బొమ్మలను ఎక్కించడానికి అత్యుత్తమ ప్రదేశం వికీమీడియా కామన్స్. అక్కడ చేర్చిన బొమ్మలను వివిధ భాషల్లోని వికీపీడియాలన్నీ వాడుకోవచ్చు. అలాగే వికీపీడియాకు చెందిన సోదర ప్రాజెక్టులు, బయటి వెబ్సైట్లు అన్నీ వాడుకోవచ్చు.
కామన్సు లోకి బొమ్మలను ఎక్కించేందుకు కామన్స్ ఎక్కింపు విజార్డు ఉపకరణాన్ని వాడవచ్చు. ఎక్కింపు వ్యవహారమంతా అదే మిమ్మలని చేయిస్తుంది.
ఒక ముఖ్యమైన నియమం ఉందిక్కడ: కామన్సు ఉచిత, స్వేచ్ఛా లైసెన్సు ఉన్న బొమ్మలనే స్వీకరిస్తుంది. దానర్థం, మీకు అంతర్జాలంలో కనిపించే బొమ్మలు చాలావరకూ ఎక్కించేందుకు పనికిరావు - అవి స్వేచ్ఛగా, ఉచితంగా లభించేవి కావు కాబట్టి.
అయితే, ఉచితంగా లభించని బొమ్మలను, సముచిత వినియోగం కిందకు వచ్చే బొమ్మలనూ వాడదగ్గ సందర్భాలు వికీపీడియాలో కొన్ని ఉన్నాయి. బొమ్మ ఉంటే వ్యాస విషయాన్ని పాఠకులు మరింత చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నపుడు, ఉచితంగా బొమ్మ ఏదీ లభించనపుడు, దాన్ని వికీలో వాడినంత మాత్రాన, స్వంతదారుకు వ్యాపార నష్టమేమీ కలగని సందర్భాల్లో ఆ బొమ్మలు వాడవచ్చు. దీనికి ఉదాహరణలు ఏంటంటే.. సంస్థల లోగోలు, వెబ్పేజీల తెరపట్టులు మొదలైనవి.
ఉచితం కాని బొమ్మను ఎక్కించేందుకు దస్త్రం ఎక్కింపు విజార్డును వాడండి. దాని ద్వారా బొమ్మకు సంబంధించిన సమాచారాన్నంతటినీ చేర్చే వీలుంటుంది. పేజీకి ఎడమవైపున ఉన్న పరికరాల పెట్టె లింకుల్లో దస్త్రం ఎక్కింపు లింకు ఉంటుంది.