వికీపీడియా ఓ విజ్ఞానసర్వస్వం. ఇందులో కచ్చితత్వం కోసం ఇక్కడి సముదాయం సర్వదా కృషి చేస్తూంటుంది. వ్యాసాలు తటస్థ దృక్కోణంతో ఉండాలి. వాటిలో నిర్ధారించుకోదగ్గ సమాచారం మాత్రమే ఉండాలి. ఆ సమాచారం విశ్వసనీయ మూలాల్లో ఈసరికే ప్రచురితమై ఉండాలి.
తటస్థ దృక్కోణం అంటే సమాచారాన్ని ఏ పక్షపాతమూ లేకుండా కేవలం వస్తుగతంగా, వాస్తవాలను ప్రతిబింబిస్తూ రాయడమే. సార్వత్రిక విజ్ఞానసర్వస్వంలో వ్యాసాలు ఏదో ఒక దృక్కోణానికి అనుగుణంగా ఉండకూడదు. తటస్థ దృక్కోణాన్ని సాధించేందుకు చేసే కృషి, వ్యాసాలు వ్యాపార ప్రకటనలుగానో ప్రచారం గానో మారిపోకుండా నివారిస్తుంది.
నిర్ధారత్వం అంటే.., ఈ సరికే విశ్వసనీయమైన మూలాల్లో (వార్తా పత్రికలు, శాస్త్రీయ పత్రికలు వగైరా) ప్రచురింపబడిన సమాచారాన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాల్లో చేర్చాలి. సమాచారమంతటికీ మూలాలుంటే మంచిది. కానీ వివాదాస్పదమైన లేదా సవాలు చేసే అవకాశం ఉన్న సమాచారానికి మాత్రం ఖచ్చితంగా మూలం అవసరం! మూలాల్లేని సమాచారాన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. విశ్వసనీయమైన మూలాలున్న సమాచారాన్ని మాత్రమే చేర్చడం వాడుకరి బాధ్యత.
మౌలిక పరిశోధన కూడదు అంటే వ్యాసాలలో గతంలో ఎక్కడా ప్రచురితమవని వాదనలు, భావనలు, డేటా, అభిప్రాయాలు లేదా సిద్ధాంతాలను వికీలో రాయకూడదు. వికీపీడియా వాడుకరులు తమ సొంత విశ్లేషణలు, సంశ్లేషణలను వ్యాసాలలో చేర్చరాదు. ప్రాథమికంగా, వికీపీడియా అంటే ఈసరికే ఉనికిలో ఉన్న, ఎక్కడో ఒకచోట వ్యక్తపరచబడిన మానవ విజ్ఞానపు, దృక్కోణాల, సారాంశాల రికార్డు మాత్రమే.