్చు]

తెల్లటి నునుపైన ప్రత్యేక శిలతో చేసిన సంగమేశ్వరుని లింగాకారం. పానవట్టంలో విడిగా తీసి పెట్టిందుకు అనువుగా వున్నట్లు నిర్మించారు. పాలరాయిలా నునుపైన మెరుపుతో వుండే ఈ శివలింగం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఆలయ ప్రాంగణంలోని విగ్రహాలు

[మార్చు]

ఆలయప్రాంగణంలో అత్యంతపురాతనమైనవిగా భావించ బడుతున్న లజ్జాగౌరిని పోలిన ఒక శిల్పం కనిపిస్తుంది. అదే విధయం సాదకులు నిర్మించుకున్నట్లుగా అనిపించే వామ దిశను చూస్తున్న హనుమంతుని విగ్రహం కూడా శతాబ్ధాల వెనుకటిదిగా కనిపిస్తుంటుంది.

దేవాలయం గోడలపై చిత్రాలు

[మార్చు]

దేవాలయపు గోడలపై మచ్చావతారాన్ని సూచించేల వున్న ఒక చేపబొమ్మ, ఏనుగులూ, గుర్రాలూ, ద్వారపాలకుల వంటివే కాకుండా సృష్టికార్యం రహస్యాన్ని వివరిస్తున్నట్లున్న కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి.

కూడలి జాతరకు గుర్తింపు

[మార్చు]

ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది.[2] ఈ జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన కూడలి జాతరను అప్పటి కలెక్టర్‌ గిరిధర్‌, జిల్లా జాతరగా ప్రకటించాడు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "సంగమేశ్వర ఆలయం (తీర్జాలు) – atoznewsvibe". www.atoznewsvibe.com. 2021-03-26. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "తీర్థాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు | ఖమ్మం | www.NavaTelangana.com". NavaTelangana. 2022-03-01. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.