Jump to content

సి. సుజాత

వికీపీడియా నుండి

సి. సుజాత తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. స్త్రీవాద ఉద్యమంతో ఆమె సాహిత్య జీవితం పెనవేసుకుపోయింది. ఆమె రాసిన సుప్త భుజంగాలు, రాతిపూలు, 24x7 న్యూస్ ఛానెల్, కాంచన వీణ వంటి నవలలు, సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, నెరుసు కథా సంపుటాలు ప్రచురితమయ్యాయి. 1986 నుంచి మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ జర్నలిజం రంగాల్లో పనిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సి. సుజాత 1950 డిసెంబరు 12న తెనాలిలో కొంజేటి జయమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించింది.[1] గుంటూరు జిల్లా జగ్గాపురానికి పెళ్ళిచేసుకుని వచ్చింది. ఆమె తల్లికి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండడంతో అదే అలవాటు సుజాతకి చిన్నతనం నుంచీ వచ్చింది. కొమ్మూరి వేణుగోపాలరావు వంటివారి నవలలు, యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన వంటివారి సీరియల్స్ నుంచి ప్రారంభించి శ్రీశ్రీ, రంగనాయకమ్మ, మాలతీ చందూర్ వంటివారి సాహిత్యం వరకూ తొలినాళ్ళలో విపరీతంగా చదివింది. మహీధర రామమోహనరావు నవలల గురించి వాకబు చేయడంతో తొలిసారిగా సాహిత్య ప్రపంచంలోని వ్యక్తులతో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది.[2] ఆ పరిచయంతోనే ఆమె పాత్రికేయ రంగంలోకి ప్రవేశించింది.

పాత్రికేయ వృత్తిలో

[మార్చు]

1986లో పాత్రికేయ వృత్తిలోకి సి. సుజాత ప్రవేశించింది. ఆమె 1986 నుంచి 1995 వరకు విజయవాడ నగరంలో సబ్ ఎడిటర్ నుంచి సీనియర్ సబ్ ఎడిటర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసింది. ఆపైన ఆంధ్రజ్యోతి వారపత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసింది. ప్రింట్ జర్నలిజంలో హారతి మాసపత్రికకు మేనేజిగ్ ఎడిటర్ హోదాలో, విజేత, స్నేహ, సెల్యూట్, రైతు సేవ వంటి పత్రికలకు సంపాదకురాలిగానూ పనిచేసింది.[3]

2003లో ఈటీవీ 2లో చేరి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఈటీవీ 2 కోసం మహిళలకే ప్రత్యేకించిన సఖి కార్యక్రమాన్ని డిజైన్ చేసి, 2008 వరకు ఐదేళ్ళ పాటు నడిపించింది. వీక్షకుల వ్యక్తిత్వం, దృక్పథాలకు తోడ్పడేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. సఖి కార్యక్రమం కోసం ఆమె దాదాపు 2000 ఎపిసోడ్ల వరకు రాసింది. ఆపైన హెచ్.ఎం.టీవి, టీవీ 7 వంటి న్యూస్ ఛానెళ్ళకు ప్రోగ్రామింగ్ హెడ్ హోదాలో పనిచేసింది. వనిత టీవీలో సినీ సందడి, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు, తేజ టీవీలో ఫ్యూచర్ ఫాక్ అన్న సీరియల్ రూపొందించి, నడిపించింది.[3]

2010 దశకంలో ఇంటర్నెట్ జర్నలిస్టుగా కళ్యాణమస్తు.కాం, సందడి.కాం వంటి ఇ-పత్రికలకు కంటెంట్ ఎడిటర్ గా పనిచేసింది.[3]

సాహిత్య రంగంలో

[మార్చు]

1984లో ఆమె తొలి నవల సుప్త భుజంగాలు ఆంధ్రజ్యోతి పత్రికలో సీరియల్ గా వచ్చి, తర్వాత పుస్తకమైంది. 1990ల నుంచి ఆమె పలు కథలు రాసింది. వాటిలో కొన్ని 1996లో సుజాత కథలు, 1999లో రెప్పచాటు ఉప్పెన, 2007లో నెరుసు కథా సంపుటులుగా ప్రచురితమయ్యాయి. 2009లో ఆమె రెండవ నవల రాతిపూలు నవ్య వార పత్రికలో సీరియల్ రూపంలో ప్రచురితమైంది. 2014లో 24x7 న్యూస్ ఛానెల్ నవల సారంగ వెబ్ మ్యాగజైన్లో సీరియల్ గా వచ్చింది. విశాలాంధ్ర దినపత్రికలో 2017లో కాంచన వీణ నవల ప్రచురితమైంది.[1] ఇవి కాక విద్యుల్లత, శ్యామ, గోపి, కరుణ వంటి మారుపేర్లతో వృత్తి ధర్మంలో భాగంగా కొన్ని వేల వ్యాసాలు రాసింది.[3]

విమర్శకులు సి. సుజాత రచనలను 1970లు, 80ల్లో ప్రారంభమైన స్త్రీవాద సాహిత్యోద్యమంలో భాగంగా భావిస్తారు.[4] సుజాత గురించి సాహిత్య విమర్శకురాలు కె.శ్రీదేవి రాస్తూ "1990 ల నుంచి తెలుగు సాహిత్యంలో స్త్రీవాద భావజాలం వాస్తవికతా పునాది మీద నిలబడడానికి, స్త్రీవాద దృక్పథపు మరో భావజాలం (Second thought of feminist out look) అభివృద్ధి చెందడానికి సి. సుజాత చేసిన యోగదానాన్ని (Contribution) ని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల తెలుగు స్త్రీవాద సాహిత్యానికి, ఒక కాల్పనిక రచయితగా ఆమె చేసిన దోహదం  చాలానే వుంది." అంటుంది.[5]

పురస్కారాలు

[మార్చు]

సి. సుజాత రచయిత్రిగా, పాత్రికేయురాలిగా పలు పురస్కారాలు అందుకున్నది:[3]

  • మధురాంతకం రాజారాం కథాకోకిల పురస్కారం (2001)
  • విశిష్ట మహిళ పురస్కారం (2006)
  • జర్నలిస్టు ప్రతిభా పురస్కారం (2008)
  • తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం - ఉత్తమ రచయిత్రి (2013)
  • పరుచూరి రాజారాం స్మారక పురస్కారం (2014)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 24x7 ఛానెల్ పుస్తకం వెనుక కవర్ పైన వివరాలు
  2. "ప్రతి ఏటా పండగ పుస్తకాల సంక్రాంతి". andhrabhoomi.net. Archived from the original on 7 మే 2019. Retrieved 7 May 2019.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 శిలాలోలిత. "వర్తమాన లేఖ". భూమిక. Retrieved 7 May 2019.
  4. "రెండు దశాబ్దాల(1990–2010) తెలుగు రచయిత్రుల సాహిత్య గమనం, గమ్యం". Retrieved 7 May 2019.[permanent dead link]
  5. "సి. సుజాత సాహిత్యం - స్త్రీ వాద దృక్పథం: కె. శ్రీదేవి". Archived from the original on 2020-10-26. Retrieved 2019-05-07.
"https://te.wikipedia.org/w/index.php?title=సి._సుజాత&oldid=3914933" నుండి వెలికితీశారు