గౌరన
శ్రీనాథునికి సమకాలికుడైన కవులలో గౌరన లేదా గౌరనమంత్రి ఒకడు. 15వ శతాబ్దం పూర్వార్ధంలోని వాడు. ద్విపద కావ్య రచనను పునరుద్దరించినవాడు గౌరన. తెలుగులో నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్విపద కావ్యాలను, సంస్కృతంలో లక్షణ దీపిక అనే ఛందో గ్రంథాని రచించాడు. ఇతడు శివభక్తుడు. తన కావ్యాలన్నిటిని శ్రీశైల మల్లిఖార్జునునికి అంకితమిచ్చాడు.
నవనాథ చరిత్ర
[మార్చు]శ్రీ గిరి కవి నవనాధ చరిత్రను పద్య ప్రబంధంగా రచించాడు. దీనిని అనుసరించి గౌరన ద్విపద కావ్యాన్ని రచించాడు. ఇందులో తొమ్మిది మంది శైవ సిద్దుల మహాత్మ్యం వర్ణించబడిండి. వీరిలో మీననాధుడు అపార మహిమాన్వితుడు. ఆనాటి జనసామాన్యంలో వ్యాప్తిలో ఉన్న సారంగధర కథను రెండు ఆశ్వాసాలలో రచించాడు. చేమకూర వెంకటకవి గౌరన సారంగధర చరిత్రను అనుసరించే సారంగధర కథను రచించాడు. 15వ శతాబ్దంలోని తెలుగు దేశ సాంఘిక స్థితిగతులను తెలుసుకోవడానికి గౌరన రచన ఉపకరిస్తుంది. ఇందులో గొల్లవారికి సంబంధించిన విశేషాలు, పశురోగ వివరణలు ఉన్నాయి.
హరిశ్చంద్రోపాఖ్యానము
[మార్చు]హరిశ్చంద్రుని కథను కావ్య వస్తువుగా గ్రహించిన తెలుగు కవుల్లో గౌరన ప్రథముడు. స్కాంద పురాణాన్ని అనుసరించి గౌరన హరిశ్చంద్రోపాఖ్యానాన్ని రచించాడు. వేదపురాణలలోలేని నక్షత్రకుని పాత్రను గౌరన సృష్టించాడు. హరిశ్చంద్రోపాఖ్యానము సత్య వీర రసస్ఫోరకంగా అనల్ప కల్పనా కవితా చమత్కృతితో అనన్య సామాన్య ప్రతిభతో ఒక ప్రభంధంగా తీర్చిదిద్దబడింది. గౌరన కవిత్వంలో వాస్తవికత ఎక్కువ. స్వభావోక్తులు గౌరన కవితకు అందం తెచ్చాయి. పదప్రయోగనైపుణ్యంలోను, నాటకోచిత రచనలోను, భవ ఔన్నత్యంలోను గౌరన తన ప్రతిభను నిరూపించుకొని సరస సాహిత్య లక్షణ విచక్షణుడు అన్న బిరుదును సార్థకం చేసుకొన్నాడు.