స్వైన్‌ఫ్లూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్.ఈ చిత్రం సి.డి.సి. లాబొరేటరీలో తీయబడినది.ఈ వైరస్ 80–120 నానోమీటర్ల వ్యాసం కలిగి యుంది.[1]

స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ కారణంగా వస్తుంది. ఈ వైరస్‌లో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో- సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల రకాలూ ఉంటాయి. ఏటా ఈ వైరస్‌లలో చిన్నచిన్న జన్యు మార్పులు సహజం. దీన్నే 'యాంటీజెనిక్‌ డ్రిఫ్ట్‌' అంటారు. అయితే కొన్నిసార్లు ఈ మార్పులు తీవ్రస్థాయిలో ఉండి.. మహమ్మారి వైరస్‌లు పుట్టుకొస్తాయి. దీన్నే 'యాంటిజెనిక్‌ షిఫ్ట్‌' అంటారు. 2009లో జరిగిందదే. పందుల్లో ఉండే రెండు వైరస్‌లు, ఒక మనిషి వైరస్‌, ఒక పక్షి వైరస్‌.. ఈ నాలుగూ కలగలిసి కొత్త వైరస్‌ (హెచ్‌1 ఎన్‌1) పుట్టుకొచ్చింది. ఇది ముందు పందుల్లో వచ్చింది కాబట్టి 'స్వైన్‌ ఫ్లూ' అన్నారు[2]. (స్వైన్‌ అంటే పంది) పందుల నుంచి మనుషులకు.. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులక్కూడా వ్యాపించటం మొదలైది.ఒక వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి,వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా ఉండాలి

హెచ్‌1ఎన్‌1[మార్చు]

హెచ్‌1ఎన్‌1[మార్చు]

ఏ రకం ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లోనైనా- హెచ్‌, ఎన్‌ అని రెండు రకాల యాంటిజెన్‌లు ఉంటాయి. మళ్లీ హెచ్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 9 రకాలుండగా.. ఎన్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 15 రకాలున్నాయి. వీటిల్లో ఏది దేనితోనైనా కలవొచ్చు. కలిసి కొత్త రూపాన్ని సంతరించుకోవచ్చు. మనం సాధారణంగా ఎక్కువగా చూసేది, జలుబుతో ఫ్లూ జ్వరాన్ని తెచ్చిపెట్టేది హెచ్‌3 ఎన్‌2 రకం వైరస్‌. హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ఫ్లూ కారకం. అలాగే స్వైన్‌ఫ్లూకు హెచ్‌1 ఎన్‌1 మూలం. ఈ ఫ్లూ వైరస్‌లన్నీ కూడా గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అందుకే ఇవి వేగంగా సమాజమంతా చుట్టబెడతాయి.[3] [4]

గాలి సమస్య[మార్చు]

ఈ మధ్య అందరం ఎబోలా గురించి భయపడుతున్నాం. కానీ నిజానికి ఎబోలా రోగి శారీరక స్రావాలు మనకు తగిలితేనే అది మనకు వ్యాపిస్తుంది. కానీ స్వైన్‌ఫ్లూ అలా కాదు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చేస్తుంది. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్‌ బయటకు వెలువడి, గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే చాలు, మనకూ సోకుతుంది. రోగి అక్కడి నుంచి వెళ్లిపోయినా గాలిలో వైరస్‌ ఉండొచ్చు. అలాగే ఆ దగ్గు, తుమ్మ సమయంలో వెలువడే తుంపర్లు పడిన చోట వైరస్‌ ఉంటుంది. దాన్ని మనం ముట్టుకుని.. ఆ చేతితో నోరు, ముక్కు, కళ్ల వంటివాటిలో పెట్టుకున్నా మన ఒంట్లో ప్రవేశిస్తుంది. అందుకే హెచ్‌1ఎన్‌1 వైరస్‌ను నిరోధించటం కష్టమవుతోంది.[5]

స్వైన్‌ఫ్లూ రకాలు[మార్చు]

స్వైన్‌ఫ్లూ తీవ్రతను బట్టి మూడు రకాలుగా వర్గీకరించొచ్చు.

 • ఎ రకం: జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. ఇతరత్రా ఏ ఆరోగ్య సమస్యలూ లేని సాధారణ ఆరోగ్యవంతులు, పెద్దలైతే.. ఇంట్లోనే ఉండి తేలికపాటి చికిత్స తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. జ్వరం తగ్గటానికి ప్యారాసిటమాల్‌ బిళ్లలు, జలుబు తగ్గటానికి యాంటీహిస్టమిన్‌ (ఎవిల్‌ వంటివి) బిళ్లలు, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటే యాంటీబయోటిక్ తీసుకుంటే చాలు. పరిశుభ్రతనూ పాటించాలి. ఈ 'ఎ' రకం వాళ్లు ఇంట్లోనే ఉంటే.. వీరి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. సాధారణంగా ఈ మందులతోనే లక్షణాలు 48 గంటల్లో తగ్గుముఖం పడతాయి.
 • బి రకం: ఫ్లూ ఆరంభమైన 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా తీవ్రం కావటం, గొంతునొప్పి పెరగటం వంటి లక్షణాలుంటే 'బి' రకం కిందకు వస్తారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వాళ్లు.. పిల్లలు, వృద్ధుల వంటివారు 'ఎ' రకంలో ఉన్నా.. 'బి' రకం కిందికే వస్తారు. ఈ 'బి' రకం వాళ్లంతా తప్పనిసరిగా సత్వరమే వైద్యులను సంప్రదించాలి.
 • ఇక 5 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, బాలింతలు.. అలాగే మధుమేహం, ఆస్థమా, గుండె, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక శ్వాస సమస్యలున్న వాళ్లు, క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు, దీర్ఘకాలంగా స్టిరాయిడ్లు తీసుకుంటున్న వాళ్లు, హెచ్‌ఐవీ బాధితులు.. వీరందరిలో రోగనిరోధశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరిని నేరుగా 'బి' రకం కిందే పరిగణిస్తారు. కాబట్టి వీళ్లు ఫ్లూ లక్షణాలు కనబడితే.. ఇంట్లో ఉండటం, సొంత మందులు వాడుకోవటం కాకుండా వెంటనే, తప్పనిసరిగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి.
 • వైద్యులు ముందుగా అవి స్వైన్‌ఫ్లూ లక్షణాలేనా? కాదా? చూస్తారు. అవి ఫ్లూ లక్షణాల్లాగే ఉంటే పరీక్షలేవీ చేయకుండానే 'ఒసాల్టమివిర్‌' మందును 75 మి.గ్రా. మోతాదులో రోజుకి 2 సార్లు చొప్పున, 5 రోజుల పాటు ఇస్తారు. పిల్లలైతే బరువును బట్టి మోతాదు మారుస్తారు. ఇలా 5 రోజుల పాటు వాడటం వల్ల స్వైన్‌ఫ్లూ తీవ్రం కాకుండా ఆగిపోతున్నట్టు, దాన్నుంచి పూర్తిగా కోలుకుంటున్నట్టు వెల్లడైంది. ఒకవేళ పరీక్షల్లో వారికి హెచ్‌1ఎన్‌1 వైరస్‌ లేదని తేలినా మందు మాత్రం ఆపటానికి వీల్లేదు. ఎందుకంటే రెండు రోజులు వాడి ఆపేస్తే వైరస్‌ మందును తట్టుకునే శక్తిని సంతరించుకుంటుంది. మందు మొదలుపెడితే ఐదు రోజులూ వాడాలి. 'బి' రకం వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగు చికిత్స తీసుకుంటే ఒక్కరు కూడా చనిపోయే అవకాశం లేదు.
 • ఒసాల్టమివిర్‌ మందును జ్వర లక్షణాలు ఆరంభమైన తర్వాత సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టటం ముఖ్యం. ఎందుకంటే ఈ వైరస్‌ సాధారణంగా ఒంట్లో ప్రవేశించిన 48 గంటల తర్వాత కణజాలానికి అతుక్కుపోతుంది. ఒసాల్టమివిర్‌ మందు ఈ వైరస్‌ కణజాలానికి అతుక్కుపోకుండా చేస్తుంది. ఒకసారి వైరస్‌ కణజాలానికి అతుక్కుపోయాక.. మందు ఇచ్చినా ప్రయోజనం శూన్యం. ఫ్లూ లక్షణాలున్న వాళ్లు దీన్ని వేసుకుంటే ఏ హానీ ఉండదు. ఇది ఒక్క స్వైన్‌ఫ్లూకే కాదు.. అన్ని ఫ్లూ జ్వరాలకూ పని చేస్తుంది. అలాగని ఎవరికి ఏ రకం జ్వరం అనిపించినా ఈ మందు వేసేసుకోవటం సరికాదు. శ్వాసకోశ సమస్యలతో వచ్చే జ్వరాల్లో దీన్ని ఇవ్వకూడదు. పైగా అందరూ విచ్చలవిడిగా వాడేస్తే వైరస్‌ ఈ మొండిగా మారుతుంది. కాబట్టి దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
 • గర్భిణులకుతొలి మూడు నెలల్లో ఒసాల్టమివిర్‌ మాత్రలు ఇవ్వకూడదు. వీరికి రెలెంజా అనే ఇన్‌హేలర్‌ మందు ఉపయోగపడుతుంది. దీన్ని నోటితో లోనికి పీల్చుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఆరేళ్ల లోపు పిల్లలకు ఇవ్వకూడదు.
 • సి రకం: జ్వర లక్షణాలుండి.. ఛాతీలో బరువుగా ఉండటం, బీపీ పడిపోవటం, శరీరం రంగు మారటం, దగ్గితే రక్తం పడటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది గలవారు ఈ కోవలోకి వస్తారు. వీరిని తప్పకుండా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చెయ్యాల్సిందే. ఫ్లూ లక్షణాలు ఏమాత్రం తగ్గకుండా డస్సి పోయినట్టు, తీవ్రంగా నీరసించినట్టు కనిపించే పిల్లలను కూడా ఆసుపత్రిలో చేర్పించాలి. ఎందుకంటే స్వైన్‌ఫ్లూ మరణాలు పిల్లల్లో ఎక్కువ. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత వీరికి పరీక్ష చేస్తారు. అప్పటికే వీరికి న్యుమోనియా ఉంటే అది దేని మూలంగా వచ్చిందో నిర్ధరించుకుంటారు. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ లేదని తేలినా ఒసాల్టమివిర్‌ మందును 5 రోజుల పాటు ఇస్తారు. మిగతా కారణాల వల్ల న్యుమోనియా వచ్చి ఉంటే దానికీ చికిత్స చేస్తారు.

నియంత్రణ[మార్చు]

ఫ్లూ జ్వరం వస్తే..

 • ఇంటికే పరిమితం కావాలి. ఇంట్లో కూడా ప్రత్యేకమైన గదిలో ఉండాలి.
 • దగ్గినపుడు, తుమ్మినపుడు తప్పకుండా నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి.
 • ఇంట్లోని మిగతావారంతా వీరికి దూరంగా ఉండాలి.
 • ఇంట్లో అందరూ తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 • లక్షణాలు ఆరంభమై 48 గంటల తర్వాత కూడా తగ్గకపోతుంటే.. వీరి శ్వాసలో వైరస్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి ద్వారా ఇంట్లో మిగతా వారికీ తేలికగా వ్యాపించే అవకాశం ఉంటుందని గుర్తించాలి.
 • స్వైన్‌ఫ్లూ బాధితులను ఆసుపత్రిలో చేర్చినా.. వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీళ్ల కోసం వినియోగించే పరికరాలను ఇతరులకు వాడకూడదు.
 • ఫ్లూ లక్షణాలున్న వారితో చేతులు కలపటం, కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి చేయరాదు.

లక్షణాలు[మార్చు]

సాధారణంగా ఫ్లూ జ్వరంలో కనిపించే లక్షణాలే స్వైన్‌ఫ్లూలోనూ ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం. వీటికి తోడు దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం కూడా ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు ఉండొచ్చు. సాధారణంగా ఈ ఫ్లూ లక్షణాలు కనబడినప్పుడు పెద్ద ఆందోళన అక్కర్లేదు. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి ముదురుతుంటే మాత్రం తాత్సారం చెయ్యకూడదు. లక్షణాలు తీవ్రంగా ఉండి కూడా చాలా రోజులు చికిత్స తీసుకోకపోతే మరణావకాశాలు పెరుగుతాయి. మనం చూస్తున్న స్వైన్‌ఫ్లూ మరణాలన్నింటికీ దాదాపు ఇదే కారణం! ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూతో చనిపోయిన వారిని పరిశీలిస్తే- వీరంతా లక్షణాలు మొదలైన 10-15 రోజులైనా చికిత్స తీసుకోకపోవటం వల్ల న్యుమోనియా తీవ్రతరమై మరణించారు. పైగా వీరిలో చాలామందికి మధుమేహం, గుండె జబ్బుల వంటి ఇతరత్రా ఏదో ఒక సమస్య కూడా ఉన్నట్టు తేలింది. గర్భిణులు, చిన్నపిల్లలకు కూడా స్వైన్‌ఫ్లూ తీవ్రమైతే మరణించే ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ లక్షణాలు కనబడి 48 గంటల తర్వాత కూడా లక్షణాల తీవ్రత తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భిణులు, పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.

స్వైన్‌ఫ్లూ టీకా[మార్చు]

స్వైన్‌ఫ్లూ రాకుండా చూసుకోవటానికి ఇప్పుడు టీకా అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక్క స్వైన్‌ఫ్లూకే కాదు. మిగతా ఫ్లూ రకాలకూ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన వాతావరణంలో స్వైన్‌ఫ్లూతో పాటు మరో రెండు రకాల ఫ్లూ వైరస్‌లూ (హెచ్‌3 ఎన్‌2, ఇన్‌ఫ్లూయెంజా బి) ఉన్నాయి. ఈ టీకా మూడు రకాల వైరస్‌ల నివారణకు తోడ్పడుతుంది. అందుకే దీన్ని 'ట్రైవలెంట్‌' టీకా అంటారు.

 • చాలామంది నాకు ఫ్లూ వచ్చింది.. ఇప్పుడు టీకా తీసుకోవాలా? అని అడుగుతుంటారు. ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత ఇంక టీకా అవసరం ఉండదు. అందుకే ఈ టీకాను ఫ్లూ జ్వరాల విజృంభణ కంటే ముందే తీసుకుంటే ఫ్లూ రాదు. సాధారణంగా ఏప్రిల్‌లో టీకా తీసుకుంటే ఏడాది పాటు రక్షణ ఉంటుంది కాబట్టి ఫ్లూ జ్వరాలను సమర్థంగా నివారించుకోవచ్చు.
 • అలాగే కొందరు నాకు దగ్గు, జలుబు ఉంది, టీకా తీసుకోవాలా? అని అడుగుతుంటారు. కానీ నిజానికి దగ్గు, జలుబు ఉన్నప్పుడు అసలు టీకా తీసుకోకూడదు. ఏ టీకాలైనా సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి. అలాగే టీకా తీసుకున్న 4 వారాలకు శరీరంలో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే 'యాంటీ బోడీలు' తయారవుతాయి. కాబట్టి ఒకవేళ ఈ నాలుగు వారాల్లోపే వైరస్‌ ఒంట్లో ప్రవేశిస్తే టీకా పనిచెయ్యదు. కాబట్టి దీన్ని ముందే తీసుకోవటం మంచిది.
 • అమెరికా వంటి దేశాల్లో ఈ టీకాను సూపర్‌ మార్కెట్లలో కూడా 'ఫ్లూ షాట్‌' పేరుతో ఇచ్చేస్తుంటారు. దీనివల్ల సమాజంలో ఫ్లూ బెడదను బాగా నివారించే అవకాశం కలుగుతోంది.
 • టీకాల్లో ఒకరకం... ముక్కులో కొట్టుకునే 'స్ప్రే' వంటిదీ ఉంది. దీన్ని అందరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, గర్భిణులకు, పిల్లలకు ఇవ్వకూడదు. దీనివల్ల వారిలో జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. మిగతావాళ్లు తీసుకోవచ్చు.

టీకా ఎవరికి అవసరం?[మార్చు]

స్వైన్‌ఫ్లూ బెడద వద్దనుకునే సాధారణ ఆరోగ్యవంతులు ఎవరైనా తీసుకోవచ్చు. వీరిలో స్వైన్‌ఫ్లూ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి వైద్యులు వీరిని కచ్చితంగా తీసుకోమని చెప్పటం లేదు. కానీ.. * ఆరేళ్లలోపు పిల్లలు * 60 సంవత్సరాల పైనున్న వృద్ధులు * గర్భిణులు * అవయవ మార్పిడి చేయించుకున్నవారు * రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు * వైద్య సిబ్బంది ... వీరంతా కచ్చితంగా టీకా తీసుకోవటం మంచిది.

టీకా మోతాదులేమిటి?[మార్చు]

ఆర్నెల్ల నుంచి 9 ఏళ్ల వయసు వరకూ పిల్లల్లో 0.25 ఎంఎల్‌ కండలోకి నెల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాలి. 9 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా 0.5 ఎంఎల్‌ ఒక్క డోసు ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత నాలుగు వారాల నుంచీ ఇది పని చెయ్యటం మొదలుపెడుతుంది. టీకా తీసుకున్న రోజున ఇంజక్షన్‌ చేసిన చోట కొద్దిగా నొప్పి, కొద్దిపాటి వాపు, చాలా కొద్దిగా జ్వరం ఉండొచ్చు. అయితే టీకా ఎప్పుడూ కూడా వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇప్పటికే జ్వరం ఉన్నవాళ్లు, ఇప్పటికే ఏదైనా నాడీమండల (నరాల) సమస్యలున్న వాళ్లు, గుడ్డు సరిపడని అలర్జీ ఉన్న వాళ్లు మాత్రం దీన్ని తీసుకోకూడదు.

 • గర్భిణులకు: గర్భిణులు మొదటి మూడు నెలల్లో టీకా తీసుకోకూడదు. 4-6 నెలల మధ్య తీసుకోవచ్చు. పైగా ఈ సమయంలో తీసుకుంటే అదనపు ప్రయోజనమేమంటే- వీరికి పుట్టే పిల్లలకు కూడా ఫ్లూ రాకుండా రక్షణ ఉంటోంది. (ఈ టీకాను మామూలుగా ఆర్నెల్ల పైవయసు పిల్లలకే ఇస్తారు. అంటే ఆలోపు పిల్లలకు ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. అదే గర్భిణి తీసుకుంటే.. ఆ మొదటి ఆర్నెల్లూ కూడా తల్లి టీకా ద్వారా బిడ్డకూ రక్షణ లభిస్తుందన్న మాట!)

మూలాలు[మార్చు]

 1. International Committee on onomy of Viruses. "The Universal Virus Database, version 4: Influenza A". Archived from the original on 2006-10-14. Retrieved 2015-06-23.
 2. "Swine influenza". The Merck Veterinary Manual. 2008. ISBN 1-4421-6742-4. Archived from the original on 2016-03-04. Retrieved April 30, 2009.
 3. Heinen PP (15 September 2003). "Swine influenza: a zoonosis". Veterinary Sciences Tomorrow. ISSN 1569-0830. Archived from the original on 6 మే 2009. Retrieved 23 జూన్ 2015. Influenza B and C viruses are almost exclusively isolated from man, although influenza C virus has also been isolated from pigs and influenza B has recently been isolated from seals.
 4. "Swine Influenza". Swine Diseases (Chest). Iowa State University College of Veterinary Medicine.
 5. "ఈనాడు ఆర్టికల్". Archived from the original on 2015-06-14. Retrieved 2015-06-14.

ఇతర లింకులు[మార్చు]