సంజయ వేలట్టిపుత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో విలక్షణ రీతిలో ప్రచారం చేసిన దార్శనికులలో సంజయ వేలట్టిపుత్త ఒకడు. గౌతమ బుద్ధుని సమకాలికుడు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో ఐదవ వాడు. ఇతను సంశయవాది. అజ్నేయవాదిగా (Agnosticism) కనిపిస్తాడు. మిగిలిన భౌతిక తాత్వికుల వలె దేవుడు, పరలోకం, లాంటి వైదిక మత విశ్వాసాలను ఖండించలేదు. అలా అని వాటిని సమర్ధించనూ లేదు. దేవుడు, పరలోకం, పుణ్యంల గురించి వుంది-లేదు, లేదు-వుంది అంటూ ఇదమిద్దంగా తేల్చకుండా, సూటిగా చెప్పకుండా సంశయాత్మక ధోరణిలో విలక్షణంగా బోధించాడు.

ఆధార గ్రంధాలు[మార్చు]

సంజయ వేలట్టిపుత్తుని గురించి అతని తాత్విక ధోరణి గురించి ఉటంకించిన కథనాలు, వ్యాఖ్యలు బౌద్ధ గ్రంథాలైన దిఘ నికాయ లోని బ్రహ్మజాల సుత్త, శమన్నఫాల సుత్త, బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” మొదలగు గ్రంథాలలో లభిస్తాయి.

జీవిత చరిత[మార్చు]

బౌద్ధ తత్వవేత్త బుద్ధఘోషుని “సుమంగళ విలాసిని”లో ఇతని తలపై కణతి (సంజ) ఉన్నందున ఇతనిని సంజయుడని పిలిచారని, ‘వేలతి’ అనేది పుట్టుకతో బానిస అనే విషయాన్ని సూచిస్తుందని చెప్పబడింది. దీన్ని బట్టి మొదట బానిసగా ఉన్నప్పటికి తత్వవేత్తగా మారాడని తెలియవస్తుంది. ఇతను బుద్ధుని సమకాలికుడు. బుద్ద్దుని సుప్రసిద్ధ శిష్యులైన శారిపుత్త (శారద్వతీ పుత్రుడు), మహా మొగ్గల్లాన (కొలిటుడు) లు మొదట సంజయ వేలట్టిపుత్తుని శిష్యులే కాని ఇతని బోధనలు విముక్తికి దారి చూపని కారణంగా తరువాత గౌతమ బుద్ధుడు రాజగృహానికి విచ్చేసినపుడు వీరిరువురు మరో 250 మంది శిష్యులతో కలసి సంజయుని విడిచిపెట్టి బుద్ధుని వద్దకు మూకుమ్మడిగా తరలిపోయి బౌద్ధమతం స్వీకరించారు. దానితో సంజయునికి పిచ్చెక్కినంత పనై రక్తం కక్కి చనిపోయాడని బౌద్ధమత గ్రంథాలు బుద్ధుని ఉన్నతీకరిస్తూ, సంజయుని చులకన చేసి పేర్కొన్నాయి.

బోదనలు – ప్రచారం[మార్చు]

ప్రాచీన భారతీయ భౌతికవాదులలో ఒకడైన సంజయ వేలట్టిపుత్త ఇతర భౌతికవాద తత్వవేత్తల వలె గంగ మైదాన ప్రాంతాలలో పర్యటిస్తూ తన అజ్నేయవాదాన్ని ప్రతిపాదిస్తూ, వైదిక మత విశ్వాసాల గురించి ఇదమిద్దంగా తేల్చకుండా విలక్షణంగా ప్రచారం చేసాడు. ఇతర తాత్వికుల వలె దేవుడు, పరలోకం, పుణ్యం లాంటి విషయాల గురించి చర్చించినట్లు కనిపించడు. మిగిలిన భౌతిక తాత్వికుల వలె వాటిని ఖండించలేదు. అలా అని వాటిని సమర్ధించనూ లేదు. వైదిక మత విశ్వాసాల గురించి దేవుడు - పరలోకం ల గురించి వుంది-లేదు, లేదు-వుంది అంటూ సూటిగా చెప్పకుండా సంశయాత్మక ధోరణిలో బోధించాడు.

సంజయ వేలట్టిపుత్త మౌలికంగా సంశయవాది. ఏ విషయంలోనూ ఇదమిద్దంగా ఏదీ చెప్పలేం. అంతా సంశయమే. యితడు ఏ విషయాన్నీ పూర్తిగా అంగీకరించడు. అలా అని దేన్నీ పూర్తిగా నిరాకరించడు. ఒక విధంగా ఇతను అజ్నేయవాదానికి (Agnosticism) ఒక తాత్వికరూపం ఇవ్వగలిగాడు.

ఇతను ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం ఇచ్చేవాడు కాదు. అందుచేత మగధ రాజు బింబిసారుడు ఇతన్ని పరమ మూర్ఖుడిగా నిందించాడని, ఇతని అనుచరులను అజ్ఞాన వాదులని పిలిచేవాడని జైన గ్రంథాలు తెలిపాయి. అయితే సంజయ వేలట్టిపుత్త మూర్ఖుడు కాదు. బౌద్ధ వాజ్మయమైన ‘బ్రహ్మజాల సుత్త’ ప్రకారం వీరిని అమర విక్షేపకవాదులని వ్యవహరిస్తారు. జైన సాహిత్యంలో వీరికి ఆపాదించబడిన అజ్ఞానవాదం, బౌద్ధ సాహిత్యంలో పేర్కొనబడిన అమర విక్షేపక వాదాలు ఆధునిక సందేహవాదానికి (Scepticism), ఆజ్ఞేయ వాదానికి (Agnosticism) అత్యంత సన్నిహితంగా వుంటాయి. ఆజ్ఞేయ వాదంలో ఏ సిద్ధాంతం పరమ సత్యం కాదు. దేవుడు, ఆత్మ, పరలోకం లాంటి వాటి ఉనికిని గురించి తెలియని బహుశా తెలుసుకోలేని విషయాల గురించి కచ్చితంగా సమాధానాలు చెప్పలేని స్థితిని వివరించే తాత్విక ధోరణి ఇది. ఉదాహరణకు ఆస్తికుడైతే దేవుని ఉనికిని విశ్వసిస్తాడు. నాస్తికుడైతే దేవుని ఉనికిని విశ్వసించడు. అజ్ఞేయవాది అయితే దేవుని ఉనికిని నమ్మడు. అలా అని దేవుని ఉనికి లేదు అని కూడా నమ్మడు. అంటే దేవుని ఉనికి గురించినది ఏదీ పరమ సత్యం కాదు అని భావిస్తారు. ఉన్నాడో, లేదో ఇదమిద్దంగా తెలియని దేవుని గురించి సకారాత్మకంగా, నకారాత్మకంగా అయినా కట్టుబడి వుండటం సమంజసం కాదని వీరి అభిప్రాయం.

ఆత్మ- దేవుడు – పరలోకం వంటి భావనల గురించి అవి ఉన్నవో, లేవో సూటిగా తేల్చకుండా సంశయాత్మకంగా వివరిస్తున్న కారణంగా సంజయ వేలట్టిపుత్తుని బోధనలు, ఆయా భావనలను తిరుగులేని సత్యాలుగా ఆమోదించిన వైదిక మతానికి శిరోభారంగా తయారయ్యాయి. ఏ విషయం పరమ సత్యంగా ప్రకటించని సంజయ వేలట్టిపుత్త పరలోకం వున్నదని చెప్పడు. లేదూ అని కూడా చెప్పడు. అందుకే బౌద్ధ గ్రంథం దిఘ నికాయ లోని 'శమన్నఫాల సుత్త' ఇతని తాత్విక దోరణిని వివరిస్తూ ఇతనితో వాదన అనేక ప్రశ్నోత్తరాలకు దారి తీస్తుంది అని పేర్కొంటూ ఇలా వివరించింది. "పరలోకం వుందా అని నన్ను అడిగితే, పరలోకం వుంది అని నేను నమ్మితే వుంది అంటాను. కాని, నేను అలా అనను. పరలోకం లేదు అని నేను నమ్మితే లేదు అంటాను. కాని, నేను అలా అనను. పరలోకం ఈ విధంగా వుందనీ, ఆ విధంగా వుందనీ నేను చెప్పను. పరలోకం ఈ విధంగా లేదనీ, ఆ విధంగా లేదనీ నేను చెప్పను." ఈ విధమైన తాత్విక ధోరణిలో సంజయ వేలట్టిపుత్తుని వివరణ కొనసాగుతుంది. అందుచేత స్పష్టంగా, సూటిగా, నిర్ద్వందంగా ఒక విషయాన్ని చెప్పడమనేది ఇతని తాత్విక ధోరణిలో కనిపించదు. ఇతను దేవుడు, పరలోకం, పుణ్యం లాంటి విషయాల గురించి మిగిలిన తాత్వికుల్లా చర్చించడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ జ్ఞాన పరిమితిని అంచనా వేసుకోవాలన్నదే ఇతని దృక్పధంగా కనిపిస్తుంది.

 మూలాలు[మార్చు]

  • History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L. Basham
  • The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
  • భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
  • ప్రాచీన భారతంలో చార్వాకం –సి.వి.