Jump to content

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

వికీపీడియా నుండి
(Vemuri dictionary (English-Telugu) నుండి దారిమార్పు చెందింది)
నిఘంటువు ముఖచిత్రం

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు ను ప్రముఖ విజ్ఞానశాస్త్ర రచయిత వేమూరి వేంకటేశ్వరరావు రచించాడు. ఇది 2002 లో ప్రచురింపబడింది.[1]

ఆధునిక నిఘంటువు అవసరం

[మార్చు]

తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (dictionary), పర్యాయపద కోశం (thesaurus), శైలి లక్షణ గ్రంథం (style manual) ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది.

మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ - పండితుల నుండి పామరుల దాకా, అందరినీ - ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం, ....., ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కరణ జరుగుతూన్న క్రొంగొత్త విషయాల గురించి తెలుగులో చెప్పవలసిన అవసరం ఉంది. సెల్ ఫోనుల వాడకం దగ్గరనుండి, రైలు టికెట్టు కొనుక్కోడం దాకా ఇంగ్లీషులోనే పని జరగాలంటే ఎలా?

ఆధునిక అవసరాలకి తెలుగుని వాడేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విషయం గురించి ఏది రాయాలన్నా తెలుగు వాళ్ల బుర్రకి ఇంగ్లీషు మాట తట్టినంత జోరుగా తెలుగు మాట తట్టదు. తెలుగులో పదసంపద లేకపోలేదు. వేళకి సరి అయిన మాట తట్టకపోవడమే పెద్ద సమస్య. పత్రికా విలేఖరులు, చలా చిత్రాలకి సంభాషణలు రాసే వారు, విద్యుత్ ప్రసార మాధ్యమాలలో మాట్లాడే లంగరయ్యలు, లంగరమ్మలు సరి అయిన, సులభమయిన తెలుగు వాడకపోతే వ్రతం చెడుతుంది, ఫలం దక్కదు.

ఇటువంటి నిత్యావసరాలు ప్రేరణ కారణాలు కాగా, ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని నలుగురికీ అర్థమయే తేలిక శైలిలో చెప్పాలనే కోరిక శ్రీ వేమూరికి 1967 లో పుట్టింది. అప్పటి నుండి తెలుగులో శాస్త్రం గురించి, తెలుగు భాష మీద ఎన్నో వ్యాసాలు, కథలు, పుస్తకాలు రాస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయనకి అవసరమైన పదజాలాన్ని - స్వయంబోధకంగా ఉండేటట్లు - ఆయనే సమకూర్చుకునేవారు. మొదట్లో చిల్లర కాగితాల మీద రాసుకున్న ఈ పదజాలం, ఇంతింతై, ఎంతో పెద్దదై, వందల కొద్దీ కాగితాలు నిండిపోయాయి. కంప్యూటర్లు కొత్తగా వస్తూన్న ఆ రోజులలో, తెలుగు ఖతులు అప్పుడప్పుడే పుడుతూన్న ఆ కాలంలో, ఈనాటి సాంకేతిక వెసులుబాట్లు లేని ఆ రాతియుగంలో మొదలు పెట్టిన ఈ ప్రయత్నాన్ని చూసి స్నేహితులు అచ్చు కొట్టించమని హితోపదేశం చేసేరు. అదే 2002 లో ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుగా వెలువడింది. గత 12 సంవత్సరాలలో ఈ నిఘంటువులో చొరబడ్డ అచ్చు తప్పులు సరిదిద్దడం, కొత్త మాటలు చేర్చడం వంటి పనులతో ఈ నిఘంటువుని మెరుగు పెరిగి పెద్దదయింది. అచ్చు ప్రతిలో కంటే ఆయన వద్ద ఉన్న కంప్యూటర్లో ఉన్న మూల ప్రతిలో కనీసం 25 శాతం ఎక్కువ మాటలు, తక్కువ తప్పులు ఉన్నాయి. ఇలా మెరుగు పరచిన నిఘంటువులో ఇంగ్లీషు-తెలుగు భాగాన్ని వికీపీడియా చదువరుల ముందు ఉంచుతున్నాం.

నిఘంటు నిర్మాణం ఒకరి వల్ల అయే పని కాదు. నిఘంటువు వాడుకలో ఉన్న మాటలని అక్షరబద్ధం చేయగలదు కాని, వాడుకని శాసించలేదు. భాష వాడుతూన్నకొద్దీ వాడితేరుతుంది; వాడకపోతే వాడిపోతుంది. ఈ నిఘంటువులో ప్రయోగాత్మకంగా వాడిన మాటలు చాల ఉన్నాయి. ఇవి అన్నీ వేమూరి వారి స్వకపోలకల్పితాలు కావు. పలువురు అరుదుగా వాడిన మాటలు, మరుగున పడిపోతూన్న మాటలు, పాత మాటలని కొత్త అర్థాలతో వాడినవి కూడా ఉన్నాయి. ఆసలు మాటలు ఎలా పుడతాయి? ప్రజలు పుట్టిస్తే పుడతాయి. ఎప్పుడు పుడతాయి? వాడుకలో అవసరమైనప్పుడు సందర్భోచితంగా పుడతాయి కాని కమిటీలలో కాదు. అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారి సౌకర్యం కోసం ఈ నిఘంటువుని వారు తయారు చేసేరు. ఇచ్చిన ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాటలకీ, వాటిని ఉపయోగించే తీరుకీ పెద్ద పీట వేసేరు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. V Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002. ISBN 0-9678080-2-2

ఇతర లింకులు

[మార్చు]
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి: ఆధునిక అవసరాలు, తెలుగుభాషా పత్రిక, సం. 3, స. 2, పు. 9- 1973 అక్టోబరు 13.
  • వేమూరి వేంకటేశ్వరరావు, పారిభాషా పదాల తెలుగు అనువాదానికి కొన్ని సలహాలు, తెలుగు పలుకు, 5వ. ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం, లాస్ ఏంజిలిస్, 5- 1985 జూలై 7,
  • వేమూరి వేంకటేశ్వరరావు, శిష్టవ్యవహారికం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ), పు. 1992 ఫిబ్రవరి 23 & 4వ ప్రపంచ తెలుగు మహాసభ ప్రత్యేక సంచిక,నూ యార్క్, పు. 484, 1992 జూలై.
  • వేమూరి వేంకటేశ్వరరావు, అమెరికాలో తెలుగు నేర్పడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ), పు. 13- 1994 ఆగస్టు 19.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి సూక్ష్మీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 9- 1995 నవంబరు 11.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి స్థాయీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 60- 1996 అక్టోబరు 64.
  • వేమూరి వేంకటేశ్వరరావు, ఇతర భాషలలోని మాటలని తెలుగులో ఉచ్చరించడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ), పు. 23- 1997 మే 25.
  • వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగులో అక్షరాలు ఏవేమిటి?, తెలుగు జ్యోతి (నూ జెర్సీ), పు. 16- 1997 జూన్ 17 & రచన ఇంటింటి పత్రిక, పు. 74- 2000 మార్చి 75.
  • వేమూరి వేంకటేశ్వరరావు (2014-05-01). "వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు". ఈమాట ఇ-పత్రిక. Archived from the original on 2015-04-24.