స్థూల కాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్థూలకాయం గల పురుషుని శరీరం. బాడీ మాస్ ఇండెక్స్ 46 kg/m2: బరువు 146 కె.జి (322 lb), ఎత్తు 177 సెం.మీ (5 ft 10 in)

స్థూల కాయం[1] (Obesity) అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి. [2] ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. [3]. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, కొన్ని సార్లు వారసత్వం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.

వర్గీకరణ[మార్చు]

బాడీ మాస్ ఇండెక్స్    కొలవడానికి సూత్రం.

ఇక్కడ '' m '' అంటే బరువు ఇంకా '' h '' అంటే ఎత్తు.

బాడీ మాస్ ఇండెక్స్[మార్చు]

BMI Classification
< 18.5 తక్కువ బరువు
18.5–24.9 సాధారణ బరువు
25.0–29.9 అతి బరువు
30.0–34.9 మొదటి తరగతి స్థూలకాయం
35.0–39.9 రెండవ తరగతి స్థూలకాయం
> 40.0   మూడవ తరగతి స్థూలకాయం  


నివారణ మార్గాలు[మార్చు]

స్థూలకాయము, ఎక్కువ బరువులను నివారించు మార్గములు:

తక్కువ ఆహారము తక్కువ కాలరీలను గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనములు భుజించుట వలన కాలరీలు ఎక్కువగా గ్రహించుట జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ ఉంటాయి.

ఆహారములో కాలరీల తగ్గింపు:

అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. చక్కెర లేని శీతల పానీయములు 0 కాలరీలవి వాడుకొనవచ్చును. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణ ధాన్యములు వినియోగించుకొని సంస్కరణ ధాన్యాల వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కిన మాంసాలను వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. మద్యము వాడుకను మితపరచుకోవాలి.

వ్యాయామముతో కాలరీల ఖర్చు పెంచుట:

జీవన శైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ ఉన్న కాలరీలను కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుక తగ్గించుకోవాలి. బయట నడచుటకు అవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరములకు ఎదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో, క్రమశిక్షణతో బరువు తగ్గగలరు.

ఔషధములు:

ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులు ఉన్నాయి. వాడుకలో ఉన్న మందులు ఆర్లిస్టాట్ , లార్కసెరిన్, లిరగ్లూటైడ్ , ఫెంటెరమిన్ / టోపిరమేట్, నల్ ట్రెక్సోన్ / బూప్రోపియన్ లు. ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణమును అరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీత ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఈ మందుల వలన దీర్ఘకాలిక ప్రయోజనము, దీర్ఘకాలము వాడుట వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు.

శస్త్రచికిత్సలు[మార్చు]

బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మతలు ఉన్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

జఠర బంధన చికిత్స:

భార సూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మిత ఆహార, వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠర బంధన చికిత్సలు అవసరము అవవచ్చును. ఉదరాంతర దర్శనము ద్వారా ( లేపరోస్కోపి ) జీర్ణాశయము చుట్టూ పట్టీ అమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపు తిత్తి కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజ లవణముల గ్రహించబడుతాయి. జఠర బంధన పరిమాణమును మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును.

జఠర ఛేదన:

ఈ శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలా భాగమును తొలగిస్తారు. జఠరములో చిన్న తిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. లేక నిలువుగా చాలా భాగమును తొలగించి జీర్ణాశయ పరిమాణములో కొంత భాగమునే ఉంచవచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజ లవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అఱుదు అయిపోయాయి.

కడుపు బుడగ, జఠర బుద్బుదము:

తాత్కాలికముగా జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను అంతర్దర్శిని (ఎండోస్కోప్ ) ద్వారా నిలిపి ఆరు మాసములలో తొలగించి ఆకలి తగ్గించి బరువును తగ్గింపవచ్చును.

ఎక్కువ బరువు లక్షణాలు పిన్నవయస్సులోనే పొడచూపుతాయి కనుక తల్లిదండ్రులు పూనుకొని పిల్లలను ఆరోగ్యకరమైన మితాహారములో ఉంచి, వారికి తగిన వ్యాయామము, క్రీడలు సమకూర్చి శ్రద్ధ వహిస్తే చాలా వఱకు అధిక భారములను, స్థూలకాయములను నివారింపగలుగుతాము.

మూలాలు[మార్చు]

  1. "Obesity and overweight". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2020-05-06.
  2. WHO 2000 p.6
  3. WHO 2000 p.9