సింహాసన ద్వాత్రింశిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహాసన ద్వాత్రింశిక
కృతికర్త: కొరవి గోపరాజు
సంపాదకులు: వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాకావ్యం
ప్రచురణ: ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ
విడుదల: 1936
పేజీలు: 490


సింహాసన ద్వాత్రింశిక 15వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు రచించిన పద్యకావ్యము. ఇది మూల సంస్కృత రచన నుండి అనువాదం చేయబడినది. ఇందు విక్రమార్కుని దివ్యసింహాసన సోపానములపై ఉన్న 32 సాలభంజికలు భోజరాజునకు చెప్పిన కథలున్నవి. ఇందులో 11 ఆశ్వాసాలలో 32 కథలు పద్యరూపంలో వున్నాయి.

కథాకావ్యాంశాలు[మార్చు]

కైలాసమునందు గౌరిదేవి శంకరుని కథ చెప్పుమనును; శివుడు భోజరాజునకు సింహాసన సాలభంజికలు 32 చెప్పిన కథలు చెప్పెదను వినుమని చెప్పదొడగేను.

ఉజ్జయినీ పురమును చంద్రగుప్తుని పుత్రుడు భర్తృహరి పాలించుచుండెను. అతని భార్య అనంగసేన. ఆమె చెడు వర్తనము వలన విరక్తుడై విక్రమార్కునకు రాజ్యము కట్టి వెళ్ళెను. విక్రమార్కుడు మహాకాళుని గూర్చి తపమొనర్చి మెప్పించి ఒక సంవత్సరము మీద ఒక దినము వయసుగల కన్యకు బుట్టిన వానితో మాత్రమే చావు కలుగునట్లు వరము పొందెను. భట్టి చాతుర్యము వలన 2 వేల యేండ్లు బ్రతుకును; బేతాళుని వశము చేసికొనును, స్వర్గమునకు పోయి రంభా ఊర్వశుల నృత్య విశేషములు వివరించి ఇంద్రునిచే దివ్య సింహాసనము సంపాదించెను. చివరకు ప్రతిష్టానపురము నందలి శాలివాహనుడను బాలునిచే మరణించును. అశరీరవాణి చెప్పినట్లు ఆ సింహాసనమును విక్రమార్కుని మంత్రులు భూమిలో పాతిపెట్టి ఆ భూమినొక బ్రాహ్మణునకు దానమిచ్చెదరు. ఆ భూమిలో ఆ బ్రాహ్మణవంశీయుడు మంచె వేసికొని చేనులో పైరుపెట్టి కావలి యుండును. భోజరాజు సైన్యములతో నచటికి రాగా మంచెపై ఉండి ఆహ్వానించును. మంచె దిగి దూషించును. భోజరాజు ఆ భూమిని కొని, మంచె ఉన్నచోట త్రవ్వింపగా సింహాసనము కనబడును, ఎంత ప్రయత్నించినను ఆది వెలికిరాదు. మంత్రి సలహా మేరకు శాంతులు చేయగా వెలికి వచ్చును. మంత్రి ఆవశ్యకతను తెలుపు బహుశ్రుత్రుని (ససేమిరా) కథ, ఏకలునికథ, వులిపులుగు కథ చెప్పబడినవి.

భోజరాజు శుభదినమున సింహాసన మెక్కబోగా మొదటిమెట్టుపై ఉండిన బొమ్మ భోజుని ఆపి విక్రమార్కుని వంటి సాహసౌదార్యములు కలవాడే ఈ సింహాసమెక్కుటకు అర్హుడని చెప్పును. ఇట్లే తక్కిన 31 బొమ్మలును ఒక్కొక్క కథ చెప్పును.

ప్రచురణలు[మార్చు]

దీనిని ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ 1936లో ప్రధమభాగము ముద్రించినది.[1] వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి దీనికి సంపాదకత్వం వహించారు. అనంతరం 1982 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు వారు తిరిగి ముద్రించారు.[2] దీనికి గడియారం రామకృష్ణ శర్మ సంపాదకత్వం వహించి విపులమైన పీఠికను రచించారు.

విషయసూచిక[మార్చు]

  • ప్రథమాశ్వాసము: కృత్యాది, దేవతాస్తోత్రాదికము, కవివంశావతారవర్ణనము, కథా ప్రారంభము, విక్రమార్కుని చరిత్రము, భోజరాజు సింహాసనమును త్రవ్వితీయించుట, బహుశ్రుతుని కథ
  • ద్వితీయాశ్వాసము: మొదటిబొమ్మ కథ, సుదర్శనుని కథ, చతురంగతజ్ఞుని కథ, రెండవబొమ్మ కథ, మూఁడవబొమ్మ కథ, గౌళికుని కథ
  • తృతీయాశ్వాసము: నాలుగవబొమ్మ కథ, ఐదవబొమ్మ కథ, ఆఱవబొమ్మ కథ
  • చతుర్థాశ్వాసము: ఏడవబొమ్మ కథ, ఎనిమిదవబొమ్మ కథ, శంఖపాలుని కథ, తొమ్మిదవబొమ్మ కథ
  • పంచమాశ్వాసము: పదవబొమ్మ కథ, పదునొకొండవబొమ్మ కథ, జీమూతవాహనుచరిత్రము, పండ్రెండవబొమ్మ కథ
  • షష్ఠాశ్వాసము: పదుమూఁడవబొమ్మ కథ, బ్రహ్మరాక్షసుని కథ, పదునాల్గవబొమ్మ కథ, రాజశేఖరుని కథ, పదునైదవకథ
  • సప్తమాశ్వాసము: పదాఱవబొమ్మ చెప్పినకథ, పదునేడవబొమ్మ కథ, పదునెనిమిదవ బొమ్మకథ
  • అష్టమాశ్వాసము: పందొమ్మిదవ బొమ్మకథ, ఇరువదియవబొమ్మకథ, ఇరువదియొకటవ బొమ్మకథ
  • నవమాశ్వాసము: ఇరువదిరెండవ బొమ్మకథ, ఇరువదిమూఁడవ బొమ్మకథ, ఇరువదినాలుగవ బొమ్మకథ
  • దశమాశ్వాసము: ఇరువదియైదవ బొమ్మకథ, ఇరువదియాఱవ బొమ్మకథ, ఇరువదియేడవ బొమ్మకథ, మతిమంతుని కథ
  • ఏకాదశాశ్వాసము: ఇరువదియెనిమిదవ బొమ్మకథ, ఇరువదితొమ్మిదవ బొమ్మకథ, ముప్పదియవ బొమ్మకథ
  • ద్వాదశాశ్వాసము: ముప్పదియొకటవ బొమ్మకథ, వజ్రముకుటుని కథ, ముప్పదిరెండవ బొమ్మకథ

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. కొరవి గోపరాజు (1936). సింహాసన ద్వాత్రింశిక (in Telugu). కాకినాడ: ఆంధ్ర సాహిత్య పరిషత్తు. Retrieved 22 August 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. కొరవి గోపరాజు (1982). సింహాసన ద్వాత్రింశిక (in Telugu) (First ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. Retrieved 22 August 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)