సారమతి గవీంద్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సారమతి గవీంద్రులు అంటూ ప్రారంభమయ్యే పద్యం ఆంధ్ర మహాభారత అవతారికలోనిది. ఈ పద్యాన్ని ఆదికవి నన్నయ్య రాశారు. తాను రాసే కవిత్వాన్ని, తన కవిత్వ లక్షణాలను నిర్వచించుకుంటూ నన్నయ్య రాసిన ఈ పద్యం సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది.

పద్యం

[మార్చు]

ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లో
నారసి మేలునా నితరు లక్షర రమ్యత నాదరింప నా
నారుచి రార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె జగద్ధితంబుగన్.

తాత్పర్యం

[మార్చు]

సారమైన బుద్ధితో కవీంద్రులైనవారు ఆదరించేలా ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఇతరులంతా ఆదరించేలా అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తినిధి అనే లక్షణాలతో నన్నయభట్టు మహా భారత సంహితా రచనను తెలుగులో జగత్తుకు మేలుకూర్చేందుకు ఒప్పేలా రాస్తానని చెప్తున్నారు ఈ పద్యంలో.

విశేషాలు

[మార్చు]

విశేషమైన కొత్తరీతుల్లో కవిత్వం చెప్పిన కవులందరూ తమ కవిత్వం యొక్క లక్షణాలు వివరిస్తూ కొన్ని పద్యాలు రాసే అలవాటు ఉంది.[1] అలాంటిది తెలుగు సాహిత్యానికే ఆదికావ్యం వ్రాస్తున్న క్రమంలో నన్నయ్య తన పీఠికలో తన కవితా లక్షణాలను తానే వివరిస్తూ ఈ పద్యం రాశారు. తన కవిత్వంలో కనిపించే లక్షణాలుగా మూడిటిని రాసుకున్నారు నన్నయ్య[2]:

  1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి
  2. అక్షర రమ్యత
  3. నానారుచిరార్థ సూక్తి నిధిత్వం

కవి తాను ముందుగా సూచించిన తన కవిత్వ లక్షణాలను పరిశీలించే విమర్శ సిద్ధాంతం ప్రకారం ఈ మూడు లక్షణాలను పలువురు విమర్శకులు నన్నయ్య కవిత్వంలో పరిశీలించారు. విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్న లక్షణాన్ని పరిశీలిస్తూ నన్నయ్యగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే విమర్శగ్రంథాన్ని రచించారు. మరెందరో రచయితల పీఠికల్లోనూ ఈ పద్యంలోని కవిత్వ లక్షణాలు ప్రాచుర్యం పొందాయి.

రాణి సుబ్బయ్య దీక్షితులు ఈ పద్యంలోని "జగద్ధితంబుగన్" అనే మాటను విశ్లేషిస్తూ, "భారత రచన చెయ్యడంలో వ్యాసమహర్షి దృక్పథం ధర్మం. నన్నయకు మాత్రం సమాజం ముఖ్యం. జగద్ధితంబుగన్ అనే మాటద్వారా మొత్తం మానవకోటి కల్యాణం కోసం నేను భారత రచన ప్రారంభిస్తున్నాను అని నన్నయ చెప్పాడు"[3] అని వివరించారు.

మూలాలు

[మార్చు]
  1. వెల్చేరు, నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. తానా ప్రచురణలు.
  2. విశ్వనాథ, సత్యనారాయణ (2007). సాహిత్య సురభి (2 ed.). విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్. p. 9.
  3. "Pravachanas in 02 Sabha Parvam (Audio files) - part 01 (8:20 min) and Part 02 (9:51 min)". ప్రవచనం.కామ్. Archived from the original on 2015-06-12. Retrieved 2016-10-28.