సిరికిం జెప్పడు (పద్యం)
సిరికిం జెప్పడు అనేది బమ్మెర పోతన రచించిన భాగవతంలోని ప్రసిద్ధిచెందిన తెలుగు పద్యం.
పద్యం
[మార్చు]
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై...భా.8-96-మ.
sirikiM jeppa@MDu; SaMkha chakra yugamuM jaedOyi saMdhiMpa@M; Dae
parivaaraMbunu@M jeera@M 'DabhragapatiM banniMpa@M' DaakarNikaaM
tara dhammillamu@M jakka notta@MDu; vivaada prOtthita Sree kuchO
parichaelaaMchalamaina veeDa@MDu gajapraaNaavanOtsaahiyai.
ప్రతిపదార్థము
[మార్చు]- సిరి = లక్ష్మీదేవి
- కిన్ = కైనను
- చెప్పడు = చెప్ప లేదు
- శంఖ = శంఖము
- చక్ర = సుదర్శన చక్రము
- యుగమున్ = జంటను
- చేదోయి = చేతులు రెంటి యందు
- సంధింపడు = ధరించుట లేదు
- ఏ = ఏ
- పరివారంబునున్ = సేవకులను
- చీరడు = పిలువ లేదు
- అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగముల (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}
- పన్నింపడు = సిద్ధపరుప నియమించడు
- ఆకర్ణిక = చెవి దుద్దుల
- అంతర = వరకు జారినట్టి
- ధమిల్లమున్ = జుట్టు ముడిని
- చక్కనొత్తడు = చక్కదిద్ధుకొనుట లేదు
- వివాద = ప్రణయకలహము నందు
- ప్రోత్థిత = పైకిలేపిన
- శ్రీ = లక్ష్మీదేవి యొక్క
- కుచ = వక్షము
- ఉపరి = మీది
- చేలాంచలము = చీర కొంగు
- ఐనన్ = అయినను
- వీడడు = వదలిపెట్టుట లేదు
- గజ = గజేంద్రుని
- ప్రాణ = ప్రాణాలను
- ఆవన = కాపాడెడి
- ఉత్సాహి = ఉత్సాహము కలవాడు
- ఐ = అయ్యి.
తాత్పర్యం
[మార్చు]గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు.
బయటి లింకులు
[మార్చు]- గీతం.కాం లో సిరికిం జెప్పడు పద్యం ఆడియో. Archived 2014-04-15 at the Wayback Machine