సమాజసేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌతం కుమార్ చిచిలీ చేస్తున్న సమాజ సేవ

చెరువు కానీ, సరస్సు కానీ, బావి కానీ, కాలువ అయినా సరే తవ్విస్తే అమితమైన పుణ్యఫలాలు దక్కుతాయంటోంది నారద పురాణం. స్వయంగా నిర్మించినా, లేదంటే ఇంకొకరు నిర్మించేటప్పుడు అందుకు సహకరించినా, తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నవారంతా లక్ష కోట్ల తరాల వరకూ, మూడు కల్పాల కాలం వరకూ విష్ణులోకంలో నివసించొచ్చు. చెట్లు పెంచితే దివ్యదేహాన్ని ధరించి ఉత్తమ విమానాన్ని అధిరోహించి, మూడు కల్పాల పాటు విష్ణులోకంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు. అక్కడ రెండు కల్పాల పాటు నివసించి, అక్కడి నుంచి స్వర్గానికి చేరి ఒక కల్పం పాటు ఉండి అనంతరం యోగులలో జన్మించి చివరగా ముక్తిని పొందేంత పుణ్యం లభిస్తుంది. చివరకు వేతనం తీసుకొని అయినా సరే అలా సేవ చేసిన వ్యక్తికి కూడా పుణ్యఫలమే ప్రాప్తిస్తుంది. సరస్సును నిర్మిస్తే ఒక చెరువును నిర్మించినందు వల్ల కలిగే పుణ్యఫలంలో సగం పుణ్యం లభిస్తుంది. బావిని నిర్మిస్తే చెరువును నిర్మించిన దానిలో నాలుగో భాగం పుణ్యఫలం లభిస్తుంది. దిగుడు బావిని నిర్మిస్తే పద్మాలు నిండిన మంచి సరస్సును నిర్మించిన పుణ్యఫలితం దక్కుతుంది. అదే చక్కగా నీరు ప్రవహించేందుకు అనువుగా ఉండే కాలువను తవ్వించిన వ్యక్తికి బావిని నిర్మించినందువల్ల కలిగే పుణ్యఫలం కన్నా నూరు రెట్ల పుణ్యఫలం దక్కుతుంది.


ధనవంతుడు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే వచ్చే పుణ్యఫలం, పేదవాడు పుణ్యకార్యం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా దక్కే పుణ్యఫలం సమానంగానే ఉంటుంది. ధనవంతుడు ఒక నగరాన్ని దానం చేసినా పేదవాడు ఒక మూర భూమిని దానం చేసినా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలమే లభిస్తుంది. అలాగే ధనవంతుడు చెరువును నిర్మించినా, పేదవాడు చిన్న బావిని తవ్వించినా ఒకే పుణ్యం కలుగుతుంది. దారిన పోయే బాటసారుల కోసం లేదంటే ఇతర ప్రాణులకు నీడనిచ్చేలా ఉండేందుకు సత్రాలను, ఆశ్రమాలను నిర్మించిన వాడు మూడు తరాల వరకూ బ్రహ్మలోకార్హతను పొందుతాడు. ఆ ఆశ్రమాల వద్ద పెంచిన చెట్ల నీడలలో ఒక ఆవు కానీ, ఒక పేద పండితుడు కానీ అరక్షణం విశ్రాంతి తీసుకొన్నా చాలు అవి నిర్మించిన వ్యక్తి దేహాంతంలో స్వర్గాన్ని పొందుతాడు. ఆరామం, చెరువు, గ్రామం లాంటి వాటిని నిర్మించిన వారు శ్రీహరితో సమానంగా పూజలందుకొనేంత పుణ్యఫలాన్ని పొందుతారు. ప్రజలకు ఉపకరించేందుకు పూలతోటను ఏర్పాటు చేసిన వారు ఆ తోటలోని చెట్ల ఆకులు, పండ్ల సంఖ్యతో సమానమైనంత కాలం పాటు స్వర్గంలో ఉండగలుగుతారు. అలాంటి పూలతోను శుభ్రం చేస్తూ చెట్లకు పాదులు చేసిన వారు, ఆ తోటకు చుట్టూ గోడను నిర్మించిన వారు డెభ్బై ఒక్క యుగాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తారు. నీడనిచ్చే మొక్కను నాటిన వారు ఏడుకోట్ల తరాల వరకు తన తల్లి, తండ్రి వైపున ఉండేవారందరూ నూరు కల్పాల పాటు నారాయణ లోకంలో ఉండేందుకు తగినంత పుణ్యఫలాన్ని సంపాదించుకొంటారు. చారెడు నీళ్లు పాదులో పోసినా సూర్యచంద్రులున్నంత వరకూ విష్ణువుతో ఉండే పుణ్యం లభిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సమాజసేవ&oldid=4340031" నుండి వెలికితీశారు