వీరభద్ర విజయం
వీరభద్ర విజయము అనునది బమ్మెర పోతన రచించిన పద్య కావ్యము. వీరశైవత్వాన్ని ప్రభోదించే ఈ కావ్యం వీరభద్రుని చరిత్రకు సంబంధించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, దక్ష యజ్ఞము యొక్క కథాగమనముతో సాగే రచన. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులో పోతన, దక్షుడు రెండు సార్లు యాగము చేసినట్లు కల్పన చేశాడు. ఇందులో 1046 గద్య, పద్యములున్నాయి.[1] ఇందులోని వృత్తాంతం వాయు పురాణం నుండి గ్రహింపబడింది.[2]
నేపథ్యం
[మార్చు]ఈ పుస్తకాన్ని పోతన యవ్వనంలో ఉండగా రాసిఉండవచ్చునని ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో పేర్కొన్నాడు.[3] పోతన తన మత గురువైన ఇవటూరి సోమనాథుని ఆదేశానుసారం ఈ గ్రంథాన్ని రచించాడు. వ్యాసుడు రచించిన వాయుపురాణం దీనికి మూలం. పురాణ కథాసారాన్ని మాత్రం తీసుకుని పోతన దీన్ని స్వతంత్ర కావ్యంగా రాశాడు. ఈ కావ్యాన్ని పరమేశ్వరునికే అంకితం చేశాడు.[1]
కథాసంగ్రహం
[మార్చు]- ప్రథమాశ్వాసము
కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుణ్ని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కోపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ వార్త నారదునివల్ల తెలుసుకొన్న దాక్షాయణి శివునికా వార్తను తెలిపింది. శివుని ఆజ్ఞ గైకొని యజ్ఞాన్ని చూడడానికి బయలుదేరింది. దక్షుడు ఆమెను పిలవని పేరంటానికి వచ్చినందుకు తిరస్కరించడమే కాకుండా శివుణ్ణి నిందిస్తాడు. అది భరించలేని దాక్షాయణి శివయోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది. ఆ వార్త విన్న శివుడు దక్షుని రెండవ యాగంలో కడతేరుస్తానని శపిస్తాడు.
ద్వితీయ తృతీయాశ్వాసాల్లో పార్వతీ పరమేశ్వరుల వివాహము సుందరంగా, శృంగారభరితంగానూ వర్ణించబడినది. చతుర్థాశ్వాసములో దక్షుని రెండవ యాగాన్ని గురించి వర్ణించాడు. ఇది కూడా పార్వతీ పరమేశ్వరులు లేని యాగమే. దధీచి వలన ఈ యాగాన్ని గురించి విన్న శివుడు వీరభద్రుని పుట్టించాడు. వీరభద్రుడు దేవతలను శిక్షించి, దక్షుని తల నరికాడు. తర్వాత అష్టమూర్తి అనుగ్రహంతో దేవతలు రక్షింపబడతారు. దక్షుడు మేకతలతో పునర్జీవితుడవుతాడు. వీరభద్రునికి పట్టం కట్టడంతో కథ సంపూర్ణమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 కొల్లి, బాబూ రాజేంద్రప్రసాద్ (1991). వీరభద్ర విజయము సవిమర్శక పరిశీలనము. p. 26.
- ↑ వీరభద్ర విజయము, బమ్మెర పోతన, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 71-80.
- ↑ ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - 5. p. 192.