ఈద్-ఉల్-ఫితర్
ఈద్-ఉల్-ఫితర్ (అరబ్బీ: عيد الفطر) [1] అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటూంటారు.
ఈద్-ఉల్-ఫితర్ నాడు రెండు రకాహ్‌లు అనే విభాగాలతో కూడిన ఒక ప్రత్యేకమైన సలాత్ (ఇస్లామీయ ప్రార్థన) చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ, భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే (జమాత్) చేయాలి. దీనిలో సాధారణ ప్రార్థనకన్నా అదనంగా ఆరు తక్బిర్‌లు (చేతులు చెవుల వరకు ఎత్తి అల్లాహు అక్బర్ (దేవుడు గొప్పవాడు అని అర్థం) అని పలకడం) ఉంటాయి, సున్నీ ఇస్లాంలోని హనీఫీ విధానంలో మూడు తక్బిర్‌లు మొదటి రకాహ్‌కు ముందు, మిగిలిన మూడు రెండవ రకాహ్‌లోనూ ఉంటాయి.[2] ఇతర సున్నీ విధానాల్లో సాధారణంగా 12 తక్బీర్లు ఉంటాయి, మొదట ఏడు, రెండవ రకాహ్ ప్రారంభించడానికి ముందు మరో ఐదు ఉంటాయి. ఈ ఈద్-ఉల్-ఫితర్ సలాత్ అన్నది ఫర్ద్ فرض (తప్పనిసరి), ముస్తహాబ్ مستحب (గట్టిగా సూచిచదగ్గది) లేక మన్‌దూబ్ مندوب (చేయదగ్గది) అన్న మూడు పద్ధతుల్లో ఉంటుంది.
రంజాన్ చివరిరోజు వరకూ ఉపవాసాలు చేయాలనీ, ఈద్ ప్రార్థనలు నిర్వహించేలోపుగా జకాత్ అల్-ఫితర్‌గా పేర్కొనే దానధర్మాలు చేయాలని అల్లా తమను ఖురాన్ ద్వారా శాసించాడని ముస్లిములు నమ్ముతారు.[3]
సమయం
[మార్చు]సంప్రదాయికంగా ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ మాసంలోని 29వ రోజున సూర్యాస్తమయానంతరం నెలవంక మొట్టమొదట కనిపించిన సమయం నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ రంజాన్ మాసపు 29వ తేదీన మబ్బులు అడ్డుపడడం వల్ల కానీ, చంద్రోదయ సమయంలో కూడా పశ్చిమాకాశం ఇంకా ప్రకాశవంతంగా ఉండడం వల్ల కానీ సూర్యాస్తమయం అయిన వెంటనే నెలవంక కనిపించకుంటే ఈద్-ఉల్-ఫితర్ ఆపై వచ్చేరోజున జరుపుకుంటారు.
చరిత్ర
[మార్చు]ఈద్-ఉల్-ఫితర్‌ను ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ ప్రారంభించాడు. ముస్లిములు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ మాసం ముగిశాకా షవ్వల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.[4]
కొన్ని సంప్రదాయాల ప్రకారం, ఈ పండుగలు ముహమ్మద్ మక్కా నుంచి వలస వెళ్ళాకా మదీనాలో ఉండగా ప్రారంభమయ్యాయి. అనస్ చెప్పేదాని ప్రకారం:
ప్రవక్త మదీనా చేరుకున్నాకా, ప్రజలు ఉల్లాసం కోసం, సేదదీరడానికి రెండు ప్రత్యేకమైన రోజుల్లో వేడుక చేసుకుంటున్నట్టు గ్రహించాడు. అతను ఈ పండుగల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నించాడు, వారు ఈ రోజులు సరదా, విశ్రాంతి వంటివి పొందేందుకు సందర్భాలని చెప్పారు. అందుకు ప్రవక్త వారికి బదులిస్తూ- భగవంతుడు వీటి బదులు, ఇంతకన్నా మెరుగైన రెండు (పండుగ) రోజులు: ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అదా నిర్ణయించాడని చెప్పాడు.[5]
ముస్లిములకు ఈదుల్ ఫితర్, ఈదల్ అదా పండుగలు రెండూ అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుర్తుచేసుకోవడానికి, పేదలకు సహాయం అందించడానికి సందర్భాలు.
ఆచార వ్యవహారాలు
[మార్చు]ఈద్-ఉల్-ఫితర్‌ను ఒకరోజు కానీ, రెండు రోజులు కానీ, మూడురోజుల పాటు కానీ జరుపుకుంటారు. పండుగ పూట సాధారణంగా శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అని కానీ, ఈద్ సఇద్ అని కానీ అరబిక్‌లో చెప్పుకుంటారు. పలు దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు- ఉదాహరణకు టర్కీలోబయ్‌రమినిజ్ కుత్లుఒల్సన్ (మీ పండుగ దివ్యంగా ఉండాలి) అని శుభాకాంక్షలు చెప్పుకుంటూంటారు.ముస్లిములు తమ మధ్య ఉన్న విభేదాలు, వివాదాలు మరచిపోవడానికి, ఆ ఏడాదిలో ఏర్పడ్డ కక్షలూ కార్పణ్యాలు మరిచిపోయి ఒకరినొకరు క్షమించుకోవడానికి ఈద్-ఉల్-ఫితర్ను ఒక అవకాశంగా తీసుకోవాలని సంప్రదాయం ప్రోత్సహిస్తోంది.
మతాన్ని అనుసరించే ముస్లింలు సాధారణంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి సలాతుల్ ఫజ్ర్ (సూర్యోదయానికి ముందు ప్రార్థనలు) చేసి, కాలకృత్యాలు, స్నానం అనంతరం కొత్త బట్టలు కానీ, ఉన్నంతలో మంచి బట్టలు కానీ ధరిస్తారు, అత్తరు చల్లుకుంటారు.[6] ఈద్ నాడు ఉపవాసం ఉండడం నిషిద్ధం (హరామ్). దీన్ని గుర్తిస్తూండేలా చిన్న తీపి పదార్థంతో (ఖర్జూర పండు శ్రేష్ఠం) బ్రేక్‌ఫాస్ట్ చేసి మరీ సలాత్ అనే ఈద్ ప్రార్థనలకు బయలుదేరాలి.
ఈద్ ప్రార్థనలు చేయడానికి ముందు పేదలకు ధనసహాయం చేయడం ఈద్-ఉల్-ఫితర్ నాడు తప్పనిసరి, దీన్నే అరబిక్‌లో జకాత్-ఉల్-ఫితర్ అంటారు.[7] సంతోషాన్ని వ్యక్తంచేయడం, సాధ్యమైనంత దానధర్మాలు చేయడం, స్థానిక మసీదులో ఫజ్ర్ ప్రార్థనలు చేయడం, సలాత్ అన్న ప్రత్యేక ప్రార్థనలకు వెళ్ళడం, ఒక బహిరంగ ప్రదేశంలో తక్బిరాత్ చదవడం, ప్రార్థనలకు వెళ్ళేప్పుడు ఏ వాహనాలూ వాడకుండా నడిచే వెళ్ళడం వంటివి ఈద్-ఉల్-ఫితర్ నాడు పాటించాల్సిన కొన్ని సాధారణమైన ఆచారాలు. బహిరంగ ప్రదేశంలో కానీ, ప్రార్థనా స్థలంలో కానీ సలాత్ చేసేప్పుడు మసీదులో వర్తించే నియమాలే వర్తిస్తాయి. అల్లాను వ్యక్తం చేసే ఖురాన్ వచనాలు, ప్రార్థనా సందేశాలు తప్ప మరేమీ పలుకకూడదు, ఈద్ సలాత్ చేయడానికి ముందు, తర్వాత ఇమామ్ ప్రసంగ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి వంటివి అవి. ఇతర ముస్లిములకు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు పలకాలు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లాఇలాహ ఇల్లల్లాహ్ వాల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వాలిల్లాహిల్లహమద్ అంటూ తక్‌బీర్ మంద్రంగా జపిస్తూ ఈద్ ప్రార్థనలకు సాగాలి, ప్రార్థనా ప్రదేశంలో కూడా ఇమామ్ కార్యకలాపాలు ప్రారంభించేలోగా ఈ తక్‌బీర్ జపించాలి.[8] ప్రార్థనా ప్రదేశానికి ఇంటి నుంచి వెళ్ళడానికి ఒకదారిలోనూ, వెనుదిరిగి రావడానికి మరోదారిలోనూ నడవడం విధాయకం. పండుగ నాడు మహిళలు కూడా సలాత్ చేయడం సంప్రదాయం. సాధారణంగా ప్రార్థనలకు ముస్లిములను పిలుస్తూ ఆధాన్, ఇఖమా వంటి పిలుపులు అందిస్తారు, అయితే ఈద్ ప్రార్థనలకు అలాంటి పిలుపు ఉండదు.
మూలాలు
[మార్చు]- ↑ Elias, Jamal J. (1999). Islam. Routledge. p. 75. ISBN 0415211654.
- ↑ "Eid al-Fitr and the six supplementary fasts of Shawwal". Inter-islam.org. Retrieved 11 August 2013.
- ↑ ఖోరాన్ 2:185
- ↑ ఘమిది, జావేద్ అహ్మద్. మీజాన్: ఎ కాంప్రహెన్సివ్ ఇంట్రడక్షన్ టు ఇస్లాం (in ఆంగ్లం). లాహోర్: అల్-మవ్రిద్.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ అహ్మద్ ఇబ్న్ హన్‌బల్, ముస్నద్, vol. 4, 141–142, (సంఖ్య. 13210).
- ↑ "The Significance of Eid". Jannah.org. Retrieved 11 August 2013.
- ↑ "Articles and FAQs about Islam, Muslims". Islamicfinder.org. Retrieved 11 August 2013.
- ↑ Mufti Taqi Usmani. "Shawwal: On Eid Night, Eid Day, and During the Month". Albalagh.net. Retrieved 11 August 2013.