చంద్రునిపై పరిశోధనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రునిపై పరిశోధన కార్యక్రమాలు 1959 సెప్టెంబరు 14 న సోవియట్ యూనియన్ ప్రారంభించిన లూనా 2 అనే అంతరిక్ష పరిశోధక ఉపగ్రహం చంద్రునిపై దూకడంతో మొదలయ్యాయి. అప్పటివరకు అందుబాటులో ఉన్న ఏకైక అన్వేషణ మార్గం భూమి నుండే పరిశీలించడం. ఆప్టికల్ టెలిస్కోపు ఆవిష్కరణతో చంద్రుని పరిశీలనలో పెద్ద ముందడుగు పడింది. ఖగోళ పరిశీలనల కోసం టెలిస్కోపును ఉపయోగించిన మొదటి వ్యక్తిగా గెలీలియో గెలీలీ ఘనత పొందాడు. 1609లో స్వంతంగా ఒక టెలిస్కోప్‌ను తయారు చేసుకుని, చంద్రుని ఉపరితలంపై పర్వతాలు, క్రేటర్‌లను చూడడం అతని మొదటి పరిశీలనలలో ఒకటి.

చంద్రునిపై మానవులను విజయవంతంగా దింపిన ఏకైక కార్యక్రమం, నాసా వారి అపోలో కార్యక్రమం. నాసా ఆరుసార్లు చంద్రుని పైకి మనుషులను పంపింది. మొదటి ల్యాండింగు 1969లో జరిగింది. అపోలో 11 యాత్రలో వెళ్ళిన వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై శాస్త్రీయ పరికరాలను విడిచిపెట్టి, చంద్రశిలల నమూనాలను భూమికి తెచ్చారు.

2019 ప్రారంభంలో చైనీస్ రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్ చాంగ్ 4, చంద్రునికి ఆవలి వైపున మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగు చేసింది. అక్కడ యుటు-2 రోబోటిక్ లూనార్ రోవర్‌ను విజయవంతంగా మోహరించింది.

ఆరంభ దశ

[మార్చు]

రష్యాతో వెనకబడటం ఇష్టం లేక... ఈ దశాబ్దాంతానికల్లా చంద్రుడి మీదకు మనిషిని పంపించితీరతామని కాంగ్రెస్ లో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ.1962 సెప్టెంబరు 21న రైస్ యూనివర్సిటీ ఫుట్ బాల్ మైదానంలో వేలమందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ - "సరికొత్త విజ్ఞానాన్ని అర్జించాల్సిన అవసరం, సరికొత్త హక్కులను సాధించుకోవాల్సిన తరుణం వచ్చింది కాబట్టే మనం ఈ కొత్త సముద్రాన్ని ఈదడం ఆరంభిస్తున్నాం..ఇది చాలా కష్టమైనదని తెలిసి మరీ దిగుతున్నాం. ఎందుకంటే ఈ లక్ష్యం మన శక్తికి పరీక్షలాంటిది. ఇది మన సామర్ధ్యాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తెస్తుంది.ఈ సవాల్ ను స్వీకరించేందుకు మన మనసూ ఉవ్విళ్లూరుతుంది" అంటూ దేశప్రతిష్ఠను పణంగా పెట్టారు. ఆయన ప్రకటనలో రాజకీయం ధ్వనించినా..శాస్త్ర రంగం మాత్రం అంత తొందరపడిపోలేదు. చంద్రుడి వైపు అడుగులు వేయటానికి ఎన్నో సన్నాహాలు చేసింది..ఎంతో కఠోరంగా శ్రమించింది.

చంద్రుని ఉపరితలం ఛాయాచిత్రాలు

[మార్చు]

సెప్టెంబరు,1959. అప్పటికి చంద్రుడి మీద అసలు ఏముందో, అక్కడి పరిస్థితి ఏమిటో ఎవరికీ ఏమీ తెలియదు. అందుకే అక్కడి పరిస్థితులను తెలుసుకొనేందుకు రష్యా తొలిగా రంగంలో దిగింది. భారీఎత్తున 391 కేజీల బరువున్న శాస్త్రసాంకేతిక పరికరాలను 'లూనిక్-2' లో ఉంచి చంద్రమండలం మీదకు పంపింది. అది భూమ్యాకర్షణ శక్తి నుంచి బయటపడేందుకు సెకెనుకు 11.3 కి.మీ వేగంతో దూసుకుపోయి..36 గంటల తర్వాత చంద్రుడి మీద దిగింది. ఆ విజయం గొప్ప స్ఫూర్తి. అప్పటి వరకూ మనకు చంద్రుడి అవతలి ముఖచిత్రం ఏమిటో తెలియదు.అందుకే వెనువెంటనే 'లూనిక్-3' ఉపగ్రహాన్ని ప్రయోగించి రిమోట్ కంట్రోల్ సాయంతో దానిలోని 35ఎంఎం కెమెరాతో 29 చిత్రాలు తీశారు. మొట్టమొదటగా చంద్రుడి ఆవలివైపు చూపే ఆ చిత్ర్రాలను రష్యన్ టీవీల్లో ప్రసారం చెయ్యటం పెద్ద సందోహం. మనకు కనిపించే వైపు కంటే అవతలి వైపు చంద్రుడి మీద ఎన్నో గుర్తులు, నమూనాలుండటం శాస్త్రవేత్తలను బాగా ఆకర్షించింది.

అమెరికా 'మెర్క్యురి ప్రోగ్రామ్' పేరుతో ఆరుదఫాలుగా కక్ష్యలోకి మనుషులను పంపి సురక్షితంగా వెనక్కి తీసుకురావటం, దాని లోపల వారు చిన్నాచితకా పనులు చెయ్యటం వంటివాటిని సాధన చేసింది. ఇక ఆతర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపేందుకు భారీ సన్నాహాలు ఆరంభించింది. చంద్రుడి మీద నేల ఎలా ఉంటుంది? అక్కడి ఉపరితలం ఎలా ఉంటుంది? అక్కడ రాకెట్ దిగితే నేల మీద నిలబడుతుందా? లేక కూరుకుపోతుందా? అసలు మనుషులు అక్కడ దిగటం సాధ్యమేనా? దీని కోసం అమెరికా మూడు ప్రత్యేక రాకెట్ పధకాలు చేపట్టింది.'రేంజర్' పేరుతో వరుసగా రాకెట్లు పంపి.. చంద్రుడి ఉపరితలం ఫోటోలు సాధించింది. ఇలా పోగైన వందలాది నలుపు-తెలుపు ఫోటోలు ఎంతో కీలకమైన సమాచారాన్ని అందించాయి. తర్వాత 'ఆర్బిటర్' చంద్రగ్రహం ఉపరితలానికి సంబంధించిన మ్యాప్స్ సిద్ధం చేసింది. తర్వాత 'సర్వేయర్'..వందలాది రంగుల ఫోటోలు పంపుతూ అక్కడి నేల తీరు ఏమిటి? బరువైన వ్యోమనౌకలు దిగితే నేల బలంగా ఉంటుందా? లేదా? అన్నది తేల్చి చెప్పింది.వీటి ఆధారంగా వ్యోమనౌకల ల్యాండింగ్ కు అనువైన స్థలం ఏదో నిర్ధారించారు. అతి చల్లగా ఉండే అక్కడి వాతావరణాన్నితట్టుకునేందుకు వీలుగా రాకెట్ నిర్మాణానికి మెరుగులు దిద్దారు. చంద్రుడి నుంచీ వెనక్కి వచ్చే వ్యోమనౌక..తిరిగి కక్ష్యలో తిరుగుతుండే రాకెట్ తో అనుసంధానమవ్వటం (డాకింగ్) కోసం 'జెమిని'వరస రాకెట్లతో ఎన్నో రిహార్సల్స్ చేశారు. మరోవైపు 1966 లో రష్యా పంపిన 'లూనా9' సుతారంగా చంద్రుడి మెత్తటి నేల మీద దిగింది. దీంతో అంతా దుమ్ముదుమ్ముగా కనిపించినా అక్కడి నేల స్థిరంగానే ఉందని తేలిపోయింది. దీంతో చంద్రుడి పై మనిషి కాలుమోపేందుకు సర్వం సిద్ధమైంది.

చంద్రుని చుట్టూ ప్రదక్షిణాలు

[మార్చు]

ఒక్కోక్క అడుగూ ముందుకు వేస్తున్న అమెరికా..ఆఖరి యత్నానికి ముందు..1968 లో 'అపోలో-8'లో ముగ్గురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి పంపింది. చంద్రుడికి 125 కి.మీ దూరంలో కక్ష్యలో తిరుగుతూ.. 20 గంటలు గడిపారు. తమ కళ్ల ముందే ఇసుక సముద్రంలా కనబడుతున్న బూడిదరంగు చంద్రుడిని వాళ్లు కెమేరాల్లో బంధిస్తూ టీవీలకు అందించారు. వాళ్లు ముగ్గురూ కక్ష్యలో చక్కగా నిద్రపోయారు, ఆహారం తిన్నారు. ఆరోగ్యంగా తిరిగివచ్చారు. అదో పెద్ద ఊరట. ఇక చంద్రుడి మీద కాలుమోపటమే తరువాయి. 1969 జూలై 20 ఫ్లోరిడా లోని కేప్ కెనడీ చాలా హడావుడిగా ఉంది. భారీ కసరత్తు తర్వాత..ఓ బృహత్ ప్రయత్నం ఆరంభమవుతోంది.మనిషి తొట్టతొలిగా మరో గ్రహం మీద కాలుమోపబోతున్న ఘడియలవి. ముగ్గురు మనుషులు సిద్ధమయ్యారు. వారిలో ఒకరైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్..ప్రయోగానికి కొద్ది క్షణాలముందు పత్రికలతో మాట్లాడుతూ చంద్రుడి మీదకు వెళ్లటం తిరిగిరావం మనకు తెలియని పెద్ద విషయాలు'అన్నాడు. పదిలక్షల మంది వీక్షిస్తుండగా..అపోలో-11 అంతరిక్షనౌకతో శాటర్న్-5 బూస్టర్ రాకెట్ రివ్వున అంతరిక్షంలోకి దూసుకుపోయింది.

మనిషి చిన్న అడుగు..మానవాళికి ఓ అతిపెద్ద ముందడుగు

[మార్చు]

జులై 21 వ తేదీ కొత్త చరిత్ర ఆరంభమైంది. ముగ్గురిలో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ డ్రిన్ లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహాన్ని చేరారు. ముందు ఆర్మ్ స్ట్రాంగ్, మరో 20 నిముషాల తర్వాత ఆల్ డ్రిన్ చందమామ మీద కాలుమోపారు. యావత్ ప్రపంచం టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఆర్మ్ స్ట్రాంగ్ ఎడమ పాదం కిందమోపుతూ.. "మనిషి వేస్తున్న ఈ చిన్న అడుగు..మానవాళి వేస్తున్న ఓ అతిపెద్ద ముందడుగు" అని హర్షాతిరేకాల మధ్య వ్యాఖ్యానించాడు. కిందంతా బొగ్గుపొడిలా ఉందన్నాడు. వ్యోమనౌక ఓ అడుగు నేలలో కుంగిందన్నాడు. ఇద్దరూ ఫోటోలు తీసుకున్నారు. చిన్నగా అక్కడక్కడ గెంతారు. అమెరికా జెండా పాతారు. "మానవాళి సుఖశాంతుల కోసం ఇక్కడికి వచ్చాం" అంటూ అధ్యక్షుడు నిక్సన్ సంతకం చేసిన ఫలకం పాతారు. 21 గంటలు గడిపిన తర్వాత తిరిగి వ్యోమనౌకలో ప్రధాననౌకను చేరుకుని..195 గంటల తర్వాత భూమిని చేరుకున్నారు. చరిత్ర కొద్దిసేపు విస్తుపోయింది. తర్వాత ఎంతటి సందోహం! అమెరికా, రష్యాలు వరుసగా మనుషులను పంపాయి. సౌరకుటుంబంలో ఇంతటి విస్తృతమైన పరిశోధనలు మరి దేనిమీదా జరగలేదు.

చంద్రుని పై వ్యోమగామి

కొనసాగుతున్న పరిశోధనలు

[మార్చు]

చంద్రుడి ఉపరితలం మీద దాదాపు 97 శాతాన్ని శాస్త్రవేత్తలు మ్యాపింగ్ చేసేశారు. వరసగా పోతూ వస్తూ అపోలో, లూనా..అప్పటికే చంద్రుడి మీది నుంచీ దాదాపు 382 కేజీల చంద్రశిలలను మోసుకొచ్చాయి.వాటిపై విస్తృత పరిశోధనలూ జరిగాయి. దీంతో 1972 నుంచీ అమెరికా చంద్రమండలం మీదకి మనుషులను పంపేపని నిలిపేసింది. ఈ పరుగులో కాస్త వెనకబడిన రష్యా కూడా 1976 నుంచీ దృష్టిని చంద్రుడి మీంచి అంతరిక్షంవైపు మళ్లించారు.

చంద్రయాన్ కార్యక్రమం

[మార్చు]

భారతదేశం 2008 లో చంద్రునిపై పరిశోధనలను చేపట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఈ పరిశోధనలకు చంద్రయాన్ కార్యక్రమం అని పేరు. ఈ కార్యక్రమంలో మొదటగా 2008 జూలైలో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఆ తరువాత పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్తూ చంద్రయాన్-2, చంద్రయాన్-3 లను కూడా చేసింది.