సవీరా ప్రకాష్
సవీరా ప్రకాష్ | |
---|---|
జననం | 1997 బునెర్, పాకిస్తాన్ |
జాతీయత | పాకిస్తాన్ |
డా. సవీరా ప్రకాష్ (ఆంగ్లం: Saveera Parkash) వృత్తిరీత్యా వైద్యురాలు. 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలలో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగిన తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు పొందింది.[1] మైనారిటీ కమ్యూనిటీ నుండి వచ్చిన మొదటి మహిళా అభ్యర్థిగా ఆమె అవతరించింది. పాకిస్థాన్ రాజకీయాల్లోకి హిందూ మహిళ ప్రవేశం ఏకంగా అక్కడ అతిపెద్ద పార్టీలలో ఒకటైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ద్వారా జరిగింది.
ఆమె ప్రస్తుతం బునేర్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తోంది.
నేపథ్యం
[మార్చు]ఆమె తండ్రి డాక్టర్ ఓం ప్రకాశ్ భారతదేశం మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన వైద్యుడు, హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. పేదలకు ఉచిత వైద్యం అందించే వైద్యుడిగా ఆయనకు పేరుంది. ఆయన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లో సుమారు నాలుగు దశాబ్దాలుగా సభ్యుడిగా కొనసాగుతున్నా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. అయితే, సవీరా ప్రకాష్ దానికి భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచింది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. పష్తూన్‌లు అంటే పష్తూ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే బునెర్ ప్రాంతం, భారతదేశం, పాకిస్తాన్ విభజనకు ముందు స్వాత్ రాజసంస్థానంలో భాగంగా ఉండేది. ఈ బునెర్ జిల్లా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు ఉత్తరంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉంది.
అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించే సమయంలో ఆమె బనర్ పీపీపీ మహిళా విభాగానికి కార్యదర్శిగా చేసింది. కళాశాలలో వసతుల లేమి, తన రాజకీయ ప్రవేశానికి కారణంగా ఆమె చెప్తుంది.
2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు
[మార్చు]జాతీయ అసెంబ్లీలోని 336 మంది సభ్యులు 266 సాధారణ స్థానాలను కలిగి ఉంటారు, మొదటి-పాస్ట్-ది-పోస్ట్ సింగిల్-సభ్య నియోజకవర్గాలలో ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు, 60 సీట్లు ప్రతి ఒక్కరు గెలిచిన సాధారణ స్థానాల సంఖ్య ఆధారంగా దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నికైన మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రతి ప్రావిన్స్‌లో పార్టీ, ప్రతి పార్టీ గెలుచుకున్న మొత్తం జనరల్ సీట్ల సంఖ్య ఆధారంగా దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నికైన ముస్లిమేతరులకు పది సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ పదవీకాలం 5 సంవత్సరాలు. చివరి పార్లమెంటరీ ఎన్నికలు 2018 జూలై 25న జరిగాయి. ప్రస్తుత గడువు ముగియడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 336 సీట్లలో 266 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులు ఎన్నుకోబడతారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో పాకిస్తాన్‌లోని 4 ప్రావిన్సులలో ప్రతి రాజకీయ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య ఆధారంగా మహిళలకు రిజర్వు చేయబడిన 60 సీట్లు కేటాయించబడ్డాయి.
16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. వివరణాత్మక షెడ్యూల్‌ను 2023 డిసెంబరు 15న పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం తాజా కీలక సవరణలలో, సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి అనే నిబంధన ఒకటి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సవీరా ప్రకాష్ 2023 డిసెంబరు 23న పీకే-25 జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను సమర్పించింది. ఆమె వైద్య వృత్తిలో ఉన్న కారణంగా ప్రజా సేవ చేయడం సులభం అని, ఒక వైద్యురాలిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్వాన్నమైన పరిస్థితులను గమనించిన తాను వాటిని మెరుగు పరచడానికి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలనే కోరిక బలపడిందని తెలిపింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇమ్రాన్ నోషాద్ ఖాన్ సవేరా సవీరా ప్రకాష్ కి తన మద్దతును పలికాడు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకారం, జాతీయ అసెంబ్లీలోని 1,085 స్థానాలకు, నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలకుగాను మొత్తం 28,626 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. జాతీయ అసెంబ్లీలోని 266 స్థానాలకు 471 మంది మహిళలు సహా 7,713 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "పాక్ ఎన్నికల బరిలో.. ఎవరీ సవీరా ప్రకాష్? | Saveera Parkash Indian Hindu Daughter Filed Nomination Pakistan Elections 2024 - Sakshi". web.archive.org. 2024-02-12. Archived from the original on 2024-02-12. Retrieved 2024-02-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)