సత్వర హృద్ధమని వ్యాధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హృదయానికి మిగిలిన అవయవాల వలె ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందించుటకు రక్తప్రసరణ అవసరం. హృదయం నిరంతరంగా జీవితకాలం అంతా తోడు యంత్రంగా పనిచేయాలి. అందువలన దానికి నిరంతరం రక్తప్రసరణ చేకూరాలి. వామ (ఎడమ), దక్షిణ (కుడి) హృద్ధమనులు హృదయానికి రక్తం కొనిపోతాయి. హృత్సిరలు రక్తంను తిరిగి హృదయంలో కుడికర్ణికకు చేరుస్తాయి.


హృదయానికి రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి,  ఆ లోపం చాలా తీవ్రం అయితే గుండెపోటు కలుగుతాయి. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండర కణజాలం రక్తప్రసరణ లేక ‘ప్రసరణరహిత మరణం (ఇన్ ఫార్క్షన్)’పొందుతుంది[1]. అందువలన ప్రాణనష్టంతో బాటు ఇతర ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 30 శాతపు మరణాలు హృదయ రక్తప్రసరణ లోపాల వలన కలుగుతాయి.                                                                      


హృద్ధమనుల వ్యాధి (కరోనరీ ఆర్టెరీ డిసీజ్)[మార్చు]

హృద్ధమని వ్యాధి


హృద్ధమని వ్యాధి అంటే పరోక్షంగా హృద్ధమనుల కాఠిన్యతగా (ఎథిరోస్క్లీరోసిస్ ) భావించాలి. ధమనీకాఠిన్యత శైశవం నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యంలో తీవ్రతరం అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర క్రింద కొవ్వులు, కొలెష్టరాలు , కాల్సియం, తాపక కణాలు పేరుకొని ఫలకలుగా పొడచూపుతాయి[2]. ధమనుల గోడలోని మృదుకండరాల మధ్య కాల్సియం ఫాస్ఫేట్ నిక్షేపాలు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీకాఠిన్యపు ఫలకలు ధమనులలోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణం తగ్గి అవి సంకుచితం చెందుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చు, లేక ఎక్కువగా ఉండవచ్చు. ధమనులలో హెచ్చుభాగం కాఠిన్యత పొందవచ్చు. హృద్ధమనులు, వాటి శాఖలలో నాళపు లోపలి పరిమాణం 40 శాతం కంటె తక్కువగా తగ్గినపుడు రక్తప్రవాహానికి చెప్పుకోదగ్గ అడ్డంకి కలుగదు. రక్తనాళాలలో ఫలకలు స్థిరంగా ఉండి నాళం లోపలి పరిమాణం 40- 70 శాతం తగ్గినపుడు రక్త ప్రవాహానికి అవరోధం కలిగి శ్రమ, వ్యాయామాలతో హృదయానికి ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు, ఆ అవసరాలు తీరక గుండెనొప్పి (ఏంజైనా) కలుగుతుంది[3]. రక్తప్రసరణ లోపం తీవ్రతరం అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశం ఉంది. జఠరికలు లయ తప్పి జఠరిక ప్రకంపనం (వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ ) లోనికి వెళ్తే ప్రాణాపాయం కలుగుతుంది.

ఒక్కోసారి ఒక హృద్ధమని ఆకస్మికంగా పూర్తిగా కాని చాలా భాగం కాని మూసుకుపోవచ్చు. ధమనిలో ఫలక ఏర్పడి ఆ ఫలక చిట్లి దానిపై రక్తము గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్ర అవరోధం కలిగితే, హృదయ కండరజాలంలో కొంతభాగం ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందక మరణిస్తే గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) కలుగుతుంది[4][3]. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కండర కణజాలానికి బదులు పీచుకణజాలం ఏర్పడుతుంది. అపుడు హృదయ వ్యాపారం క్షీణిస్తుంది. హృద్ధమని లేక ఒక శాఖ హటాత్తుగా పాక్షికంగా మూసుకుపోతే గుండెలో ఒక భాగానికి రక్తప్రసరణ ఆకస్మికంగా తగ్గి తీవ్రమైన గుండెనొప్పి కలిగినా గుండె కండరజాలం మరణించకపోవచ్చు. వీరిలో శ్రమలేకుండా గుండెనొప్పి కలగడం, ఎక్కువ సమయం గుండెనొప్పి ఉండడం, నొప్పి తీవ్రంగా ఉండడం, వంటి లక్షణాలు సత్వర హృద్ధమని వ్యాధిని సూచిస్తాయి.

హృద్ధమని వ్యాధులకు కారణాలు              [మార్చు]

వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనం హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమనివ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుమేహవ్యాధిగ్రస్థులలోను, అల్పసాంద్రపు లైపోప్రోటీనులు అధికంగా ఉన్నవారిలోను, అధికసాంద్రపు లైపోప్రోటీనులు తక్కువగా ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోను, పొగత్రాగేవారిలోను[5], వ్యాయామం చేయక భౌతిక జడత్వం కలవారిలోను, స్థూలకాయులలోను (భారసూచిక 18.5-24.9 పరిమితులలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళాలలోపు స్త్రీలలో 35 అంగుళాలలోపు  ఉండుట మేలు.), దగ్గఱి కుటుంబసభ్యులలో పిన్నవయస్సులోనే (పురుషులలో 55 సంవత్సరాలలోను, స్త్రీలలో 65 సంవత్సరాలలోను) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు కలిగిన వారిలోను[6], హృద్ధమనీవ్యాధులు కలిగే అవకాశాలు హెచ్చు[3]. ధూమపానం సలిపేవారు ధూమపానం పూర్తిగా 15 సంవత్సరాలు మానివేస్తే వారిలో హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశం ధూమపానం సలుపని వారితో సమానం అవుతుంది. రక్తపరీక్షలలో సి-రీయేక్టివ్ ప్రోటీన్ 2 మి.గ్రాలు/డె.లీ మించినవారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణాలు పెరిగిన వారిలోను, దూరధమని వ్యాధులు కలవారిలోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశాలు హెచ్చు.

హృదయ ధమనులలో కాఠిన్యఫలకలు ఏర్పడి వాటి లోపల పరిమాణం తగినంత (40- 70 శాతం) తగ్గినపుడు శ్రమతోను, వ్యాయామంతోను హృదయంకి ప్రాణవాయువు, పోషకపదార్థాల అవసరాలు పెరిగి అవి తీరనపుడు గుండెనొప్పి కలుగుతుంది[7]. ధమనీకాఠిన్య ఫలకలు స్థిరంగా ఉన్నపుడు హృద్ధమనివ్యాధి స్థిరమని పరిగణిస్తారు. వీరిలో గుండెనొప్పి విశ్రాంతితోను, నాలుక క్రింద నైట్రోగ్లిసెరిన్ మందు వాడుకతోను తగ్గిపోతుంది. వీరిలో కూడ గుండె కండరానికి రక్తప్రసరణలోపం కలిగినపుడు గుండెలయలో మార్పులు కలిగి హఠాన్మరణం కలిగే అవకాశం ఉంది.

హృద్ధమనులలో ధమనీకాఠిన్య ఫలకలు చిట్లినపుడు, ఆ పలకలకు నెత్తురులోని సూక్ష్మరక్తఫలకాలు (ప్లేట్ లెట్స్) అంటుకొని నెత్తురుగడ్డలు ఏర్పడుటకు దారితీసి, నాళంలో రక్తప్రసరణకు అడ్డు కలిగిస్తే తీవ్రమైన గుండెనొప్పి కాని గుండెపోటు కాని కలుగుతాయి. హృద్ధమనులలో అకస్మాత్తుగా కలిగే యీ పరిణామాలను సత్వర హృద్ధమని వ్యాధులుగ (ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్) వర్గీకరిస్తారు.

అస్థిరపు గుండెనొప్పి:[మార్చు]

హృద్ధమనిలో ప్రసరణ అవరోధం పాక్షికం అయినా, తాత్కాలికం అయినా హృదయకండర కణజాలంలో ప్రసరణరహిత మరణం కలుగకపోయినా, అసాధారణమైన, తీక్ష్ణమైన గుండెనొప్పి కలుగడం, హెచ్చు సమయం (20 నిముషములు మించి) ఉండుట, హెచ్చు తీవ్రత కలిగి ఉండుట, తక్కువ శ్రమతో కాని, విశ్రాంత సమయాలలో కాని కలగడం వంటి లక్షణాలు ఉండడం వలన దానిని అస్థిరపు గుండె నొప్పిగా వైద్యులు పరిగణిస్తారు. వీరికి త్వరితంగా ఔషధాలతో చికిత్స చేసి ఆపై వారికి (చర్మము ద్వారా) హృద్ధమని వ్యాకోచ చికిత్స (పెర్ క్యుటేనయస్ కరోనరీ ఇంటర్ వెన్షన్) అవసరమో కాదో వైద్యులు నిర్ణయించాలి.

విద్యుత్ హృల్లేఖలో ఎస్ టి భాగము పైకి లేవని గుండెపోటు[మార్చు]

గుండెపోటు ; హృద్ధమనిలో నెత్తురు గడ్డ

కొందఱిలో ఈ నొప్పితో విద్యుత్ హృల్లేఖలో S T భాగం మూలరేఖ మీదకు లేవకపోయినా రక్తంలో ట్రొపోనిన్, క్రియటినిన్ కైనేజ్, వంటి హృదయ సూచకాలు పెరిగినట్లైతే దానిని గుండెపోటుగా పరిగణించి NSTEMI అని (Non S T Elevation Myocardial Infarction) వర్ణిస్తారు. వీరికి చికిత్స అస్థిరపు గుండెనొప్పి కలిగిన వారి చికిత్స పంథాలోనే అందిస్తారు.

విద్యుత్ హృల్లేఖలో ఎస్ టి భాగం పైకి లేచే గుండెపోటు:[మార్చు]

గుండె క్రిందిభాగం, కుడి జఠరికలో STEMI గుండెపోటు విద్యుత్ హృల్లేఖలో మార్పులు


హృద్ధమనులలో రక్తపుగడ్డలు రక్తప్రసరణకు పూర్తిగా అడ్డుపడితే ప్రాణవాయువు, పోషక పదార్థాలు అందక ఆ యా ధమనులనుంచి ప్రసరణ పొందే హృదయకండర కణజాలం కొంత ప్రసరణరహిత మరణం పొందుతుంది. అపుడు గుండెపోటు కలుగుతుంది. గుండెపోటు కలిగి హృదయకండర కణజాలం మృతి పొంది, విద్యుత్ హృల్లేఖలో S T భాగం మూలరేఖపైకి ఎత్తుగా లేచి ఉన్నపుడు దానిని STEMI గా (ST Elevation Myocardial Infarction) వర్ణిస్తారు. STEMI చికిత్సలో రక్తప్రసరణను అతిత్వరగా పునరుద్ధరించి హృదయ కండర కణజాల మరణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.

ఇతర కారణాలు[మార్చు]

కొందఱిలో హృద్ధమని కండర దుస్సంకోచం వలన, కొకైన్  దుర్వినియోగం కలిగించే హృద్ధమని కండర దుస్సంకోచం వలన, పాండురోగంవలన, గళగ్రంథి ఆధిక్యత (హైపర్ థైరాయిడిజమ్) వలన, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత తగ్గుట వలన, రక్తపీడనం హెచ్చుట వలన సత్వర హృద్ధమనివ్యాధులు కలుగవచ్చు.

సత్వర హృద్ధమని వ్యాధి లక్షణాలు  [మార్చు]

సాధారణంగా గుండెనొప్పి, గుండెపోటు కలిగినవారిలో రొమ్ముటెముక వెనుక భాగంలో తీక్ష్ణమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి భుజాలకు, భుజదండాలకు, మెడకు, క్రింది దవడకు వ్యాపించవచ్చు. నొప్పితో బాటు చెమటలు, ఊపిరి అందకపోవుట,  వాంతిభావన, వాంతులు కూడా కలుగవచ్చు. కొందఱిలో ఛాతినొప్పి బదులు అసాధారణమైన గుండెకు సంబంధించని లక్షణాలు కలుగవచ్చు. ఊపిరి అందకపోవడం, పై కడుపులో నొప్పి, వికారం, కళ్ళుమసకబారి స్మృతితప్పడం, నీరసం వంటి అసాధారణ లక్షణాలు సుమారు 25 శాతం మందిలో కలుగుతాయి.  

స్త్రీలలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, వృద్ధులలోను, మూత్రాంగ వైఫల్యం అంత్యదశలలో ఉన్నవారిలోను, శస్త్రచికిత్సలు సమీపకాలంలో జరిగిన వారిలోను  అసాధారణ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిలో ఛాతిలో నలత ఉండవచ్చు.

ఛాతినొప్పి తీవ్రంగా ఉండడం, ఎక్కువ సమయం ఉండడం, కొత్తగా రావడం అస్థిరపు గుండెనొప్పిని సూచిస్తాయి. ఊపిరితో వచ్చే నొప్పి, భుజాల చలనంతో కలిగే నొప్పి, ఛాతిపైన, పక్కటెముకలు - ఛాతిఎముక సంధానాల ఒద్ద నొక్కితే కలిగే నొప్పి గుండెనొప్పిని సూచించవు. కొద్ది సెకండులు మాత్రమే ఉండే నొప్పులు గుండెపోటును సూచించవు. వైద్యులు పరీక్షించేటపుడు రక్తపీడనపు తగ్గుదల, వినికిడి గొట్టంతో విన్నప్పుడు గుండెలో క్రొత్త మర్మర ధ్వనులు, ఊపిరితిత్తుల క్రిందిభాగాలలో చిటపట శబ్దాలు ఉన్నాయేమో పరిశీలిస్తారు .

వైద్యులు హృదయవైఫల్య లక్షణాలకు కూడా పరిశోధించాలి. హృదయకండరానికి రక్తప్రసరణ తగ్గినపుడు ఎడమ జఠరిక సంకోచం తగ్గి బృహద్ధమని లోనికి నెట్టబడే రక్తపరిమాణం తగ్గి రక్తపీడనం తగ్గగలదు. హృదయ సామర్థ్యం తగ్గడంవలన రక్తపీడనం తగ్గి శరీర కణజాలానికి రక్తప్రసరణ తగ్గుటను ‘హృదయజనిత విఘాతం’ (కార్డియోజనిక్ షాక్ ) గా వ్యవహరిస్తారు. కుడి జఠరిక కండరజాలానికి రక్తప్రసరణ తగ్గి కుడిజఠరిక సమర్థత తగ్గితే, పుపుస ధమనికి చేరే రక్తపరిమాణం తగ్గి > ఎడమ కర్ణికకు పుపుససిరలు కొనిపోయే రక్తపరిమాణం >  ఎడమ జఠరికకు  > బృహద్ధమనికి చేరే రక్తపరిమాణాలు కూడా తగ్గుతాయి. అందువలన రక్తపీడనం తగ్గగలదు. ఎడమ జఠరిక వైఫల్యం వలన ఊపిరితిత్తులలో ద్రవసాంద్రత (కంజెషన్) పెరిగి వైద్యులు ఊపిరితిత్తుల దిగువ భాగాలలో చిటపట శబ్దాలు వినగలుగుతారు.

గుండెపోటు వలన ఎడమకర్ణిక, ఎడమజఠరికల మధ్య ఉండే ద్విపత్రకవాటంలో తిరోగమన రక్తప్రసరణం కలిగినా, రెండు జఠరికల నడిమిగోడలో రంధ్రం (జఠరికాంతర కుడ్యరంధ్రం) ఏర్పడినా జఠరికలు ముకుళించుకున్నపుడు మర్మరశబ్దాలు వినిపిస్తాయి. ఛాతినొప్పిని కలిగించు ఇతర కారణాలకు కూడ వైద్యులు పరిశోధించాలి.

బృహద్ధమని విదళనం (డైసెక్టింగ్ అయోర్టిక్ ఎన్యురిజెమ్) అరుదైనా దీనివలన ఛాతినొప్పి కలుగుతుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఛాతినొప్పితో బాటు నాడీమండలంలో లోపాలు, అవలక్షణాలు కూడ వీరిలో కనిపించవచ్చు. హృదయాన్ని ఆవరించుకొని ఉండు హృదయవేష్టనంలో తాపం (పెరికార్డైటిస్) వలన ఛాతినొప్పి కలుగవచ్చు. వీరిలో హృదయవేష్టనపు పొరలమధ్య రాపిడిశబ్దం వైద్యులు వినే అవకాశం ఉంది.

పరీక్షలు  [మార్చు]

ఛాతినొప్పి కలవారికి రక్తకణాల గణనం, రక్తరసాయన పరీక్షలు, రక్తంలో కొవ్వుల పరీక్షలు అవసరం.

విద్యుత్ హృల్లేఖ (ఎలెక్ట్రోకార్డియోగ్రామ్)  [మార్చు]

ఛాతినొప్పి కలిగిన వారికి విద్యుత్ హృల్లేఖ వెంటనే తీయాలి.విద్యుత్ హృల్లేఖలో q తరంగాలు, ST భాగములో మార్పులు, T తరంగము తిరుగబడుట హృద్ధమని వ్యాధిని సూచిస్తాయి. విద్యుత్ హృల్లేఖలో మార్పులు వెనువెంటనే కనిపించక పోవచ్చును. అందువలన ప్రతి 20 నిముషాలకు ఒకసారి చొప్పున రెండు గంటలు విద్యుత్ హృల్లేఖలు తీసి మార్పులకై శోధించాలి. స్టెమి (ST Elevation Myocardial Infarction) గుండెపోటు కలిగినవారిలో విద్యుత్ హృల్లేఖలో కనీసం రెండు సమీప స్థానాలలో  S T భాగం మూలరేఖకు కనీసం 1 మి.మీ పైకి ఎత్తుగా ఉంటుంది. కొందఱిలో జఠరికలకు విద్యుత్ప్రేరణ కొనిపోవు మోపు ఎడమ శాఖలో కొత్తగా మందకొడితనం (లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ / వీరిలో ఎడమ జఠరిక కండరజాలానికి  విద్యుత్ ప్రేరణ  ఆలస్యంగా చేరుతుంది) కనిపిస్తుంది. గుండె వెనుకభాగం రక్తప్రసరణ లోపానికి గుఱి అయినపుడు S T భాగం మూలరేఖకు దిగువకు పోయి V1, V2 , V3 స్థానాలలో  R waves  పొడవుగా ఉంటాయి. అస్థిరపు గుండెనొప్పి (unstable angina), ఎన్ స్టెమి (Non ST Elevation Myocardial Infarction) గుండెపోటులు కలిగినపుడు విద్యుత్ హృల్లేఖలలో ST భాగం మూలరేఖకు దిగువన ఉండవచ్చు, లేక ఏ మార్పులు ఉండకపోవచ్చు.

హృదయ సూచకాలు (కార్డియక్ మార్కర్స్)[మార్చు]

హృదయకండర కణాలకు రక్తప్రసరణ ఎక్కువ సమయం లోపించినపుడు ఆ కణ పటలాలల అభేద్యత దెబ్బతిని ఆ కణాల నుంచి క్రియటినిన్ కైనేజ్,  మయోగ్లోబిన్, ట్రొపోనిన్ అనే హృదయ సూచకాలు బయటకు చింది రక్తంలో కనిపిస్తాయి. ఛాతినొప్పి కలిగిన వారిలో ఈ సూచకాలకు వెంటనేను, 6 గంటల తర్వాతను, 12 గంటల తరువాతను పరిశోధించాలి. విద్యుత్ హృల్లేఖలలో ST భాగం ఎత్తుగా ఉన్నవారిలో ఈ హృదయ సూచకాలు పెరుగకపోయినా, వారికి అతిత్వరగా రక్తప్రసరణను పునరుద్ధించు ప్రయత్నాలు చేయాలి. ST భాగం మూలరేఖకు ఎత్తులోలేక, హృదయసూచకాలు మాత్రం పెరిగినవారిలో ఎన్ స్టెమి కలిగినట్లు నిర్ణయించాలి.

ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం  (ఎఖోకార్డియోగ్రఫీ)[మార్చు]

ఛాతినొప్పి కొనసాగుతున్నవారిలో ప్రతిధ్వని హృదయ చిత్రీకరణాలు ఉపయోగపడుతాయి. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణాలు రక్తప్రసరణ లోపించిన హృదయభాగంలో  గుండెగోడ కదలికల మందకొడితనాన్ని చూపిస్తాయి. గుండెగోడ చలనంలో లోపాలు లేనివారిలో గుండెపోటు కలుగలేదని నిర్ధారించజాలం కాని, తీవ్రమైన నష్టం వాటిల్లలేదని చెప్పగలం. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణాలు ఛాతినొప్పిని కలిగించే ఇతర కారణాలు, హృదయకండరంలో తాపం (మయోకార్డైటిస్), బృహద్ధమని కవాట సంకీర్ణత (అయోర్టిక్ స్టినోసిస్), బృహద్ధమని విదళనం (అయోర్టిక్ డైసెక్షన్) పసిగట్టగలవు. గుండెపోటు వలన కలిగే ద్విపత్రకవాటంలో తిరోగమన ప్రసరణ, జఠరికాంతర కుడ్యంలో రంధ్రాలు వంటి ఉపద్రవాలు కూడా  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం వలన తెలుస్తాయి.

హృద్ధమనుల చిత్రీకరణం (కరోనరీ ఏంజియోగ్రఫీ)[మార్చు]

ఊరుధమని (ఫెమొరల్ ఆర్టెరీ)  లేక ముంజేతి వెలుపలి ధమని (రేడియల్ ఆర్టెరీ) ద్వారా బృహద్ధమనిలోనికి ఆపై హృద్ధమనులలోనికి  కృత్రిమనాళం చొప్పించి ఎక్స్ -రే వ్యత్యాసపదార్థాలతో హృద్ధమనుల చిత్రీకరణం  చేసి హృద్ధమనుల నిర్మాణాన్ని, ఆ ధమనులలో సంకుచితాలను, అవరోధాలను కనుగొనవచ్చు. ధమనుల సంకుచితాలను బుడగతో వ్యాకోచింపజేసి అచట వ్యాకోచ సాధనాలను అమర్చుట వంటి ప్రక్రియలు కూడా అవసరమయితే చేయగలరు. స్టెమి గుండెపోటు ఉన్నవారిలోను, కొత్తగా ఎడమ జఠరికకు విద్యుత్ప్రేరణ ప్రసరణలో ఆలస్యం (లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్) కనిపించినవారిలోను, గుండె వెనుక భాగంలో గుండెపోటు కలిగిన వారిలోను, ఎన్ స్టెమి లేక అస్థిరపు గుండెనొప్పి (అన్ స్టేబిల్ ఏంజైనా) ఉన్నవారిలో ప్రాణాపాయ లక్షణాలు ఉన్నపుడు, ఔషధాలతో గుండెనొప్పులను అరికట్టలేకపోయినపుడు, రక్తప్రసరణను పునరుద్ధరించు ధ్యేయంతో హృద్ధమనీ చిత్రీకరణాలు చేస్తారు .

చికిత్స[మార్చు]

ఛాతినొప్పి కలిగిన రోగులకు త్వరితంగా పరీక్షలు చేస్తూనే, చికిత్స కూడా సత్వరంగా అందించాలి.

ప్రాణవాయువు[మార్చు]

అస్థిరపు గుండెనొప్పి, లేక గుండెపోటు లక్షణములు కలవారిలో , ప్రాణవాయువు సంతృప్తత 90 శాతము కంటె తక్కువ ఉంటే ప్రాణవాయువును ముక్కులోనికి నాళాల ద్వారా అందించాలి. ప్రాణవాయువు సంతృప్తత 90 శాతము మించి ఉన్నవారిలో ప్రాణవాయువు ఇవ్వడం వలన ప్రయోజనము ఉండదు[8]

మార్ఫిన్ సల్ఫేట్[మార్చు]

మార్ఫిన్ సల్ఫేట్  నొప్పిని నివారించుటకు తఱచు వాడుతారు. ఇది నొప్పిని నివారించుటే కాక ఆందోళనను తగ్గించి సహవేదన నాడీమండల తీవ్రతను తగ్గిస్తుంది. వేగస్ నాడి ద్వారా గుండెవేగాన్ని తగ్గిస్తుంది. సిరలను వ్యాకోచింపజేసి హృదయముపై ముకుళితపూర్వ భారాన్ని ( ప్రీ సిస్టోలిక్ లోడ్) తగ్గించి హృదయానికి ప్రాణవాయువు అవసరాలను తగ్గిస్తుంది.

ఏస్పిరిన్[మార్చు]

ఏస్పిరిన్ సూక్ష్మరక్తఫలకాల (ప్లేట్ లెట్స్)) గుమికూడడాన్ని నివారిస్తుంది. 325 మి.గ్రా ఏస్పిరిన్ ను నమిలిస్తే అది త్వరితంగా పనిచేస్తుంది.

థీనోపైరిడిన్లు[మార్చు]

క్లొపిడోగ్రెల్, ప్రాసుగ్రెల్ ఈ వర్గానికి చెందిన ఔషధాలు. ఇవి రక్తఫలకాలపై ఉన్న ఎడినొసైన్ డైఫాస్ఫేట్ గ్రాహకాలను  నిరోధించి రక్తఫలకాలు గుమిని అరికడుతాయి. రక్తస్రావ ప్రమాదం లేనివారిలో ఏస్పిరిన్ తో బాటు క్లొపిడోగ్రెల్ కాని, ప్రాసుగ్రెల్ కాని వాడుతారు[9]. శస్త్రచికిత్సతో రక్తప్రసరణను పునరుద్ధరించవలసి వస్తే  రక్తస్రావం ఎక్కువవకుండా ఉండడానికి  క్లొపిడోగ్రెల్ ను శస్త్రచికిత్సకు ఐదు దినాలకు ముందు, ప్రాసుగ్రెల్ ను ఏడు దినాలకు ముందు ఆపివేయాలి.

నైట్రోగ్లిసరిన్  [మార్చు]

గుండెనొప్పి, గుండెపోటు కలిగిన వారికి నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్ ను అందించాలి. గుండె క్రిందిభాగం, కుడి జఠరిక గుండెపోటుకు లోనయినప్పుడు, రక్తపీడనం తక్కువగా ఉన్నపుడు నైట్రోగ్లిసరిన్ వాడకూడదు. వీరిలో రక్తపీడనం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. రక్తపీడనం తక్కువగా లేనప్పుడు గుండెనొప్పి కొనసాగుతున్నపుడు  నైట్రోగ్లిసరిన్ ను సిరల ద్వారా బొట్లుబొట్లుగా ఇస్తారు. నైట్రేటుల వలన హృదయకండరంలో ప్రసరణరహిత మరణం పొందే భాగపు పరిమాణం  తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.

బీటా గ్రాహక అవరోధకాలు    [మార్చు]

బీటా గ్రాహక అవరోధకాలు (బీటా రిసెప్టార్ బ్లాకర్స్) అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటు ఉన్నవారికి వాడుతారు. ఇవి గుండె వేగాన్ని తగ్గించి గుండెకు ప్రాణవాయువు అవసరాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తపీడనం తగ్గించి గుండెకు శ్రమ తగ్గిస్తాయి. వీటిని గుండెవేగం నిమిషానికి 50 కంటె తక్కువ ఉన్నా, ముకుళిత రక్తపీడనం (సిస్టోలిక్ బి పి) 90 మి.మీ.పాదరసము కంటె తక్కువగా ఉన్నా, హృదయ వైఫల్యం ప్రస్ఫుటంగా ఉన్నా, కర్ణిక జఠరికల మధ్య విద్యుత్ ప్రేరణ ప్రసరణకు  2 వ డిగ్రీ అవరోధం ఉన్నా వాడకూడదు. కొకైను వాడకం వలన గుండెపోటు కలిగిన వారిలోను, హృద్ధమనుల దుస్సంకుచితం వలన గుండెనొప్పి కలిగివారిలోను బీటాగ్రాహక అవరోధకాలను వాడకూడదు. బీటాగ్రాహక అవరోధాలు వాడలేని పరిస్థితులలో గుండెనొప్పి కొనసాగుతున్నపుడు నైఫిడిపిన్ తక్క మిగిలిన కాల్సియమ్ ద్వార నిరోధకాలను వాడవచ్చు.

హెపరిన్[మార్చు]

అస్థిరపు గుండెనొప్పి, ఎన్ స్టెమి గుండెపోటు  కలవారిలో అవిభాగ హెపరిన్ కాని, అల్ప అణుభారపు హెపరిన్  కాని వాడుతారు. స్థూలకాయులలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను అల్ప అణుభారపు హెపరిన్ వాడకూడదు[10]. అవిభాగ హెపరిన్ వాడేటపుడు రక్తపరీక్షలతో పార్షియల్ ప్రోథ్రాంబిన్ టైమ్ (పి.టి.టి) గమనిస్తూ మోతాదును సరిదిద్దుతుండాలి. అల్ప అణుభారపు హెపరిన్ వాడేటపుడు రక్తపరీక్షలు, మోతాదు సవరణలు అవసరం ఉండవు.

అస్థిరపు గుండెనొప్పి, ఎన్ స్టెమి కలవారిలో ఔషధాలతో చికిత్స చేస్తూ హృల్లేఖలతో జాగ్రత్తగా వైద్యులు పర్యవేక్షిస్తుంటారు.

ఔషధాలతో గుండెనొప్పులు అదుపులోనికి వచ్చి ఇతర ఉపద్రవాలు కలుగనపుడు, హృదయసూచకాలు  ట్రొపోనిన్, క్రియటినిన్ కైనేజ్ సాధారణ పరిమితులలో ఉన్నప్పుడు కూడా వారికి గుండెపోటులకు కాని ఆకస్మిక మరణాలకు కాని అవకాశాలు ఉంటే హృద్ధమనుల చిత్రీకరణం చేసి, అవసరమైతే, ధమనుల వ్యాకోచ, వ్యాకోచ సాధనాలతో చికిత్సలకు పూనుకోవాలి.      

అంతిమదశ దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యం, కాలేయ వైఫల్యం, అంతిమదశలో ఉన్న ఊపిరితిత్తు వ్యాధులు, చికిత్సలకు అవకాశంలేని వ్యాప్తిచెందిన కర్కటవ్రణాలు వంటి వ్యాధులు వలన ఆయుఃప్రమాణం పరిమితమయినవారికి  ఔషధ చికిత్సలనే కొనసాగించుట మేలు.

గుండెనొప్పులు అదుపులో ఉండకపోయినా, వాటి తీవ్రత హెచ్చినా, రక్తపీడనం బాగా తగ్గి శరీర రక్తప్రసరణకు భంగం చేకూరినా, ప్రమాదకర హృదయలయలు కలిగినా, కొత్తగా ఎడమ జఠరికకు విద్యుత్ప్రేరణ ప్రసరణలో ఆలస్యం (లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్) ఏర్పడినా, కొత్తగా ద్విపత్రకవాటంలో తిరోగమన రక్తప్రసరణ (మైట్రల్ రిగర్జిటేషన్) కలిగినా, వారికి సత్వరంగా చర్మం ద్వారా హృద్ధమనుల చిత్రీకరణతో బాటు  రక్తప్రసరణ పునరుద్ధరణ ప్రయత్నాలను చెయ్యాలి.

ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏస్) ఇన్హిబిటర్లు[మార్చు]

గుండెనొప్పి, గుండెపోటులు కలిగిన వారిలో ఏస్ అవరోధకాలు హృదయం ఆకృతి మార్పుదలలను  తగ్గించి హృదయ వైఫల్యాలను  తగ్గించడానికి తోడ్పడుతాయి[11]. గుండెపోటులు తగ్గించడానికి కూడా ఇవి తోడ్పడుతాయి. ఏస్ అవరోధకాలను వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకాలను వాడుతారు.

స్టాటిన్స్[మార్చు]

గుండెపోటులు, గుండెనొప్పులు కలిగినవారికి స్టాటిన్ మందులు చాలా త్వరగా మొదలుపెట్టాలి. ఇవి హృద్ధమని లోపలిపొర (ఎండోథీలియమ్ ) కార్యాలను, కాఠిన్య ఫలకలను సుస్థిరపరచి గుండెపోటులను తగ్గిస్తాయి. స్టాటిన్ మందులు అల్పసాంద్ర కొలెష్టరాలును తగ్గించి దీర్ఘకాలంలో కూడా హృద్ధమని వ్యాధులను తగ్గిస్తాయి.

ఆల్డోష్టిరోన్  అవరోధకాలు[మార్చు]

గుండెపోటులు కలిగినవారిలో ఎడమ జఠరిక పనితీరులో లోపాలు ఉంటే ఆల్డోష్టిరోన్ అవరోధకాలు స్పైరొనోలాక్టోన్, లేక ఎప్లెరినోన్ ను ఉపయోగిస్తారు. ఇవి పీచుకణజాలం ఏర్పడడాన్ని తగ్గించి హృదయపు ఆకృతి మార్పుదలను తగ్గించి, హృదయ వైఫల్యాన్ని తగ్గిస్తాయి. మూత్రాంగ వ్యాధులు కలవారిలోను, రక్తద్రవంలో పొటాసియం ఎక్కువగా ఉన్నవారిలోను, ఆల్డోష్టిరోన్ అవరోధకాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి[12]. ఆల్డోస్టిరోన్ అవరోధకాలు వాడేటప్పుడు రక్తంలో పొటాసియమ్ విలువలను గమనిస్తూ ఉండాలి

చర్మం ద్వారా హృద్ధమని వ్యాకోచ చికిత్సలతో రక్తప్రసరణ పునరుద్ధరణ (పెర్ క్యుటేనియస్ ఇంటర్ వెంషన్)[మార్చు]

Blausen 0034 Angioplasty Stent01 హృద్ధమనిలో వ్యాకోచ సాధనము

చర్మం ద్వారా ఊరుధమని లోనికి గాని, వెలుపలి ముంజేతి ధమని లోనికి గాని నాళిక చొప్పించి, బృహద్ధమని లోనికి ఆపై హృద్ధమనుల లోనికి ప్రవేశించి వ్యత్యాస పదార్థాలతో హృదయ ధమనుల చిత్రాలు తీసుకొని, హృద్ధమనిలో సంకుచిత భాగాలను బుడగతో వ్యాకోచింపజేసి, వ్యాకోచ సాధనాలను (స్టెంట్స్) అమర్చి రక్త ప్రసరణను పునరుద్ధరించు ప్రక్రియలు విశేషంగా వ్యాప్తిలోనికి వచ్చాయి. STEMI గుండెపోటులు కలవారిలోను, కొత్తగా ఎడమ జఠరికకు విద్యుత్ప్రేరణ ప్రసరణలో ఆలస్యం ( లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ వలన) కలవారిలోను, గుండె వెనుక భాగంలో గుండెపోటు కలిగిన వారిలోను అతిత్వరగా (90 నిముషాలలో) హృద్ధమనులను చిత్రీకరించి, సంకుచిత భాగాలను వ్యాకోచింపజేసి[13], అవరోధాలు తొలగించి, వ్యాకోచ సాధనాలను అమర్చి రక్తప్రసరణను పునరుద్ధరించు ప్రక్రియ మొదలుపెట్టే ప్రయత్నం చెయ్యాలి. ఈ ప్రక్రియల వలన హృదయకండరజాలంలో నష్టంను నివారించుటో, తగ్గించుటో చేయగలుగుతారు. సత్వర హృద్ధమని వ్యాకోచ ప్రక్రియల వలన గుండెపోటులు వచ్చినవారిలో మరణాల సంఖ్యను, తదుపరి ఉపద్రవాలను వైద్యులు తగ్గించగలుగుతున్నారు[14].

రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స[మార్చు]

హృద్ధమనులను వ్యాకోచింపజేసి  వ్యాకోచ సాధనాలను అమర్చు సౌలభ్యం అందుబాటులో లేనపుడు హృద్ధమనులలో ఏర్పడిన రక్తపుగడ్డలను ఔషధాలతో విచ్ఛేదించి రక్తప్రసరణను పునద్ధరించగలిగితే, హృదయకండరంలో ప్రసరణ రహిత మరణానికి గురి అయ్యే భాగపు పరిమాణం తగ్గి, రోగులు బ్రతికే అవకాశాలు చాలా మెరుగవుతాయి. దీనికి రెటిప్లేజ్, టెనెక్టిప్లేజ్ వంటి ఔషధాలను వాడుతారు. అదివరలో మెదడులో రక్తస్రావం  జరిగిన వారిలోను, గత మూడునెలలలో మెదడు రక్తనాళాలలో ప్రమాదాలు (సెరిబ్రోవాస్కులార్ ఏక్సిడెంట్స్ ) కలిగినవారిలోను, మెదడు రక్తనాళపు వ్యాధులు  ఉన్నవారిలోను, బృహద్ధమని విదళనం (అయోర్టిక్ డైసెక్షన్) అవకాశాలు ఉన్నవారిలోను, ఇతర రక్తస్రావవ్యాధులు ఉన్నవారిలోను, గత మూడు నెలలలో తలకు దెబ్బలు తగిలినవారిలోను రక్తపుగడ్డలను విచ్ఛేదించు ఔషధాలను వాడకూడదు. హృద్ధమనులలో రక్తపుగడ్డలను ఔషధాలతో విచ్ఛేదనం చేసిన రోగుల పరిస్థితి స్థిరపడిన తర్వాత వారికి హృద్ధమని చిత్రీకరణం చేసి ఆపై అవసరమయిన చికిత్సలు చెయ్యాలి. అస్థిరపు గుండెనొప్పి, ఎన్ స్టెమి వ్యాధిగ్రస్థులలో గుండెపోటు కలిగే అవకాశాలు ఉంటే వారికి గ్లైకోప్రోటీన్ 2బి / 3ఎ అవరోధకాలు  ఉపయోగపడుతాయి[9]. ఇవి సూక్ష్మరక్తఫలకాలు గుమికూడడాన్ని నిరోధించి నెత్తురు గడ్డలు ఏర్పడడాన్ని అడ్డుకుంటాయి.

అవరోధ అధిగమన శస్త్రచికిత్స (కరోనరీ ఆర్టెరీ బైపాస్ సర్జరీ)[మార్చు]

Blausen 0466 Heart Bypass Surgery

వామహృద్ధమనిలో కాని, వామపూర్వఅవరోహణధమనిలో కాని,  ఎక్కువ ధమనులలో కాని సంకుచితాలు తీవ్రంగా ఉన్నపుడు ఆ అవరోధాలను అతిక్రమించు శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు. ఈ శస్త్రచికిత్సలలో దృశ్యసిరలను (సెఫినస్ వీన్స్), అంతర స్తనధమనులను (ఇంటర్నల్ మమ్మరీ ఆర్టెరీస్ ) ఉపయోగిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్థులలో అవరోధ అధిగమన శస్త్రచికిత్సలు మెఱుగయిన ఫలితాలు ఇస్తాయి. దృశ్యసిర భాగాలను వాడేటప్పుడు వాటి ఒక కొనను బృహద్ధమనికి, రెండవకొనను హృద్ధమనిలో అడ్డు ఉన్న భాగానికి ఆవలి పక్కన సంధానించి హృదయానికి రక్తప్రసరణను పునరుద్ధరిస్తారు. గుండెపోటులో ఎడమజఠరిక గోడకు ద్విపత్రకవాటాన్ని సంధించే పాపిల్లరీ కండరాలకు హాని జరిగి ద్విపత్రకవాటంలో రక్తం తిరోగమనం చెందుట, రెండు జఠరికల నడిమి గోడలో రంధ్రం ఏర్పడడం వంటి ఉపద్రవాలు కలుగుతే సత్వర శస్త్రచికిత్సలు అవసరం.

బృహద్ధమనిలో బుడగ సాధనం (ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్)[మార్చు]

బృహద్ధమనిలో బుడగ

పై సందర్భాలలోను, గుండెపోటుల వలన, ఎడమ జఠరిక బృహద్ధమని లోనికి సమర్థవంతంగా రక్తం ప్రసరించచేయలేనపుడు, రక్తపీడనం తగ్గి (హృదయ జనిత విఘాతం / కార్డియోజెనిక్ షాక్ ) శరీర కణజాలానికి రక్తప్రసరణ తగ్గేతే బృహద్ధమనిలో జఠిరికల ముకుళిత వికాసాలకు ప్రతికూలంగా వికాస ముకుళితాలు పొందు బుడగ సాధనాన్ని అమరుస్తారు[15]. జఠరికలు ముడుచుకున్నపుడు ఈ బుడగ సాధనములో హీలియమ్ గాలి తీసివేయబడుటచే గుండెకు శ్రమ తగ్గుతుంది. శరీరానికి రక్తప్రసరణ సమర్థమంతం అవుతుంది. జఠరికలు వికాసం పొందేటపుడు బుడగ సాధనంలో హీలియమ్ చేరి బుడగ వ్యాకోచించి హృద్ధమనులకు, శరీరానికి రక్తప్రసరణను అందజేయుటకు ఉపకరిస్తుంది .

హృదయలయ సవరణి (ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ / డీఫిబ్రిలేటర్)        [మార్చు]

గుండెపోటు కలిగిన 48 గంటల తర్వాత జఠరిక అతివేగం  కలిగినవారిలోను, ఎడమ జఠరిక ప్రసరణశాతం (ఎడమ జఠరికలో సంపూర్ణవికాసం అప్పుడు ఉన్న రక్తంలో ఎంత శాతం ముడుచుకున్నప్పుడు బృహద్ధమనిలోనికి నెట్టబడుతుందో ఆ రక్తపు శాతం: లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఎజెక్షన్ ఫ్రాక్షన్)  35% కంటె తక్కువ ఉన్నవారిలోను, జఠరిక ప్రకంపనం కలిగి  (జఠరికలు ముడుచుకొనుట, వికసించుట చెందడం మాని, ప్రకంపిస్తే రక్తప్రసరణ జరుగదు) ఆకస్మిక మరణాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. వీరికి హృదయ లయ సవరణి అమర్చితే  మరణ అవకాశాలను తగ్గించగలుగుతారు.

గుండెపోటు నుంచి కోలుకొన్న వారికి చికిత్స[మార్చు]

అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటుల నుంచి కోలుకొన్నవారిలో రక్తపుపోటును, మధుమేహ వ్యాధిని నియంత్రించాలి. వారిచే ధూమపానం మాన్పించాలి. వారి రక్తంలో అల్పసాంద్రపు కొలెష్ట్రాలను 70 మి.గ్రాలు లోపల ఉండునట్లు నియంత్రించాలి. వారికి తగిన వ్యాయామచికిత్స, వ్యాయామపు అలవాట్లు అలవఱచాలి. వారు ఏస్పిరిన్ ను, బీటాగ్రాహక అవరోధకాలను, ఏస్ అవరోధకాలను, స్టాటిన్  ఔషధాలను నిరంతరంగా కొనసాగించాలి. థీనోపైరిడిన్ ను తగినంతకాలం కొనసాగించాలి. గుండెపోటు కలిగిన వారిలో 20 శాతం మందికి మానసిక క్రుంగుదల కలిగే అవకాశం ఉంది . వారి దిగులకు తగిన చికిత్స సమకూర్చాలి[3].

  1. CDC (2021-07-19). "Coronary Artery Disease | cdc.gov". Centers for Disease Control and Prevention (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  2. "Atherosclerosis - What Is Atherosclerosis? | NHLBI, NIH". www.nhlbi.nih.gov (in ఇంగ్లీష్). 2022-03-24. Retrieved 2023-09-01.
  3. 3.0 3.1 3.2 3.3 "Coronary Artery Disease: Symptoms, Causes & Treatment". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  4. "Myocardial ischemia-Myocardial ischemia - Symptoms & causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  5. Johnson, Kenneth C. (2018-01-24). "Just one cigarette a day seriously elevates cardiovascular risk". BMJ (in ఇంగ్లీష్). 360: k167. doi:10.1136/bmj.k167. ISSN 0959-8138. PMID 29367307.
  6. McPherson, Ruth; Tybjaerg-Hansen, Anne (2016-02-19). "Genetics of Coronary Artery Disease". Circulation Research (in ఇంగ్లీష్). 118 (4): 564–578. doi:10.1161/CIRCRESAHA.115.306566. ISSN 0009-7330.
  7. "Coronary artery disease - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  8. Hofmann, Robin; James, Stefan K.; Jernberg, Tomas; Lindahl, Bertil; Erlinge, David; Witt, Nils; Arefalk, Gabriel; Frick, Mats; Alfredsson, Joakim; Nilsson, Lennart; Ravn-Fischer, Annica; Omerovic, Elmir; Kellerth, Thomas; Sparv, David; Ekelund, Ulf (2017-09-28). "Oxygen Therapy in Suspected Acute Myocardial Infarction". New England Journal of Medicine (in ఇంగ్లీష్). 377 (13): 1240–1249. doi:10.1056/NEJMoa1706222. ISSN 0028-4793.
  9. 9.0 9.1 Committee Members; Braunwald, Eugene; Antman, Elliott M.; Beasley, John W.; Califf, Robert M.; Cheitlin, Melvin D.; Hochman, Judith S.; Jones, Robert H.; Kereiakes, Dean; Kupersmith, Joel; Levin, Thomas N.; Pepine, Carl J.; Schaeffer, John W.; Smith, Earl E.; Steward, David E. (2002-10). "ACC/AHA Guideline Update for the Management of Patients With Unstable Angina and Non–ST-Segment Elevation Myocardial Infarction—2002: Summary Article: A Report of the American College of Cardiology/American Heart Association Task Force on Practice Guidelines (Committee on the Management of Patients With Unstable Angina)". Circulation (in ఇంగ్లీష్). 106 (14): 1893–1900. doi:10.1161/01.CIR.0000037106.76139.53. ISSN 0009-7322. {{cite journal}}: Check date values in: |date= (help)
  10. Lim, Wendy; Dentali, Francesco; Eikelboom, John W.; Crowther, Mark A. (2006-05-02). "Meta-Analysis: Low-Molecular-Weight Heparin and Bleeding in Patients with Severe Renal Insufficiency". Annals of Internal Medicine (in ఇంగ్లీష్). 144 (9): 673. doi:10.7326/0003-4819-144-9-200605020-00011. ISSN 0003-4819.
  11. Ohman, E. Magnus (2016-03-24). Solomon, Caren G. (ed.). "Chronic Stable Angina". New England Journal of Medicine (in ఇంగ్లీష్). 374 (12): 1167–1176. doi:10.1056/NEJMcp1502240. ISSN 0028-4793.
  12. "DailyMed - ALDACTONE- spironolactone tablet, film coated". dailymed.nlm.nih.gov. Retrieved 2023-09-01.
  13. "Percutaneous Coronary Intervention (PCI): Practice Essentials, Background, Indications". 2021-10-17. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  14. Ancha 5, Siri 5 (2023). The Washington Manual of Medical Therapeutics. Mexico: Washington University in St.Louis. pp. 134–135. ISBN 978-1-975190-62-0.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Nickson, Chris (2019-01-05). "Intra-Aortic Balloon Pump Overview". Life in the Fast Lane • LITFL (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-01.