Jump to content

సెక్రటరీ (నవల)

వికీపీడియా నుండి
(సెక్రటరీ (పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)
సెక్రటరీ (నవల)
"సెక్రటరీ (నవల)" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: యద్దనపూడి సులోచనారాణి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: ఎమెస్కో
విడుదల: 1964
పేజీలు: 256
ముఖపత్రాలంకరణ: బాపు

సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

రచన నేపథ్యం

[మార్చు]

నలభై ఏళ్లకు పైగా నవలారాణి అన్న ప్రాచుర్యం పొందిన యద్దనపూడి సులోచనారాణి తొలినవల సెక్రటరీ. జ్యోతి మాసపత్రికలో 1964లో ధారావాహికగా ప్రచురితమైంది. ఆధునిక నవలా సాహిత్యంలో ప్రాచుర్య సాహిత్యం (పాపులర్ లిటరేచర్), నిబద్ధ సాహిత్యం (సీరియస్ లిటరేచర్) అనే రెండు శాఖలు విస్తరించాయి. ప్రాచుర్య నవలా సాహిత్యం మొదట్లో కొవ్వలి, జంపన నవలలతో ప్రారంభం కాగా 1960 దశకం నుంచి ఆ నవలా శాఖలో మైలురాయిగా సెక్రటరీ నవల నిలుస్తుంది.

ఇతివృత్తం

[మార్చు]

ప్రధానంగా ఇది జయంతి అన్న యువతి కథ. అందం, పరువం, పొగరుమోతుతనం, ఆత్మాభిమానం ఉన్న దిగువ మధ్యతరగతి యువతి జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పలుకుబడి, ఆడపిల్లలను సమ్మోహనపరిచే రూపు ఉన్న నిండైన వ్యక్తి రాజశేఖరం. వీరిద్దరి పరస్పర ఆకర్షణ, ప్రేమ, ద్వేషం, కోపం, పట్టుదలలతో నిండిన ప్రేమకథ "సెక్రటరీ". జయంతి దిగువ మధ్యతరగతి అమ్మాయి, ఆమె బామ్మ జయంతిని కష్టపడి పెంచి చదువు చెప్పిస్తుంది చదువు పూర్తికాగానే ఉద్యోగం చూసుకుని ఆ వృద్ధురాలి శ్రమ తగ్గించాలనే సదుద్దేశంతో ఉద్యోగప్రయత్నాలు చేస్తూంటుంది ఆమె. ఈ నేపథ్యంలో "ఆంధ్ర వనితా విహార్" సంస్థలో సెక్రటరీ ఉద్యోగం దొరకగానే జయంతి ఆనందంలో తేలిపోతుంది. నగరంలో ధనికులు, ఉన్నతోద్యోగులతో ఆ సంస్థకు అనుబంధం ఉంటుందనీ, అలాంటివారి మధ్య తిరగడం తనలాంటి సామాన్యురాలికి అందివచ్చిన అవకాశమని ఆమె భావిస్తుంది. ఐతే వనితా విహార్ లో ఉద్యోగం అందుకు భిన్నంగా ప్రముఖులైన స్త్రీల మధ్య ఈర్ష్యాసూయలు, భేదాభిప్రాయాలే కాక నమ్మశక్యం కాని దుస్సంఘటనల మధ్య సాగుతుంది. బామ్మని కష్టపెట్టాల్సి ఉంటుందని తెలిసీ, మరో ఉద్యోగం దొరకడం కష్టమని అవగాహన ఉండి కూడా ఆమె ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. అనంతరం రాజశేఖరం వద్ద సెక్రటరీగా ఉద్యోగాన్ని పొందుతుంది.
రాజశేఖరం వద్ద ఉద్యోగం వనితా విహార్లోని ఉద్యోగానికి భిన్నంగా అన్ని రకాల సౌకర్యాలు, క్రమశిక్షణతో కూడిన పనితో ఉంటుంది. పైగా వనితావిహార్ ఉద్యోగం కన్నా గౌరవం, జీతం కూడా ఎక్కువే. జయంతి అంతకుముందు కన్న కలలన్నీ ఈ ఉద్యోగంలో నిజమైనట్టుగా ఉన్న పరిస్థితుల మధ్య రాజశేఖరం వల్ల ఓ సమస్య ఎదురవుతుంది. రాజశేఖరం పద్ధతేమిటో, అతనేమిటో ఒక పట్టాన అర్థం కాక, రకరకాల ఊహలకీ, భావనలకీ లొంగి ఆత్మాభిమానం చంపుకోకూడదనుకుని జయంతి ఈ ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తుంది. రాజశేఖరం అంగీకరించడు, అలాగని తానేమిటో, తన పద్ధతేమిటో స్పష్టంగా విప్పిచెప్పడు. అందం, ఐశ్వర్యం, హోదా ఉన్న ఓ మగవాడి ఆకర్షణలో మధ్యతరగతి అమ్మాయిగా జయంతి మనసు ఎన్నో ఉద్విగ్నతలకు లోనవుతుంది. అనంతరం జరిగే మలుపుల్లో ఎన్నో విచిత్రమైన సంఘటనల మధ్య ఈ నవల ఆసక్తికరంగా సాగుతుంది.[1]

శిల్పం-శైలి

[మార్చు]

సున్నితమైన, ఆకర్షణీయ శైలితో, తక్కువ వివరణలతో గట్టి ప్రభావాన్ని చూపే పాత్రల చిత్రీకరణ, సమకాలీనంగా ఎంచుకున్న పాత్రల వేషభాషలతో ఈ నవలను రచించారు సులోచనారాణి. ప్రముఖ రచయిత, విమర్శకుడు వి.రాజారామమోహనరావు ఈ నవల విజయానికి గల మూలకారణాన్ని విశ్లేషిస్తూ మధ్యతరగతి యువత మనస్సులో అస్పష్టంగా ఉన్న ఊహలకు, ఆశలకు స్పష్టమైన రూపం ఇచ్చి నవలగా కళ్లముందు ఉంచడంతో, జయంతి పాత్రతో వారు పొందిన మమేకమే ముఖ్యకారణమంటారు. జయంతి లాంటి అమ్మాయిలందరూ దిగువ మధ్యతరగతి పేదరికానికి బలైనవారే. కట్టుకోవడానికి మంచి ఖరీదైన చీర ఉండదు. చిన్నచిన్న సరదాలు తీరాలన్నా ఆర్థికంగా సరైన ధైర్యం ఉండదు. అలా అని పై తరగతి ఖరీదైన జీవితం తెలియనివారూ కాదు. దాని పట్ల ఆసక్తి, ఆశలేని వారూ కాదు. వీరి ఈ పరిస్థితి స్వయంకృతం కాదు. సాంఘికంగా ఇదో పరిస్థితి, ఓ చిత్రమైన పరిస్థితి. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. అందంతోటే కాక, వారి ప్రవర్తనతో, వ్యక్తిత్వంతో చాలామంది వీరికి ఆకర్షితులవుతారు. మంచితనం వీరి స్వభావం. ప్రేమ వీరి తత్త్వం. దోషరహితంగా కనబడే వీరితో పరిస్థితులు చెలగాటం ఎటువంటి పాఠకుడికైనా ఆకర్షణ ఉంటుంది అంటారు నవలాహృదయం పుస్తకంలో రామమోహనరావు.[2]

ప్రాచుర్యం

[మార్చు]

1964లో తొలిసారిగా నవల ధారావాహికగా జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైన నాటి నుంచి 2012లో ఎమెస్కో ప్రచురణసంస్థల పుస్తక ముద్రణ వరకూ దాదాపు 78ముద్రణలు పొందింది. పుస్తకాన్ని కొన్నవారే కొన్ని లక్షలమంది ఉండగా, తెలుగు పుస్తక సంస్కృతిలో విలసిల్లిన అద్దె పుస్తకాల కొట్ల పద్ధతి ద్వారా, ఇతరేతర మార్గాల ద్వారా ఎందరు చదివారన్న అంచనా వేయడానికి వీలు లేదు.
బహుళ ప్రచారం సాధించిన ఈ నవల సినిమాగా రూపుదిద్దుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించిన "సెక్రటరీ" చిత్రంలో జయంతిగా వాణిశ్రీ, రాజశేఖరంగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. సినిమాగా కూడా ప్రేక్షకాదరణ పొంది విజయాన్ని సాధించింది.[3]

ప్రభావం

[మార్చు]

సెక్రటరీ నవల ప్రభావం తెలుగు సాహిత్యంపై మరీ ముఖ్యంగా నవలారంగంపై చెదరనిది.

సాహిత్యంపై ప్రభావం

[మార్చు]

యద్దనపూడి సులోచనారాణి రచనా జీవితంలో తొలినవల "సెక్రటరీ" ఆమెని నాటి నవలా రంగంలో ప్రాచుర్య నవలల శాఖకు అగ్రస్థానంలో నిలిపింది. అనంతరం ఆమెకు వచ్చిన ప్రాచుర్యం ఏ స్థాయికి చేరిందంటే పలువురు మగరచయితలు తమ సొంతపేర్లతో నవలలు పంపితే పత్రికల్లో ప్రచురణ కావట్లేదని స్త్రీపేర్లతో నవలలు పంపే స్థితి ఏర్పడింది. సెక్రటరీ నవలలోని నేపథ్యం ప్రాచుర్య నవలల నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ఎందరో అక్షరాస్యుల్ని సాహిత్య పాఠకులుగా మార్చడం కూడా సెక్రటరీ నవల సాధించిన విజయంలో భాగమే.

పాఠకులపై ప్రభావం

[మార్చు]

1964లో తొలిసారిగా ఈ నవల ధారావాహికగా ప్రచురణ పొందుతున్న రోజుల్లో నవలా పఠనం అలవాటు ఉన్న కుటుంబాలలో జయంతి, రాజశేఖరాలు వారిలో ఒకరైపోయారని విమర్శకులు ప్రశంసించారు. ఆ రెండు పాత్రల జీవితాల్లో మలుపులు, సంఘటనలు తమ బంధుమిత్రుల జీవితాల్లోనివే అన్నంతగా పాఠకులు తాదాత్మ్యత పొందారు. సినిమాగా విజయం పొందినా, నవలగా అమ్మకాల్లో, ప్రాచుర్యంలో చరిత్ర సృష్టించినా అంతా పాఠకుల కలల లోకాన్ని వారి ముందు నిలపడంలో ఉందని విమర్శకులు రాజారామమోహనరావు అభిప్రాయం.

విమర్శ

[మార్చు]

"సెక్రటరీ" నవల విషయంలో తెలుగు విమర్శలోకంలో వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నవల పాఠకులను కలలలోకంలోకి తోసేసి, పఠనా సమయాన్ని నిష్ప్రయోజనకరంగా మారుస్తుందని వ్యతిరేకించిన వారి ముఖ్య ఆరోపణ. ఆశ, నిరాశలు, రాగద్వేషాలతో నిండిన ఈ నవల పాఠకుల వికాసానికి ఏ విధమైన సహకారీ కాదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యకరమైన వినోదంతో పాఠకులను సేదతీర్చడమే కాక సమాజంలోని ఒక వర్గం ఆశలు, ఆకాంక్షలు పరోక్షంగా చిత్రీకరించిన ఉత్తమ సాహిత్యంగా మరికొందరు విమర్శకులు ప్రశంసించారు. నవల మరో వందపపేజిలు పెంచే అవకాశం వున్నా శ్రీమతి సులోచనారాణి ఆ పని చెయ్యలేదు. నవల చివరలో రాజశేఖరం ఉత్తరం ద్వారా చెప్పిందంతా,సంఘటనారూపంలో రాస్తే నవల పెరుగుతుంది అని వి.రాజారామమోహనరావు నవలాహృదయంలో వివరించారు.

స్వరోత్సవం

[మార్చు]

లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయగానసభలో నవలకు నీరాజనం కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచించిన ‘సెక్రటరీ’ నవల సర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సులోచనారాణిని సత్కరించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. యద్దనపూడి సులోచనారాణి "సెక్రటరీ" నవల
  2. వి.రాజారామమోహనరావు రచించిన "నవలాహృదయం"
  3. సురేష్ ప్రొడక్షన్స్ "సెక్రటరీ" చిత్రవివరాలు
  4. "ఘనంగా 'సెక్రటరీ' నవల స్వర్ణోత్సవం 25-01-2016". Archived from the original on 2016-01-25. Retrieved 2016-01-25.

ఇతర లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]