మాలిక్ అంబర్

వికీపీడియా నుండి
(Malik Ambar నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాలిక్ అంబర్
మాలిక్ అంబర్ [1][2]
జన్మనామంచాపు[3]
జననం1548[3]
కంబాత[3]
మరణం11 మే 1626 (aged 77–78)
రాజభక్తిఅహ్మద్ నగర్ పాలకుడైన నిజాం షా

మాలిక్ అంబర్ (1548 – 13 మే 1626) దక్కన్ ప్రాంతానికి చెందిన ఇథియోపియన్ సైనిక నాయకుడు. ఇథియోపియాలో చాపుగా జన్మించిన అంబర్‌ను తల్లిదండ్రులు బానిసగా అమ్మివేయగా, మధ్యప్రాచ్యంలో కొంతకాలం పెరిగి, భారతదేశానికి బానిసగా వచ్చాడు. దక్కన్‌లో ఇథియోపియన్ యజమానికి సైనికునిగా సేవలందించి అతని మరణానంతరం స్వేచ్ఛ పొందిన అంబర్ తన శక్తిసామర్థ్యాలు, రాజకీయ చతురతతో సైన్యశక్తిని పెంపొందించుకున్నాడు. మొఘల్ పాలకుడు జహంగీర్ దక్కన్‌లోని రాజ్యాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న కాలంలో అహ్మద్ నగర్ నిజాంషాహీ వారసుడిని సింహాసనం మీద నిలిపి యుద్ధాలు చేసి రాజ్యాన్ని నిలబెట్టాడు. అహ్మద్ నగర్ సుల్తానులకు ప్రధానమంత్రిగా పనిచేస్తూ సుల్తానులను నామమాత్ర అధికారంతో ఉంచి తానే నిజపాలకునిగా వ్యవహరించాడు.

ప్రధానమంత్రిగా పరిపాలన వ్యవహారాల్లోనూ, సైన్యాధ్యక్షునిగా వ్యూహనిపుణతలోనూ గొప్ప పేరుపొందాడు. శివాజీ, మరాఠాలు మరింత మెరుగుపరిచి ప్రయోగించిన గెరిల్లా యుద్ధ పద్ధతులను దక్కన్‌ సైనిక చరిత్రలో తొలిసారి ప్రవేశపెట్టింది మాలిక్‌ అంబరే. దక్కన్ ప్రాంతంలో రెవెన్యూ సంస్కరణలకు నాందిపలికిన వ్యక్తిగా పేరొందాడు. ఈ సంస్కరణలను తర్వాతి రాజ్యాలు మరింత మెరుగుపరిచాయి. ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డ సిద్ధీలకు అతను ఆరాధనీయుడు. అతని సైనిక, పరిపాలన విజయాలతో బలహీనమైన నిజాం జాహీ గౌరవాన్ని పెంచి, మొఘల్ చక్రవర్తి జహంగీర్, బీజాపూర్‌ ఆదిల్ షాల దూకుడు అడ్డుకున్నాడు.[4][5]

బాల్యం, బానిసత్వం[మార్చు]

ఆఫ్రికా నుంచి బాగ్దాద్ వరకు[మార్చు]

అంబర్ 1550కి అటూఇటుగా ఇథియోపియా (ఆనాటి అబిసీనియా)కు చెందిన హరార్ ప్రావిన్సులోని కంబాత ప్రాంతంలో జన్మించాడు. చిన్నతనంలోనే బానిసగా అతన్ని అమ్మేశారు. హిజాజ్ నగరానికి బానిసగా అడుగుపెట్టిన అతన్ని యజమానులు, బానిస వర్తకులు అమ్మివేస్తూండగా మోచా, బాగ్దాద్ నగరాల్లో యజమానులకు అమ్ముడుపోయాడు. బాగ్దాద్లో అతని యజమాని మీర్ ఖాసిం అతన్ని ఇస్లాం మతానికి మార్చి, అంబర్ అన్న పేరుపెట్టాడు. మీర్ ఖాసిం అంబర్ కి నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో విద్య నేర్పాడు. తన ఇరవైల్లో ఉండగా 1570 దశకం తొలి సంవత్సరాల్లో నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ మంచి నిపుణుడైన బానిసగా అంబర్ ను మీర్ ఖాసిం అమ్మివేశాడు. ఈసారి అంబర్ భారతదేశంలో దక్కన్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నగర్ కు వచ్చాడు.[6]

అహ్మద్ నగర్ లో[మార్చు]

అహ్మద్ నగర్ రాజ్యపాలకుడైన హుస్సేన్ నిజాంషా వద్ద పీష్వాగా పనిచేస్తున్న ఛెంఘిజ్ ఖాన్ అంబర్ ను మీర్ ఖాసిం నుంచి కొనుక్కున్నాడు. ఛెంఘిజ్ ఖాన్ ఇథియోపియా నుంచి బానిసగా సైన్యంలో పనిచేయడానికి వచ్చి రాజ్యానికి ప్రధానమంత్రి హోదా అయిన పీష్వాగా ఎదిగినవాడు. ఇథియోపియాని అప్పట్లో అబిసీనియా అని పిలిచేవారు, దాని పేరు మీదుగా అబిసీనియా నుంచి వచ్చారన్న అర్థం వచ్చేలా వీరిని హబ్శీలని పిలిచేవారు. పీష్వాగా ఎదిగిన తోటి హబ్శీని చూసిన అంబర్ తన ముందు ఉన్న అవకాశాలు కనుగొన్నాడు. అరబిక్ భాషా జ్ఞానం, సునిశితమైన దృష్టి, వ్యవహార జ్ఞానం, తన యజమాని పట్ల సడలని విశ్వాసంతో అంబర్ తన యజమాని ఛెంఘిజ్ ఖాన్ ను, ఇతర హబ్శీలను ఆకట్టుకున్నాడు. యజమాని అంబర్ ని ముందు తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకుని, తర్వాత సైనికాధికారిగా పదోన్నతి కల్పించి సైనిక నాయకునిగా అతని భవిష్యత్తుకు పునాది వేశాడు. ఇలా కొన్ని దశాబ్దాలు గడుస్తూండగా 1590ల మొదట్లో అతని యజమాని హత్యకు గురయ్యాడు. అహ్మద్ నగర్ రాజ్యం ఈ ఘటనతో అంతర్గత వివాదాలతోనూ, బయట నుంచి మొఘలులు రాజ్యాన్ని ఆక్రమించాలని చేసే ప్రయత్నాలతోనూ రాజకీయంగా అల్లకల్లోలమైంది. అంబర్ యజమాని భార్య అంబర్ కు స్వేచ్ఛ ప్రసాదించింది, అతని బానిసత్వం అలా ముగిసింది.[6]

సైన్యాధ్యక్షునిగా[మార్చు]

బీజాపూర్లో సైనిక నాయకునిగా[మార్చు]

అహ్మద్ నగర్ అంతర్గత, బహిర్గత సమస్యలతో సతమతమవుతున్న దశలో అంబర్ పక్కనే ఉన్న బీజాపూర్ రాజ్యానికి తరలిపోయాడు. అక్కడ సుల్తాన్ అతనికి చిన్న దళానికి సేనా నాయకునిగా చేసి, మాలిక్ (రాజులాంటివాడు) అన్న బిరుదు ఇచ్చాడు. 1595లో బీజాపూర్ సుల్తాను కొలువులో తనకు దక్కుతున్న కొద్దిపాటి జీతం సంతృప్తి కలిగించలేకపోవడంతో మాలిక్ అంబర్ ఆ పని విడిచిపెట్టి అహ్మద్ నగర్ తిరిగివచ్చాడు.

అహ్మద్ నగర్లో రెండవ ముర్తెజాకు పట్టాభిషేకం[మార్చు]

1595లో మాలిక్ అంబర్ అహ్మద్ నగర్ కు తిరిగివచ్చేనాటికి రాజ్యం వారసత్వ కుట్రలతో, మొఘల్ చక్రవర్తి రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకోవడానికి చేస్తున్న యుద్ధాలతో కకావికలై ఉంది. అభంగర్ ఖాన్ అన్న హబ్శీ పీష్వా నిర్వహిస్తున్న సైన్యంలో 150 మంది నమ్మకస్తులైన సైనికులతో కూడిన ఆశ్విక దళానికి నాయకునిగా అంబర్ చేరాడు. ఆ అరాచక స్థితిగతుల మధ్య అత్యంత వేగంగా ఎదిగి కొద్దికాలానికే 7 వేల మంది సైన్యానికి నేతృత్వం వహించే స్థాయికి చేరాడు.[6]


1600లో అహ్మద్‌నగర్ కోట ముట్టడిలో మొఘలులు విజయం సాధించారు. మాలిక్ అంబర్ అహ్మద్ నగర్ రాజ్యాన్ని మొఘలుల బారి నుంచి కాపాడి, స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పలువురు చరిత్రకారులు "వీరోచిత పోరాటం" అని అభివర్ణించిన సైనిక, రాజకీయ యత్నాన్ని మొదలుపెట్టాడు. నిజాం షాహీ సింహాసనంపై మొదటి బుర్హాన్ నిజాం షా మనవడు, అప్పుడే మొఘల్ ముట్టడిలో ఓడిపోయిన బహదూర్ నిజాం షా మేనల్లుడు అయిన రెండవ ముర్తెజా నిజాం షాను రాజుగా నిలబెట్టాడు.[6] ముర్తెజా నిజాం షాను కేవలం నామమాత్ర పాలకుడిగా ఉంచి, తాను రాజ్యపాలనలో, సైన్యనిర్వహణలో కీలకమైన బాధ్యతలు తీసుకున్నాడు.

రాజు దక్కనీతో వ్యూహాత్మక ఒప్పందం[మార్చు]

రాజు దక్కనీ అనే తోటి సైన్యాధ్యక్షునితో అప్పటివరకూ తనకున్న సమస్యలను అంబర్ పక్కనపెట్టి చేతులు కలిపాడు. బీజాపూర్, గోల్కొండ రాజ్యాలతో సరిహద్దు పంచుకుంటున్న అహ్మద్‌నగర్ రాజ్యపు తెలంగాణ ప్రాంతంలో మాలిక్ అంబర్, గుజరాత్ సరిహద్దు వరకు అహ్మద్‌నగర్ రాజ్యపు ఉత్తర ప్రాంతాలైన నాసిక్, దౌలతాబాద్‌లను రాజు దక్కనీ అధికారం స్థాపించుకుని, రాజ్యాన్ని పంచుకున్నారు. మాలిక్ అంబర్ ప్రభావంలోనే రాజ్యానికి నామమాత్ర పాలకుడైన రెండవ ముర్తెజా ఉండే రాజధాని అహ్మద్‌ నగర్ ఉండేది. మాలిక్ అంబర్ రెండవ ముర్తెజాకు పట్టాభిషేకం చేశాకా మొఘల్ దండయాత్రల నుంచి రాజ్యాన్ని, తమ అధికారాన్ని కాపాడుకోవాలన్న పెద్ద లక్ష్యం కోసం తనకున్న అంతర్గత శత్రువులను వ్యూహాత్మకంగా మిత్రులను చేసుకున్నాడు.[7]

మొఘల్ సైన్యాధ్యక్షులతో యుద్ధాలు, సంధులు[మార్చు]

మొఘలులు అహ్మద్ నగర్ నిజాంషాహీని దెబ్బతీయడానికి ఇద్దరు సైన్యాధ్యక్షులను పంపారు.  అబుల్ ఫజల్ నాయకత్వంలో సైన్యాన్ని ఉత్తరాన రాజు దక్కనీ ప్రాంతాలకు, అబ్దుర్ రహీం ఖాన్-ఇ-ఖానాన్ నేతృత్వంలో మరో సైన్యభాగాన్ని దక్షిణాన మాలిక్ అంబర్‌ మీదికి పంపారు. రాజు దక్కనీ మీదికి అబుల్ ఫజల్ వెళ్ళినప్పుడు, ఆ యుద్ధకాలంలో తనకు చిక్కిన కాస్త విరామాన్ని ఉపయోగించుకుని మాలిక్ అంబర్ రాబోయే యుద్ధాలకు బాగా సన్నద్ధమయ్యాడు. ఆపైన 1601లో జరిగిన పలు యుద్ధాల్లో మొఘల్ సైన్యాలను ఓడించాడు. 1601 మే 16న నాందేడ్ సమీపంలో గోదావరి తీరంలో జరిగిన యుద్ధంలో అంబర్ ఓటమి చెంది శాంతి కోసం మొఘల్ సైనికాధికారిని అభ్యర్థించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మొఘలులతో అంబర్ శాంతి పాటించేట్టు, ముందు జరిగిన యుద్ధాల్లో ఖైదీలుగా దొరికిన మొఘల్ సైన్యాధికారులను విడుదల చేసేట్టు, అందుకు మొఘలులు ఆసా, ధరూర్ ప్రాంతాలు, బీర్ ప్రాంతంలో కొంత భాగం అంబర్ కు అప్పగించేట్టు సంధి కుదిరింది.[7]

కొద్ది నెలల వ్యవధిలో తిరిగి మొఘలుల మీద పోరాటాలు చేసి దెబ్బతీశాడు. క్రమేపీ 1602లో మరోసారి మొఘల్ సైన్యం అంబర్ సైన్యాన్ని ఓడించింది. ఐతే దక్కన్ లో మొఘల్ సైన్యాధికారులు అబుల్ ఫజల్, ఖాన్-ఇ-ఖానాన్ల మధ్య సమన్వయ లోపం, ఒకరి పద్ధతుల మీద మరొకరికి అభ్యంతరాలు పెరిగాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న అంబర్ తనకు అనుకూలము, సంతృప్తికరమూ అయిన సంధి షరతులు రాబట్టుకోగలిగాడు. మొఘల్ సైన్యాలు పత్రి వరకూ వెనక్కుతగ్గడం అలా సాధించుకున్న సంధి షరతులో భాగం కావచ్చని చరిత్రకారుడు ఎం.సిరాజ్ అన్వర్ అంచనా వేశాడు.[7] మొఘల్ చక్రవర్తి అక్బర్ మరణ శయ్య మీద ఉండడం, సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు సాగుతూండడం సంధి కోసం మొఘలులు త్వరపడడానికి ప్రధాన కారణం.[8] ఇది మొఘల్ సైన్యంతో 1607 వరకు అంబర్ కు యుద్ధం లేకుండా శాంతి సంపాదించుకునే వీలునిచ్చింది.[7]

సైనిక, పరిపాలన, రెవెన్యూ సంస్కరణలు[మార్చు]

మాలిక్ అంబర్ 1601 నుంచి 1607 వరకు అహ్మద్ నగర్ సైనిక, పరిపాలన, రెవెన్యూ వ్యవస్థల్లో పలు సంస్కరణలు తీసుకువచ్చాడు. అతను సైన్యంలో క్రమశిక్షణతో కూడిన అశ్విక దళాన్ని రూపొందించాడు. మరాఠా అశ్విక దళం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వారిని పెద్ద ఎత్తున సైన్యంలోకి తీసుకున్నాడు. వారికి గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో శిక్షణనిచ్చాడు.[7] రెవెన్యూ వ్యవస్థలో సర్వే చేపట్టి, ఖచ్చితమైన కొలమానాలు రూపొందించి, మధ్యలో అధికారులు అటు రైతులను, ఇటు రాజ్యాన్ని మోసంచేసే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశాడు.[9]

రాజు దక్కనీపై అంతిమ విజయం[మార్చు]

రాజు దక్కనీ 1602-04 వరకూ మొఘల్ సైన్యంతో పోరాడి చివరికి సంధి కుదుర్చుకున్నాడు. ఆపైన రాజు దక్కనీకి, మాలిక్ అంబర్ కీ నడుమ మరోసారి యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 1608లో పూణె-నాసిక్ నగరాల నడుమ నిర్ణయాత్మక యుద్ధంలో రాజు దక్కనీ సైన్యాలను ఓడించిన అంబర్ అతని ప్రభావంలో ఉన్న ఉత్తర ప్రాంతం అంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.[8]

మొఘల్ సైన్యాలతో తిరిగి యుద్దాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sheikh Chand, Malik Ambar,"Ehde Afreen; Hyderabad; 1929
  2. Times of India, Plus Supplement, July 1999,
  3. 3.0 3.1 3.2 African Elites in India. Mapin. 2006. p. 50. ISBN 8188204730. Retrieved 29 August 2017. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
  4. [1][permanent dead link]
  5. Michell, George & Mark Zebrowski. Architecture and Art of the Deccan Sultanates (The New Cambridge History of India Vol. I:7), Cambridge University Press, Cambridge, 1999, ISBN 0-521-56321-6, p.11-12
  6. 6.0 6.1 6.2 6.3 జెకల్స్కా, రెనెటా; కుజ్కీవిక్జ్-ఫ్రాజ్, అగ్నీస్జ్కా (2016). "ఫ్రం ఆఫ్రికన్స్ ఇన్ ఇండియా టు ఆఫ్రికన్ ఇండియన్స్". పోలిటెజా (in ఆంగ్లం). Jstor (42): 189–212. ISSN 1733-6716. Retrieved 13 April 2019.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  7. 7.0 7.1 7.2 7.3 7.4 ANWAR, M. SIRAJ (1994). "MALIK AMBAR AND THE MUGHALS, 1601-26". Proceedings of the Indian History Congress. 55: 355–367. ISSN 2249-1937. Retrieved 13 April 2019.
  8. 8.0 8.1 Stewart Gordan 1993, pp. 41, 42.
  9. KULKARNI, G.T. (1991). "LAND REVENUE SETTLEMENT UNDER THE NIZAM SHAHIS (1489-1636) - WITH SPECIAL REFERENCE TO MALIK AMBAR - A PRELIMINARY STUDY". Proceedings of the Indian History Congress. 52: 369–377. ISSN 2249-1937. Retrieved 13 April 2019.

ఆధార గ్రంథాలు[మార్చు]