కోవెల సంతోష్ కుమార్
కోవెల సంతోష్ కుమార్ | |
---|---|
జననం | కోవెల సంతోష్ కుమార్ 1968 అక్టోబరు 8 |
విద్య | ఎం.ఎ. |
వృత్తి | పాత్రికేయుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1993 - ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | రామం భజే శ్యామలం, దేవరహస్యం, మహావిద్య |
తల్లిదండ్రులు | కోవెల సుప్రసన్నాచార్య, శారద |
బంధువులు | కోవెల సంపత్కుమారాచార్య |
కోవెల సంతోష్ కుమార్ తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు, రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు కోవెల సుప్రసన్నాచార్య, శారద దంపతులకు 1968, అక్టోబర్ 8వ తేదీన జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.పట్టాను పొందాడు.
పాత్రికేయుడిగా
[మార్చు]ఇతడు 1993 నుండి వివిధ అగ్రశ్రేణి పత్రికలు, ఎలెక్ట్రానిక్ మీడియాలో అనేక విభాగాల్లో పాత్రికేయుడిగా పనిచేశాడు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా తొలితరం పాత్రికేయుడు కోవెల సంతోష్ కుమార్. భారతదేశంలో అప్పుడప్పుడే ప్రైవేట్ చానళ్లు ప్రారంభమైన కాలంలో 1996-1997లో ఇతడు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించాడు. భారతదేశం నుంచి శ్రీలంక, సింగపూర్‌కు వార్తల కార్యక్రమాన్ని రూపొందించి ఆయా దేశాల నుంచి ప్రసారం చేసిన కాలం అది. అప్పటి నుంచి మీడియాలో చోటు చేసుకున్న అన్ని మార్పులకు చేర్పులకు ఇతడు సాక్షీభూతంగా నిలిచాడు. 1999లో తెలుగు మీడియాలో మొట్టమొదటి ప్రత్యక్ష ప్రసారాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి వాజపేయి ప్రసంగాన్ని.. రెండు నిమిషాల వ్యవధిలో ప్రసారం చేసారు. తెలుగు మీడియాలో అదే తొలి లైవ్ ఎఫెక్ట్ కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 1993 నుంచి అనేక ఎన్నికలను ప్రత్యక్షంగా కవర్ చేసాడు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నక్సల్స్ నిర్బంధం విధించినప్పుడు.. ప్రజాకవి కాళోజీతో తొలి ఓటు వేయించి దానిని పత్రికలో ప్రముఖంగా ప్రచురించాడు. అదే ఎన్నికలో హన్మకొండ అభ్యర్థి పీవీ రంగారావు అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టటంతో ఆయన ఓడిపోయాడు. నాటి వరంగల్ జిల్లా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని వెలుగులోకి తేవటం ద్వారా.. వాటిలో మునుపెన్నడు లేని సంస్కరణలు జరగటానికి పరోక్షంగా కారకుడయ్యాడు. 2003లో భారీ వరదలు వచ్చినప్పుడు రైళ్లను ఆపడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ఒంటి మీద ఉన్న ఎర్ర చొక్కాలను విప్పి రైలుకు అడ్డంగా వెళ్ళిన ఇద్దరు లైన్‌మెన్‌ల గురించి ఇతడు రాసిన సంపాదకీయం అనేక మందిని కదిలించింది. ఆ కారణంగా ఆ రైల్వే కార్మికులకు పలువురు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇలా అనేక మానవీయ కథనాలను రచించటం ద్వారా ఇతడు సామాజిక బాధ్యతను నెరవేర్చాడు. సుమారు 7 సంవత్సరాల పాటు ఆంధ్రభూమి దినపత్రికలో సంపాదకీయ వ్యాసాలు, వార్తా కథనాలు వ్రాశాడు. "జీ 24గంటలు" ఛానెల్‌లో జీ స్టోరీస్ కార్యక్రమాన్ని, టీవీ 5 ఛానెల్‌లో పంచతంత్రం కార్యక్రమాన్ని నిర్వహించాడు.
రచయితగా
[మార్చు]ఇతడు కళాశాల స్థాయి నుండే రచనలు చేయడం మొదలు పెట్టాడు. వృత్తిలో భాగంగానే కాకుండా ప్రత్యేక ఆసక్తితో అనేక విశ్లేషణాత్మక రచనలు చేశాడు. ఇతని వ్యాసాలు అనేక పత్రికలలో, సావనీర్లలో ప్రచురితమయ్యాయి. ఇతని రచనలను పలువురు సాహితీవేత్తలు, విమర్శకులు ప్రశంసించారు.
ప్రచురించిన గ్రంథాలు
[మార్చు]ఇతడు ఈ క్రింది గ్రంథాలను రచించాడు.
- కాలంతో పాటు (వచన రచన.. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై ప్రత్యేక గ్రంథం)
- ఎలక్ట్రానిక్ మీడియా మాన్యువల్ (తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఉపయుక్త గ్రంథం)
- దేవ రహస్యం (భారతీయ ధార్మిక అంశాల వెనుక దాగి ఉన్న సాంకేతికపై తులనాత్మక అధ్యయనం)
- మహావిద్య ( దశమహావిద్యల వెనుక విజ్ఞానాన్ని శాస్త్ర పరంగా చేసిన తులనాత్మక అధ్యయనం)
- విలయ విన్యాసం (ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధార్మికఅంశాలు.. ప్రత్యేకించి మహాశివుడి భావనాత్మకత, ఇతర అంశాలపై సాంకేతికపరంగా చేసిన తులనాత్మక వ్యాసాల సంకలనం)
- రామం భజే శ్యామలం (రామాయణం, శ్రీరాముడిపై వేలఏండ్లుగా కొనసాగుతున్నవక్రభాష్యాల ఖండన, భారతదేశ చరిత్ర వక్రీకరణ పై విశ్లేషణాత్మక గ్రంథం (ఇది ఆంగ్లంలోకి కూడా అనువాదమైంది)
- దేశ విభజన విషవృక్షం (భారతదేశ విభజనకు సా.శ.622 సంవత్సరం నుంచి జరిగిన భయంకరమైన కుట్రను బయటపెడుతూ.. దానికి గల కారణాలను విశ్లేషిస్తూ రచించిన ఉద్గ్రంథం.)
సంపాదకత్వం వహించిన పుస్తకాలు
[మార్చు]- జాజర (అమెరికా తెలుగు రచయితల కవితా సంకలనం)
- కృష్ణవేణి (కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన నాగరికతా వికాసంపై వ్యాస సంకలనం)
- గోదావరి (గోదావరి పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన నాగరికతా వికాసంపై వ్యాస సంకలనం)
- ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్ 50 ఏండ్ల వార్షికోత్సవ సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక వ్యాసాల సంకలనం)
- పినాకిని (ఆంధ్రభూమి ప్రత్యేక సంచిక)
- సన్నుతి (సుప్రసన్నాచార్య అశీతి మహోత్సవ సంచిక)
- కాకతీయ (మేడారం ప్రత్యేక సంచిక)
గ్రంథాలపై ప్రముఖుల అభిప్రాయాలు
[మార్చు]- ‘కాలంతోపాటు అనే పుస్తకంలో యువ రచయిత చిరంజీవి కోవెల సంతోష్ కుమార్ భారత స్వాతంత్ర్య ప్రాతి తరువాత దేశంలోని సమస్యలు అనేకం చర్చించారు. మనం స్వతంత్రంగానే ఎన్ని విధాలుగా చీలిపోగలిగామో చర్చించారు. మన దేశపుటెల్లలు, కాశ్మీర్, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో వేర్పాటువాదాలను, తిరుగుబాట్లను చర్చించి, దేశంలో మీడియా వ్యవహరిస్తున్న పాత్ర వంటి అంశాలతో ఈ వ్యాసమాల చిరంజీవి సంతోష్ కుమార్ పూర్తిచేశారు. మంచి ఆలోచనాపరుడు, భావుకుడు, దేశభక్తుడు అయిన సంతోష్ కుమార్ ను అభినందిస్తున్నాను. – సద్గురు కందుకూరి శివానందమూర్తి
- ‘దేవ రహస్యం అనే పేరిట వెలువడ్డ గ్రంథం ప్రత్యక్షంగా మనం చూసే జగత్తునకు, మనం భావించి నిర్మించుకున్న ఆధ్యాత్మిక జగత్తునకు నడుమ ఒక సంబంధాన్ని, ఒక ఆత్మీయతను నిర్మించే ప్రయత్నం చేస్తున్నది. పాఠకులు తమకు తాము తెలియకుండానే వక్తవ్యాన్ని అంగీకరించే దశలోకి చేరుకుంటారు. ఒక సమ్మోహన స్థితిలో సామాన్యులు ఇంద్రియ ద్వారాల నుండి సాగిపోతూ అతీంద్రియ స్థాయికి చేరుకుంటారు. – కోవెల సుప్రసన్నాచార్య
- ‘మహావిద్యలో చాలామందికి తెలియని ఆదిపరాశక్తి యొక్క దశరూపాల గురించీ, దశమహావిద్యల గురించి సంతోష్ కుమార్ క్లుప్తంగా ఆసక్తికరంగా చర్చించారు. వీటిలో ప్రయోగ విద్యలు, మోక్ష విద్యలు, ఐఔహిక సాధన విద్యలు, తీవ్రసాధనకు సంబంధించిన మాతంగి, భగళ, ధూమావతి మొదలైన, సాత్విక సాధనకు చెందిన తార, భైరవి, త్రిపురసుందరి, దిక్ శక్తులైన భువనేశ్వరి, కాళి, ఛిన్నమస్త, మరియు కమలాత్మిక గురించి వేదం కీర్తించినట్టు సృష్టి ఆరంభ బిందువైన ఉషస్సు. ఈ ఉషస్సే తర్వాత తేజశ్శక్తిగా ప్రవర్తించి ఆ తరువాత సూర్య చంద్రులుగా ఆవిష్కృతమైన సత్యాన్ని గురించి ఆసక్తికరంగా చెప్పారు.’ – రామా చంద్రమౌళి
- ‘ఈ రచయిత తన ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు కేవలం హిందూ మత గ్రంథాలనే ఆలంబనగా చేసుకోలేదు. ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాష్ట్రియన్ గ్రంథాల్లో ఉల్లేఖించిన విషయాలను కూడా సందర్భానుసారంగా ఉదహరించారు. భారతదేశంలో నెలకొని ఉన్న అచ్చెరువొందే కట్టడాల గురించే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న అంతుచిక్కని రహస్యాల గుట్టు విప్పి ‘మన పూర్వికులంతా ఒక్కటే, మనమంతా ఒక జాతి సంతతే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మనమంతా ఒక వ్యక్తి సంతతే. జగమంతా మన కుటుంబమే అంటారు.’ – సలీం సయ్యద్[1]
- రామం భజే శ్యామలం గ్రంథంలో రచయిత పాశ్చాత్యులు మన చరిత్రను, సంస్కృతిని ఎలా తగ్గించి చూపారో, దానిని ఎలా belittle చేశారో వివరించారు. వారి తర్వాత, మన పాలకులేం తక్కువ తినలేదనీ, విదేశీ పాలకుల మార్గంలోనే మన చరిత్రను సంస్కృతిని distort చేసే ప్రయత్నాలను, అవి సఫలీకృతమైన క్రమాన్ని చెప్పారు. కేవలం రామాయణం మీదే, రాముని వ్యక్తిత్వం మీదే విషం ఎందుకు చిమ్ముతున్నారో విశ్లేషించారు. కుహానా సెక్యులరిజాన్ని బట్టబయలు చేశారు. ఆనాటి రాజరికంలోని అంతర్లీన ప్రజాస్వామ్యాన్ని వివరించారు. అశోకుడిని అహింసామూర్తిగా, భారతజాతికి ప్రేరణగా ఎందుకు చేశారో విపులీకరించారు. ఆయన నిజస్వరూపం బయటపెట్టారు. బౌద్ధమతం యొక్క లొసుగులు చూపించారు. - పాణ్యం దత్తశర్మ[2]
- ‘రామాయణం చదివితే వచ్చే ఆనందం కంటే.. ఈ పుస్తకం చదివితే వచ్చే ఆనందం చాలా ఎక్కువ. రాముడు అనేక ధర్మాలు పాటించాడు. అటువంటి పురుషుడి గురించి వక్రంగా మాట్లాడి, విశ్వాసాన్ని దూరం చేసి , హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలకు గండి కొట్టేలా కోవెల సంతోష్ కుమార్ ఈ రచన చేశారు.’ – కె. ఐ. వరప్రసాదరెడ్డి
- ‘ఇది రాముడి కథ కాదు.. రామాయణం అంతకంటే కాదు. ఇది భారతదేశ చరిత్ర, భారతదేశంలో భారతీయులు ఒక పథకం ప్రకారం ఎలా అణగదొక్కబడుతున్నారో ఒక పద్ధతిలో వివరించడానికి చేసిన ప్రయత్నం. ముఖ్యంగా గత వంద సంవత్సరాలలో హిందూ జాతిని ఏ విధంగా అప్రదిష్టపాలు చేయడానికి అనేక వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయో వివరిస్తున్న పుస్తకం ఇది. ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఏఏ వర్గాలు హిందూ మూలాలను పెకలించి వేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టిన 56 వ్యాసాల సంపుటం ఇది’ – ఎన్.వీ హనుమంతరావు[3]
స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ
[మార్చు]ఇతడు హైదరాబాదు శివారు ప్రాంతమైన నారపల్లిలో "స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థ" పేరుతో ఒక గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ గ్రంథాలయంలో పాతిక వేలకు పైగా విలువైన పుస్తకాలు ఉన్నాయి. 1872 నుండి నేటివరకూ వివిధ ప్రక్రియలలో వెలువడిన గ్రంథాలు ఇక్కడ లభిస్తాయి. ఈ గ్రంథాలయం భాషా సాహిత్య పరిశోధకులకు ఉపయుక్తంగా ఉంది.
చిత్రమాలిక
[మార్చు]-
తెలుగు విశ్వవిద్యాలయపు పురస్కారం స్వీకరిస్తున్న సంతోష్ కుమార్
-
దేవరహస్యం
-
మహావిద్య
-
విలయవిన్యాసం
-
రామం భజే శ్యామలం
మూలాలు
[మార్చు]- ↑ సయ్యద్ సలీమ్ (22 June 2022). "అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విలయ విన్యాసం". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 8 May 2024.
- ↑ పాణ్యం దత్తశర్మ (1 August 2023). "'రామం భజే శ్యామలమ్": మన సనాతన ధర్మపునరుజ్జీవనం". ఔచిత్యం. 4 (9). Retrieved 8 May 2024.
- ↑ ఎన్.వి.హనుమంతరావు (25 December 2022). "కొత్త అంశాలపై వెలుగు - 'రామం భజే శ్యామలం'". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 8 May 2024.