స్మార్ట్ సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో 100 “బుద్ధ నగరాలు” (స్మార్ట్ సిటీస్) నిర్మించాలనే పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకీ “బుద్ధ నగరాలు” అంటే ఏమిటి? వీటిని నిర్మించవలసిన అవసరం ఏమిటి? ఈ నిర్మాణానికి వెయ్యవలసిన పునాదులు ఏమిటి?

తెలుగులో “బుద్ధి” అనే మాటకి mind, intellect అనే అర్థాలతోపాటు intelligence, judgment, wisdom, discrimination వగైరా అర్థాలు కూడా ఉన్నాయి. “బుద్ధిశాలి” అంటే clever or smart person అనే అర్థం కూడా ఉంది. ఈ మాట నామవాచక రూపంలో “బుద్ధి” కనుక విశేషణం రూపంలో “బుద్ధ” అని ప్రయోగించవచ్చు. కనుక “బుద్ధ నగరం” అంటే “స్మార్ట్ సిటీ.”

బుద్ధ నగరం అంటే ఏమిటి? అంక సాంకేతికాలు (“డిజిటల్ టెక్నాలజీస్”) ఉపయోగించి పురజనులు పురపాలక విధులలో పాల్గొనడానికి వెసులుబాటు కల్పించడం. అంటే పురజనుల మంచిచెడ్డలు, క్షేమం, కుశలత దృష్టిలో పెట్టుకుని, డబ్బు, వనరులు పొదుపు చేస్తూ పాలన చెయ్యడానికి వెసులుబాటు కల్పించడం. ఈ సందర్భంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం కనుక ఇదే విషయాన్ని ఉదాహరణల రూపంలో చూద్దాం..

ఒక్క నగరాల నిర్మాణం లోనే కాదు, ఈ “బుద్ధి కుశలత”ని చాల చోట్ల ప్రవేశ పెట్టవచ్చు. ఉదాహరణకి: బుద్ధ భవనాలు, బుద్ధ కార్లు, బుద్ధ ఫోన్లు, బుద్ధ మీటర్లు. ఈ సందర్భంలో “బుద్ధ” అంటే “ఇంటెలిజెంట్, స్మార్ట్,” మాత్రమే కాకుండా ఆ “బుద్ధత్వం” ఆపాదించడానికి వాడే సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అన్వయం చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో “బుద్ధ” అంటే “డిజిటల్, ఇంటర్‌నెట్” సాంకేతికాలు అనే విస్తృతార్థం ఇవ్వవచ్చు.

ఈ రోజుల్లో సాంకేతిక రంగంలో వెల్లివిరుస్తూన్న అంతర్జాల (“ఇంటర్‌నెట్”) సౌకర్యాలు, వార్తాప్రసార సాంకేతికాలు (“కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్”), మొదలైన వాటిని ఆసరాగా తీసుకుని “పట్టణాలని నడిపే” వ్యవస్థలో మౌలికమైన మార్పులని తీసుకురావాలనే కోరికే “బుద్ధ నగరాలు” అనే భావనకి పునాది అయింది. కంప్యూటర్ రంగంలో వ్యాపారం చేసే కంపెనీలకి ఇది మహాదవకాశం. ఈ మహాదవకాశాన్ని భారతీయ కంపెనీలే చొరవ తీసుకుని వినియోగపరచుకుంటే అవి ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉంది.

పట్టణాలని “నడపడం” అంటే పురపాలక సంస్థలని నడపడం. పట్టణాలలో నివసించే పౌరుల సౌకర్యం కొరకు ప్రభుత్వం రంగం కాని, ఖానిగీ (“ప్రైవేటు”) రంగం కాని పౌరులకి అందించే సేవాకార్యక్రమాలే “నడపడం” అంటే. ఏమిటీ సేవలు? ఉదాహరణకి పురపాలక సంఘాలు పౌరులకి అందించే సపర్యలలో ముఖ్యమైనవి విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, ప్రయాణ, రవాణా సౌకర్యాలు, మురుగు పారుదల, చెత్తని తుడిచి వీధులని శుభ్రంగా ఉంచడం, ఆరోగ్య, వైద్య సౌకర్యాలు అమర్చడం, వగైరాలు. ఇవి కాకుండా పన్నులు వసూలు చెయ్యడం, ఇళ్లు కట్టుకుందుకి అనుమతి పత్రాలు ఇవ్వడం, వ్యాపారస్తులకి కావలసిన వెసులుబాట్లు కల్పించడం, మొదలైన పనులు ఎన్నో ఉంటాయి కదా. వీటన్నిటినీ సజావుగా నడిపే యంత్రాంగం ఉంటుంది కదా. ఈ యంత్రాంగాన్ని పౌరులందరినీ సమ దృష్టితో చూస్తూ, లంచాలు, తినుబడులు లేకుండా, నడపడం.

ఈ పనులన్నీ – లంచాలు తింటూ – ఇప్పుడు చేస్తున్నాము కదా అని చదువరులు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి, పురజనులకి మధ్య ఉన్న బంధం “ఇచ్చిపుచ్చుకోలు” (transactional) బంధం. ప్రజలు ఉత్తరాలు, దక్షిణలు ఇస్తున్నారు, ఉద్యోగులు పుచ్చుకుంటున్నారు, పనులు జరుగుతున్నాయి. ఈ ఉత్తర-దక్షిణ బంధం “వాటాదారు” (partnership) బంధంగా మారాలి. అటువంటి సందర్భంలో “హుద్‌హుద్” లాంటి తుపాను వస్తే – లేదా మరొక ప్రాణాపాయమైన సంకటం సంభవిస్తే – ప్రజలు, ప్రభుత్వం కలసి ఆ సమస్యని ఎదుర్కోడానికి కావలసిన హంగులు, వసతులు నగరంలో ఎల్లప్పుడు సర్వసిద్ధంగా ఉండాలి. అదీ బుద్ధ నగరం అంటే!

ఈ బృహత్ ప్రణాళిక అందరికీ అర్థం అయే రీతిలో చెప్పడానికి, ముందస్తుగా కొన్ని చిన్న ఉదాహరణలు. “సిటీ బస్సు” ఎప్పుడొస్తుందో, ఎంత ఆలస్యంగా నడుస్తోందో, అది వచ్చే వేళ తెలియక బస్సు ఆగే స్థలాలలో పడిగాపులు పడడం, వంటి అనుభవాల కోసం ఎంతమంది ఎదురు చూస్తారు? బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉందో, ఫలానా ప్రదేశానికి ఎంతసేపట్లో వస్తుందో, ఆ బస్సులో ఖాళీ ఉందో, లేదో అన్న విషయాలు వీధి పక్కన ఉన్న ప్రతి “బస్సు స్టేండు” దగ్గర ప్రకటన చెయ్యగలిగే సాంకేతిక స్తోమత ఉంటే ఎంత సదుపాయంగా ఉంటుందో కదా. అదే విధంగా బస్సులో కూర్చున్న వారికి ఎదట “ఆగే స్థలం” (Bus Stop) పేరు ఏమిటో బస్సులోనే ప్రకటించగలిగే సదుపాయం ఉంటే కొత్తవారికి ఎంతో సదుపాయంగా ఉంటుంది. ఈ రకం సదుపాయం పాశ్చాత్య నగరాలలోని బస్సులలోను, రైళ్లల్లోనూ ఉంది. కలన యంత్రాలు, వార్తాప్రసారక మాధ్యమాలు ముమ్మరంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రకం సదుపాయాలు కల్పించడం కష్టం కాదు. ఈ రకం అవస్థాపన సౌకర్యాలు (infrastructure facilities) భారతదేశంలో కూడా వస్తున్నాయి.

రెండవ ఉదాహరణ. ఒక బంగీని ఒక ఊరు నుండి మరొక ఊరికి పంపినప్పుడు ఆ బంగీ ఎప్పుడు, ఎక్కడ ఉందో, అది ఎప్పుడు మన ఇంటి గుమ్మం ముందు వాలుతుందో చెప్పగలిగే స్తోమత కూడా ఇప్పుడు భారతదేశంలో ఉంది. అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కాని, ఉండడం ఉంది.

మూడవ ఉదాహరణ. “బుద్ధ దూరవాణి” (“స్మార్ట్ ఫోన్”) సంగతే చూద్దాం. మామూలు (అంటే, బుద్ధి లేని లేదా dumb) “సెల్ ఫోనులు” వాడుకలోకి వచ్చేక వాటిని వాడని వారు అరుదు. చాకలి, మంగలి, పాల మనిషి, పని మనిషి, ఇలా సర్వులూ ఈ రోజుల్లో సెల్ ఫోనులు వాడుతున్నారు. నాసి రకం, చవక రకం (బుద్ధి లేని) ఫోనులు అయితే మరొకరితో మాట్లాడడానికే పరిమితం. కాని వాటిల్లో కాసింత “బుద్ధి”ని జొప్పిస్తే అదే పనిముట్టుతో మరెన్నో పనులు చేసుకుని ప్రయాస తగ్గించుకోవచ్చు, అనుకోని దిశలనుండి లబ్ధి పొందవచ్చు. ఉదాహరణకి సెల్ ఫోనుని అంతర్జాలానికి తగిలించేమంటే అంతర్జాలంలో లభ్యం అయే సమాచారం అంతా అరచేతిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ పరికరాన్ని రైతు చేతిలో పెడితే వానలు ఎప్పుడు పడతాయో, తుఫానులు ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకుని నారుమడులు ఎప్పుడు పోయాలో, కోతలు ఎప్పుడు కొయ్యాలో, వగైరా నిర్ణయాలు ముందుచూపుతో చేసుకోవచ్చు. “గాలిలో దీపం పెట్టి అంతా నీదే భారం” అని నిస్పృహ పడనక్కర లేదు.

“జి. పి. ఎస్” (GPS) సౌకర్యం వచ్చిన తరువాత సెల్ ఫోనుల శక్తి ఇంకా పెరిగిపోయింది. ఈ రోజుల్లో మనం ఎక్కడున్నామో మనకి తెలియకపోయినా మన సెల్ ఫోను పసికట్టకలదు. మన రాష్ట్రం దాటి బయటకి వెళితే భాష అర్థం కాదు. ఇంగ్లీషు అందరికీ రాదు. కాని అందరి దగ్గరా సెల్ ఫోను ఉంటోంది. అహమ్మదాబాద్‌లో విమానం దిగి సెల్‌ఫోనులో తెలుగులో మాట్లాడితే అది మన మాటని గుజరాతీలోకి తర్జుమా చేస్తే ఎంత సదుపాయంగా ఉంటుంది! లక్నోలో దిగితే అదే ఫోను హిందీలోకి తర్జుమా చెయ్యాలి.

ఈ రకం పరిచర్యలు అన్నీ అందుబాటులో ఉండాలంటే ఆ నగరంలో అంతర్జాలం 24 గంటలూ అందుబాటులో ఉండాలి. విద్యుత్ సరఫరా ప్రతిరోజూ, 24 గంటలూ ఆగిపోకుండా ఉండాలి. బుద్ధ నగరాలు ఈ కనీస అవసరాలు ముందు సమకూర్చితే కాని బుద్ధ నగరాలు అనే భావన పని చెయ్యదు.

మౌలికమైన సౌకర్యాలు సమకూరిన తరువాత బుద్ధ నగరాలని ఎవరి అవసరాలకి తగినట్టు వారు తీర్చి దిద్దుకోవచ్చు. ఉదాహరణకి ఈ రకం సాంకేతిక పరిజ్ఞానంతో వీధులలో కార్ల రద్దీని అదుపులో పెట్టవచ్చు. కార్లని నిలిపే స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చోదకులకి తెలియపరచవచ్చు. జనసంచారం లేని చోట్ల విద్యుత్ దీపాలని ఆర్పి ఆదా చెయ్యవచ్చు. మారుతూన్న వాతావరణ పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఏయే మొక్కలకి ఎప్పుడు నీళ్లు పొయ్యాలో నిర్ణయించి నీటి ఖర్చు తగ్గించుకోవచ్చు.

ఈ సదుపాయాలు ఉన్న నగరం ఎలా ఉంటుంది? మూడొంతులు ఈ నాటి సింగపూర్‌లా ఉంటుంది. అంతా సింగపూర్‌లా ఉంటే ప్రజలందరికి నచ్చకపోవచ్చు. సింగపూర్‌లో ప్రభుత్వం వారి ఆధిపత్యం, నియంత్రణ, పర్యవేక్షణ అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పౌరుడి చర్యలని ప్రభుత్వం ఒక కంటితో చూస్తూనే ఉంటుంది. స్వేచ్ఛకి అలవాటు పడ్డ ప్రాణాలకి ఇన్ని కట్టుబాట్లు ఉంటే బతకడం కష్టం. కాని అలా ఉండవలసిన అవసరం లేదు. అదే అంక సాంకేతికం (digital technology) లో ఉన్న సౌకర్యం. మన వైయక్తిక స్వతంత్రాలకి తిలోదకాలు ఇవ్వనక్కర లేకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపడానికి అవకాశాలు ఉన్నాయి.

కనుక బుద్ధ నగరం అంటే ఏమిటి? నగరాలకు సంబంధించి అన్ని ప్రధాన కార్యక్రమాల్లో అంక సాంకేతికాలని (డిజిటల్ టెక్నాలజీ) అనుసంధానించినట్లయితే ఆ నగరమే స్మార్ట్ సిటీ. అనగా బుద్ధ ఆర్థిక వ్యవస్థ (స్మార్ట్ ఎకానమీ), బుద్ధ చలనం (స్మార్ట్ మొబిలిటీ), బుద్ధ పర్యావరణం (స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్), బుద్ధ ప్రజలు (స్మార్ట్ పీపుల్), బుద్ధ జీవనం (స్మార్ట్ లివింగ్), బుద్ధ పరిపాలన (స్మార్ట్ గవర్నెన్) స్ అనే లక్ష్యాలను సాధించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రభుత్వం, సమాజాన్ని ఒకే చోటకు చేర్చడం.

సానుభూతితో ప్రజలు ప్రభుత్వంతో సహకరించకపోయినా, ప్రభుత్వోద్యోగులు “మేము లంచాలు తినకుండా పని చెయ్యలేము” అని భీష్మించుకుని కూర్చున్నా ఎన్ని బుద్ధ నగరాలు నిర్మించినా ప్రయోజనం ఉండదు. సాంకేతిక విద్య ప్రజలలో మార్పుని తీసుకుని రాలేదు, అది మన బుర్రలో పుట్టాలి!

ప్రస్థానం[మార్చు]

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ సిటీ అనే పేరు ఆవిర్భవించింది. 2008లో ఐ.బి.ఎం స్మార్టర్ ప్లానెట్ ఇనీషియేటివ్ (I.B.M smarter planet initiative) లో భాగంగా స్మార్టర్ సిటీస్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2009 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్మార్ట్ సిటీలపై ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలు స్మార్ట్ సిటీల ఏర్పాటు, పరిశోధనపై అధిక పెట్టుబడులు పెట్టాయి. ఇదివరకే అంతర్జాతీయ వాణిజ్య జిల్లా వెరోనాలో ఈ సిటీలు ప్రాచుర్యం పొందాయి. ఇక మనదేశం విషయానికి వస్తే: కోచి, అహ్మదాబాద్, ఔరంగాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని మనేసర్, ఖుష్‌కెరా (రాజస్థాన్), కృష్ణపట్నం, పొన్నే (తమిళనాడు), తుంకూరు (కర్ణాటక) ప్రాంతాల్లో స్మార్ట్ సిటీలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ప్రత్యేక పెట్టుబడి ప్రాంతాలు లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటవుతాయి. ఆయా ప్రాంతాలలో పన్ను నిర్మాణతలో నియంత్రణల సడలింపు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఆశయం[మార్చు]

భారత ప్రభుత్వం 2020 నాటికి 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధి లక్ష్యాన్ని చేపట్టింది. భారత్‌లో స్మార్ట్‌సిటీల ఏర్పాటు ప్రపంచ బ్యాంకు సమ్మిళిత గ్రీన్ గోల్‌కు అనుగుణంగా ఉంది.

ప్రయోజనాలు[మార్చు]

అవస్థాపనా సౌకర్యాల కల్పనతోపాటు సుస్థిర రియల్ ఎస్టేట్, సమాచారం, మార్కెట్ సౌకర్యాలు ఉన్న పట్టణ ప్రాంతంగా స్మార్ట్ సిటీలు ఆవిర్భవించాలి. స్మార్ట్ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా కింది ప్రయోజనాలు చేకూరుతాయి:

 1. సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ
 2. వ్యర్థ నీటి రీసైక్లింగ్ (Sewage Water Recycling)
 3. నీటి వృథాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం.
 4. గ్రీన్ స్పేసెస్
 5. భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన
 6. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి
 7. వస్తు, సేవల లభ్యత
 8. ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల
 9. సహజ వనరుల సమర్థ వినియోగం
 10. గవర్నెన్స్‌లో పౌరుల భాగస్వామ్యం
 11. పర్యావరణ పరిరక్షణ - యాజమాన్యం
 12. స్మార్ట్ పట్టణాభివృద్ధి సాధన
 13. సుస్థిర వృద్ధి
 14. గ్లోబల్ నెట్ వర్కింగ్
 15. సృజనాత్మక పరిశ్రమ
 16. ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటు
 17. ఈ-అర్బన్ గవర్నెన్స్ 18. పారిశ్రామికీకరణ
 18. భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ