బమ్మెర పోతన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బమ్మెర పోతన

బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

జననం

[మార్చు]

అతను నేటి జనగామ జిల్లా లో ని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు.[1] అతని అన్న తిప్పన. ఇతను బమ్మెర వంశానికి చెందివాడు, శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి “సోమనాథుడు”.అతను ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.

భాగవత రచన

[మార్చు]

తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు.బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయ్యాయి.[2]

కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కల చెరువు క్రింద "పోతన మడి" ఉంది.

అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించాడని అభిప్రాయపడ్డాడు. కాని, అతని భాగవత రచనను రాచకొండలో ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేసాడు.[2]

పోతన
పోతన

ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.

ఇతర రచనలు

[మార్చు]
పోతన చిత్రపటం

యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచన చేశాడు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాసాడు. దానశీలము అనే ఒక పద్యాన్ని రాసాడు.

పోతన - శ్రీనాధుడు

[మార్చు]

పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది. కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరి మధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి.

కవిత్వం-విశ్లేషణ

[మార్చు]

పోతన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభం పలికి రచన ఆరంభించిన సుగుణశీలి అతను. సి.నారాయణరెడ్డి వ్యాసం భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యంలో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.

డిజిటల్ మ్యూజియం

[మార్చు]

వరంగల్లులోని పోతన విజ్ఞాన పీఠంలో బమ్మెర పోతన పేరుమీద బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం ఉంది.[3] మహాకవి బమ్మెర పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్‌ చేసి, భావితరాలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది.[4]

పోతన స్మృతివనం

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బమ్మెర గ్రామంలో పోతన స్మృతివనం నిర్మించబడుతోంది. అప్పటి ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2017 ఏప్రిల్‌ 28న బమ్మెరలో పోతన స్మృతివనం ఏర్పాటుపనులకు శంకుస్థాపన చేశాడు.[5] ఇక్కడ పోతనామాత్యుని భారీ విగ్రహం, పోతన మ్యూజియం, థియేటర్‌, స్మృతివనం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్‌ ఏర్పాటుచేస్తున్నారు.[6] పోతన సమాధి, పోతన పొలం వద్ద బావిని సుందరీకరించి, ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది.[7]

అయన చాలా గొప్ప కవి అయన చాలా మంచి రచనలు రాసారు.

మూలాలు

[మార్చు]
  1. "బమ్మెర పోతన". TeluguOne Devotional. 11 February 2020.
  2. 2.0 2.1 సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "పోతన - TSN మూర్తి : రచనలు : అలమార : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2021-06-19.
  3. "భాగవతామృతానికి డిజిటల్‌ తళుకు". EENADU. 2022-04-15. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
  4. telugu, NT News (2022-04-17). "పోతనకు.. డిజిటల్‌ పీఠం". Namasthe Telangana. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
  5. "కవుల నేలకు పర్యాటక కళ". EENADU. 2022-09-16. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
  6. telugu, NT News (2022-10-11). "పోతనకు పట్ట సోమనకు వనం". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-14.
  7. telugu, NT News (2022-10-14). "బమ్మెర, పాల్కురికి యాదిలో!". Namasthe Telangana. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.