12 యాంగ్రీ మెన్
12 యాంగ్రీ మెన్ | |
---|---|
దర్శకత్వం | సిడ్నీ లూమెట్ |
రచన | రెజినాల్డ్ రోస్ |
నిర్మాత | హెన్రీ ఫోండా రెజినాల్డ్ రోస్ |
తారాగణం | హెన్రీ ఫోండా |
ఛాయాగ్రహణం | బోరిస్ కాఫ్‌మన్ |
కూర్పు | కార్ల్ లెమర్ |
సంగీతం | కెన్యన్ హాప్‌కిన్స్ |
పంపిణీదార్లు | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
విడుదల తేదీs | అమెరికా: 1957 ఏప్రిల్ 13 |
సినిమా నిడివి | 96 నిమిషాలు |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | US$340,000 (అంచనా) |
12 యాంగ్రీ మెన్ అనే నాటకం ఆధారంగా 1957లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 1954 లో రెజినాల్డ్ రోస్ రాసిన టెలిప్లే ఆధారంగా ఈ సినిమా తీసారు.[1] నిందితుడు నిరపరాధి అని నమ్మిన ఒక జ్యూరీ సభ్యుడు, అతడు నేరస్థుడే అని నమ్మే మిగతా 11 మంది సభ్యులను తన ఆలోచనలతో, తన వాదనాపటిమతో ఎలా మార్చగలిగాడు అన్నది ఈ చిత్ర కథాంశం. హెన్రీ ఫోండా ఈ సినిమాలో నటించడమే కాకుండా దీనికి సహ నిర్మాత కూడా. లీ జె కాబ్, ఎడ్ బెగ్లీ, ఇ.జి. మార్షల్, జాక్ వార్డెన్ ఇతర ప్రముఖ నటులు.
కథాంశం
[మార్చు]ఒక కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడన్న ఆరోపణ పైన కోర్టులో వాదోపవాదాలు ముగుస్తాయి. అమెరికన్ చట్ట ప్రకారం న్యాయనిర్ణేతలయిన 12 మంది తమలో తాము చర్చించుకొని ఏకగ్రీవంగా ఒప్పుకున్నపుడే దోషిని శిక్షించవచ్చు. ఏ ఒక్కరు ఒప్పుకొనకపోయినా తిరిగి విచారణ మొదలవుతుంది.
12 మంది జ్యూరీ సభ్యులు ఒక గదిలోకి వెళ్ళి, నిజంగా ఆ కుర్రవాడు చేసాడా లేదా అన్న విషయం పైన చర్చించడం మొదలు పెడతారు. కోర్టులో సాక్షులు చెప్పిన దానిని బట్టి, మరి కొన్ని ఆధారాలను బట్టీ ఆ కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడని 11 మంది జ్యూరీ సభ్యులు నిర్ణయిస్తారు. ఒక్క సభ్యుడు మాత్రం ఆ కుర్రవాడు హత్య చేసాడనడానికి ఆధారాలు లేవని, ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడనీ అంటాడు.
ఆ ఒక్క సభ్యుడు తన అభిప్రాయాలను తెలియజేసి, పలు సన్నివేశాలను ఊహించి ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడు అని ఒక్కొక్క సభ్యుణ్ణే ఒప్పిస్తూ చివరగా మొత్తం 11 మందినీ ఒప్పించడంతో ఆ కుర్రవాడు నిర్దోషి అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు.
నిర్మాణం
[మార్చు]ఈ సినిఉమా షూటింగు న్యూయార్కులో చేసారు. $3,37,000 బడ్జెట్టులో (2021 ధరల ప్రకారం ఇది $32,51,000 కు సమానం) ఈ సినిమా తీసారు.[2] ఎంతో శ్రమించి రిహార్సిల్స్ చేయడం వలన కేవలం మూడు వారాలలో సినిమా నిర్మాణం పూర్తి అయింది.
దాదాపు సినిమా అంతటినీ కేవలం ఒకే గది ఉన్న సెట్‌లో తీయడం ఈ సినిమా విశిష్టత. మూడు నిమిషాలు మినహా మొత్తం సినిమా 16 x 24 అడుగుల గదిలో జరుగుతుంది. కథాంతంలో ఇద్దరు జ్యూరీ సభ్యులు తమ పేర్లు ఒకరికొకరు చెప్పుకోవడం మినహా, సినిమా మొత్తంలో ఎవ్వరి పేరూ వినపడదు. సంబోధనలన్నీ 'కుర్రవాడు', 'వృద్దుడు' 'ఎదురింటిలో ఉన్న స్త్రీ' అంటూనే సాగుతాయి.
స్పందన
[మార్చు]విడుదల తర్వాత ఈ చిత్రం విమర్శకులనుండి గొప్ప పేరు తెచ్చుకుంది. కానీ అప్పటికే ప్రసిద్ధి పొందుతున్న కలర్ సినిమాల వల్ల బ్లాక్ అండ్ వైట్‌లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయింది. 8వ న్యాయనిర్ణేతగా హెన్రీ ఫోండా నటించిన పాత్ర 20వ శతాబ్దపు 50 గొప్ప పాత్రలలో 28వ స్థానంలో నిలిచింది. కోర్టు డ్రామాకు సంబంధించిన చిత్రాలలో ఇది రెండవ అత్యుత్తమ చిత్రంగా పేరుపొందింది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో కోర్ట్ రూం డ్రామా విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది.[3]
విడుదలైనపుడు ఘన విజయం సాధించని ఈ చిత్రం, కాలక్రమంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని గొప్ప చిత్రాల జాబితాలో చేరింది. ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు 'ఆలోచనా ధోరణి ' గురించి బోధించడానికి ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "12 Angry Men". Harrison's Reports. March 2, 1957. p. 35. Retrieved June 7, 2019 – via archive.org.
- ↑ Hollinger, Hy (December 24, 1958). "Telecast and Theatre Film, Looks As If '12 Angry Men' May Reap Most Dough As Legit Play". Variety. p. 5. Retrieved May 21, 2019 – via archive.org.
- ↑ "AFI's 10 Top 10 Courtroom Drama". American Film Institute. June 17, 2008. Retrieved November 29, 2014.