Jump to content

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం

వికీపీడియా నుండి
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:బల్కంపేట, హైదరాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశము

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం.[1] ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది.

చరిత్ర

[మార్చు]

దాదాపు 700 ఏళ్లక్రితం హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో వూళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. ‘ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం?’ అని శివసత్తులు ఇచ్చిన సలహాతో, మూలవిరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు.

కొంతకాలానికే, రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించడంతో, ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్‌ బహద్దూర్‌ అనే సంస్థానాధీశుడి హయాంలో ‘బెహలూఖాన్‌ గూడా’ గా పిలువబడిన ఈ ప్రాంతం, తరువాతికాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మతల్లి ‘బల్కంపేట ఎల్లమ్మ’గా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది.[2]

ప్రత్యేకత

[మార్చు]

అమ్మవారి స్వయంభూమూర్తి శిరసుభాగం వెనుక నుంచీ నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మరుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఉత్సవాలు

[మార్చు]

ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు ఐదు లక్షలమంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేలసంఖ్యలో భక్తుల వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు. "చల్లని తల్లి... బల్కంపేట ఎల్లమ్మ". మజ్జి తాతయ్య, న్యూస్‌టుడే, సంజీవరెడ్డినగర్‌. Archived from the original on 14 జనవరి 2018. Retrieved 14 January 2018.
  2. తెలుగు బంధు. "బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవత దేవాలయం ప్రాశస్త్యం". www.telugubandhu.com. Retrieved 14 January 2018.[permanent dead link]