హైపర్‌లూప్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
హైపర్‌లూప్ అనునది అభివృద్ధి చెందుతున్న ఒక నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్ లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయి.ప్రముఖ శాస్త్రవేత్త, టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలన్ మస్క్ ఈ వ్యవస్థకు సూత్రధారి[1][2]. ఈ వ్యవస్థను ఉపయోగించి గంటకు కనీసం 600 మైళ్ల (965 కిలోమీటర్లు) వేగంతో దూసుకెళ్లవచ్చు. అంటే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో పోవడం మాత్రమే కాదు.. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంటకంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు!!
నేపధ్యము
[మార్చు]2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా దీనిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెళతాయి. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.
2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ గురించి ప్రతిపాదించాడు . కొన్ని నెలల తరువాత మస్క్ తన ఆలోచనలన్నింటినీ ఆల్ఫా డిజైన్ పేరుతో అందరితో పంచుకున్నాడు. ప్రపంచంలో ఎవరైనా ఈ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు వీలుగా ఓపెన్ లెసైన్సింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించాడు. రెండు మూడేళ్లలో హైపర్‌లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఒక టెస్టింగ్ ట్రాక్‌ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని, బోగీలు మొదలుకొని, ఇతర వ్యవస్థలను ఎవరైనా అభివృద్ధి చేయవచ్చునని మస్క్ ప్రకటించాడు. ఇందుకు అనుగుణంగానే 2015 ఫిబ్రవరి నెలలో హైపర్‌లూప్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ మస్క్ ఆలోచనలను నిజం చేసేందుకు ముందుకొచ్చింది[3]. దీంతోపాటు జంప్‌స్టార్ట్ ఫండ్ వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సరికొత్త రవాణా వ్యవస్థ రూపకల్పనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
పనితీరు
[మార్చు]దీని నిర్మాణంలో సొరంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాంక్రీట్ స్తంభాలపై వందల కిలోమీటర్ల పొడవున గుండ్రటి గొట్టాలతో సొరంగాన్ని ఏర్పాటు చేస్తే అది హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ అవుతుంది. కాకపోతే.. ఈ గొట్టాల్లోపల అతితక్కువ పీడనం ఉంటుంది. దాదాపు ఆరు అడుగుల వెడల్పుండే ఈ గొట్టంలో ప్రయాణీకుల కోసం బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 28 మంది ప్రయాణించవచ్చు. అర నిమిషానికి ఒక బోగీ గొట్టం మార్గం గుండా ప్రయాణం మొదలుపెడుతుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఏర్పాటు చేసే ఎలక్ట్రిక్ మోటర్ ఈ బోగీలు మరింత వేగంగా ప్రయాణించేందుకు, గమ్యస్థానాన్ని చేరుకునేటప్పుడే వేగాన్ని తగ్గించేందుకూ ఉపయోగిస్తారు.
బోగీ ముందుభాగంలో ఉండే భారీ ఎగ్జాస్ట్‌ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలినీ పీల్చుకుని వెనుకభాగంలోకి పంపిస్తూ ఉంటుంది. అతిసన్నటి గాలిపొరపై బోగీ తేలియాడుతూ ఉంటుందన్నమాట. ప్రయాణీకుల లగేజీని బోగీ వెనుకభాగంలో ప్రత్యేక ప్రదేశంలో ఉంచుతారు. గొట్టం మొత్తం అతితక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణీకులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అతిపెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా... హైపర్‌లూప్ స్తంభాలు, బోగీలు ఉంటాయి.
లాభాలు
[మార్చు]హైపర్‌లూప్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఖర్చు గురించి. మస్క్ తన ప్రాజెక్టును శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 558 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గంలో హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లు (రూ.43,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా కానీ దాదాపుగా ఇంతే పొడవున్న హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించే అవసరముండదు కాబట్టి పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పైగా ఈ వ్యవస్థ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా శక్తిని ఆదా చేస్తుంది. గొట్టపు మార్గం పొడవునా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తు చేసుకోవచ్చు. రహదారుల కోసం భూమి సేకరించాల్సిన అవసరమే ఉండదు.
హైపర్‌లూప్ ప్రత్యేకతలు
[మార్చు]- గరిష్ఠ వేగం (గంటకు) : 1220 కిలోమీటర్లు
- ఒక్కో బోగీలో పట్టే వాహనాలు : 3
- వాడుకునే శక్తి : 26,000 హార్స్‌పవర్ (2.1 కోట్ల మెగావాట్ల విద్యుత్తు)
- సోలార్‌ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 76,000 హార్స్‌పవర్
- తొలిమార్గం : శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్
- టికెట్ ఖరీదు : 20 డాలర్లు (రూ.1200)
- ప్రయాణీకుల సంఖ్య (గంటకు) 840
మూలాలు
[మార్చు]- ↑ Garber, Megan (July 13, 2012). "The Real iPod: Elon Musk's Wild Idea for a 'Jetson Tunnel' from S.F. to L.A." The Atlantic. Retrieved September 13, 2012.
- ↑ Musk, Elon (August 12, 2013). "Hyperloop Alpha" (PDF). SpaceX. Archived from the original (PDF) on 2016-01-28. Retrieved August 13, 2013.
- ↑ Davies, Alex (December 18, 2014). "These Dreamers Are Actually Making Progress Building Elon's Hyperloop". Wired. Retrieved December 19, 2014.
బయటి లంకెలు
[మార్చు]- Tesla Motors: Hyperloop Alpha PDF
- SpaceX: Hyperloop Alpha PDF